పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

పచ్చటి ఆశలు

పిడికెడు మట్టి , చిటికెడు గింజలు పురిసెడు నీళ్ళను పట్టుకుని ఒంటిరెక్కతో ఒంటరిగా పైకి పోతున్నా ముందున్న వారికి వందనం మరో రెక్కై మొలిచి పచ్చగ నిలిచే వారికి స్వాగతం ప్రకృతి పరిణయాన ప్రణయలేఖలకు పత్రహరితాన్ని కలగంటూ ఉద్యమం జీవామృతానికి పసరువైద్యం చేయాలి పసిమొక్కగా రూపంతరం పొందాలి మనం రేపటి ప్రపంచానికి తడి స్పర్శ చెప్పి పచ్చటి ఆశల జల్లులకు ప్రతి అణువు మొలకలు మొలకలుగా అంకురించాలి వచ్చేప్పడు వట్టి చేతులతోనే కదా వచ్చాం పోయేది కూడా కాళీ చేతులతోనే నానా గడ్డితో సకలవిషాలను మేస్తూ మనసులతోపాటు దేహాలకు నింపుతూ మనం అందరం కదలాడే శ్మశానాలు అవుతున్నాం నివారణ మొదలవ్వాలిసిన తరుణం ఇది మనలో తడి ఆరకముందే ఇంటి పంటలై చిగురిద్దాం రండి మరో మొదటి రోజున ప్రతినబూని ప్రగతిశీల పచ్చదనమౌదాం రండి మిద్దెతోటలై మనమంతా విస్తరిద్దాం రండి • .......... జ్వలిత/9989198843

కార్పొరేట్ ధాంపత్యం

"కాలాన్ని జయిస్తూ నేను" కవితా సంపుటి నుండీ నాలుగవ కవిత *కార్పొరేట్ ధాంపత్యం* మనిషిని మనిషిగా బతకనివ్వని మాయాజాలం కుడిచేత యిచ్చి ఎడంచేత లాక్కుంటుంది మబ్బులా వర్షించే మాయజలం సూర్యుడు లేకుండానే ఆవిరైపోతుంది ఎటునుండి వచ్చి ఎటు పోతుందో తెలియని స్పర్శానందం బలుపో వాపో తెలియనివ్వని ఆర్ధిక లబ్ది సుఖాల విలాసాల తాయిలాలు కుటుంబ గోడలకు బీటలు చేస్తూ మానవతా బంధాలపై మార్మిక కుట్రలు మనకు తెలవకుండానే మనం మాయమౌతూ అమ్మానాన్నలు లేని రాలేని పబ్బు క్లబ్బుల వారాంతపు సరదాలు నాగరికత పరదా మాటున ' న్యూక్లియర్' కుటుంబాలకు అవార్డులు "డేటింగ్ అలవెన్స్' తో వ్యభిచారానికి రివార్డులు సూర్యచంద్రుల కాపురం - రాత్రింబవళ్ళ స్నేహం నాకు సూర్యోదయంతో బతుకు తెరువు నీకు చంద్రోదయంతో సుఖం కరువు ధాంపత్యానుబంధం అమావాస్య కారుచీకటి కోరికలను కంట్రోల్ చేసే 'రిమోట్ ' ఐదంకెల వేతనం గ్లోబలైజేషన్ లో విలాసాల ప్రలోభం బహుభార్యత్వం బహుభర్తృత్వం కాని మనసుకు ముసుగేసిన శరీరాల స్నేహం మది పొక్కిలి చేసుకోడానికి 'కంప్యూటర్' మౌస్ పనికిరాదు వంటిపై బట్టకు కరువు సంఘంలో విలువలకు కరువు

