సహనుభూతి కథ


"సహానుభూతి వెలిగించిన దీపం" జ్వలిత-9989198943 గిప్పుడు గీ పొల్ల‌ను ఎవ‌రు చూడాలె తాదూర కంత లేదు మెడ‌కో డోల‌న్నట్టున్నది మ‌న పొల్ల‌గాల్ల‌నే హాస్టలేస్తిమి గా ప్ర‌వీణ్ కుమార్ సార్ పుణ్య‌మా మ‌న పోర‌ల్ల‌కు స‌ద‌వుకు ద‌క్కుతుంది. మ‌నం గీ చెప్పుల కొట్టు మీద బ‌తుకుడే ఎక్కువ‌. స‌ణుగుత‌నే ఉన్న‌ది సుగుణ‌. ఎవ‌రో క‌ష్ట‌మ‌రొచ్చిండు షూ పాలిష్ చెయ్య‌మ‌ని బ‌ండి టైం అయితాంద‌ని తొంద‌ర పెట్టుకుంట మూడు జ‌త‌ల బూట్లు ముందేసిండు. "స‌దువుడాపి గీ బూట్లు ఒక జోడి పాలిస్ పెట్టు నేను గూడ పెడ‌త జ‌ప్పునయిత‌ది లేదంటే తాత‌కు తిట్లు ప‌డ‌త‌యి" అన్న‌డు కాశ‌య్య‌. తానొక బూటు చేతిల‌కి తీసుకొని. "బాబ్బాబు చ‌చ్చి నీ క‌డుపున పుడ‌త త్వ‌ర‌గ చేసియ్యి ఇల్లంత పందిరేస్తున్న‌రు పిల్ల‌లు" అన్న‌డు బూట్లు తెచ్చిన ముస‌లాయ‌న‌. "ఆ, మా క‌డుపున పుట్టి ఏం బావుకుంట‌వ్, పెద్ద మ‌నిషి చెప్పులు కుడ‌త‌వా ఆక‌లికి మాడ‌త‌వా" ఇసురుకున్న‌ది సుగుణ‌. "అదేంట‌మ్మా మీ పిల్ల‌లు పోయిన‌ట్లు హాస్ట‌లుకు పోతా, బాగా చ‌దువుతా, మీ క‌ష్టాలు తీరుస్తా" ఆనందంగా చెప్పుకు పోతున్న‌డు ముస‌లాయ‌న‌. ఒక బూట్ పాలిస్ పూర్తిచేసి రెండో బూటు అందుకుంటూ "ఆగండి సారూ ఇప్పుడు మీ కో్సం నేను ఈ వ‌య‌సుల పిల్ల‌ల్ని యాడ కంట గ‌ని" అని ముసి ముసిగ న‌వ్వుకుంట అన్న‌ది సుగుణ‌. ఇందాక‌టి కోపం,విసుగు త‌గ్గింది మాటల్ల‌. "ఊకో సుగుణ‌క్కా ఆయ‌న అనేది ఇప్ప‌టి సంగ‌తి గాదు మ‌ల్ల జ‌న్మ‌ల‌, ఆయ‌న మ‌ని ఉండంగ నువ్వెట్ల గంట‌వ్‌" ఎప్పుడొచ్చిండో ప‌క్క‌నే బెల్టులు, చెప్పులు అమ్మే డ‌బ్బా లెనిన్ అన్న‌డు. "వ‌చ్చినావుర అయ్యా నువ్వే త‌క్కువైన‌వు ముచ్చ‌ట్ల‌కు పొద్దున్నే, పొయ్యి నీ డ‌బ్బ‌ల కూసోపో" గ‌దిమిండు కాశయ్య‌. "ఉండు బావా పోత‌గ‌ని శ‌నివారం పూట గింత పొద్దుగాల నా డ‌బ్బాకాడి కెవ‌రు వ‌త్త‌రు. గీ పెద్దాయ‌న కంటె త‌ప్ప‌ది. వాళ్ళంతా పిల్ల‌ల‌తో ఊరేగ‌పోత‌రు. ఇంటికి తాళ‌మేసుకొని గీనె బ‌య‌ట వ‌సాట్లె కూసోవ‌లె". అన్న‌డు ప‌క్క డ‌బ్బా కొట్టు లెనిన్‌. లొడ లొడ మాట్లాడ‌త‌నే ఉంట‌డు ప‌దో త‌ర‌గ‌తి చ‌దివి ఆపేసిన వాడి చ‌దువు ముందుకు సాగ‌లేదు. తండ్రి చ‌చ్చిపోయిండు. డ‌బ్బా కొట్టు వాడికి న‌చ్చింది. దాదాపు రోజంతా వ‌చ్చినోళ్ళతో ముచ్చ‌ట్లాడొచ్చు. త‌ల్లిలాగా ఎండ‌నక వాన‌న‌క కూలికి పోన‌వ‌స‌రం లేదు వాడు. ఈ డ‌బ్బా లేక‌పోతే త‌న‌ను కూడా కూలికి రమ్మ‌నేది త‌ల్లి. ఆ క‌ష్టం నించి తండ్రి త‌న‌ను కాపాడిండు డ‌బ్బా పెట్టి. మూడు జ‌త‌ల బూట్లు పాలిస్ చేసి క‌వ‌ర్ల పెట్టి ముస‌లాయ‌న చేతికి అందించి ఆయ‌న అందిచ్చిన చిల్ల‌ర డ‌బ్బులు తీసుకున్న‌డు కాస‌య్య‌. లెనిన్‌, సుగుణ మాట‌ల‌కు ఆలోచ‌న‌ల ప‌డ్డాడు పెద్ద మ‌నిషి. త‌న సంగ‌తి వీళ్ళ‌కు కూడా తెలిసింద‌ని చిన్న‌బుచ్చుకొని అక్క‌డి నుండి క‌దిలాడు. “ఆ ఔసులోళ్ళ పిల్ల‌ను ఏం చేసిన్రు బావా, వాళ్లోళ్ళెవ‌ర‌న్న వ‌చ్చిన్రా” ముచ్చ‌ట్లు మొద‌లు పెట్టిండు లెనిన్‌. “ఎవ‌డు రాలే మీ బావే సాదుత‌ట‌. మ‌న‌కు మింగ‌టానికి లేదు గ‌ని పొల్ల‌ను సాదుతాట‌” సుగుణ‌కు మ‌ళ్ళీ కోపం చూపే అవ‌కాశం వ‌చ్చింది. “అరె నువు చెప్పుర లెనిన్‌, మ‌న ప‌క్క‌నే కూసునె చారి, వాడి పెళ్ళాం తేజాబ్ తాగి స‌చ్చిన్రు. మ‌న క‌ళ్ళ ముంద‌ట మెసిలిన పిల్ల. దీని వ‌య‌సు మూడేళ్ళు త‌ల్లిదండ్రులు స‌చ్చిన్ర‌ని కూడ తెల‌వ‌క ఇంకా పండుకొనే ఉన్న‌ది. ఆర్నెల్ల పిల్ల కాణ్ణిచ్చి వాళ్ళున్నా మ‌న చేతుల‌నే పెరిగింది కాదా” త‌న మాట‌కు మ‌ద్ధ‌తు కోసం కాశ‌య్య అడిగిండు. “అవును గ‌ని బావ గా చారిగానికి ఎయిడ్స్ ఎట్టొచ్చిందో గ‌దా పిల్లి పీక్క‌తిన మాంసం లేదు వానికి” లెనిల్ ధ‌ర్మ సందేహం ఎలిబుచ్చిండు. “ద‌మాక్ క‌రాబ‌యినాదిర నేనేమంట‌న్నా నువ్వేమ‌డుగుతున్న‌వ్ స‌మ‌జ‌యితాందా నీకేమ‌న్నా” గ‌య్ మ‌న్న‌డు కాశ‌య్య‌. “అయ్యో గా పోర‌డ్నెందుకు క‌సురుతవ్ నీకేమెర‌కో చెప్పు లేకుంటే ఊకో లొల్లెందుకు”మొగ‌డ్ని క‌సిరింది సుగుణ‌. “నీకు దెల‌వ‌దా గీ పొల్ల పుట్ట‌క ముందు మ‌న క‌ళ్ళ ముంద‌నే ఆ చారిని కారు గుద్దిపోతే నెత్తురంత పోయింది. ద‌వాకాన్ల నెత్తురెక్కించిన్రు. ఎక్క‌డ ఏం త‌ప్పు జ‌రిగిందో తెల‌వ‌దు. అప్ప‌డి సంది న‌వ‌స్త‌నే వున్న‌డూ ఏదోఒక‌టి జ‌ర‌మో, భేదులో ఎయిడ్స్ అని తెలిసేటాలికెనా ముదిరిపోయి. ఇజ్జ‌తికి పెళ్ళాం మొగ‌లిద్ద‌రు తేజాబ్ తాగి చ‌చ్చిరి, వాళ్ళ చుట్టాలెవ‌రు రాక‌పోతె గా అన్నం శ్రీ‌నివాస్ సార్ వ‌చ్చి దానం చేసిండు” అన్న‌డు కాశ‌య్య‌. అంద‌రికి తెలిసిందే క‌దా అన్న‌ట్టు. “అవును బావా అన్నం సేవా సంస్థ వాళ్ళు భ‌లేగా చేస్త‌రు. గా అన్నం శ్రీ‌నివాస్ సార్ మొన్న ఏట్ల మురిగిన శ‌వాన్ని కూడా తీసి దానం చేసిండు. ఏడ అనాథ శ‌వం క‌న‌ప‌డ్డా పోలీసోళ్ళు ఆయ‌న‌కే చెప్తాన్రు” అన్న‌డు లెనిన్‌. “గీ పోర‌నికి ఏది తోస్తే అది సొల్లు” స‌ణిగింది సుగుణ‌. “సుగుణ‌క్క న‌న్నెందుకు తిడ‌త‌న్న‌వ్‌. నేనేం త‌ప్ప‌న్న‌క్కా” అమాయ‌కంగా అడిగిండు. “ఏ ఆపండి మీ లొల్లి ఏమ‌యింది సారు మ‌ళ్ళొచ్చిన్రు” అన్న‌డు కాశ‌య్య ఇందాకొచ్చిన పెద్ద మ‌నిషి మ‌ళ్ళొచ్చింది చూసి. “కోడ‌లు చెప్పు తెగింద‌ట బాబు కొంచెం తొంద‌ర‌గ కుట్టియ్యి వాళ్ళంత పిక్‌నిక్ పోత‌ర‌ట‌” అన్న‌డు ముస‌లాయ‌న‌. “నీ కోడ‌లికి దండం పెట్టాలె చేసేది చ‌ప్రాసి ఉద్యోగం, చేష్ట‌లు క‌లెక్ట‌రోతిగ‌” అన్న‌డు లెనిన్‌. “ఏ ఊకో పోర‌గా”క‌సురుకుంది సుగుణ‌. కాశ‌య్య చెప్పు కుట్టి అందిస్తే తీసుకొని పోయ్యండు ముస‌లాయ‌న‌. “గీ పెద్ద మ‌నిషి బ‌ళ్ళె పంతులుద్యోగం చేసిండు ఎంత మంది బ‌తుకులు బాగు చేసిండు. కోడ‌లు కొడుకు ఆయ‌న‌ను చ‌ప్రాసిలాగా చూస్తాన్రు. ఒక్క‌డే కొడుకు ఉద్ద‌రిస్త‌డంటె ప్రేమ పెళ్ళ‌ని పెళ్ళాం మోజుల తండ్రిని బాంచ లెక్క చేస్తున్న‌డు పాపం” అన్న‌డు కాసయ్య‌. “గ‌య్య‌న్ని నీకెందుకు గ‌ని సొంత కొడుకే ఆయ‌న్ని చూడ‌ట్లే మ‌నం గీ పొల్ల‌నెందుకు మోసుడు” సుగుణ మ‌ల్ల మొద‌లుపెట్టింది. “కొంచం పెద్ద మ‌న‌సు చేసుకొని ఆలోచించ‌వే ఆ ప‌సి పొల్ల‌ను అనాథ ఆష్ట‌ల్ల ఎయ్యిడానికి మ‌న‌సొప్పుతాందా నీకు, నువ్వుగూడ ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లివి గ‌దా” అన్న‌డు కాశ‌య్య పెళ్ళాన్ని బ‌తిమిలాడిన‌ట్టే. “పెద్ద మ‌న‌సు చేసుకుంటె తిండి దొరుకుతాదా, ఆడిపిల్ల అన్ని క‌ర్సులే ఎట్ల సాత్త‌వే మ‌న కులం కాదు, రేపెవ‌ర‌న్న ఏమ‌న్నంటె. బ‌ళ్ళెయ్యీల‌న్నా ఎట్ల‌” త‌న జాస‌ల త‌ను ప్ర‌శ్న‌లేసింది సుగుణ‌. “ఏం కాదులేవే మ‌న‌కున్న‌ది పెట్టి సాదుకుందాం. మ‌న కుల‌మ‌నే చెపుదాం ఏమయిత‌ది” అన్న‌డు కాశ‌య్య‌. “ఓ బావ అట్ల గిట్ల చేసేవు. అగో ఆ రోహిత్ హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటిల ఉరేసుకున్న‌డు యాది కున్న‌దా కులం ఇస‌యింల ఎంత లొల్ల‌య్యంది. వాల్ల‌మ్మ ఎస్సీ, నాయిన బీసీ, వాల్ల‌మ్మ‌ను సాదుకున్నోళ్ళు బీసీ అని చెప్పి పెళ్ళి చేసిన్ర‌ట ఎంత లొల్ల‌యింది” త‌న‌కు తెలిసిన దంత చెప్పాల‌న్న ఆత్రుత‌తో లెనిన్ చెప్పిండు. “మీ బావ మొండోడురా, ఎంత సెప్పిన ఇంట‌లేడు” అన్న‌ది సుగుణ‌. “ఓ అక్క నేను చారి బిడ్డ‌ను సాదొద్దంట లేదు. బావ‌ను మ‌న కుల‌మ‌ని అబ‌ద్దం చెప్తె లొల్ల‌యిత‌ది అంటున్న‌”, అన్న‌డు లెనిన్‌. “అంటె దీన్ని మ‌నం సాదాల్నా, ఏంబెట్టి” కసురుకున్న‌ది సుగుణ‌. “లెనిన్ నువు చెప్పుర మ‌న పిల్ల‌నుకొని సాద్దాం చారి ఆదార్‌ కార్డున్న‌ది, చ‌చ్చిన‌ట్టు డెత్ స‌ర్టిఫికెట్టు తీద్దాం. మ‌నం సాదుకుందాం” లెనిన్ మాట‌ల మ‌ద్ధ‌తు దొరికిన‌ట్టు వివ‌రంగా చెప్పిండు కాశ‌య్య‌. “ఆ పోర‌నికేమెర‌క రేపు చారి కుల‌మోళ్ళు వ‌చ్చి లొల్లి చేస్తే” అన్న‌ది సుగుణ‌. “ఆఁ ఆ కులంల అయిదు దాయిలున్న‌యి వాళ్ళ‌ళ్ళ వాళ్ళ‌కే బ‌డ‌దు. పోరి అమ్మ అయ్యి చ‌చ్చిన‌పుడే రాలేదు. రోహిత్ విష‌యం అంటే ద‌ళితులంత ఒక్క‌ట‌య్యిన్రు లొల్లి చేసిన్రు, చారీలు అట్ల‌గాదు బుగులు ప‌డేది లేదు” అన్న‌డు కాశ‌య్య‌. “అంతే కాదు బావ ఎస్సీ లు, బీసీ లు అంతా క‌లిస్తేనే బ‌హు జ‌నులం. మ‌న‌మంత క‌ల‌వాల‌ని పూలే అన్న‌డు, అంబేద్క‌ర‌న్న‌డు. ఇంకొక మాట బ్ర‌హ్మంగారి ద‌గ్గ‌ర క‌క్క‌య్య అనే మాదిగ‌ శిష్యుడు, సిద్ద‌య్య అనే దూదేకుల శిష్యుడు ఉండెన‌ట‌. మా తెలుగు టీచ‌ర్ చెప్పింది” అన్న‌డు లెనిన్‌. “అవున్రా నేను కూడ విన్న మొన్నొక మీటింగుల పోతులూరి వీరబ్ర‌హ్మం చారీ కులం అయినా కులాల‌న్నీ స‌మాన‌మ‌ని చెప్పేటందుకు క‌క్క‌య్య‌ను, సిద్ద‌ప్ప‌ను శిష్యులుగ చేసుకున్న‌డ‌ట‌”అన్న‌డు కాశ‌య్య‌. “పోసుకోలు పురాణాలు కాదు ఆడ పోరిని సాదుడు మాట‌లా, మ‌న పోర‌ల్లనేసినట్టు హాస్ట‌ల్ల ఏసుడెట్ల‌” భ‌యిం బాధ సుగుణ మాట‌ల్ల క‌న‌ప‌డ్డ‌ది. ఈసారి కోపం లేదు. “ఏం కాదులే అక్కా,నేను కూడా సాయం చేత్త‌లే సుగుణ‌క్కా” లెనిన్ అన్నడు. “బ‌గ్గ సాయం చేత్త‌వు ముందుగాల మీ అమ్మ కూలి పనికి పోకుండా,బువ్వ బెట్టు. ముస‌ల్ది రెక్క‌లు ముక్క‌లు చేసుకుంటాంటే సోకు చేసుకొని డ‌బ్బాకాడ కూసోని సొల్లు చెప్పెటోడు. అనాథ పొల్ల‌కు సాయం చేత్త‌డ‌ట* కోపం లెనిన్ మీదికి మ‌ల్లింది. సుగుణ‌ది ఏమి చెయ్య‌లేని నిస్సాయ‌త‌, చారి బిడ్డ‌ను ఆదుకోవాల‌న్న ఆతుర‌త‌, కొత్త క‌ష్ట‌మేమి వ‌స్త‌దోన‌న్న భ‌యం. గంద‌ర‌గోళంగా ఉన్న‌ది ఆమెకు. కొత్త‌గా ఉద్య‌మం లోకి వ‌చ్చిన విద్యార్థోలె త‌ల్లిదండ్రులు చెప్పిన‌ట్టు త‌న భ‌విష్య‌త్తు చూచుకోవాలా ఉద్య‌మ నాయ‌కుల ఉప‌న్యాసాల్లో చెప్పిన‌ట్టు జీవితాల‌ను ఉద్య‌మాల‌కు అంకితం చేయ్యాలా తోచ‌న‌ట్టున్న‌ది సుగుణ వ్య‌వ‌హారం. కాశ‌య్య మాత్రం చారి బిడ్డ బాధ్య‌త త‌నే తీసుకోవాల‌న్న నిర్ణ‌యంలో ఉన్నాడు. కాక‌పోతే సుగుణ‌కున్న అనుమానాలు భ‌యాలు ఎట్లా తొల‌గించాలో అర్థం కాట్లేదు. సుగుణ క‌సురుడుకు చిన్న‌బుచ్చుకున్న లెనిన్ త‌న డ‌బ్బాలోకి పోయి కూసున్న‌డు. కాశ‌య్య డ‌బ్బా ముందుకు ఒక స్కూట‌రొచ్చి ఆగింది. రాములు సార్ గ‌వ‌ర్న‌మెంటు టీచ‌ర్‌. త‌న కొడుకును ప్రైవేట్ బ‌ళ్ళె చ‌దివిచ్చెటోడు ఈ మ‌ధ్య‌నే త‌ను ప‌ని చేసే స్కూల్ల‌నే కొడుకును చేర్చిండు. కాకపోతే కొడుకు చిన్న బోకుండ‌. బూట్లు, టైలు కొన‌సాగిస్తుండు. కొడుకు బూట్ల పాలిష్ కోసం ఆగిండు. ఆయ‌న చెప్పులు కూడా పాలిష్ కోసం ఇచ్చి స్కూట‌ర్ మీద కూసున్న‌డు. రాములు సార్ ని చూచి లెనిన్ మ‌ళ్ళీ వ‌చ్చాడు. ఆయ‌న‌కు న‌మ‌స్తే చెప్పిండు. ఆయ‌న కొడుకును ప‌ల‌క‌రించిండు. సుగుణ ద‌గ్గ‌ర‌కు పొయ్యి చిన్న‌గ ఏదో చెప్పిండు. సుగుణ క‌ళ్ళు మెరిసిన‌యి చిన్న ఆశ‌తో“సార్ మాకో సాయం కావాలె చేస్త‌ర” అన్న‌ది. అది విన్న ఆయ‌న“నేనో బ‌క్క బ‌డి పంతులును నేనే సాయం చేయ్య‌గ‌ల‌ను, అయినా చెప్పు చేత‌నైంది చేస్తా”అన్న‌డు. చారి బిడ్డ సంగ‌తి చెప్పింది. కాశ‌య్య ఆ పొల్ల‌ను సాదుత అంటాండు అన్న‌ది. కొద్దిసేపు ఆలోచించి“అంత భ‌య‌ప‌డ‌న‌వ‌స‌రం లేదు, ఈ అమ్మాయి ఇంకా చిన్న‌దే కాబ‌ట్టి ఇప్ప‌డే అనాథాశ్ర‌మంలో ఎందుకు. కొన్నాళ్ళ‌గితే ఏదో మార్గం ఆలోచిద్దాం”అన్నాడాయ‌న‌. ఆశ‌గా చూస్తున్న లెనిన్ క‌లుగ‌చేసుకొని “సార్ ఈవాళ్ళ న్యూస్ పేప‌ర్ చూచిన్రా! మ‌హ‌బూబూబ్ న‌గ‌ర్ జిల్లా గీత కార్మికుడు సుక్కా రాములుగౌడ్‌, వెంక‌ట‌మ్మ‌లు అనారోగ్యంతో చ‌చ్చిపోతే వాళ్ళ ఇద్ద‌రి పిల్ల‌ల గురించి సిఐ ధ‌న‌ల‌క్ష్మి అడిగితే ద‌ళిత గురుకులాల కార్య‌ద‌ర్శి ప్ర‌వీణ్ కుమార్ సార్ క‌లుగ‌చేసుకున్న‌ర‌ట‌. వాళ్ళ‌కు ఎస్సీ గురుకుల పాఠ‌శాల‌ల్లో చేర్పించిన్ర‌ట‌. మీరు కూడా చారి బిడ్డ కోసం అడ‌గ‌రాదండి” వాడి మాట‌ల‌కు కాశ‌య్య సుగుణ ఆశ‌గా రాములు సార్ వైపు చూశారు. “పోకిరిగా తిరుగుతూ సొల్లు క‌బుర్లు చెప్పే నీకు ఎంత మంచి బుద్ధి ఉన్న‌దిరా లెనిన్ త‌ప్ప‌కుండా ఆలోచిద్దాం,సుగుణా కాశ‌య్యా మీరేం బెంగ ప‌డ‌కండి, మ‌నం అంద‌రం క‌లిసి చారి బిడ్డ కోసం ఏదో ఒక‌టి చేద్దాం”అన్నాడు రాములు సార్‌. “అన్న‌ట్టు ఇప్పుడే వ‌ద్దులెండి సార్ నా వంతు నేను చారి బిడ్డ‌ను ఐదో త‌ర‌గ‌తి దాక చ‌దివిస్తా. అప్పుడు గురుకులం చేరుద్దాం” అన్న‌డు కాశ‌య్య‌. గ‌ట్ల‌యితే స‌రే అన్న‌ది సుగుణ కూడా. త‌రువాత ఏడు సంవ‌త్స‌రాల‌కు రాములు సార్ రిటైర్ అయ్యిండు. ఆయ‌న చారి బిడ్డ‌ను గురుకులంల చేర్పించిండు. లెనిన్ కూడా దూర విద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసిండు. సివిల్స్ రాసిండు. త‌న వంతు సాయం చేస్తున్నాడు. ఉప‌న్యాసాలు చెప్పేవాళ్ళు, ఊరేగేవాళ్ళు ఊరేగుతూనే ఉన్నారు. అండేద్క‌ర్ చెప్పిన “పే బ్యాక్ టు సొసైటీ”నినాదాన్ని నిశ్శ‌బ్దంగా పాటిస్తున్న వాళ్ళు న‌లుగురికి స్ఫూర్తిదాయ‌కంగా ముందుకు పోతున్నారు. చారీ బిడ్డ కూడా ఒక సామాజిక బాధ్య‌త గ‌ల బ‌హుజ‌న మ‌హిళ‌గా ఎదిగింది. త‌న వంతు ఈ సంఘానికి తిరిగి చెల్లిస్తున్న‌ది. “బ‌హుజ‌నుల రాజ్యం కోసం క‌ల‌లు క‌న‌డంతో పాటు పునాదులు ప‌డుతున్నాయి. విద్య ఒక్క‌టే దిక్కని అందరు తెలుసుకుంటున్నరు. బ‌హుజ‌నులంతా చేయి క‌లుపుతున్న‌రు. బ‌లాలు బ‌ల‌హీన‌త‌ల‌ను గుర్తించ‌గ‌లుగుతున్న‌రు. సంఘం శ‌రణం గ‌చ్చామి.బౌద్ధ‌ మొక్క‌టే బ‌హుజ‌న సుఖాయ అన్న‌ది” నీవు పొందిన దాంట్లో కొంత తిరిగి స‌మాజానికివ్వు. “ఆ సూత్రానికి నా జీవితం ఒక ఉదాహ‌ర‌ణ‌”,నేను సంఘం చెక్కిన శిల్పాన్ని. స‌హ అనుభూతి వెలిగించిన దీపాన్ని. చారి బిడ్డ అనేక స‌భ‌ల్లో అదే చెప్తున్న‌ది. ****

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

జిల్లేడు కాయ(కరోనా కథ))