నీళ్ళు కవిత

>ఏసంగెనక ఏసంగెనక తొలకరివాన నీల్లగురించి ఎంత సెప్పిన తక్కువనే ఆశల ఆకాశంలో అధికభాగం అవినీతి నీల్లే నల్లటియన్నీ నీల్లుకావు - తెల్లటియన్ని పాలు కావు అన్నరు గురువులు ఎర్రటినెత్తుర్ను తెల్లటి పాలు సేసి రొమ్ము గుడిపిన్రు అమ్మలు రక్తాన్ని సెమటనీల్లు సేసి బతుకిచ్చిండ్రు అయ్యలు అమ్మనాయన ఆశలకు నీల్లొదిలి గుడంబనీల్లకు అలవాటయి నీల్లు లేక ఎండిన పంటలోతిగ కూలబట్టిరి పోరగాల్లు బొట్టు బొట్టు నీటి సుక్క పొదుపు సేసి రేపటి తరానికి పాఠం చెప్పమంటది మొగులు మొక్కను మొక్కను కాచి వనాలను పెంచమంటది అడవి అడవి భూముల హక్కులను కాపాడ మంటది కొండ కొండ దాపున నిధులకు మర్మజలధారలకు ఆశపడుతున్నది నగరం తియ్యటి కొబ్బరనీల్లసుంటి మాటలు కమ్మగ సెప్పాలని నాకు సుత నోట్ల నీల్లూరుతన్నయి కని ఏమి సేద్దును తేజాబ్ నీల్లు తాగి సచ్చిన ఔసల కుటుంభాలు పురుగు మందు తాగి లోకాన్నొదిలిన రైతు కుటుంభాలు యాదికొచ్చి నీల్లుకు దూప కాదు కంటి కునుకు రాదు దుఃఖం మీద నీల్లు జల్లి మల్ల లేసి నిలబడమంటది మనుసు నేను కలగంటున్నది నీల్లనే అవును నేను కలవరిస్తున్నది నీటినే ఆడపొల్లని పుట్టకముందే ముంచేస్తున్న ఉమ్మనీటిని సిరియా శిశుమేధంలో కరువయిన కన్నీటిని మహాపాదయాత్రలో రక్తమోడిన అరికాలిబొబ్బల్లో నెత్తుటినీటిని మాన్హోల్స్ నోళ్ళుతెరిచి మనుషులను మింగి రోదిస్తున్న రోడ్లను సవాలక్ష నిర్లక్ష్యాలు చాపకిందనీరయి కమ్ముకుంటున్నా నిమ్మకు నీరెత్తనట్టున్న మేధావులను ఏ నీల్లను తలుసుకోను నేను ఏ నీళ్ళు ఏట్లె నీళ్లు వాగుల నీళ్లు చెరువులెండి కుంటలెండి పొడుచుకొచ్చిన భవంతులకెల్లి పొంగుకొస్తన్న మురికి నీల్లు ఏ నీల్ల గురించి మాట్లాడదమన్నా కండ్లనీళ్లు దునకబట్టె బొట్లు దిద్దుకుంట దారాలు సర్దుకుంట కోట్లు కోట్లు సదురుకో బట్టిరి కొందరు నీల్లమీద మన్ను బడ బొందలగడ్డల సుత నీల్లు లేకపాయె కొందరికి నీల్లు నములుకుంట ఎన్ని కతల పడితేంది ఏ కవితలు సదువుతేంది శంఖంల పోస్తెనే నీల్లు తీర్దమయినట్టు నీల్లుతాపకుంట గొంతు కోసెటోల్లదే రాజ్యమాయె పాడుబడ్డ బాయిలకు నీళ్లొదులతరని మోసకారి మొయిలు సూసి చేతుల ముంతనీల్లు ఒలకబోసి కుశాలయితాన్రు గని మన ఆశల మీద నీల్లు సల్లేది కానరైరి సెవ్వ పాపం పాడుగాను ఒక్క మాటనను భగీరధున్ని కాకతీయుల్ని మిషన్లయినందుకు ఒక్క మాట అనను కానీ చేతులు మారుతున్న రోతల్ల నా వాటా నీల్లెయ్యి అని అడిగిటోల్లను సైసు సైసున్రి లొల్లెందుకు అంట ఓట్ల పండుగ దగ్గర పడ్డది ఓపిక పట్టమంట త్యాగాలకు నీల్లొదలి అణిచివేయబడ్డ అక్క సెల్లెల్లు సుత గండిపడ్డ చెరవులోతిగ పురుషరాజకీయాల పాలై అస్తిత్వాలనొదిలి కొట్టక పోబట్టిరి ఓ అన్నలారా ఓ అక్కలారా ఓ అమ్భల్లారా ఓ అయ్యల్లారా మిట్టర మిట్టర మిట్కరిచ్చుకుంట ఎంతకాలం సూత్తరు మీ వాటా నీల్లు మీకొద్దా ఇప్పుడు కాకుంటే మల్లెపుడు రావు కుతంత్రాల మంత్రపు నీల్లు సల్లుకుండు ఆపండి ఉద్యమాలకు నీల్లారబోయ రమ్మంటోంది కాలం వచ్చేది కొత్త నీళ్ళ కాలం ఏసంగెనక తొలకరి కాలం 💐💐💐💐💐 జ్వలిత-9989198943 హేవిళంబి ఉగాది కవిత రవీంద్రభారతి 17/03/2018,(23గం.)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష