అరువుకు కన్నొకటి

"కాలాన్ని జయిస్తూ నేను" లో 5వ కవిత

' అరువుకు కన్నొకటి కావాలి'

మనిషి బుద్ధికి చిలుము పట్టినట్లు
మానవత్వపు మెట్లకు పాకురు పట్టినట్లు
చాన్నాళ్ల నుండి పేరుకుపోయిన నమ్మకాలు
మసీదుల్లో మందిరాల్లో అమాయకపు పావురాలు
శాంతమో మూఢమో ప్రతిసారీ ఎక్కడెక్కడో
నమ్మకద్రోహంలా బాంబు పేలుతూనే వుంది

గుక్క పట్టిన పిల్లగాణ్ణి ఏమార్చేందుకు
చప్పట్లు కొట్టినట్టు
పట్టీంచుకోని తల్లి కోసం కాళ్ళు నేలకు కొట్టినట్టు
మాట వినిపించుకోని భర్తపై కోపం
వంట పాత్రలై మోగినట్లు
టీవీ సీరియల్లో మునిగిన భార్యకై
తలుపు విసిరి కొట్టినట్టు
ప్రజల దృష్టిని మరల్చే ప్రభుత్వం లా
అప్పుడప్పుడు ఇంటిదొంగలా
బాంబు పేలుతనే ఉంది

మసీదు కు దెబ్బతగిలితే
మందిరం అబ్బా అంటుంది
కోవెల గాయపడితే మసీదు అయ్యో అంటూంది
ఇద్దరికీ కలిపి శఠగోపం పెడ్తుందెవరు
అల్లా ఆలకించడం లేదా
దైవం తిలకించడం లేదా
పత్రికల మసిపూస్తూన్నాయి
ప్రజలకు బూడిద మిగుల్తోంది
ఉమ్మడి శత్రువును వెతుకుదాం
సోదరా నీ కన్నొకటి అరువిస్తవా ?
********
(మక్కా మసీదు లో18/05/2007న బాంబు పేలుళ్ళ పై)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష