కార్పొరేట్ ధాంపత్యం

"కాలాన్ని జయిస్తూ నేను" కవితా సంపుటి నుండీ నాలుగవ కవిత
*కార్పొరేట్ ధాంపత్యం*
మనిషిని మనిషిగా బతకనివ్వని మాయాజాలం
కుడిచేత యిచ్చి ఎడంచేత లాక్కుంటుంది
మబ్బులా వర్షించే మాయజలం
సూర్యుడు లేకుండానే ఆవిరైపోతుంది
ఎటునుండి వచ్చి ఎటు పోతుందో తెలియని స్పర్శానందం

బలుపో వాపో తెలియనివ్వని ఆర్ధిక లబ్ది
సుఖాల విలాసాల తాయిలాలు
కుటుంబ గోడలకు బీటలు చేస్తూ
మానవతా బంధాలపై మార్మిక కుట్రలు

మనకు తెలవకుండానే మనం మాయమౌతూ
అమ్మానాన్నలు లేని రాలేని పబ్బు క్లబ్బుల
వారాంతపు సరదాలు నాగరికత పరదా మాటున
' న్యూక్లియర్' కుటుంబాలకు అవార్డులు
"డేటింగ్ అలవెన్స్' తో వ్యభిచారానికి రివార్డులు

సూర్యచంద్రుల కాపురం - రాత్రింబవళ్ళ స్నేహం
నాకు సూర్యోదయంతో బతుకు తెరువు
నీకు చంద్రోదయంతో సుఖం కరువు
ధాంపత్యానుబంధం అమావాస్య కారుచీకటి
కోరికలను కంట్రోల్ చేసే 'రిమోట్ ' ఐదంకెల వేతనం

గ్లోబలైజేషన్ లో విలాసాల ప్రలోభం
బహుభార్యత్వం బహుభర్తృత్వం కాని
మనసుకు ముసుగేసిన శరీరాల స్నేహం
మది పొక్కిలి చేసుకోడానికి
'కంప్యూటర్' మౌస్ పనికిరాదు
వంటిపై బట్టకు కరువు
సంఘంలో విలువలకు కరువు
ఆనందానికి కొత్తర్థాలు చెప్పే పర్సుతో బరువు
"వెబ్సెంటర్" చాలు ఆకలి తీర్చుకొనేందుకు

తెల్లతోడేళ్ళు దేశ సంపదను కొల్లగొట్టే క్రమం
ప్రపంచీకరణ మాటున తెలివితేటలను దోచుకుంటూ
సంస్కృతి సంప్రదాయాలపై గుమ్మరించిన నల్లతారు
అందాల పోటీ ల్లో మన ముఖాన చల్లిన తెల్లపౌడరు

తాతలు చిన్నాన్నలు మేనత్తలు
"గెట్ టుగెర్" లో మృగ్యమై
కంటికి కనిపించని ఒంటరితనం
జనారణ్యాల మధ్య ఏకాంతపు భూతం
మనసు చుట్టూ రకరకాల గోడలు
శరీర విశాలత్వపు ఒబిసిటీ
పెంచిపోషించుకున్న విషసంస్కృతి

స్వంతవారిలో పరాయితనం
అవసరాల అవకాశాలలో ప్రేమతనం
నేను ఒక నేనుగా
నీవు ఒక నీవుగా. మిగిలి
మనం కాలేని కార్పొరేట్ ధాంపత్యం

......................
2007 ఆగ్రాలో అంతర్జాతీయ రైటర్స్ సదస్సులో చదివింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష