విత్తన సైనికులు- కథ

 విత్తన సైనికులు (కథ)


పొద్దువాలుతున్నా అన్నానికి రాని కొడుకు కోసం ఆత్రపడుతూ కూర్చుంది శాంతమ్మ.
నాలిగింటప్పుడు పొద్దటి మీటింగ్ లో చూసిన ఆఫీసర్ను , యువతీ యువకుల్ని తీసుకొని ఇంటికొచ్చాడు శివ. శ్యామల అందర్నీ కూచ్చోమని తాగడానికి మంచినీళ్ళిచ్చింది. శివ తల్లిని పిలిచి వాళ్ళను పరిచయం చేశాడు. ఆమె వారికి నమస్కారం పెట్టింది.
" మీ శివ చాలా తెలివైన వాడు ధైర్య వంతుడమ్మా. అందరూ చదువుకొని ఉద్యోగాల కోసం వెంపర్లాడుతూ పట్టణాలలో పాట్లు పడుతుంటే. శివ మాత్రం తను చదివిన చదువుకు సార్థకత కలిగిస్తూ తన స్నేహితులను సైతం గ్రామాలకు వ్యవసాయం లో విత్తనాల సాగు వైపు మళ్ళిస్తూన్నాడమ్మా. మీ ఇంట్లో చిన్నగది ఖాళీగా ఉందని అది అద్దెకిస్తే , మాకు ఆఫీసుగా ఉపయోగించుకుంటాం. మీకు ఖర్చులకు డబ్బు ఉపయోగపడుతుంది"అన్నాడు ఆ అధికారి.
"అయ్యో ఇంతకు ముందెన్నడు అద్దెలకియ్యలేదయ్యా. పైగా గడ్డిల్లు చిన్న గది." అన్నది శాంతమ్మ.
"ఫర్వాలేదు ఆంటీ ఈ చిన్నదైనా సరిపోద్ది " అన్నాడు ఒక యువకుడు.
"ఇంతకీ ఏం చేస్తారు ఇక్కడ. అసలే ఆడపిల్ల ఉన్న ఇల్లు" అన్నది శాంతమ్మ.
"మీ శివ విత్తన వ్యవసాయం గురించి ప్రచారం చేస్తాడు. దానికి సంబంధించిన అధికారులు ఒక్కరో ఇద్దరో వచ్చి పని చేసుకుంటారు. మీ ఊరి రైతులకు ఏదైనా సందేహమొచ్చినా, ఏవైనా విత్తనాల అడ్రసులు కావాలన్నా వాళ్ళిక్కడకు వచ్చి తెలుసుకుంటారు. మీరేం భయపడనవసరం లేదు . కొత్తవాళ్ళెవరూ రారు" అన్నడాధికారి.
"మీరన్నా చెప్పండయ్యా చదువుకొని ఉద్యోగం చేస్తడని ఆశపడితే మళ్ళీ వ్యవసాయం అనుకుంట ఈ పల్లెకు చేరిండూ " అన్నది శాంతమ్మ.
" అమ్మా నీ కొడుకు ఈ ఊరి చరిత్రనే మార్చబోతున్నాడు. తానొక్కడే కాదు ఈ ఊరి రైతులందరినీ విత్తన సేద్యం వైపు నడిపించబోతున్నాడు. పుట్టిన గడ్డ ఋణం తీర్చుకోబోతున్న సైనికుడి వంటి నీ కొడుకును ఆపకండమ్మా. మీకేం భయం లేదు మేమంతా అదే పనిలో ఉన్నాం. ధైర్యంగా ఉండండి" అన్నాడు ఆ అధికారి.
"విత్తన సేద్యమన్నా వ్యవసాయమేగా. వాడి తండ్రి వాణ్ణొక ఉద్యోగిగా చూడాలనుకున్నాడు. పొద్దున్న మీటింగ్ లో కొన్ని విన్నాను. కానీ " అంటూ నసిగింది.

" ఆంటీ గతంలో పెళ్లి సంబంధం చూడాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు తెలుసుకోవాలనే వాళ్ళు. వ్యవసాయంలో విత్తనాల ఎంపిక విషయంలో కూడా అదే జాగ్రత్త తీసుకోవాలి.
లేదంటే ఆశించిన దిగుబడి రాదు. నాణ్యమైన విత్తనం ఎందుకంటే ? మౌలికంగా ఉత్పత్తిని ఆదాయాన్ని పెంచుకోవాలంటే నాణ్యమైన విత్తనమే సహాయపడుతుంది. సారవంతమైన భూమి, సాగు పద్ధతులు, ఉపయోగించే ఎరువులు మొదలైన వాటి కంటే కూడా నాణ్యమైన విత్తనం ఎంపికలోనే రైతు తన విజయాన్ని పొందగలడు. ఆ ప్రయత్నం కోసమే మేమంతా శివతో కలసి మీ ఊరొచ్చాము. చూస్తారుగా మన జీవితాలే మారిపోతాయి అన్నది" వారితో వచ్చిన యువతి.
" ఆడపిల్లవు నీకెందుకమ్మా ఈ గోలంతా" అన్నది శాంతమ్మా.
"నేనే కాదు మీ శ్యామలను కూడా ఈ ప్రయత్నంలో కలుపుకుంటాం చూడండి. ఆడపిల్లలు ఎందులౌ తక్కువ. అయినా మీరేం తక్కువ. వ్యవసాయం గురించి మీకే ఎక్కువ తెలుసు. కాకపోతే మామూలు ధాన్యం పండించడం కంటే. విత్తనాలను పండించడం వల్ల రైతుకు ఎక్కువలాభం వస్తుంది" అన్నదా యువతి.
"మా శ్యామల నీకెట్లా తెలుసు," ఆశ్చర్యంగా అడిగింది శాంతమ్మా. "నేను చెప్తాలేమ్మా అన్నివిషయాలు అంటూ కలగ చేసుకున్నాడు శివ.
"మేము వెళ్ళొస్తామమ్మా రేపుకలుద్దాము" అంటూ వాళ్ళు బయలుదేరారు. శివ వాళ్ళతో కలిసి బయటకు వెళ్ళాడు.
"మరీ చోద్యం కాకపోతే ఆడపిల్లలకు ఇంత అతి అవసరమా . ఈ వ్యవసాయం ఏం వెలగబెడుతదో , ఉద్యోగం చేసుకోక. పురాణాల్లో లేని వింతలు జరుగుతున్నాయి". అన్నది శాంతమ్మ.
"ఊరుకోమ్మా పురాణాల్లో కూడా వ్యవసాయం గురించి, ఆడవారి భాగస్వామ్యం గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. మనుస్మృతిలో కూడా సుబీజం సుక్షేత్రం అంటూ మంచి బీజాలు మంచి భూమి వల్ల మంచి వ్యవసాయం సాధ్యమవుతుంది అన్నారు. రుగ్వేదంలో కూడా నాణ్యమైన విత్తనాల గురించి చెప్ప బడింది" అన్నది శ్యామల.
"నీకెట్లా తెలుసు ఈ విషయాలన్నీ"తల్ల ప్రశ్న.
"అన్నయ్య చెప్పాడు. ఆ అమ్మాయిని కూడా పరిచయం చేశాడు. ఆమె పేరు సస్య అన్నయ్యతో కలిసి చదువుకున్నది. ఆమెకూడా విత్తనాల గురించి చాలా చెప్పింది" అన్నది శ్యామల.
"ఏమి చెప్పింది చాలా చాలా"
"నాణ్యమైన విత్తనాల ఎంపిక ద్వారా తక్కువ నెలలు ఎక్కువ దిగుబడితో పాటు రసాయనిక ఎరువులను అధికంగా ఉపయోగించకుండా లబ్ధి పొందవచ్చని. నాణ్యమైన విత్తనాల వల్ల పంటకు చీడపీడలను ఎదుర్కొనే శక్తి ఉంటుందని. నాణ్యమైన విత్తనాలు నాటినపుడు క్షేత్రస్థాయిలో మొక్కలన్నీ సమానంగా ఎదిగి ఆశించిన దిగుబడులను పొందవచ్చనీ. ఆరోగ్యవంతమైన లాభదాయకమైన వ్యవసాయానికి, అధిక దిగుబడులకు మంచి విత్తనం ఎంపిక ఎంతో ముఖ్యమని చెప్పింది". అంటు ఒక పుస్తకం చూపిస్తూ "ఇదిగో ఈ పుస్తకం లో ఇంకా కొన్ని విషయాలున్నాయి చదువుతా విను.
నాణ్యమైన విత్తనం గుర్తించడానికి లేదా ఒక విత్తనాన్ని నాణ్యమైనదిగా చెప్పడానికి జన్యుపరమైన ఆధారాలు అవసరం.
వ్యవసాయంలో విత్తనాలను పండించడానికి సమయము, సాగు విధానం చాలా ముఖ్యమైనవి. విత్తనాల్లో తేమ మీద ఆధారపడి విత్తన వ్యవసాయం ఉంటుంది.
విత్తనాల వ్యవసాయం చేసేటప్పుడు ఎంతో జాగ్రత్త వహించాలి. కేవలం ధాన్యం కోసం వ్యవసాయం చేసినట్టుగా చేస్తే విత్తన వ్యవసాయం కుదరదు. విత్తనాలను భద్రపరచడానికి వాటికి కొంత చికిత్స చేయవలసి ఉంటుంది. అట్లా చేయడం వల్ల మొలకెత్తే శాతాన్ని, దిగుబడి శాతాన్ని, పెంచుకోవచ్చు. అలాగే విత్తనాలను భద్రపరచుకోవడం, ప్యాక్ చేసుకోవడం వంటి విషయాల్లో జాగ్రత్త వహించడం వల్ల ఆరు నుండి ఎనిమిది శాతం నష్టాన్ని అధిగమించవచ్చు. ఇందులో విత్తనాలను భద్రపరచడం, పంపిణీ చేయడం వంటి అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. విత్తనాల పండించడం కొరకు ప్రత్యేకమైన చట్టాలు చేయబడ్డాయి."
"ఆగాగు చట్టాలు కూడా ఉన్నాయా విత్తనాల కోసం. ఇవన్నీ వింటుంటే కొంచం ధైర్యం అనిపిస్తుంది. అవునూ ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా "అంది శాంతమ్మ.
"ఔను తెలుసు. అన్నయ్య ఆమె కలిసి చదువుకున్నారు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికిష్టం. వాళ్ళమ్మానాన్నకు అన్నయ్య నచ్చాడు. నువ్వొప్పుకుంటే వాళ్ళే పెళ్ళికూడా చేస్తామన్నారు. అందరం కలిసి విత్తన సేద్యం గురించి ప్రచారం చేస్తాం" అని గబాగబా చెప్పి. ఏదో పని ఉన్నట్టు అక్కడి నుండి వెళ్ళ బోయింది శ్యామల.
"ఆగాగు ఇవన్నీ నీకు తెలిసి నాకెందుకు చెప్పలేదు. మరి కట్నం ఎంతిస్తారు. వాళ్ళదే కులం. మరి నీ పెళ్ళెట్లా" అంటున్న శాంతమ్మ ప్రశ్నలకు.
"సస్య వాళ్ళ పెదనాన్న కొడుకు శ్యామలను ఇష్టపడుతున్నాడు. నువ్వొప్పుకుంటే పెళ్ళిచేద్దాం. సస్యవాళ్ళు కట్నమివ్వరు, మనమూ ఇవ్వనవసరం లేదు. కులం పట్టింపులు నాకూ వాళ్ళకు లేవు. నీకిష్టం లేకుండా ఏదీ జరగదమ్మా. మేమంతా కలిసి విత్తన సేద్యం యొక్క ప్రాధాన్యతను తెలుసుకున్నాం కనుక మన ఊరిని విత్తన సేద్య గ్రామంగా మార్చాలనుకుంటున్నాం. ఆలోచించమ్మా" అప్పుడే వచ్చిన శివ వేడుకున్నట్టుగా అన్నాడు.
"ఇంత జరుగుతున్నా నాకేది తెలవలేదు. మీరేమైపోతారో పెళ్ళెట్లా అని భయపడుతున్నా. చిన్నవాళ్ళయినా మీరింతా ముందుచూపుతో ఉన్నారు. మీనాన్న ఉండి ఉంటే సంతోషించే వాడు " అంటూ కళ్ళు తుడుచుకుంది శాంతమ్మ.
ఆనందంగా తల్లిని చుట్టేసుకున్నారు. తిడుతుందేమో అని భయపడుతున్న అన్నా చెల్లళ్ళు.
ఉందిలే మంచికాలం ముందు ముందునా ..
అందరూ సుఖపడాలి నందనందనా.. పాటవినపడుతూంది గ్రామపంచాయతీ ఆఫీసు మైకునుండి.

...................
జ్వలిత
13/1/2020

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష