సాయిలుచారి, ముందుమాట

 సాయిలుచారి కవిత్వ సాళ్ళు


"కాంతి లేకపోతే నడవగలను, కలలే లేకపోతే సాగడమెట్లా " అంటాడో మహానుభావుడు.

కంటి రెప్పలు కత్తిరించుకొని కలలను కాపలా కాయవలసిన సందర్భంలో ప్రస్తుత కవులున్నారు.
కవిత్వం రాయడం అంటే కవి తనను తాను ఖండించుకోవడంతో సమానం. కవితా రచన కోసం తపించే వారిలో వడ్ల సాయిలుచారి ఒకరు. విశ్వకర్మ బిడ్డగా పుట్టి, నిరుపేద కుటుంబ పరిస్థితులకు చదువు కొనసాగించలేక విద్యను మధ్యలో వదిలేసి చేతి వృత్తిలో తండ్రికి చేదోడయిన బాధ్యత గల వ్యక్తి మన కవి. తరువాత తన జీవిత శిల్పాన్ని తన ఇష్టప్రకారం నచ్చిన విధంగా తనకు తానే చెక్కుకున్న ఇగరశాలి.
దూరమైన విద్యను దూరవిద్య ద్వారా దగ్గర చేసుకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉపాధిని పొందాడు. తాను చూసిన,చదివిన అనుభవించిన జీవితాలను కవిత్వీకరించే దిశగా ప్రయాణం చేస్తున్న క్రమంలో `రుంజ´ కోసం పని చేస్తూ ఒకరికొకరం పరిచయమయ్యాం.
అప్పటినుండి 'అక్కా..!' అంటూ ఆదరంగా పిలుస్తూ పలకరించేవాడు. తెలంగాణ ఉద్యమకాలంలో రుంజ ఆ తరువాత వేవా వేదా వంటి వివిధ సంఘాలలో కూడా కలిసి పని చేస్తూ వచ్చాం.
2017 లో ఉద్యోగవిరమణ తర్వాత
'సాహితీవనం మిద్దెతోట'లో గాయాలను మాన్చుకుంటూ అన్నిటికీ దూరంగా ఉంటూ వచ్చాను.
ఒకరోజు ఫోన్ చేసి ఒక వ్యాస సంకలనం గురించి మాట్లాడుతూ " అక్క నా పుస్తకానికి ముందుమాట రాయాలి" అని అడిగాడు .
ఒకే ఒక్క సంఘటన తో (2017లో) క్రమక్రమంగా అన్నింటికీ స్వయంగా దూరంగా జరిగిన నేను రాయలేను అన్నాను. కానీ సోదరుడి ఒత్తిడితో రాయక తప్పలేదు `కవిత్వం´ ఒక వివాదస్పద వస్తువుగా మారిన ప్రస్తుత సందర్భంలో ( కవి అంటే ఒక తిట్టు గా మారిన సమయం) మంచి కవిత్వాన్ని చదివే అవకాశం కల్పించిన సాయిలు చారి
ఇంకా ఎన్నో పుస్తకాలు రాయాలని కోరుకుంటున్నాను.
కవిత్వ లక్షణాలు అంటూ సమయం వృధా చేయకుండా సూటిగా పుస్తకం విషయంలోకి వస్తే. `ఎదజేబు´ కవితా సంపుటిలో మొత్తం 43 కవితలున్నాయి. అందులో `ఈల పేట´` సిలుకొయ్య´ వంటి కవితలు కనుమరుగవుతున్న తెలంగాణ వస్తు సంపదను కవిత్వీకరించాడు. ఆ వస్తువులనే కవితా శీర్షికగా కవిత్వం రాశాడు. ఇదొక మంచి ప్రయత్నం.
* మొదటి కవిత "మట్టి పొరల్లో"
ఒరేయ్ సాయి! మట్టిలో ఆడుతున్నావా!
అన్న తల్లి మాటలతో కవిత ప్రారంభించి తనను తాను సంబోధించుకుంటూ బాల్య స్మృతులను తవ్వి పోసుకున్నాడు.
మనం తినే అన్నం మట్టిపాత్రలో పుట్టిందని తెలుసుకోవడం అంటే మనిషిగా బ్రతకే అర్హతను పొందడం అన్నమాట. మట్టిని గౌరవించాలి, మట్టిని జీవశక్తిగా గుర్తించాలి. మట్టితో అనుబంధం ఉన్న రైతు యొక్క శ్రమైక జీవన సౌందర్యాన్ని తెలుసుకోవాలి. అట్లా తెలుసుకున్న కవి కాబట్టే ఈ కవితను రాయగలిగాడు సాయిలు చారి.

*రెండవ కవిత `మా గురువు´
ఈ కవితలో గురువు పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు. స్వయంగా ఉపాధ్యాయుడైన కవి తన పట్ల తనకు తన గురువులపై తనకు ఉన్న గురుభక్తిని యావత్ గురువులందరికీ ఉండవలసిన లక్షణాలు నిర్దేశించాడు.

* మూడవ కవిత`ఎదజేబు´లో తను ఏమి జేయాలనుకున్నాడో చెప్పాడు.
"అంతులేని అనంతలోకాల చింతనై విహంగమై విహరిస్తాను" అంటాడు.
"నింగిని వదిలి నేల రాలుతున్న ప్రభాత కిరణాల నేరుకుంటూ ఎద జేబులో నింపుకుంటానంటాడు.

*సాష్టాంగ వందనం అనే కవితలో సైనికుల పై తనకున్న భక్తి గౌరవాలను చెప్పాడు.

* బోసివోయిన దాతి కవితలో ప్రపంచీకరణ ప్రభావం చేతివృత్తులను ఎట్లా ధ్వంస్వ చేసుకున్నాయో అర్ధం చేసుకున్నాడు. రైతుకు వడ్రంగి ఉన్న సంబంధం తెగిపోయినందుకు చింతించాడు.
గుంటుక, గొర్రు, బంబు, గెగ్య వంటి వ్యవసాయ పనిముట్లను పలవరిస్తాడు.
"ఆకాశమంత ఎత్తుకు ఎగిరి - తల ఎత్తుకు జీవించేలా చెక్కిన పెద్దబాడిసె - దిక్కులేనిదై దిగాలు పడుతుంది" అని విచారిస్తాడు.

* పూదిచ్చుడు అనే కవితలో తెలంగాణ సాంస్కృతిక సంపదను తెలిపే ఆచారవ్యవహారాలను వస్తు సంపదను చూచి గర్వపడ్డాడు. ఆత్మవిశ్వాసం ప్రదర్శించాడు.

*తెలంగాణ జాతిపిత! అనే కవితలో
ప్రో. జయశంకర్ సార్ గురించి,
*ఆత్మగౌరవం కవితలో అంబేద్కర్ గురించి రాశారు.

*ఆత్మీయ బాండాగారం అనే కవితలో తన ఊరు పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.
"మా ఊరు రమ్మంటుంది కానీ తెమ్మనదు" అంటాడు.

* తేల్చుకో అనే కవితలో కట్నం పట్ల తనకున్న విముఖతను వ్యక్తపరుస్తాడు. కట్నం తెచ్చిన భార్యలు బాధ్యతను స్వీకరించలేరు అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.
"మీ అవ్వ గావాల్నా - నేనుగావాల్నా తేల్చుకో" అంటుందంటాడు.

*ఎట్లయితది అనే కవితలో తన పేదరికానికి కారణాన్ని ప్రశ్నించాడు.
"నన్ను నా జాతిని నిట్టనిలువునా తొక్కేసిన కుట్ర ఏమిటి? ఎందుకు?" అని చింతిస్తాడు.
కులం, మతం అనే రక్కసి- అధిక శాతం ఉన్న ప్రజానీకాన్ని పేదలుగా మిగిల్చింది.
భూమి మీద ఉన్న పేద వాళ్లంతా వివక్షకు, దోపిడీకి గురైన వారే, భారతదేశంలో వివక్ష పేరు కులం.

*ప్రతి చుక్క అపురూపం అనే కవిత నీళ్ల కోసం పడే గోస పడుతూనే నీటి విలువ తెలుసుకోకపోవడం గురించి చింతిస్తాడు.
"ఖాళీ కుండల వలసలు - పొలిమేరలు దాటుతుంటే - ఆయాస పడి నడిసిన అమ్మకు తెలుసు" అంటూంటే
ఆ కవితా పాదాల్లో ఒక దృశ్యం మన కళ్ళముందు కదలాడుతుంది.
నీటి విలువ గుర్తించకపోవడం ఇంకా కొనసాగుతుండడం విషాదకరమైన విషయం

*ఉద్యమ జ్వాల అనే కవిత తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి గురించి..
"మలిదశ పోరాటానికి - దివిటీ వలె వెలుగు నిచ్చి అమరుడవై నావు - తెలంగాణ తల్లి తొలిబిడ్డవు నువ్వు " అంటాడు.

*మా నాన్న - అనే కవితలో తండ్రి తో తనకున్న అనుబంధాన్ని తెలుపుతుంది.

*ఆ.... డపిల్ల- అనే కవిత అమ్మాయికి పుట్టింటికి ఉన్న అనుబంధాన్ని తెలిపేది. కుటుంబ సంబంధాలను వివరించే కవిత.

*నీ మాట - అనే కవిత మాట గొప్పతనాన్ని చెప్పేది
"నీలాకాశం కోరే నిన్ను నేలకేసి కోట్టుద్ధి అంటాడు.
నీ మాట ఒక తూటా దాన్ని ఊరికినే వదిలేయకు అవసరమైతే తప్ప.." అంటాడు.

* నేల విడచిసాము- అనే కవితలో విజయమాల్య వంటి వారివల్ల భారత పౌరుని ఆర్థిక స్థితి మరింత దిగజారుతుందని పరోక్షంగా చెప్పాడు కవి.
" అవినీతి రోగాన్ని అంతం చేయడం అందరి బాధ్యత" అంటాడు.

**"ఎదజేబు" కవితా సంపుటిలోని ఎక్కువ కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమైనవే.
కవిత్వం రాయడం సామాజిక బాధ్యతగా భావించిన వడ్ల సాయిలు చారి అనేక సందర్భాల్లో తమ స్పందనను కవితలుగా రాశారు. సైనికుల గురించి, నీటి గురించి, అవినీతి గురించి ఇంకా చాలా విషయాలను కవితా వస్తువుగా స్వీకరించారు.
అంతేకాదు ప్రముఖుల గురించి రాశారు. తెలంగాణ జాతిపిత ప్రో..జయశంకర్ గురించి, ఆత్మగౌరవ పాఠాన్ని నేర్పిన అంబేద్కర్ గురించి, సినారే, వీరేశలింగం గురించి కూడా రాశారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి గురించి రాశారు.అమ్మమాటను, నాన్నను, గురువును తలుచుకున్నాడు.
అయితే మహాత్మా జ్యోతిబాపూలే సావిత్రి బాయి పూలే గురించి కూడా రాయాల్సింది. బహుజనులకు అక్షర భిక్ష పెట్టిన జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే భావజాలం అక్షరీకరించ బడకుండా వారి సేవలను చదవకుండా నేటి సాహిత్యం సంపూర్ణం కాదు. సామాజిక న్యాయం స్పురణకు రాదు. సాంఘిక అనాచారాలు అవగతం కావు అన్నది నా అభిప్రాయం.
శిల్పం, శైలి వంటి వాటిని గురించి నేను మాట్లాడను. కానీ గగ్గె, దామర వంటి తెలంగాణ వస్తు సామాగ్రి గురించి కవితలకింద( ఫుట్ నోట్ లో) వివరణ ఇస్తే బాగుండేది.
'బతుకొచ్చి బాగోతమాడిండు'
'ఎండుగడ్డి మంటలా '
'చల్ల కుండలో కవ్వం చిలుకుతున్నట్టు' వంటి వాక్యాలు తెలంగాణ భాష పట్ల కవికున్న ప్రేమతో పాటు మన భాషా సౌందర్యానికి అద్దంపడతాయి. అయితే 'చెవుల నోరెత్తించే', 'ఇంటంటే ఇను' వంటి ప్రయోగాలు తెలంగానణేతర పాఠకులకు గంధరగోళం కలిగించే అవకాశం ఉన్నది.

ఇంతకు ముందే అనేక అవార్డులు పొంది, అనేక మంది పాఠకులను కలిసి ఉన్న సాయిలు చారి ముందు ముందు ఇంకా విస్తృతంగా సాహితీ వ్యవసాయం చేసి తన వాటాను బస్తాలకెత్తుకోవాలని ఆశిస్తున్నాను.

ఉపాధ్యాయుడు, కవి మాత్రమే కాదు సినీనటుడు కూడా అయిన సాయిలుచారి "విశ్వకర్మ ఉద్యోగుల సంఘం" రాష్ట్ర స్థాయి నాయకుడు . మున్ముందు ఈ చారి జాతీయ అంతర్జాతీయ నాయకత్వాన్ని పొందాలని రాజకీయ వాటాలో మన వంతు సాధించే దిశగా తన ప్రయాణం సాగాలని ఆకాంక్షిస్తూ అభినందిస్తున్నాను. అయితే నాయకత్వ బాధ్యతల్లో కవితా పలవరింతలు మరవద్దని సలహా నిస్తాను.

జ్వలిత
(కవి , రచయిత, విమర్శకురాలు, సామాజిక కార్యకర్త)
9989198943, 16072019

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష