జిల్లేడు కాయ(కరోనా కథ))

 జిల్లేడుకాయ


"కిషన్ రావు సంగతి తెలిసిందా! "గోపాల్రావు
"ఏమైంది"వాసు.
"హాస్పిటల్లో ఉన్నాడట" గోపాల్రావు.
"ఎందుకు మళ్ళేమయింది" వాసు.
" అవును ఇంతకుముందు కూడా పదిరోజుల వరకు హాస్పిటల్లో ఉన్నట్టున్నాడు కదా బాయ్" ఆలి.
"ఏదో స్కిన్ ఎలర్జీ అట" గోపాల్రావు.
"అంతే కాదు గుండెలో మూడు వాల్వులు బ్లాక్. అయినయట" వాసు.
"ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు కదా" క్రిష్టఫర్.
"అందరికీ పెళ్లిళ్లయ్యాయి కొడుకు అమెరికాలో ఉంటాడు" గోపాల్రావు.
" భార్య భర్తలు ఇద్దరే ఉంటున్నారు" వాసు.
"అయితే ఏమిలే ఇద్దర బిడ్డలు ఇదే ఊర్లో ఉంటారట కదా బాయ్" ఆలి.
"ఎక్కడ ఉంటే ఏముంది బాధ్యతలన్నీ తీరిపోయాయి కదా" క్రిష్టఫర్.
" బాధ్యతలు తీరడం అంటే పెళ్లిళ్లు చేయడం తోటే అయిపోదు" వాసు.
"అది కాదు లేరా బాబు, ఇప్పుడు కష్టపడి, పడీపడి అప్పులు చేసేంత అవస్థ లేదని" రామకృష్ణ.
"ఎంత చెట్టుకు అంత గాలి, ఎవరికీ ఉండే కష్టం వారికుంటుంది" వాసు.
"రేపు ఒకసారి పోయి చూసొద్దాం" గోపాల్రావు.
"అప్పుడు నాకు కూడా చెప్పురా బాబు నేనొస్తా" రామకృష్ణ.
"ఏ లోకంలో ఉన్నారు మీరు ఇద్దరూ. లాక్ డౌన్ లో ఎట్లా పోదామనుకుంటున్నారు" వాసు.
"నిజమే కదా మర్చిపోయాం" ఇద్దరూ ఒకేసారి అన్నారు.
అదొక మిత్ర సమూహం అందరూ ఐదుపదులు చూసిన వాళ్ళే.
... ... ... ... ...

వాళ్లంతా ఒకే ఆఫీసులో పనిచేసే వాళ్లు కారు కానీ, ఒకే డిపార్ట్మెంట్ లో వేరు వేరు బ్రాంచ్ ల్లో పనిచేస్తున్నారు. ఇంకా ఆఫీస్ కి వెళ్తున్న వారిద్దరు, వాసు , కిషన్రావు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు .
అందుకే వాసుకు అభద్రత. కిషన్రావు పరిస్థితి చూసి మరీ బెంగ పడుతున్నాడు.

నలుగురూ ఒకే డిపార్ట్మెంట్లో పనిచేయడమే కాదు వాళ్ళు కాలేజీ నాటినుండి ఫ్రెండ్సు. ఒకే కాలేజీలో వేరువేరు గ్రూపుల్లో చదువుకున్నారు. ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఒకే ఊరికి చేరారు. కాలం అనుకూలించి పక్క పక్కన ఇళ్ళు కూడా కట్టుకున్నారు.

కాకపోతే ఏవో కారణాల వల్ల కిషన్ రావు తన ఇల్లు అమ్మేసి వేరే బజార్లో కొనుక్కున్నాడు. ఆ స్థానాన్ని ఆలి పూర్తి చేశాడు. క్రిష్టఫర్ అని మిల్ట్రీలో చేసి రిటైర్ అయిన మరొకరు వీరి మిత్ర బృందంలో చేరాడు.
ఆవిధంగా ఆ మిత్రచతుష్టయానికి మరో ఇద్దరు చేరారు.
--- ---- --- -----

మర్నాటి ఉదయం ఎనిమిది గంటలకు కిషన్రావు సంగతి అడుగుదామని అనుకుంటుండగా. రామకృష్ణ ఫోన్ మోగింది.
ఫోన్ ఎత్తి "హలో వాసు ఏమైనా విషయం తెలిసిందా" అన్నాడు .
"అవును అది చెబుదామనే చేసాను"
"ఏం జరిగింది ? ఎలా ఉంది ?"
"బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందట, వెంటిలేటర్ల మీద ఉన్నాడట"
"ఎవరు చెప్పారు"
"వాళ్ళ పక్కింటి అప్పారావు చెప్పాడు"
"మరి ఎట్లా ? మనం పోవడం కుదురుతుందా" "ఎక్కడికి పోతావురా ? ఎట్లా పోతావు ?పోవడానికి కుదరదనే, నీకు సమాచారం ఇస్తున్నా"
"సరేలేరా బాబూ అప్పుడే ఎండ పెరిగిపోయింది. సాయంత్రం కలుద్దాం కంగారు పడకు" అన్నాడు రామకృష్ణ.
మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసాడు వాసు.
"పాపం వాసు టెన్షన్ పడుతున్నట్టున్నాడు. వాడి సమస్యలు వాడివి" అనుకున్నాడు రామకృష్ణ.

------ --- -------

వాసుకు ఇద్దరు పిల్లలు. కొడుకు, బిడ్డ. ఇద్దరి పెళ్ళిళ్ళూ అయినాయి. ఏవో ఉద్యాగాలు చేసుకుంటున్నారు అయినా టెన్షనే వాసుకి. అసలే టెన్షన్ మనిషి. బిడ్డ ఏదో పల్లెటూర్లో ఉంటుంది. అల్లుడు అనుమానపు గొడ్డు , ఆమేమో చదువుకున్న పట్నం బిడ్డ.
'అనుమానంతో చంపుతున్నాడు నా బిడ్డను.ఆ పల్లెటూరుమొద్దు" అంటాడు వాసు.
"నీది పట్నమయితేంది నన్ను వేపుకుతింటలే, అయినా నీ బిడ్డ నీకంటే నాలుగాకులెక్కువే సదివిందిలే" అంటది వాసు భార్య.
వాసు బిడ్డకిద్దరు పిల్లలు కొడుకు‌, బిడ్డ. వాసు కొడుకుకు ఇద్దరూ ఆడపిల్లలే.

ఈమధ్యే వాసు సడ్డకునికి ఒక మనమడు పుట్టాడు. అప్పటినించీ మరీ ఇంటిపేరు నిలబెట్టే మగపిల్లాడు లేడని తెగ బాధ పడ్తున్నాడు.
అతడి భార్యమో "ఎవరైతే ఏమిటి. మీ అన్నయ్యకు , తమ్ముడికీ ఇద్దరూ అమ్మాయిలే కదా వాళ్ళు బాధపడుతున్నారా, కనీసం మనకొక కొడుకున్నాడు, మనమ్మాయికి ఒక కొడుకున్నాడు" అందట.
"మా ఆవిడ కనిపించని ఫెమినిష్టురా" అంటూ వాసు రామకృష్ణతో చెప్పుకొని తనకు అలవాటయిన టెన్షన్ పడ్డాడు.

కరోనా లాక్డౌన్ అయినప్పటికీ, ఓకే బజార్ కాబట్టి వీరంతా, ఎవరో ఒకరి డాబామీద జాగ్రత్తలు పాటిస్తూ మాస్కులు పెట్టుకొని, దూరం దూరం కూర్చుని, రోజుకు ఒక అర్థగంట మాట్లాడుకుంటున్నారు. మందు విందు బంద్ కాబట్టి కరోనా పుణ్యమా ఎవరింటికి వారు పరిమితమయ్యారు.

కరోనా కష్టకాలంలో స్నేహాలు లేవు. బంధువులు లేరు, పెళ్ళిళ్ళు లేవు, సమావేశాలు లేవు. అన్నీ నాలుగు గోడల మధ్యలోవాట్సాప్ ఫేస్బుక్ ఇష్టాగ్రామ్ వంటి వాటికే పరిమితమయ్యాయి.

కరోనా వల్ల ఒకవైపు భయం ఒకవైపు దిగులు ఇసుమంత ఆనందం. ఆనందం ఎందుకంటే ఉరుకుల పరుగుల జీవితానికి బ్రేక్ పడింది. అనవసరమైన మార్కెట్ కొనుగోళ్లకు లాకులు పడ్డాయి. కుటుంబ సభ్యులంతా ఒకే ఇంట్లో ఉన్నా వేరు వేరు ప్రపంచంలో ఉండే మనుషులు. ఇప్పుడు కలిసి టిఫిన్ చేస్తున్నారు, కలిసి భోజనాలు చేస్తున్నారు కలిసి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడడం చేతగాని వాళ్ళు పోట్లాడుకుంటున్నారు.

పిల్లలు ఉన్న ఇల్లు గోలగోలగా జాతర జాతర. వాళ్ల ఇష్టాలు ,పోట్లాటలు, ఆటలు, అల్లర్లు. స్కూల్ లేదు ట్యూషన్ లేదు పార్కులు షికార్లు అన్నీ బంద్. మొత్తానికి ఇంటి ఇల్లాళ్ళకు పని పెరిగింది. కొంచెం ఓపిక సృజన ఉన్న మోడర్న్ ఇల్లాళ్ళు పిల్లలకు ఏదో ఒక ఆటను చిన్న చిన్న ఎస్సైన్మెంట్లను, డ్రాయింగ్లను నేర్పిస్తూన్నారు. యూట్యూబ్ పరిజ్ఞానానికి సొంత శైలిని ఉపయోగించుకొని.

ఇది వద్దు అది వద్దు అనకుండా అన్నీ ఇచ్చి, చివరికి వారు ఇల్లు పీకి పందిరి వేసిన వాటిని, వారి చేతే సర్థించడం, నేర్పుతున్నారు. అమ్మలకు పనులలో సాయం చేసేట్టు వారిని మలుస్తూన్నారు.
మొదట్లో కొంత భయ పడ్డా తర్వాత అలవాటు పడ్డారు. పిల్లలకు, రేపటి తరానికి సమాజాన్ని ఏకోణంలో చూడవచ్చో నేర్పించే అవకాశం తల్లిదండ్రులకు కరోనా కల్పించింది. కష్టంలో కూడా బంగారు పూలు పూయించగల కాలం ఇది సమర్ధులకు, వివేకవంతులకు.

ఆర్థికంగా స్థిరంగా ఉన్న వాళ్ళు ముందు జాగ్రత్తలు ఉన్నవాళ్ళు కుటుంబాలలో చాలా మంది తల్లులు కరోనా సెలవులను ఆస్వాదించారు. పిల్లలకు బోర్ కొట్టకుండా నొప్పి తెలియకుండా చూసుకో గలిగారు.

కానీ యాంత్రికంగా బతికే తల్లులు, తెలిసీ తెలియని తల్లులు, ఉరుకుల పరుగులతో ఇంటి నుండి పని చేయాల్సి రావడం కష్టంగానే మారింది. ఇంట్లో వారికి అన్ని వండి పెట్టడం, మిగిలిన వాళ్ళు ఏమీ పట్టించుకోకపోవడం, ఉద్యోగం చేసే అమ్మలకు ఒక రకమైన కష్టాలు వస్తే, ఉద్యోగం చేయని అమ్మలకు మరొక రకం కష్టాలొచ్చాయి. పనికి సాయంమనుషులు రాకపోవడం, పెద్ద వయసు తల్లిదండ్రులు ఎక్కడో ఉండడం, కరోనా వదంతులు వార్తలు చావులు భయపెట్టడం, మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఒత్తిడి మాట సరిపోదేమో హింసకు గురయ్యారు. ఎడ్డెం అంటే తెడ్డెం అనే దంపతులు ఉన్న కుటుంబాల్లో ఈ సమస్య మరీ ఎక్కువ అయింది. పిల్లలపై హింస పెరిగింది. తొమ్మిది రోజుల్లో రెండువేల ఫోన్ కాల్స్ చైల్డ్ హెల్ప్ లైన్లకు వచ్చాయంటే. తీవ్రత ఎంతుందో ఫోన్ కూడా చేయలేని పరిస్థితులలో ఎందరున్నారో ఊహించవచ్చు. కరోనా పుణ్యమా లాక్డౌన్ కాలంలో అవాంఛిత గర్భాలు పెరిగాయని ఆరోగ్య సర్వేలు చెప్తున్నాయంటే అందులో లైంగిక, గృహహింస అంచనాలకందదు, ఊహించలేము కూడా.

--- ----- --- --- ---- ------ ------

సాయంత్రం ఆరుగంటలు అయిన తరువాత ఒక్కరొక్కరు వాసు ఇంటి డాబా మీదికి చేరారు. రోజూ కరోనా విశేషాలు, ఇంటింటి భాగోతాలు, వంటింటి ప్రయోగాలపై సాగే చర్చ ఆ రోజు కిషన్రావు ఆరోగ్య పరిస్థితి వాళ్ళ టాపిక్ అయింది..
"ఏమి జరిగిందట వాసూ" రామకృష్ణ దిగులుగా అడిగాడు.
"మొన్న సాయంత్రం ఏడుగంటలకే భోజనం చేసి. మంచమీద పడుకున్నాడట. తర్వాత కొద్దిసేపటికీ తలనొప్పంటూ అటు ఇటూ తిరుగుతూ తలరుద్దుకున్నాడట. తలకుగుడ్డ కట్టుకున్నాడట, కుర్చీలో కోర్చోబోతే భార్య మంచంమీద పడుకో బెట్టిందట. తల అటూ ఇటు ఊపుతూ కోమాలోకి పోయాడట"గాలి పీల్చుకోడానికి ఆగాడు వాసు.
"పెద్దల్లుడు వచ్చి కార్లో హాస్పిటల్కు తీసికెళితే‌ , కోవిడ్ టెష్టులు లేకుండా చేర్చుకోమన్నారట హాస్పటల్లో.
మళ్ళీ కోవిడ్ హాస్పిటల్ కు తీసుకుని పోయి, టెష్టులు చేయించి 'నెగిటివ్' అని రిపోర్ట్ చూపిస్తే ఒక హాస్పిటల్ వాళ్ళు చేర్చుకున్నారట. అప్పటికే ట్రీట్ మెంట్ ఆలస్యమయింది. బ్రైన్ స్ట్రోక్ ఇంటర్నల్ బ్లీడింగ్ అట. గంటలోపు ట్రీట్మెంట్ మొదలుపెడితే క్యూర్ అయ్యేది, అన్నారట డాక్టర్లు. వెంటిలేటర్స్ మీదున్నాడట. సర్జరీ చేసినా తొంబై శాతం ఆశాజనకం కాదు, వేరే ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి అన్నారట, నలబై ఎనిమిది గంటలై పోయింది అప్పుడే" అంటూండగానే ఫోన్ మోగింది వాసుది.

"అప్పుడే అర్థగంటయిందా బెల్ మోగుతుంది" అనుకుంటూ ఫోన్ చూశాడు.
అర్థం గంటకు అలారం పెట్టుకొని ఎవరిళ్ళకు వాళ్ళు పోవడం వారి దిన చర్య.

"హలో అప్పారావుగారు చెప్పండి"
అతడు చెప్పేది విని. దిగాలుగా ఫోన్ పెట్టేసి.
"పోయాడు కరోనా మింగేసింది వాడిని" అన్నాడు వాసు.

"ఇప్పుడెట్లా మనం చూసొద్దాం" అన్నాడు రామకృష్ణ.
"మనం చూస్తే వాడు లేచొస్తాడా" అన్నాడు. వాసు చాలా వత్తిడికి లోనవుతూ.

"నిజమే మంచి మిత్రుణ్ణి పోగొట్టుకున్నాం, కానీ చూడాలి కదా బాయ్" అన్నాడు ఆలీ.

అందరి ముఖాల్లో విషాధం అలుముకుంది.
"ఇంటికెప్పుడు తెస్తారట"అన్నాడు రామకృష్ణ.
"ఇంటి వరకు తేనివ్వక పోవచ్చు, నేను పోలీసు పర్మిషన్ తీసుకుంటా, రెండు కార్లల్ల పోదాం" అంటూ కిష్టఫర్ పోలీసు స్టేషన్ కు బయలు దేరాడు.
" నేనూ వస్తా అన్నాడు" రామకృష్ణ.
"మిగిలిన వాళ్ళు రెడీగా ఉండండి. ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్కు రండి అట్నించి అటే పోదాం" అంటూ కిష్టఫర్ ముందుకు కదిలాడు. వాసుభుజం మీద చెయ్యి వేసి నొక్కి, ఆలీకి కళ్ళతోనే చెప్పి కిష్టఫర్ వెనుక నడిచాడు.
ఆలీ , వాసు, గోపాల్రావు మిగిలారు దుఃఖంతో.


పోలీసు స్టేషన్లలో పెద్ద గుంపు కాదు చాలా మంది మూగి ఉన్నారు.
"ఏదో పెద్ద కేసేమో. ఈ గోలలో మనకు పర్మిషన్ ఇస్తారంటారా" అన్నాడు రామకృష్ణ.
"ప్రయత్నిద్దాం"అంటూ, గుంపుకు దూరంగా నించున్న పెద్దమనిషితో
" విషయం ఏమిటి బాయిసాబ్ చాలా మందున్నారు" అడిగాడు కిష్టఫర్.
"డాక్టర్ గారి తల్లి వచ్చారు , డాక్టర్ సపోర్టర్స్ వీళ్ళంతా" అన్నాడతను.
క్రిష్టఫర్ కి ఏ డాక్టరో అర్థం కాలేదు "ఏ డాక్టరండీ"అన్నాడు.
" ఏ డాక్టరా ? దేశంల ఏమి జరుగుతుందో కూడా తెలవదా? ఏమి మనుషులు మీరు, పోపో... అయ్యన్నీ చెప్పే ఓపికా సమయం నాకు లేదు. పోపో" కసరుకున్నాడు కోపంగా.

క్రిష్టఫర్ కు అవమానంగా అనిపించింది. రామకృష్ణ అతన్ని చెయ్యిపట్టి పక్కకు తీసుకొచ్చాడు.
"నీకు తెలుసా రామకృష్ణ, డాక్టరెవరు ఏమిటి? నాకు నిజంగా తెలవదు. మా ఇంట్లో టీవీ రిపేరుకొచ్చింది" అన్నాడు.

" ఒక డాక్టర్ పై పోలీసులు దాడి చేశారు. అతన్ని రోడ్డుమీద పెడరెక్కలు విరిచి చేతులు కట్టేసి బట్టలు చించి, లాఠీలతో కొట్టారు. అదో పెద్ద చర్చ అవుతోంది. అతడు అనామకుడు కాదు. దాదాపు ఇరవై సంవత్సరాలు వైద్య సేవలు అందిస్తున్నాడు. ప్రతిపక్షపార్టీకి యాక్టివ్ పర్సన్. కాక పోతే కోవిడ్ హాస్పిటల్ లో మాస్కులు లేవు అన్నాడట. అంతే ప్రభుత్వానికి మండింది. రాజకీయ కక్షలు ఇంతలా దిగజారాయి. అతడిని పిచ్చి వాడిగా నిరూపించేందుకు మెంటల్ హాస్పిటల్ లో వేశారు" అని రామకృష్ణ అంటూండగా, ఎణబై సంవత్సరాల వృద్ధురాలు బలహీనంగా మాగమగ్గిన జామపండు వలె ఉన్నామె బయటకు వచ్చింది. ఆమెను చెరోవైపు ఇద్దరు పట్టుకొని జాగ్రత్తగా నడిపిస్తూ పోలీస్ స్టేషన్ బయట ఉన్న కారు వద్దకు వెళ్లారు. ఆమె వెనకే దాదాపు మిగిలిన వాళ్ళందరూ వెళ్లిపోయారు.

రామకృష్ణ మళ్లీ "ఆ డాక్టర్ తల్లి ఈమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసేందుకు వచ్చి ఉంటారు" అన్నాడు రామకృష్ణ
కిష్టఫర్ ముఖం గంటు పెట్టుకొని " కొడుకు కోసం ఆ తల్లి ఈ వయసులో పోరాడాలేమో" అన్నాడు.
"నిన్న పురిటి నొప్పులతో వచ్చిన ఒక మహిళను కరోనా అనుమానంతో హాస్పిటల్ లో చేర్చుకోలేదు. మూడు నాలుగు దవాఖానలు తిరిగిందిట. చివరికి రోడ్డుమీదే కాన్పయింది‌, ఆడపిల్ల పుట్టింది. తెల్లారేపాటికి తల్లీపిల్ల ఇద్దరూ చనిపోయారు. వాళ్ళు డాక్టర్లే ఇతనూ డాక్టరే" అన్నాడు రామకృష్ణ.

అదివిని ఆలోచనలో పడ్డాడు. తర్వాత వేరే మిత్రుడికి ఫోన్ చేసి మాట్లాడి. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళాడు. రామకృష్ణ మౌనంగా అతడిని అనుసరించాడు.

అక్కడున్న ఎస్ఐకి తనను తాను పరిచయం చేసుకుని, విషయాన్ని వివరించి. డిఎస్పీ మనోహర్ తన మిత్రుడని, విషయమంతా వివరించి డాక్టర్ వద్దకు వెళ్లేందుకు పర్మిషన్ అడిగాడు.
అందరి ఆధార్ కార్డులు జిరాక్స్ కాపీతోపాటు ఒక లెటర్ రాసిమ్మని సలహా ఇచ్చాడు. కారుకు ఇద్దరు మాత్రమే వెళ్లాలని మొత్తం కలిపి నలుగురు కంటే మించి పర్మిషన్ ఇవ్వలేనని చెప్పాడు.
బయటకు వచ్చి "వాసుకు ఫోన్ చేయమన్నాడు" రామకృష్ణ - ఇప్పుడు వాసు కంటే ఆలీకి చేస్తేనే మంచదని, ఫోన్ చేసి ఆధార్ కార్డులు తీసుకొని రమ్మని నలుగురికే పర్మిషన్ దొరికింది, అక్కడే పోలీస్ స్టేషన్లోణ్డ ఉంటామని వీలైనంత త్వరగా రమ్మని చెప్పి ఫోన్ పెట్టేసాడు. ఇరవై నిమిషాల లోపు, వాసు ఆలి కూడా వచ్చారు. గోపాల్రావు తల్లికి బీపీ పెరిగిందని రాలేకపోయాడు.

కిష్టఫర్ ఒక అప్లికేషన్ రాసి జిరాక్స్ అవకాశం లేనందున నలుగురు ఆధార్ కార్డుల జోడించి పర్మిషన్ తీసుకుని హాస్పిటల్ వైపు బయల్దేరారు.

దారిలో హాస్పిటల్ కంటె ముందు ఒక చౌరస్తాలో ట్రాఫిక్ పోలీస్ ఆపారు ఐదు నిమిషాలు వివరణ ఇచ్చి, పర్మిషన్ చూపించి, బతిమిలాడుతున్నట్లు చేసి వినయాన్ని ప్రదర్శిస్తే కానీ వాళ్ళొదిలి పెట్టలేదు.

ఆస్పత్రిలో గేటు వద్ద మళ్ళీ షరా మామూలే.
ఈ లోపు కిషన్రావు అల్లుడు బయటికొచ్చాడు. వీళ్ళను చూసి గేట్ పాస్ చూపించి కేసు వివరించి, తొందరగా వెళ్లిపోతారని చెప్పి, లోపలికి తీసుకెళ్లాడు. ఇంకా ఐసీయూలోనే ఉన్నాడు. డెడ్ బాడీ ఫార్మాలిటీస్ ఏవో ఉన్నాయని చెప్పాడు. అక్కడంతా ఏడుస్తున్నారు, భార్య కళ్ళుతిరిగి పడిపోయింది. కొడుకు అమెరికా నుండి వచ్చే పరిస్థితి లేదు. సిటీలో ఉన్న కిషన్ బంధువులు ఆరుగురు ఉన్నారక్కడ.
" ఇంటికి ఎప్పుడు తీసుకెళ్లడం" వాసు బెరుకుగా అడిగాడు.
పక్కనే ఉన్న యువకుడు ఎవరో "ఇంటికి కుదరదు, రేపు పొద్దున ఎనిమిది లోపే డైరెక్టుగా అక్కడికే, ఇరవై మంది కంటే ఎక్కువ పర్మిషన్ ఇవ్వరట" అన్నాడు.
మిగిలిన వాళ్ళందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
"ఏమన్నా హెల్ప్ కావాలంటే చెప్పండి" అన్నాడు క్రిస్టఫర్.
"ఫరవాలేదు మేమున్నాం" అన్నాడొకాయన.
" భయ్యా ! ఏవో కార్యక్రమాలు ఉంటాయి కదా, వాటికోసం మన బజార్లోని మర్రి చెట్టు దగ్గర కొంత ఖాళీ స్థలం ఉంది అక్కడ చేసుకోవచ్చు అనుకుంటా" అన్నాడు ఆలి.
" ఎమ్మార్వో వార్డ్ మెంబర్ కు ఫోన్లో చెప్తా అన్నాడు" మళ్లీ ఆ యువకుడు సమాధానం చెప్పాడు.
" సరే మంచిది మాకు నలబై నిమిషాలే పర్మిషన్ ఇచ్చారు.మా ఆధార్ కార్డులు పోలీసుల దగ్గరే ఉన్నాయి. రేపు కలుద్దాం " అని వీళ్లంతా కదిలారు.

వీళ్లతో పాటు ఇద్దరు యువకులు గేట్ వరకు వచ్చారు. "ఏమి జరిగింది అసలు" అన్నాడు రామకృష్ణ.

" చిన్నాన్న మందు లేనిదే ఉండలేడు. కరోనా లాక్డౌన్ పుణ్యమా అది దొరికలేదు. దొరికిన సిగరెట్లనే బాగా కాల్చి ఉంటాడు. డాక్టర్ ఇంతకుముందే డ్రింక్ స్మోక్ పూర్తిగా బంద్ చేయమన్నాడు" అన్నాడు అబ్బాయి.
సరే మరి అన్నట్టు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని
"డబ్బు ఏమన్న అవసరమా" అన్నాడు వాసు. "లేదండి మేమంతా ఉన్నాం కదా"అన్నాడు మరో యువకుడు.
సరె అంటూ కదిలారు ఆనలుగురు.
తిరిగి పోలీస్ స్టేషన్కు వచ్చి తమ ఆధార్ కార్డులు తీసుకుని ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళారు.

వీళ్ళు బయటికి వెళ్ళొస్తే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకు మరోగంట అదనపు పని. మాస్కులు బట్టలు చెప్పులతో సహా ఉతికాలి డెట్టాలో శానిటైజరో మరోటో ఏదో ఒకటి వేసి.

ఆ మిత్రులెవ్వరూ ఆ రాత్రి భోజనం చెయ్యలేదు.
ఆలి భార్య సలీమా 'అమ్మాయి ఫోన్ చేసింది జీ' అన్నది.
"ఏమిటంటా ? కుచ్ కాస్ హై క్యా " అన్నాడు.
"ఏమీ లేదు మనవడు నిద్రలో కూడా 'ఐవాంట్ టు గో అవుట్, ఐ వాంట్ టు గో అవుట్' అని కలవరిస్తున్నాడట. బిడ్డ ఏడ్చుకుంట చెప్పింది. పాపం పెద్దోళ్ళం. మనమే ఇంట్లో ఉండలేక పోతున్నాము. వాడినేమో రోజు కాకపోయినా వారానికి రెండు సార్లు పార్కు తీసుకెళ్లేవారు" అన్నది సలీమా.
"కొడుకు కలవరిస్తున్నాడు, అని ఏ తల్లన్నా ఏడుస్తదా? నువ్వు ఒక పిచ్చి మొద్దువి. అల్లుడు ఏం కిరికిరి చేస్తున్నాడో 'వర్కెట్ హోమ్ కదా'!" అన్నడు ఆలీ.
అతని కూతురు బెంగళూరులో ఉంటది. మనవడకి ఆరేళ్ళు, అల్లుడు సాఫ్ట్వేర్.

"కిషన్ రావు పోయినడంటే అక్కడికే పోయి వచ్చాము, రేపు కార్యక్రమాలు ఉన్నాయి" అన్నాడు, దిగులుగా అలీ.
ఆమెకు ముందే తెలిసింది ఆ వార్త. కానీ ఆమె ఏమి మాట్లాడ లేదు.
తెల్లవారి పదకొండు గంటలకల్లా అన్నీ ముగిసాయి.
మిత్రబృందంలో లోటు ప్రపంచ ఆరోగ్య విపత్తు ప్రభావం వారి జీవితాల్లో ఒక లోటును మిగిలించింది,.
తర్వాత వారం రోజుల వరకూ ఒకరినొకరు కలవ లేదు వాళ్ళు.
**** ****

గోపాల్ రావు ఒకరోజు రామకృష్ణకు ఫోన్ చేసి "ఈ రోజు మా డాబా మీద కలుద్దాం. అందరికీ ఫోన్ చేయరా కొంచెం" అని బ్రతిమిలాడాడు అతడు అడుగుతున్న తీరుకు రామకృష్ణ సరే అన్నాడు.

మిగిలిన వాళ్లకు కూడా కలవాలని ఆసక్తి ఉన్నా ఒకరినొకరు పలకరించుకునే ధైర్యం లేకపోయింది. కిషన్ రావు మరణం, కరోనా వల్ల చోటుచేసుకుంటున్న సంఘటనలు, వారిని వెలగ పండులో పురుగు వలె , వారి ధైర్యాన్ని గుల్ల చేసింది.

ఆ సాయంత్రం ఆరుగంటలకు టంచనుగా అందరూ గోపాల్రావు ఇంటికి వచ్చారు. మాస్కులు చేతికి గ్లౌజులు, జేబులో శానిటైజర్ లా తో దూర దూరంగా కూర్చున్నారు. ఆత్రంగారా నైతే వచ్చారు గాని మౌనంగా ఐదు నిమిషాల కాలం జెట్ స్పీడ్ లో కలిసి పోయింది.
క్రిస్టఫర్ కలగజేసుకుని "మనకున్నది అర్ధగంటే. మౌనంగా ఉంటే ఎట్లా ఎవరో ఒకరు మొదలు పెట్టండి" అన్నాడు.
"ఆ అవును అవును " అందరు అన్నారు మిగిలిన వాళ్ళు.
" గోపాల్ రావు నేను చెప్తాను" అన్నాడు.
" సరే అమ్మ బావుంది కదా ! "అని అడిగాడు రామకృష్ణ.
"బాగుంది , బీపీ షుగరు అప్ ఎండ డౌన్స్ అవుతున్నాయి. దిగులు పడుతున్నా నేనే, అమ్మ ధైర్యంగానే ఉంది. అమ్మ ఆరోగ్యం కంటే ఒక విషయం నన్ను తినేస్తోంది. మీతో పంచుకోవాలని అనిపించి కలుద్దాం అన్నాను" అని అందరి వైపు చూశాడు.
" చెప్పరా బాబు, మేము కూడా వింటాము. నీ బాధ కొంత తగ్గుతుంది" అన్నాడు రామకృష్ణ.

" సరే బాయ్ ఫికర్ చెయ్యకు, చెప్పు" అన్నాడు అలీ.
" మా ఇంట్లో పనిలో మా ఆవిడకు సహాయం చేయడానికి, అమ్మకు స్నానం చేయించడానికి, ఒక అమ్మాయి వస్తుంది. అమ్మాయి అంటే అమ్మాయి కాదు మధ్యవయసు ఆడమనిషి. ఏదో పల్లెటూరు నుండి బతకడానికి వచ్చింది ఒక జంట. భార్య భర్తలు ఏవో పనులు చేసుకొని బతుకుతున్నారు. రెండేళ్ల నుంచి మా ఇంట్లో పనిచేస్తోంది"గోపాల్రావు చెప్తుండగా!
"లాక్ డౌన్లోడ్ రావట్లేదు కదా! ఇంకా వస్తుందా మీ ఇంటికి ? మా ఆవిడకు హెల్పర్ ఆమే" అన్నాడు రామకృష్ణ సందేహంగా.
"లేదు ఊరు నుండి వచ్చి వారం రోజులైంది. మా ఇంటికి మొన్న వచ్చింది. అమ్మేమో ఇప్పుడే రానివ్వ వద్దంటుంది. మా ఆవిడేమో రానివ్వండి పర్వాలేదు అంటుంది. వాళ్ళు వచ్చింది మాత్రం ఒక సలహా కోసం"
"ఏంటి బాయ్ డబ్బులు కావాలా వాళ్లకు" అన్నాడు ఆలీ.
"కాదు వాళ్లకు ఒక బిడ్డ, ఒక కొడుకట. ఇన్ని రోజుల్లో చెప్పలేదు. కానీ, వాళ్ళ బిడ్డ పదేళ్ల కింద ఎవరి ప్రేమలో పడి వెళ్ళిపోయింది. వీళ్లకు పరువు తక్కువ అనిపించి, ఉన్న పొలం చక్క కౌలుకిచ్చి, ఇక్కడికి వచ్చారట. ఆ అమ్మాయిని వెతకడానికి ప్రయత్నించారట , కానీ ఆ అమ్మాయి సమాచారం ఏమి దొరకలేదట"
"వాడే బొంబాయి తీసుకుపోయి అమ్మేసి ఉంటాడు. అది ఎక్కడ దొరుకుతుంది" అన్నాడు వాసు.
"ఆగరా బాబు అట్లా అనకు. నువ్వు చెప్పు గోపాల్రావు" అన్నాడు రామకృష్ణ .
" వారం రోజులుగా వలసకార్మికుల ప్రయాణాలు సాగుతున్నాయి. ప్రభుత్వం శ్రామిక రైళ్ళకు అనుమతించింది కదా" గోపాల్రావు చెప్తూండగా.

"కొందరు కాలి నడకన వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఒక పన్నెండేళ్ళ పిల్ల నూటయాబై కిలోమీటర్లు తల్లి తండ్రులతో నడిచి సొంత ఊరుకు ముప్పై మైళ్ళ దూరంలో మరణించింది" అన్నాడు వాసు.

"ఔను బాయ్ జ్యోతి అనే అమ్మాయి గాయపడిన తండ్రిని సైకిల్ మీద కూచ్చోపెట్టకొని గురుగాంవ్ నుండి పన్నెండొందల కిలోమీటర్లు ప్రయాణించి ఇల్లు చేరిందట. ట్రంప్ కూతురు మెచ్చుకుందట ఆ అమ్మాయిని" అన్నాడు ఆలీ.

"అంతే కాదు డిల్లీ నుండి కాలినడకన ప్రయాణిస్తున్న కుటుంబంలో భర్త మరణిస్తే అక్కడే అంత్యక్రియలు చేసి ఇద్దరు చిన్నపిల్లలతో నడకసాగించింది ఓ తల్లి. ఒక ముసలి తల్లి నడవలేక పోతే వీపున మోస్తూ నడుస్తూన్నాడొక కూలీ , కాన్పయిన మూడు రోజులకే పసిగుడ్డుతో నడుస్తోంది ఒక బాలింత , ఇద్దరు పిల్లలను కావడీలో మోస్తూ పోతున్నాడో తండ్రి, చూస్తూ మా ఆవిడ ఒకటే ఏడ్పు" అన్నాడు క్రిష్టఫర్.

"నిజమే టివీ చూడలంటేనే భయమేస్తోంది బాబూ" అన్నాడు రామకృష్ణ.
అందరి కడుపు నిండా దుఃఖం , గుండె నిండా దిగులుతో కొద్ది తేమకే పేలడానికి సిద్దంగా ఉన్న కనకాంబరం విత్తనాల వలె ఉంది పరిస్థితి. వాళ్ళ నలుగురే కాదు దేశమంతా, కాదు ప్రపంచమంతా.

కొన్ని రాబందులు , గుంట నక్కలు, తోడేళ్ళు ముసుగులేసుకొని ఉంటే , మరికొన్ని మొసలికన్నీళ్ళతో సీసాలతో తలుపులు తెరచుకొని ఉన్నాయి.
గోపాల్రావు మళ్ళీ మొదలు పెట్టాడు "టీవీలో చూపించిన వార్త మీరు కూడా చూసే ఉంటారు. ఒక అమ్మాయి ఇద్దరు పిల్లలతో శ్రామిక రైలు ప్రయాణం చేస్తూ, నాలుగు రోజులు నీళ్ళు తిండి లేక, తన వద్ద ఉన్నాయి పిల్లలకు అందిస్తూ ప్రాణం వదిలింది. ఏదో స్టేషన్లు ప్లాట్ ఫామ్ మీద దించేసారు. తల్లి చచ్చిపోయిందని తెలియక పిల్లలిద్దరూ ఆమె చుట్టూ ఆడుకుంటున్నారు. ఆ యువతి మా బిడ్డ అంటూ వచ్చారు. మా ఇంట్లో పనిచేసే నరసమ్మ, దాని మొగుడు. నరసమ్మ ఏడుస్తూ నా బిడ్డ సార్ చచ్చిపోయింది. పిల్లలు తల్లులు లేనోళ్లు అయ్యారు, తెచ్చుకుందాం అనుకుంటున్నాము అంటుంది.
" సరే టీవీ లో ఇచ్చిన సమాచారం ప్రకారం పిల్లల అడ్రెస్ కనుక్కోవచ్చు" అన్నాడు క్రిష్టఫర్.
"అదే చెప్పాను కనుక్కుందాం అన్నాను,.
"అది కాదు సారూ అని నీళ్ళు నములుతూ నరసమ్మ మొగుడు, నరసమ్మ వెక్కివెక్క ఏడుస్తూండగా . ఆ పిల్లల్ని సాదే వాళ్లకు ఉద్యోగం ఇస్తామని గవర్నమెంట్ అంటుంది కదా సారుఅన్నాడు"
"అవును కానీ, నీ వయసు వాళ్ళకి కాదు కదా ఉద్యోగం" అన్నాను.
"అదే సారు నా కొడుక్కు ఇరవై సంవత్సరాలు, పది చదివిండు. ఆటో నడుపుతాండు సారు. నా కొడుక్కి ఉద్యోగం ఇప్పిస్తే ఆ పిల్లల్ని తీసుకొచ్చి హాస్టల్ లో వేస్తా అంటున్నాడు. వివరాలన్ని మాకు తెలియదు కదా సార్ మీరు సాయం చేయండి" అన్నాడు వాడు.
" విషయం మొదలు పెట్టేటప్పుడు నీళ్లునమిలినా తర్వాత వాడి ముఖంలో స్వార్థం, గొంతులో ధైర్యం నిండిపోయింది. బుద్ధి లేదా రా నీకు. ఇంకా పిల్లల మీద ప్రేమతో వచ్చారనుకున్నా! అని తిడుతూ ఉంటే, మా అమ్మ వెనుకనుండి ఎప్పుడు వచ్చిందో , వాడి చెప్పేదంతా విన్నట్టుంది. తన చేతికర్రతో వాడిని నాలుగు వేసింది. పిల్ల చచ్చింది అన్న బాధ లేదు, పసి పోరగాళ్ళ మీద జాలి లేదు. వాళ్ళ పేరున వచ్చి ఉద్యోగం నీ కొడుకుకు కావాలా పొండి బయటికి. నువ్వు కూడా నర్సి ఇంకోసారి ఇంటి గడప తొక్కకు. నీ మొహం చూపించకు. అని గట్టి గట్టిగా అరిచింది వాళ్ళిద్దరూ మా అమ్మ అ ఉగ్ర రూపం చూసి భయపడి గేటు అవతలికి పోయారు.
కానీ అమ్మ బీపీ పెరిగి పడిపోయింది. చాలా భయమేసింది"
"అయ్యో ఇప్పుడు ఎట్లా ఉంది ? అమ్మ. మాకు చెప్పలేదు"అన్నాడు క్రిస్టఫర్ .
"అమ్మ బాగుందా బాయ్ అన్నడు ఆలి.
వాసు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, పళ్ళు కొరుకుతున్నాడు .
రామకృష్ణ వాసు వైపు ఒక అడుగు వేసి, భుజం మీద చెయ్యేసి శాంత పరిచాడు. దాంతో వాసు కళ్ళనుండి ధారాపాతంగా నీళ్లు కారుతున్నాయి.

మిగిలిన వాళ్లంతా అతనిని చూసి కంగారు పడ్డారు, ఓదార్పుగా మాట్లారు.
గోపాల్రావు వాసు పరిస్థితి చూసి బాధపడ్డాడు "అనవసరంగా చెప్పానా మీకు" అన్నాడు.
" అదేమీ లేదులే" అన్నాడు వాసు కొంత కుదుట పడి.
ఇంతలో గోపాల్రావు ఫోన్లో అలారం మోగింది. ఎవరింట్లో కలిస్తే వాళ్ళు అలారం పెట్టుకుంటారు అన్నమాట.
" అప్పుడే ఆదగంట అయిందా బాయ్, మేనెలజీతమన్నా మొత్తమిస్తే బాగుండు" అన్నాడు ఆలి విచారంగా.
"ఔను ఫోన్ మెసేజ్ లో కరెంటు బిల్లులొచ్చినయ్ చూసుకున్నారా. నాకు రెండు వేలలోపు వచ్చే బిల్లు. పన్నెండు వేలొచ్చింది. రీడింగ్ లేదు నోటికొచ్చినట్లుగా వేసారు" అన్నాడు క్రిష్టఫర్.

అందరూ విచారంగా ఫోన్లో మాట్లాడుకుందాం అనుకుంటూ మెట్లుదిగారు.

ఎండి పగిలిన జిల్లేడు కాయ నుండి గింజలు గాలికి చిన్నచిన్న తెల్ల సీతాకోకచిలుకల్లా ఎగురుతున్నాయి. ఎవరికంట్లో పడుతుందో ఎవరిని గుడ్డివాణ్ణి చేస్తోందో తెలియదు. అసలు జిల్లేడు ఎక్కడిది , ఎట్లావచ్చింది తర్వాత, కళ్ళు కాపాడుకోడం ముఖ్యం. కొందరు గుడ్డి వాళ్ళ కంట పడకుండా మనని మనం కాపాడుకోడం ముఖ్యం.
కరోనా కనపడకుండా కదులుతూనే ఉంది. జాగ్రత్తలు పాటించాల్సిందే, లేదంటే బలైపోతాం.
అనుకుంటూ ఇంటి దారిపట్టారు వాళ్ళు.
*** *** *** ***22/5/2020

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