వంధ్యత్వం

"కాలాన్ని జయిస్తూ నేను" లో 6వ కవిత "వంధ్యత్వం" సగటుది సామాన్యమైనది నామనసు నా బలం బలహీనత కూడా నా మనసే వర్జీనియా టెక్ అయినా విజయవాడయినా శ్రీ లక్ష్మయినా లక్ష్మీ సుజాతయినా ప్రేమ హింసారూపమెత్తింది అహాలను తృప్తి పరచలేదనేగా హంతకులు ఆకాశం నుండి ఊడిపడ్డారా ధృతరాష్ట్రునిలా పుట్టుగుడ్డి కాదుగదా మనం గాంధారిలా అపాదించుకున్న అంధత్వం మనది ఇందుకు లింగభేదం లేదు చూపుకే కాదు మనసుకూ మనకెందుకులే అనే ఉపేక్ష దేవుని ప్రసాదంలా మనప్రేమలను ఐ లవ్ యూ రా అంటూ ఎందరికైనా ఎస్.ఎమ్.ఎస్. ఎందరికైనా ప్రేమను పంచే స్వేచ్ఛ మనకుంటే మనబుద్ది అమీబాలా అనుక్షణం మారుతుంటే ఆక్టపస్లమై అన్నివైపులా వేట మనదే వైరస్లతోపాటు హింసను పెంచే వటవృక్షాలు మనమే అనేక అత్యల్ప ప్రహసనాలకు మీడియా ఉత్సాహం అనేక హత్యల పై వెలుగు చూడనీ వుదాంతాలపై నిజాలు వెలికి తియ్యటానికి ఎందుకు వంధ్యత్వం నాలుగు గోడలమధ్య తలలెత్తే చిరుమొలకలు సామూహిక హింస రూపెత్తడానికి మన పాత్రెంత? నైతిక విలువల పతనంలో మన వాటా ఎంత ? వెలిగిపోతున్న భారతంలా తెల్లపావురమై ఎగురుతున్న శాంతిలా మదిపండు ఘనీభవించి చిదిమినా చెరిపినా ఏమిపట్టని స్థితప్రజ్ఞ

అరువుకు కన్నొకటి

"కాలాన్ని జయిస్తూ నేను" లో 5వ కవిత ' అరువుకు కన్నొకటి కావాలి' మనిషి బుద్ధికి చిలుము పట్టినట్లు మానవత్వపు మెట్లకు పాకురు పట్టినట్లు చాన్నాళ్ల నుండి పేరుకుపోయిన నమ్మకాలు మసీదుల్లో మందిరాల్లో అమాయకపు పావురాలు శాంతమో మూఢమో ప్రతిసారీ ఎక్కడెక్కడో నమ్మకద్రోహంలా బాంబు పేలుతూనే వుంది గుక్క పట్టిన పిల్లగాణ్ణి ఏమార్చేందుకు చప్పట్లు కొట్టినట్టు పట్టీంచుకోని తల్లి కోసం కాళ్ళు నేలకు కొట్టినట్టు మాట వినిపించుకోని భర్తపై కోపం వంట పాత్రలై మోగినట్లు టీవీ సీరియల్లో మునిగిన భార్యకై తలుపు విసిరి కొట్టినట్టు ప్రజల దృష్టిని మరల్చే ప్రభుత్వం లా అప్పుడప్పుడు ఇంటిదొంగలా బాంబు పేలుతనే ఉంది మసీదు కు దెబ్బతగిలితే మందిరం అబ్బా అంటుంది కోవెల గాయపడితే మసీదు అయ్యో అంటూంది ఇద్దరికీ కలిపి శఠగోపం పెడ్తుందెవరు అల్లా ఆలకించడం లేదా దైవం తిలకించడం లేదా పత్రికల మసిపూస్తూన్నాయి ప్రజలకు బూడిద మిగుల్తోంది ఉమ్మడి శత్రువును వెతుకుదాం సోదరా నీ కన్నొకటి అరువిస్తవా ? ******** (మక్కా మసీదు లో18/05/2007న బాంబు పేలుళ్ళ పై)

బతకండి

బతకండి మీరే/ జ్వలిత/22/2/2019, 22/20 బతకండి మీరు మాత్రమే బతకండి పక్కవాడిని నిలువునా చంపేసి తోటి వాళ్ళను పాతాళానికి తొక్కేసి వాడి పళ్ళెంలోది కూడా నువ్వే బొక్కేసి బతకండమ్మ మీరు మాత్రమే బతకండి మీ కొడుకులను రేపిస్టులని చేసి మీ సోదరులను సన్నాసులను చేసి మీ తాత తండ్రుల అహంకారాలని చుట్టుకొని బతకండి మీరు మాత్రమే బతకండి మీ జబ్బలను మీరే చరుచుకొని మీ తప్పులను మీ చంకల కింద దాచుకొని చట్టాలను మీ కింద పీఠాలు చేసుకొని బతకండి మీరే బతకండి తెల్లోళ్ళను తరమాటానికి వందలేళ్ళు భరించినోళ్ళం కదా మరేం పర్వాలేదు మీరే బతకండి బతకండి మీరే బతకండి నీకో గుంపు వాడికో గుంపు నీ చేతిలో డప్పు డబ్బా వాడి చేతిలో డబ్బు ఆయుధం అధికారం కోసం నువ్వు ప్రయత్నించకు ఇద్దరూ అంతా బాగుందని అంత్యప్రాసలతో రాసివ్వండీ మా పిల్ల కుంకలు బట్టీ పట్టి చదువుకుంటరు ఊళ్ళూ అడవులే కాదు సరిహద్దుల్లో కూడా మీ కిరాయి కత్తులకు మా దేహాలుంటాయిలే బతకండి మీరే బతకండి ....... 

3 స్వంత రక్తంలో పరాయితనం

"కాలాన్ని జయిస్తూ నేను"లో మూడో కవిత "స్వంత రక్తంలో పరాయి తనం" రాయి తగిలిన అద్దంలా కాపురాలు ముక్కలౌతున్నాయి ముక్క ముక్కలో వికృత రూపాలు వికటాట్టహాసపు ధ్వనులు రక్షణ వలయమవ్వాల్సిన రక్తబంధాలు స్వార్థపు రంగులు అద్దుకుంటున్నాయి కుటుంబమంతా అందమే , మరి వికృతమెక్కడిది దర్పణంలా శ్రతిబింబించాల్సిన సమయం కటకంలా వక్రీభవనమేమిటి? రాతి తాకిడికి అద్దం ముక్కలయ్యిందా ! అదృశ్య దెబ్బలకు హృదయం పగుళ్ళు వారిందా! రాయి నేనే , కటకం నేనే , దర్పణం నేనే ఐతే గుండె కవాటానికి అడ్డుపడేదిమిటి స్వార్థపు పొరల భేషిజం స్వంతరక్తంలో పరాయి తనం కుటుంబ బంధాలకు పోగులు సన్నబడ్డాయి మానవ సంబంధాలు పలుచబడ్డాయి వట్టిపోయిన గోవులు కబేళాలకు బ్రతికి వున్న బంధాలు వృద్ధాశ్రమాలకు... అంతే ............... (రచనా కాలం 1990)

1సబ్బన్న జాతుల ఆడది

"కాలాన్ని జయిస్తూ నేను"లో  కవితలు 1*సబ్బన్న జాతుల ఆడది* కొలిమి కాడికి బొగ్గులు నేను తెస్తే కొలిమి తిత్తి నా అక్క ఊదితే కొలిమిల కర్రుకు అమ్మ సమ్మెటేసి సాగదీస్తే సందేల డబ్బులు అయ్య చేతుల బడ్డయి 'ఒక్కడి రెక్కాడితే నలుగురి బుక్కలాడతన్నయ్ ' అన్న నా అయ్య మాట నా అమ్మను కూలిదాన్ని చేసింది సంగడి చక్రం నే తిప్పితే బండిముంతకు బతుకు కుదిరింది బండి పూటీలకు తొళ్ళు నే కొట్టి బండి ఆకులకు నూలు కొట్టి దొడ్డిరంపానికి అక్కాచెల్లెళ్ళం చెరో పక్క మేం అయి మా పసితనంతో కోస్తే పొద్దుగూకేళ్ళ నా తండ్రి సోయి తప్పేట్టు తాగినప్పుడు అలిసిందెక్కడ తాగిందెవరో తెల్వక ఆకాశమోలె నోరు తెర్సి నిద్రపోయిన పత్తి పాదాలతో మెత్తగా మట్టి తొక్కి చిట్టి చేతులతో నీళ్ళుకొట్టి నల్లరేగడి మట్టి అందమైన పట్వోలె మారేదాకా నీరై మట్టై మంటై వామై సంతల బేరమాడేదాక మేమున్నా చక్రం తిప్పినందుకే రెక్కలిరిగినయంటఘ ఎండల కుండలమ్మిన అమ్మ కుమ్మరివాముల బూడిదోలె తెల్ల మొగమేసింది అష్టకష్టాలతో చదివించలేం అర్థాకలితో పెంచి ఓ అయ్య చేతిల పెట్టాలె అంటే పరువు నిలుపుకునేందుకు పాచిపని చెయ్యనీకి అమ్మ కొంగు చాటుంగ కదిలి