వంధ్యత్వం

"కాలాన్ని జయిస్తూ నేను" లో 6వ కవిత "వంధ్యత్వం"
సగటుది సామాన్యమైనది నామనసు
నా బలం బలహీనత కూడా నా మనసే
వర్జీనియా టెక్ అయినా విజయవాడయినా
శ్రీ లక్ష్మయినా లక్ష్మీ సుజాతయినా
ప్రేమ హింసారూపమెత్తింది
అహాలను తృప్తి పరచలేదనేగా
హంతకులు ఆకాశం నుండి ఊడిపడ్డారా

ధృతరాష్ట్రునిలా పుట్టుగుడ్డి కాదుగదా మనం
గాంధారిలా అపాదించుకున్న అంధత్వం మనది
ఇందుకు లింగభేదం లేదు
చూపుకే కాదు మనసుకూ మనకెందుకులే అనే ఉపేక్ష

దేవుని ప్రసాదంలా మనప్రేమలను
ఐ లవ్ యూ రా అంటూ ఎందరికైనా ఎస్.ఎమ్.ఎస్.
ఎందరికైనా ప్రేమను పంచే స్వేచ్ఛ మనకుంటే
మనబుద్ది అమీబాలా అనుక్షణం మారుతుంటే
ఆక్టపస్లమై అన్నివైపులా వేట మనదే
వైరస్లతోపాటు హింసను పెంచే వటవృక్షాలు మనమే

అనేక అత్యల్ప ప్రహసనాలకు మీడియా ఉత్సాహం
అనేక హత్యల పై వెలుగు చూడనీ వుదాంతాలపై
నిజాలు వెలికి తియ్యటానికి ఎందుకు వంధ్యత్వం
నాలుగు గోడలమధ్య తలలెత్తే చిరుమొలకలు
సామూహిక హింస రూపెత్తడానికి మన పాత్రెంత?
నైతిక విలువల పతనంలో మన వాటా ఎంత ?

వెలిగిపోతున్న భారతంలా
తెల్లపావురమై ఎగురుతున్న శాంతిలా
మదిపండు ఘనీభవించి
చిదిమినా చెరిపినా ఏమిపట్టని
స్థితప్రజ్ఞత మననావహించి
మనమిప్పుడు నడుస్తూన్న శవాలం

... ...... .....
2007 జున్ , " ప్రజాకళ.ఆర్గ్"


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష