పథేర్ పాంచాలి-4

 "పథేర్ పాంచాలి" ఆగని గ్రామీణ గానాలాపన

జ్వలిత

"పథేర్" అంటే పథం, రహదారి, మార్గం అని అర్థం. "పాంచాలీలు" అనేవి తరతరాలుగా సంప్రదాయ కథాగానానికి ఉపయోగించే బెంగాలీ గీతాలు.
"పథేర్ పాంచాలి" బిభూతి భూషన్ బంధోపాధ్యాయ స్వీయ కథాత్మక బెంగాలీ నవల.1928-29 మధ్య "విచిత్ర" పత్రికలో సీరియల్ గా రాశారు. నవంబర్ 1929లో పుస్తక రూపంలో వచ్చింది. బెంగాలీ సాహిత్యంలో పేరెన్నికగన్న ఈనవలను సత్యజిత్ రే చలనచిత్ర రూపకల్పన చేయడంతో అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది.
సత్యజిత్ రే తన చిత్రానికి "సాంగ్ ఆఫ్ ది లిటిల్ రోడ్" అనే ఉప శీర్షికను ట్యాగ్ లైన్ గా జోడించారు.
ఈ బెంగాలీ నవలను అదే పేరుతో మద్దిపట్ల సూరి తెలుగు సేత చేశారు. తొలి ముద్రణ 1960లో విశ్వవాణి పబ్లిషర్స్, విజయవాడ వారు చేయగా ,
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ఫిబ్రవరి 2008, జూలై 2009, 2012లలో ముద్రించారు.
(అట్ట మీద బొమ్మ సత్యజిత్ రే పథేర్ పాంచాలి చిత్రంలో దుర్గ పాత్రలో ఉమాదాస్ గుప్త.)

చింత, నిశ్చింతల మధ్య ఊగిసలాడే జీవన పయనంలో ఎన్నో మలుపులు, ఒడిదుడుకులు అయినా సరే ఆ నడక ముందుకు సాగుతూనే ఉంటుంది. స్థల కాలాదులు లకు అతీతంగా జీవితాన్ని మానవ అనుభూతులను "పథేర్ పాంచాలి" నవలలో విభూతి భూషణ్ సార్వత్రికరించారు.
చక్కటి బెంగాలీ గ్రామీణ జీవితపు అనుభవాలతో అలరారే బిభూతి భూషన్ రచనలు చదవటం అంటే ఈ విశ్వాన్ని ప్రపంచాన్ని అతి దగ్గరగా సందర్శించడమే.

నవల చదువుతూ ఉన్నప్పుడు కొన్ని జీవితాలను గురించి సూటిగా సున్నితంగా కథ నడుస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ సామాజికంగా దీనికి ఉన్న విస్తృతి చాలా ఎక్కువ మారుతున్న కాలంతో పాటు వ్యక్తులుగా తమ తమ జీవితాలను వెతుక్కుంటూ, పల్లెల నుంచి పట్టణాలకు వలసపోతున్న జీవితాల గురించి అంతర్లీనంగా నవలాకారుడు కలవరపడడం గమనించవచ్చు. పారిశ్రామికీకరణ ప్రభావం గ్రామాల గుండెల్లోకి దూసుకు వచ్చిన నాగరికతారైళ్ళు, పసి మనసుల్లో అవి కలిగించే ఆనందాశ్చర్యాలతో కూడిన భయాందోళనలు, మానవ సంబంధాలను కుటుంబ సంబాధలను కూకటివేళ్ళతో కదిలించిన అనూహ్య విలయాలు, వేటికి తలవంచక చేసే పేదరికపు ఆత్మగౌరవం పోరాటాలు వంటివి, ఎన్నో మానవ అసామాజిక సందర్భాలను నవలలో మనం చూడవచ్చు. నవల చదివేప్పుడు పాఠకులు కూడా మనసు కరిగి కన్నీటి ప్రవాహాలై మౌనంగా కదిలి పోతారు.

పథేర్ పంచాలిలో కథ చాలా స్వల్పం . నిశ్చిందిపురంలో నివసించే ఒక పేద బ్రాహ్మణ కుటుంబం. చిన్న ఇంట్లో ఇద్దరు పిల్లలతో తిండి కోసం వాళ్లు చేసే పనులు వారి దైనందిన అనుభవాలు అంతే. ఈ చిన్న కథాంశాన్ని నవలా రచయిత బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ ఇద్దరు చిన్నపిల్లల కళ్ళతో వారి పసి మనసుల్లో నుంచి పొరలు పొరలుగా ఒక జీవిత కాలపు అనుభూతులను దర్శింప చేస్తాడు. నిశ్చిందిపురంలోని తోటలు చెట్లు చేమలు కాయలు పళ్ళు వాటితో పాటు దుర్గ, అపూ మన కళ్ళ ముందే సజీవ దృశ్యాలై తిరుగుతుంటారు. శైశవంలో సహజమైన ఆసక్తులు, చపల చిత్త తీవ్ర కోరికలు, సాహసాలతో కూడిన పరిశోధనలు, అపురూపమైన ఆశలు. చిన్న చిన్నవే అయినా వారి కోరికలు తెచ్చిన అవమానాల, గుసగుసలు, కవ్వింపులు, కుళ్ళుపోతు ఆలోచనలు మనకు తెలియకుండానే వాళ్ల లోకంలోకి మనమూ ప్రవేశించి నిస్సహాయంగా వాళ్లతో స్నేహం చేస్తాం. చివరకు దుర్గ మరణాన్ని వాళ్ళ కుటుంబం తట్టుకున్నా మనం తట్టుకోలేనంత విషాదాన్ని అనుభవిస్తాం.

కథలోకి వస్తే నిశ్చిందిపురంలో హరిహర రాయ్ ది ఒక పాత పెంకుటిల్లు. హరిహరుడు ఒక పేద బ్రాహ్మణుడు, తండ్రి ఇచ్చిన కొద్దిపాటి భూమి మీద రాబడికి తోడు ఐదారుగురు శిష్యులిచ్చే వార్షిక గ్రాసాలతో సంసారాన్ని ఈదుతుంటాడు.

నిశ్చిందిపురం హరిహరరాయని తాత ముత్తాతల ఊరు కాదు. వారిది పక్కనున్న ఎశ్డా విష్ణుపురం.
ఆ ఊరిలో చౌదరి వంశీయులైన ఐశ్వర్యవంతులు గతంలో కొందరు బ్రాహ్మణులను ఈనామ్ ఇచ్చి పిలిపించి వారికి అక్కడ నివాసం కల్పించారు. వారిలో హరిహరరాయ్ పూర్వీకుడు విష్ణురామరాయ్ ఒకడు. అప్పటికింకా బ్రిటిష్ పరిపాలన స్థిరపడలేదు. దారులు దొంగలతో దోపిడి గాళ్ళతో నిండి ఉండేవి. ఆ దొంగల ముఠాలలో దొమ్మరి, ఉప్పరి, యానాది, వడ్డెర కులాల వాళ్ళు, ఉక్కు శరీరాలతో కర్ర సాములతో ఆరితేరి ఉండేవాళ్ళు. చౌదరీ, బ్రాహ్మాణ వంశాల వాళ్లు దొంగలను పోషించి చాటుగా కాళికాలయం ఏర్పాటు చేసుకుని పగలు పెద్దమనుషులలా తిరుగుతూ చీకటి పడగానే సంపన్నుల ఇళ్ళను దోచుకునేవారు. ఆదోచుకునే ఇళ్ళలో సొంత బంధువుల ఇళ్ళు కూడా ఉండటమే. వంగదేశంలో చాలామంది జమీందార్లు తాము చాటుగా ఉండి అలగా జనాలతో దొంగతనాలు చేయించి ధనవంతులుగా మారారు. ప్రాచీన వంగ దేశ చరిత్ర తెలిసినవారికి ఈ విషయాలన్నీ తెలుసు. విష్ణురామరాయ్ కుమారుడు వీరురాయి కూడా అటువంటి వాడే. అతడి చేతి కింద జీతాలకు పనిచేసే దొంగలముఠా ఒకటి ఉండేది. నిశ్చింది పురానికి ఉత్తరంగా సాయాడోంగా నుంచి నవాబ్ గంజ్ మీదుగా టాకీకి పోయే కాలిబాట పక్కగా, సోనా డాంగ మైదానం మధ్యన ముసలమ్మ చెరువుగట్టు ఈ ముఠా వాళ్లకు కేంద్రం. చెరువు ఒడ్డున తరతరాల నాటి మర్రిచెట్టు చాటున దాక్కుని దారిన పోతున్న వారిని దోపిడీ చేసి దుడ్డు కర్రలతో కొట్టి చంపేశేవారు. ఆ తర్వాత శవాలను చెరువులోకి గుంజి బురదలో కుక్కేవారు.
వీరూరాయ్ తన దొంగలముఠా తో బ్రాహ్మణ తండ్రి కొడుకులను కనికరం లేకుండా చంపిన కారణంగా అతడి వంశంలో జేష్ఠ సంతానం మరణించేవారు. ఆ విధంగా రెండు మూడు తరాల వరకు కొనసాగింది.

హరిహర రాయ్ తండ్రి రామచంద్రరాయికి చిన్నతనంలోనే భార్య పోయింది. అతని తండ్రికి కొడుకుకు మళ్లీ పెళ్లి చేయాలని ఆలోచనే రాలేదు. రామచంద్ర రాయి ప్రత్యక్షంగా చెప్పలేక నానా తంటాలు పడ్డాడు. చివరకు నిశ్చిందిపురంలో రెండో వివాహం జరిగింది. ఆ తర్వాత కొద్దిరోజులకే తండ్రి చనిపోయాడు. దానితో విష్ణుపురంలో మకాం ఎత్తేసి నిశ్చింది పురంలో స్థిర పడ్డాడు.
మామగారి ప్రోద్బలంతో పాఠశాలలో చేరి సంస్కృతం నేర్చుకొని పండితుడయ్యాడు. కానీ సంపాదన పరుడు కాలేదు. అతని భార్యా కొడుకు సంవత్సరానికి తొమ్మిది నెలలు మామగారి ఇంట్లోనే ఉండేవారు. మామ గారు చనిపోయిన తర్వాత సంసారం ఈదడం కష్టమని తెలిసి వచ్చింది అతనికి.
ఆ ఊరిలో అతడికి భూమి పుట్ర ఏమీ లేవు. దాయాది సోదరుని కొడుకు "నీలమణి రాయ్" సాయంతో కొన్నాళ్ళు గడిచింది. ఉద్యోగరీత్యా నీలమణిరాయ్ తన తల్లితో సహా ఊరు వదిలి వెళ్లడంతో ఆ ఇంట్లో మకాం పెట్టాడు .
ఆ నివేశనంలో ఇల్లు కూడా కట్టాడు.
ఇందిరమ్మ అతని బంధువే. ఇందిరమ్మకు ఒక కులీనునితో వివాహం అయినా, ఆమెను అత్తవారింటికి తీసుకుపోలేదు వారు. భర్తే ఒకటి రెండు సార్లు వచ్చి ఒకరోజు ఉండి దారి ఖర్చులు బత్తెం తీసుకొని మరో అత్తగారింటికి వెళ్ళేవాడు. తల్లిదండ్రులు తమ్ముడు పోయిన తర్వాత ఆమె మొదటిసారి రామచంద్ర రాయ్ ఇంట్లో అడుగు పెట్టింది. ఆ తర్వాత రామచంద్రరాయ్ మరణించాడు. హరహరరాయ్ ఎప్పుడు చెట్లు పుట్టలు చెరువులు దొరువులు పట్టుకు తిరుగుతూ ఉండేవాడు. తండ్రి మరణించిన తరువాత అతనికి వివాహమైంది. భార్య పదేళ్ల పిల్ల, ఆమెను పుట్టింట్లో విడిచి దేశాల మీద పడిపోయాడు ఎనిమిది ఏళ్ల వరకు.
ఆ సమయంలో ఇందిరమ్మకు పూట గడవడమే కష్టంగా ఉండేది. చాలా కాలం తర్వాత తిరిగివచ్చిన హరిహర రాయ్ భార్యని తీసుకొని వచ్చి కాపురం పెట్టాడు.
హరిహరరాయ్ భార్య సర్వజయ ప్రతిదానికి ముసలమ్మతో గొడవ పడేది. హరిహరరాయ్ ఇంటి ఆవరణలో తూర్పు పక్కన పూరిపాకలో ఇందిరమ్మ ఒక్కతే ఉండేది. హరిహరన్ కుమార్తె దుర్గ అంటే ఆమెకు ప్రాణం. ఇందిరమ్మకు అటువంటి కూతురే ఉండేది, చిన్నతనంలోనే చనిపోయిన ఆమె బిడ్డే దుర్గ రూపంలో మళ్లీ జన్మించిందని ఆమె భావించేది. దుర్గకు కూడా అత్తయ్య అంటే ఎంతో ఇష్టం. అత్త నేర్పే పాటలు, చెప్పే కథలు ఎంతో ప్రియంగా విని నేర్చుకునేది. కానీ ఇవేవీ సర్వజయకిష్టం ఉండేది కాదు.

హరిహర రాయి సర్వజయదంపతులకు దుర్గ కూతురు, అపూ కుమారుడు. సర్వ జయకు ఇందిరమ్మకు తిండి పెట్టడమే దండుగ అని భావిస్తూండేది. దుర్గకు ఇందిరత్త చెప్పే కథలు కబుర్లు ఒక అందమైన అద్భుతమైన ప్రపంచంలో విహరింప చేస్తాయి ఆ పసిదాన్ని. తల్లి తరిమినప్పుడల్లా దుర్గ ఇందిరమ్మను ఊరడించి తిరిగి ఇంటికి తెచ్చేది.
1834వ సంవత్సరంలో ఇందిరమ్మ 75 ఏళ్లు పైబడిన వృద్ధురాలు. దవడలు జారిపోయి తోళ్ళ వడలి వేలాడుతూ ఉండగా, నడుము వంగి పల్లకి బొంగుల ఉన్నదామె శరీరం, దూరపు చూపు కనిపించదు కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టుకుని దారి వెంట పోయే వారిని పలకరిస్తూ ఉంటుంది.

సర్వజయ ఇందిరమ్మను వదిలించు కోవాలని రోజుకు మూడుసార్లు తిట్టిపోస్తుంది. ఒకరోజు ఇంటి నుండి తరిమేస్తూ తిరిగి ఇంటిగడప తొక్కొద్దని కఠినంగా మాట్లాడింది. వేసవి కాలం ఎండకు తట్టుకోలేక ముసలమ్మ ప్రాణం వదలింది
.
ఆ తర్వాత ఆ కుటుంబంలో చాలా పరిణామాలు చోటు చేసుకుటాయి. 1928 కంటే ముందు భారతదేశం ముఖ్యంగా బెంగాల్ ప్రాంత గ్రామీణ జీవనానికి అద్దం పట్టే నవల ఇది.

తల్లి తండ్రుల కోల్పోయి బంధువుల ఇండ్లలో హింసపడే గుల్కీ వంటి బాలికలు,
భాగవతాల ట్రూపుల్లో వివక్షకు గురయ్యే అజయుడు వంటి బాలనటులు.
గోకుల్ వంటి మూర్ఖుల చేతిలో గృహహింసను అనుభవిస్తూన్న భార్యలు, ఆ హింసను ప్రోత్సహిస్తూన్న గోకుల్ అక్క సఖీఠాకురాయన్ వంటి మహిళలు.
ఉమ్మడి కుటుంబాల్లో పుట్టి పలాయనవాదులయిన భర్తల వల్ల అనాథవృద్దురాలిగా మరణించిన ఇందిరమ్మ వంటి వా‌రు.
పైకి పెద్దమనుషులుగా ఉంటూ దోపిడీలతో సంపన్నులయ్యే చౌదరీ వంశీయులైన విష్ణురామరాయ్, వీరూరాయ్ వంటివారు.
కష్టాలలో ఉన్న సర్వజయ వంటి స్త్రీలను వేధిస్తూ గోతికాడ నక్కల్లా ఎదురుచూసే నందబాబు వంటివారు ,
పుస్తకపఠనం పట్ల ప్రపంచ వింతలపట్ల ఆసక్తితో ఉండే అపూ అని పిలవబడే దుర్గ తమ్ముడు శ్రీఅపూర్వకుమారరాయ్ వంటి అమాయక బాలురు ,
"ప్రేమభక్తి చంద్రిక" వంటి పుస్తకాలను , అనేక గేయలను , కథలను చెప్తూ అపూకు ప్రపంచాన్ని పరిచయం చేసే నరోత్తమదాస బాబాజీ.
బాలకథానాయకురాలు దుర్గ ప్రపంచంలోని పేద బాలికలకు ప్రతినిధి సాహసవంతురాలు తెలివైనది చురుకైనది ధైర్యవంతురాలు మొండిఘటం. చివరికి మందుమాకు లేక సరైన ఆహారం లేక మలేరియా జ్వరంతో దీనాతి దీనంగా మరణిస్తుంది.
ఆమె తండ్రి హరిహరరాయ్ ఏమిచెయ్యాలో తెలియక పగటికలలు కంటూ కాలం వెళ్ళబుచ్చే విద్యావంతుడైన సోమరి.
ఇట్లా ఎన్నో పాత్రలు ఇప్పటకీ మన చుట్టూ కనిపిస్తూనే ఉంటాయి.
1928లో రాసిన ఈ నవల తొంబదిరెండు సంవత్సరాల తర్వాత కూడ మారని భారతదేశ సామాజిక పరిస్తితులను వివరిస్తూంది.

ఈ నవలలో బాల్యాన్ని వర్ణించిన తీరు గుర్రంజాషువా రచన "శిశువు"ను గుర్తుకు తెస్తుంది. పేజీ నంబర్ 15 లో
"బుట్టెడు పండు సంపెగల్ని బోర్లించినట్టు - పాపాయి తన బుల్లి చేతులను నేలను కరుచుకొని హాయిగా నిద్దురపోతుండేవాడు. నాలుగు పక్కలనించి చీమలు ప్రాకివస్తూ వుండేవి. ఆదమరచిన నిద్రలో పల్చని బాబాయి చిట్టి పెదవులు రవ్వంత కంపిస్తున్నట్లు ఉండేవి. నిద్రలోనే మధ్య మధ్య గుక్కిళ్ళు మింగుతూ, మేల్కొన్న పోయి వాడిలా గట్టిగా నిట్టూరుస్తూ ఉండేవాడు తీరా దగ్గరకు వచ్చేస్తే మళ్లీ అంతలోనే ఒళ్ళు తెలియని నిద్ర లో ఉండేవాడు, పగలు రాత్రి వెదురు అడవి మధ్యలో అలికిడి లేకుండా ఉన్న ఇల్లు నెలల పాపాయి బోసినవ్వులతో గలగల మార్మోగుతూ కలకలలాడు సాగింది."
"అపూ" పదినెలల పసివాడిగా ఉన్నప్పుడు ఆ ఇంటి వాతావరణం లో వచ్చిన మార్పు.
(16వ పేజీలో) తల్లీపిల్లల ఋణాను బంధాలకు కొత్త నిర్వచనం చెప్పాడు రచయిత.
" తల్లులు ప్రాణం ఇచ్చి పిల్లల్ని పెంచుతారు" అంటూ మాతృ గౌరవాన్ని ఇనుమడింప చేసే ఇలాంటి మాటలు ఎవరి నోట పడితే వారి నోట వినిపిస్తూ ఉంటాయి. కానీ శిశువులు తల్లులకు ఇచ్చేది కూడా తక్కువ విలువైంది ఏమీ కాదు. వాళ్ళు ఈ లోకం లోకి వస్తూ వెంట ఏమీ తెచ్చుకోరు అన్న మాట వాస్తవమే. కానీ మనసును చదువుకొని వచ్చే మాలిన్యం లేని ఆ చిరునవ్వులు. చందమామలోని సిగ్గుతో చేసినట్లు ఉండే ఆ ముఖాలు. ఆ శిశుతారళ్యం అర్థాలకు కట్టుబడని ఆ ముద్దు మాటలు. వీటన్నిటికీ విలువ ఎంత కట్టగలం. అదే వాళ్ళ కలిమి. ఆ కలిమినిచ్చి దానికి బదులు తల్లుల చేత వూడిగాన్ని చేయించుకుంటారు. అంతేకానీ బిక్షువుల్లాగా ఒట్టి చేతులతో వచ్చి ఏమీ స్వీకరించడం లేదు". అంటారు రచయిత.

కథానుగుణంగా ఎన్నో పుస్తకాలను ప్రస్తావిస్తారు నవలలో. ప్రేమభక్తిచంద్రిక , కాళిదాసు మహాభారతం, ఆధ్యాత్మిక రామాయణం, పద్మ పురాణం, సచిత్ర చండీమహత్యం, కాలకేతోపాఖ్యానం, నిత్య కర్మ పద్ధతి, ప్రాకృతిక భూగోళం, శుభంకర లెక్కల పుస్తకం, మహాభారతం, వీరాంగన కావ్యం , కుటాయి చండీ, వంగవాసి పత్రిక, ముకుల్ పత్రిక, గోపీశ్వరుని గుప్తకథ, ప్రేమ పరిణామం, ప్రణయ ప్రతిమ సరోజ్, దస్యు దుహిత, కుసుమ కుమారి, సీతా వనవాసం, బేతాళ కథలు, మహారాష్ట్ర జీవన ప్రభాతం, రాజపుత్ర జీవన సంధ్య, సచిత్ర యవ్వని యోగిని నాటకం వంటివి. ఈ పుస్తకాలతో పాటు రాబందు గుడ్డులో పాదరసం నింపితే ఎక్కడికైనా ఎగిరి పోవచ్చని రాసి ఉన్న సర్వసందర్శిని వంటిపుస్తకాలు గురించి చెప్పారు రచయిత.

దుర్గ, రాణుదీ, అమలాదీ, లీల వంటి కౌమరదశ దాటని అమ్మాయిలు వాళ్ళ ఆశలు వాటిపై నిబంధనలు. బినీ వంటి అంటరాని తనాన్ని అనుభవించే అమ్మాయిల గురించి కళ్ళకట్టినట్టు నవలలో చెప్పబడింది.
దుర్గచనిపోయిన తర్వాత కుటుంబ దుఃఖాన్ని నవలలో ఒక సాధారణ సంఘటనలా "ఇంకెక్కడి దుర్గండీ , దుర్గ మనని వదలి పోయింది, ఇన్నాళ్లు మీరెక్కడికి పోయారు" అనడంతో అయిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు.
బెంగాలీ బ్రాహ్మలు చేపలు ( మాంసాహారం) తింటారని మొదటిసారి చదివాను.
వడ్డెర , ఎరుకల వంటి శూద్రులను వేతనాలిచ్చి దొంగలుగా మార్చిన వ్యవస్థ మీద కోపం వచ్చింది నాకు.

దుర్గను ఒక ప్రకృతి ప్రేమికురాలిగా పరిచయం చేసి ఎన్నో రకాల ఫలాలను తినిపించాడు రచయిత.
కామంచి పళ్ళు, శాఖోటపు పళ్ళు, రామాపళ్ళు, తీగ పానిపళ్ళు, పనస పళ్ళు, అత్తి పళ్ళు, వనచాలతా పళ్ళు, ఎర్రటి మకాల్ పళ్ళు, వన్ ధుంధుల్ తీగలు , తిత్తి రాజ్ చెట్టు, తిప్పతీగల,ు దిరిసెన చెట్టు, బిల్వ వృక్షం, పొన్న చెట్టు, తీగసంపెంగలు, కొండగోగు చెట్లు, వాస పుష్పాలు వంటి అనేక రకాల పళ్ళు పూలు తీగలు చెట్లను పరిచయం చేస్తూందీ నవల.

అందమైన ప్రకృతి వర్ణనలతో పాటు, పాతకాలపు దేవాలయాల గురించి కూడా ఇందులో చెప్పాడు రచయిత. గ్రామదేవత పంచానన్ ఠాకూర్ దేవాలయం వంటిదే పాతచెరువు గట్టున మజుందార్ వంశీయులచే ప్రతిష్టించబడిన విశాలక్షీ దేవాలయం ఉండేది , ఆమందిరంలో నరబలులు ఇవ్వడంతో ఆగ్రహించి ఆలయం వదలి వెళుతున్నట్టు కలలో కనపడిచెప్పి వెళ్ళిపోయిందట దేవత. మజుందార్ వంశంలో ఒక్కరు కూడా మిగలకుండా పోయారు.

ఆ తర్వాత చానాళ్ళకు స్వరూప చక్రవర్తి ఊరు వెళ్లి వస్తుండగా, సందె వేళకు రేవు దాటే ప్రదేశంలో ఒక పదహారేళ్ల సుందరి కనిపించి, అతడితో "నేను ఈ గ్రామంలోని విశాలాక్షీదేవిని, కొద్దిరోజుల్లో ఊర్లో కలరా మసూచీలు ప్రారంభమవుతాయి, చతుర్దశి నాటి రాత్రి "పంచానంద ప్రదేశం"లో 108 గుమ్మడి కాయలు కొట్టి కాళీ పూజ చేయమని" చెప్పి మాయమయిందట. అది జరిగిన కొన్నాళ్ళకి ఊర్లో అంటు వ్యాధులు ప్రబలాయట. ఇటువంటి కథలు ఈ నవలలో చాలా కనిపిస్తాయి.

దుర్గ చనిపోయిన తర్వాత కాశీకి చేరిన ఆ నిరుపేద కుటుంబంలో ఇంటి పెద్ద హరిహరరాయ్ కూడా మరణించాడు. అపూ తల్లీ సర్వజయ వంటమనిషిగా కుదురుతుంది.
అక్కడే అకారణంగా దెబ్బలు తినడంతో "తన ఊరు తనకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనే కోరిక జాగృతమయింది" అపూకు.
పథదేవత ప్రసన్నంగా నవ్వి " ఓయి వెర్రివాడా మీ ఊరిలోని వెదురు తోపుతో గాని, బందిపోటు వీరూరాయి వట వృక్షం దగ్గర తోబల్చిత్ కాల్వ రేవు దగ్గరతో గాని, ఈ నా పథం అంతమయ్యేది కాదు. మీ సోనాడాంగా మైదానాన్ని ఇచ్చామతి నదిని దాటి, పద్మాలతో నిండి ఉండే మధుకాళీ తటాకం ప్రక్క నుంచి పోయి, మిత్రావతి రేవు దాటి సూటిగా కేవలం సూటిగా దేశాన్ని వదిలి దేశాంతరాలు వైపు సూర్యోదయాన్ని విడిచి సూర్యాస్తమయం వైపు, పరిచితమైన పరిధులన్ని అధిగమించి అపరిచితులైన పరిధుల వైపు సాగిపోతున్న ఈ పథం. ఈ విచిత్ర ఆనంద యాత్ర తిలకాన్ని నీ నుదుట ధరింపచేసి నిన్ను గృహ విముక్తుణ్ని చేసి తీసుకు వచ్చాను.
" పద ముందుకు పద" అన్నది. అనే వాక్యం తో నవల ముగుస్తుంది.


(నవల దుర్గ మరణంతో అపూ సొంత జీవితం ఆరంభమవుతూ ముగుస్తుంది. ఆకథ1932 అపరాజిత నవలలో కొనసాగుతుంది.)

*****(సమీక్ష - జ్వలిత)********
మూల రచయిత పరిచయం:
బిభూతి భూషన్ బందోపాధ్యాయ 1894లో కలకత్తా కు ఉత్తరంగా వంద మైళ్ళ దూరంలో ఉన్న మరాటి పూర్ గ్రామంలో జన్మించాడు బాల్యమంతా పేదరికంలో గడిపి గడిపి చదువు స్థానిక పాఠశాలలో కొనసాగించాడు 1918లో కలకత్తా లోని కాలేజీ నుండి డిగ్రీ పొందారు రకరకాల పనులు చేసిన ఉపాధ్యాయుడిగా వృత్తిని కొనసాగించారు 1922లో అతని తొలి కథ కలకత్తా జర్నల్లో సచ్చిపోయింది 17 నవలలు ఇరవై కథ సంకలనాల తో 50 పుస్తకాలను ప్రచురించారు అతనికి గొప్ప కీర్తిని తెచ్చి పెట్టిన నవల మాత్రం ఎయిర్ పాంచాలి దానికి కొనసాగింపు అపరాజిత అంతరించిపోతున్న అరణ్య గురించి దట్టమైన ప్రకృతిలో మమేకమై మనసుకు హత్తుకునేలా రాసిన నవల అరణ్యక దానిని తెలుగులో వనవాసి 1950లో వీరు మరణించారు
***** ***** ****
అనువాద రచయిత పరిచయం:
"పథేర్ పాంచాలి" నవలను తెలుగులోకి అనువాదం చేసిన వారు మద్దిపట్ల సూరి. వీరు 1920 జూలై 7వ తేదీన తెనాలి దగ్గర అమృతలూరులో జన్మించారు. తెలుగు, సంస్కృతం, బెంగాలీ, హిందీ భాషలపై పట్టు ఉన్న వీరు బెంగాలీ సాహిత్యాన్ని సహజ సుందర అనువాదంతో సొగసైన నుడికారంతో తెలుగు పాఠకులకు పరిచయం చేశారు. బిభూతి భూషణ్ బందోపాధ్యాయతో పాటు తారాశంకర్ బెనర్జీ , శైలజానంద్ ముఖర్జీ, నిరంజన్ గుప్త వంటి బెంగాలీ రచయితల రచనలను తెలుగు పాఠకులకు అందించారు. వీరు అనువాదం చేసిన సాంబుడు, సమయం కాని సమయం , కలకత్తాకు దగ్గరలో వంటి నవలలను సాహిత్య అకాడమీ ప్రచురించింది. భలే తమ్ముడు, పండంటి కాపురం, విచిత్ర దాంపత్యం వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు. 1995లో నవంబర్ 19న మరణించారు.

7/8/20

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష