1సబ్బన్న జాతుల ఆడది

"కాలాన్ని జయిస్తూ నేను"లో  కవితలు

1*సబ్బన్న జాతుల ఆడది*
కొలిమి కాడికి బొగ్గులు నేను తెస్తే
కొలిమి తిత్తి నా అక్క ఊదితే
కొలిమిల కర్రుకు అమ్మ సమ్మెటేసి సాగదీస్తే
సందేల డబ్బులు అయ్య చేతుల బడ్డయి
'ఒక్కడి రెక్కాడితే నలుగురి బుక్కలాడతన్నయ్ '
అన్న నా అయ్య మాట
నా అమ్మను కూలిదాన్ని చేసింది

సంగడి చక్రం నే తిప్పితే
బండిముంతకు బతుకు కుదిరింది
బండి పూటీలకు తొళ్ళు నే కొట్టి
బండి ఆకులకు నూలు కొట్టి
దొడ్డిరంపానికి అక్కాచెల్లెళ్ళం
చెరో పక్క మేం అయి
మా పసితనంతో కోస్తే
పొద్దుగూకేళ్ళ నా తండ్రి
సోయి తప్పేట్టు తాగినప్పుడు
అలిసిందెక్కడ తాగిందెవరో తెల్వక
ఆకాశమోలె నోరు తెర్సి నిద్రపోయిన

పత్తి పాదాలతో మెత్తగా మట్టి తొక్కి
చిట్టి చేతులతో నీళ్ళుకొట్టి
నల్లరేగడి మట్టి అందమైన పట్వోలె మారేదాకా
నీరై మట్టై మంటై వామై
సంతల బేరమాడేదాక మేమున్నా
చక్రం తిప్పినందుకే రెక్కలిరిగినయంటఘ
ఎండల కుండలమ్మిన అమ్మ
కుమ్మరివాముల బూడిదోలె
తెల్ల మొగమేసింది
అష్టకష్టాలతో చదివించలేం
అర్థాకలితో పెంచి ఓ అయ్య చేతిల పెట్టాలె అంటే
పరువు నిలుపుకునేందుకు
పాచిపని చెయ్యనీకి
అమ్మ కొంగు చాటుంగ కదిలినం
పని మానెయ్ మనువు చెయ్యాలంటే
పయిలమని చెప్పినట్టుండేది
పైసలీమని అడిగినట్టుండేది

వేన్నీళ్ళకు చన్నీళ్ళోతిగ నౌకరీ మొదల్పెట్టి
చివరాఖరికి పానం నిలపనీకి
జీవనాధారం నేనయినంక
'అయ్యకిష్టం లేనిది నీళ్ళెందుకు'
అని కొడుకడగ బట్టే
నే నీళ్ళు తాగితెనే కదా నీకు పాలిచ్చేది
ఏం చెయ్యను
మొదట్నించీ వానపామోలె
తెగినకాడే పెరగడం నేర్చుకున్నదాన్ని
బల్లితోకోల్గె తెంపినప్పుడల్లా పెరుగుతనే వున్నా..
పడ్డ ప్రతిసారీ లేత్తనే వున్నా
నే చేత్తనే వున్నా...

కన్నందుకు నువ్ నాకేం చేసినవ్
అని కన్నబిడ్డ అడిగితే
పిల్లోలె కూనల నోట కర్సుకొని
అద్దె యిండ్లెమ్మటి తిరిగిన
సాలోడు బట్టవమ్మనట్టు
అరువులు తెచ్చి బట్టలమ్మిన
'గద్దొచ్చె కోడీపిల్లాట' నిత్యం ఆడీ
రెక్కల కింద మిమ్మల్ని దాచిన
గద్దలతో పోరాడిన
నీళ్ళకోసం నీడకోసం కూటికోసం కూలికోసం
ఎలుకోలె ఎలుగులెంట కలుగులెంట పోరు చేసిన

మగతనం విర్రవీగి
నన్ను తిరుగుబోతంటే
నన్ను కూలదాన్ని చేసిందెవరు ?
కొలిమిల కర్రు కుమ్మరికుండలు చీరముక్కలు..
చివరికి నా చిలుక పలుకులమ్మినపుడు
నేనేడిదాన్ని ? ఆడదాన్ని కాదా ?
మీకు ఆస్తులతో అస్థికలతో
అస్తిత్వంతో ఆకారాన్నిచ్చి ఆత్మనిచ్చింది నేనే...

అయ్యో ! నేనే కొడకా నీ అమ్మను
తల నేలకేసి నా ముందుకెల్లి
పోబడ్తివి రాబడ్తివి
నా బిడ్డవ్ నువ్వని మరిస్తెట్లా ?

---///-///-----

'
ఆంధ్రజ్యోతి' దినపత్రిక 'వివిధ' తేదీ :16/07/2007.

" కాలాన్ని జయిస్తూ నేను"  నా మొదటి కవితా సంపుటి. 23/11/2007న కొత్తగూడెం లో కోవెలసుప్రసన్నాచార్య ఆవిష్కరించారు, రామాచంద్రమౌళి సమీక్షించారు. మా అమ్మకు మొదటి కాపీని అందించాను.
పుస్తక ముఖచిత్రం, నా మాట, మొదటి కవిత పాఠక మిత్రుల కోసం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష