పాలు సున్నపు నీళ్ళు

పాలు- సున్నపు నీళ్ళు/జ్వలిత

ఇక్కడ చెంచాల సమ్మేళనం సాగుతూన్నది
కొన్నిపాత్రల కనుసైగలతో సదస్సు మొదలైంది
కారంకుండను చూచి మంటలనుకొని
అంటించని పొయ్యి చుట్టూ
గంటెలు సాగిలపడుతున్నాయి
గాజులులేని చేతివంట రుచుండదని
సన్నాసిశిబ్బి సన్నాయి ఊదుతూన్నది
వండనివీ వండినవీ వంతులేసుకొని
మింగుతున్న చీమలు కవాతు చేస్తున్నయి
ఆరగింపులకు ఆటంకమని పిల్లులు
ఎలుకలను బందిస్తున్నయి
ప్రేమైక వస్తుసౌందర్య నగ్నబొద్దింక ముగ్దరమణీయ ప్రదర్శన
రాతికుప్పల మీద చూపుల బూతులకు
మాంసపు ముద్దలమీద వాతలేసుకుంటున్నయి మెదళ్ళు

ఇంకా చెంచాల సమ్మేళనం నడుస్తూన్నది
మసిగుడ్డలన్నా కప్పండని
గంగాళం గొంతు చించుకుంటున్నది
ఈగలు దోమలు పిలుపులందుకొని
పీలికలు సర్దుకొని బాకాలూదుతున్నవి
ఆశల జాలాట్లో దొర్లుతున్న పందులు
ఉలికిపడి ఉరుకుతున్నయి
ఉడకని అన్నానికి తల్లెలు పట్టిన ఆకలిని
పక్కసందులకు గుంజుతున్నయి పందికొక్కులు
ఎముకలు కొరికే దరిద్రం
వెన్నెల్లో ఆడపిల్లయి తోడేళ్ళగోళ్ళకు రంగేస్తూన్నది

చెంచాల సదస్సు లొల్లాయి పదాలను చిలకరిస్తూన్నది
అజీర్తి వాయువు ముక్కులను శుభ్రం చేస్తూంటే
వెలగని పొయ్యికి హారతిస్తూన్నది కల్యమాకు
ఎంగిలే కాని గిన్నెలు తమకింక డోకాలేదని చెంచాలకు చరఘగీతం పాడుతున్నాయి

గేటు పక్క డేరాలో ముడుచుకున్న బక్కకుక్కపిల్ల
ఆకలి పెంచె పదార్థాలను చూపడం
జాతి భవితకు హానికరం అంటున్నది
ఇది సాఫ్ట్ ఫోర్న్ ఎందుకు కాదో
చెప్పమంటున్నది గోడమీద బల్లి
ఆరంభం కాకుండానే ముగించబడిన వంట సదస్సు
జల్లిగంటెకున్న పరిణితి చెంచాలకుండదని
తీర్మానించింది
ప్రాణలింగం బోడిలింగంపై టోపీ ఒకటేనని
పాలకు సున్నపునీళ్ళుకు తేడా తెలవక పేగులు కాలాయని
బెల్టుషాపు నుండి తూలుతూ వచ్చిన పట్టుకారు
చెంచాల సదస్సు ముగిసిందని ప్రకటించింది
మళ్ళీ వచ్చే చీకట్లలో కలుసుకుందామని
పురుగూ బూసి భుజాలు తడుముకొని విడిపోయాయి
~~~~~~~~~~~~~~~~~~~~
28/12/2018

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష