బషాయ్ టుడు3- అన్ని సార్లు ఎట్ల

 "బషాయి టుడు" అన్నిసార్లు ఎట్లా మరణించాడు

(పరిశీలన - జ్వలిత- 9989198943)

1967 మే జూన్ మాసాల్లో ఉత్తర బెంగాల్ లోని నక్సల్బరీ ప్రాంత రైతాంగ ఉద్యమం దాని నేపథ్యం ద్వారా "బషాయి టుడు" రచనకు స్పూర్తి అని రచయిత్రి మహాశ్వేతాదేవి తన ముందుమాటలో చెప్పుకున్నారు. డార్జిలింగ్ జిల్లాలోని నక్సల్బరీ, ఖడీబాడీ, ఫంసీదేవా ప్రాంతవాసుల లో చాలా ఎక్కువ మంది ఆదివాసులు భూమిలేని రైతులు. మేది, లెప్చా , భూటియా, సంతాల్ , ఓరావో, రాజ్భన్వీ , గూర్ఖా వంటి వేరు వేరు తెగలకు చెందినవారు స్థానిక జోతేదారులు "పంట వాటా పద్ధతి" అని దోపిడి విధానం కింద వాళ్లను యుగయుగాలుగా పీడిస్తూ ఉన్నారు. జోతేదారులు భూమి లేని రైతులకు విత్తనాలు, అరకలు, పశువులు కొద్దిపాటి తిండిగింజలు విదిల్చి, ఆరుగాలం వాళ్లు కష్టం చేసి పండించిన పంటలో పెద్ద వాటాను జోతేదారులు గద్దల్లా తన్నుకు పోతారు. యుగయుగాలుగా చాకిరీ చేసేవారికి భూమిలేక తిండికి కూడా లేక కష్టాలు అనుభవిస్తూన్నారు. వాళ్ల ప్రతిఘటనలు ఆ క్రమంలో సంభవించిన సంఘర్షణలతో ప్రభుత్వం 1954లో ఎస్టేట్ స్వాధీన చట్టం తెచ్చింది. అనేక చట్టాలు ప్రభుత్వం చేసినప్పటికీ వాటివల్ల ఎటువంటి ఉపయోగం లేక ముఖ్యంగా నక్సలైట్ ఉద్యమం ఉన్నా , అధికారంలో ఫ్రంట్ పార్టీల నిర్లక్ష్యం వల్ల ఆదివాసీలు ఎంతో హింసకు గురయ్యారు, దోపిడీని ఎదుర్కొన్నారని, ఈ నవలలో చెప్పబడింది.

"బషాయ్ చనిపోతున్నాడు" అనే మాటతో ఈ నవల ప్రారంభమవుతుంది. పోలీసులకు సింహస్వప్నంగా మారి, వాళ్లను భయంతో గడగడలాడించిన ఆదివాసుల విప్లవ నాయకుడు బషాయి టుడు.
రచయిత్రి మాటల్లోనే "1970 - 80 దశాబ్దం పొడుగునా మంటలం కాలం గుండెల్లో నిర్విరామంగా ఉండేవి" అంటూ ఆ పది సంవత్సరాల కాలంలో జరిగిన పోరాటాల తీవ్రతను ఒక్కమాటలో చెప్పారు .

ఇందులో ప్రధాన పాత్రలు బషాయి టుడు, కాళీ సంత్రా, సమంత బాబు, దేవీమిస్సర్ బాబు వంటి కొన్ని బ్రాహ్మణ పాత్రలు. కానీ ముఖ్యమైనవి నవల ప్రతి సంఘటనలో మనకు కనిపించేవి బషాయి టుడూ, కాళీ సంత్రా.
కాళీ సంత్రా ఎంతోకాలం నుంచి మార్క్సిస్టు పార్టీ లో ఉంటున్నాడు. జగుల పట్టణాన్ని తన చుట్టుపక్కల ఉన్న గ్రామాలను తానే ఎంచుకొని వాటికే అంకితమై పోయాడు. కాళీసంత్ర వృద్ధుడు ఇప్పుడు అధికారంలో ఉన్న మార్క్సిస్టు ప్రభుత్వానికి బాగా సన్నిహితుడు. నిజాయితీపరుడు. ఒకప్పుడు బషాయికి సహచరుడు. ఇద్దరు కలిసి రైతు ఉద్యమంలో పని చేశారు.
కానీ ఇప్పుడు "జిల్లా వార్త" అనే వారపత్రికకు కాళీసంత్ర సంపాదకుడు, ప్రచురణకర్త కూడా. నగరాలలో రాణిస్తున్న పార్టీ బాబుల్లాగా భోగభాగ్యాలను అతడెప్పుడూ ఎరుగడు. పార్టీ పలుకుబడి ఉపయోగించుకొని డబ్బు సంపాదించ లేదని అతని భార్యా, కొడుకు అతనిని మూర్ఖునిగా లెక్కగడతారు.
నవలలోని ప్రధాన పాత్ర "బషాయి టుడు" అతడు బకుళి అనే ఊరిలో పుట్టాడు. పుట్టగానే తల్లిని ఆ తరువాత సంవత్సరం తండ్రిని పోగొట్టుకున్నాడు. బేలు గ్రామంలో అతని అత్త ఆరేళ్ల వరకు పెంచి ఆమె చనిపోయింది. అప్పుడు గోకుల్ బాబు బషాయిని రామ్తా మిషన్లో చేర్పించాడు. ఆ తర్వాత జగలలో కిసాన్ ఫ్రంట్ కోసం పని చేశాడు. దాదాపు 30 సంవత్సరాలు వంద గ్రామాలకు పైగా తిరుగుతూ పనిచేశాడు. అందువల్ల ఆ గ్రామంలో అందరికీ అతడు తెలిసిన మనిషి, కావలసిన వాడు అయిపోయాడు. అయితే ఎక్కడా అతనితో రక్త సంబంధం ఉన్న బంధువులు ఎవరూ లేరు. సొంతిల్లు కుటుంబం లేదు.

బషాయిది గెరిల్లా యుద్ధ వ్యూహం. భారతీయ పరిస్థితులకు తగినట్టుగా దానిని మలచుకుని కార్యక్రమాలకు గ్రామాలను క్షేత్రంగా ఎంపిక చేసుకొన్నాడు. ఆదివాసీలను తన పక్షం తిప్పుకోవడానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆ వ్యూహంతో అతని కార్యక్రమాలు అంతటా విస్తరించాయి. ఒక పోరాటానికి మరో పోరాట స్థలానికి 40, 50 మైళ్ల దూరం ఉంటుంది. చర్షొ అడవి అతనికి ఆశ్రయం ఇచ్చింది.
బషాయి చేసిన పోరాటంలో ఇప్పటికీ నాలుగు సార్లు మరణించాడు. ప్రతిసారి అతని శవాన్ని గుర్తించడానికి కాళీసంత్రానే పోలీసులు ఆశ్రయిస్తారు. నేను రాను అనడానికి వీలు లేని పరిస్థితి కాళీది.
ఒక మనిషి ఇన్ని పోరాటాలలో నాలుగు సార్లు మరణించడం చిత్రంగా అనిపిస్తుంది. కానీ మరణించిన ప్రతిసారి మళ్లీ పోరాటం చేయడానికి బతికి వస్తాడు. ప్రతిసారి కాళీసంత్రానే మరణించినది బషాయి అని నిర్ధారిస్తాడు. పోలీస్ అధికారులకు వేరెవ్వరికీ అతడు ఎట్లా ఉంటాడో తెలియదు.
నవలంతా కాళీసంత్రా, భాషాయి శవాన్ని గుర్తించడానికి వెళ్ళినట్టుగా నడుస్తుంది. ప్రతిసారి వెళ్లిన సందర్భంలో గతంలో జరిగిన సంఘటనలను, పోరాటాలను, వారి అనుభవాలను నెమరు వేసుకుంటూ ఉన్నట్టు, వారి మధ్య జరిగిన సంభాషణ వివరిస్తున్నట్టు రచయిత్రి ఈ కథను నడిపారు.
పాఠకులు నవలను చదువుతున్నంతసేపు చారిత్రకాంశాలు చాలా ప్రస్తావించబడుతాయి. పశ్చిమ బెంగాల్లోని ఉద్యమాలు, ప్రభుత్వం చేసిన చట్టాలు, ఎవరి కోసమైతే చట్టాలు చేయబడ్డాయో అవి వారికి చేరకపోవడం, చైనా పార్టీ - రష్యా పార్టీ అంటూ కమ్యూనిస్టు పార్టీలు నక్సలైట్ పార్టీలతో మధ్య అంతరాలను, విభేదాలను, మూడింటిలో ఉండే కొన్ని అవలక్షణాలను రచయిత్రి నిర్భయంగా చర్చిస్తుంది.
సంతాల్ తెగ చెందిన బషాయి టుడు నక్సలైట్ కాదు, కాంగ్రెస్ కాదు, కానీ పోరాటయోధుడు. గతంలో మార్క్సిస్టు పార్టీ లో పనిచేసి, దాని వల్ల ఉపయోగం లేదని తెలుసుకొని, తన జాతి వారి కోసం, రైతు కూలీల కోసం ఏమి చేయాలో ఆలోచించి, నిర్ణయించుకున్న ఒక జానపద వీరుడు. నక్సలైట్ల వలెనే రైతు కూలీలకు వేతనం చెల్లించని దోపిడీ చేస్తున్న భూస్వాములను తల నరుకుతాడు. కానీ అతడు నక్సలైట్ కాదు. మార్క్సిస్టు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతాడు కానీ అతడు కాంగ్రెస్ కాదు. ఇలా ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పోరాటం నడిపి పశ్చిమ బెంగాల్లోని అడవి ప్రాంతంలో అనేక గ్రామాలకు ప్రజలకు న్యాయం చేకూర్చే గలిగిన గొప్ప పోరాట వీరుడు.
ఒక ఎస్ఐ మాటల్లో "బషాయి టుడూ ఒక సంతాల్. కోపం వస్తే రాక్షసుడిగా మారిపోయే వాళ్లలో ఒకడు. సంతాలులు బాణాలు గురిచూసి కొట్టడంలో దిట్టలు. ప్రారంభంలో బషాయి నక్సలైట్ కాదు. అతడు ఒకసారి నక్సలైట్ అవ్వగానే నాయకుడు అయిపోయాడు. భూమిలేని ఆదివాసీల వలస కూలీలు, వ్యవసాయ కూలీలతో తన సైన్యాన్ని తయారు చేసుకున్నాడు" అని అంటాడు ఎస్. ఐ.

బషాయి మాటల్లోనే "మీకు గొట్టం తుపాకులు ఉంటాయా? కాల్చేయడానికి. ఎందుకు మాకు విష ఫలాలు లేవా ? పాములు లేవా ? వాటి విషాన్ని నా బాణాల మొలలకు పూసి, ఎక్కు పెడతాము. మేము సంతాలి వాళ్ళం. మీరు బాబులు. మీరు మాకు నేర్పాలి అనుకునేది, మా ఉచ్చ తో సమానం" ఇది అతని తత్వం(10వ పుట)

రచయిత్రి మహాశ్వేతాదేవి నవలో చాలాచోట్ల చిన్న చిన్న పిట్ట కథలు చెప్పడం జరిగింది ఆనాటి అంటే 1990 లో రాసిన ఈ కథ 1950 ప్రాంతం నుండి జరిగిన మార్పులను వివరిస్తుంది. కానీ ఇందులో ప్రస్తావించబడిన చాలా అంశాలు ఇప్పటికీ కూడా అంటే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా ఈ రచన సాగి 30 సంవత్సరాలు అయినా ఇంకా అటువంటి అంశాలు మెరుగుపడలేదు. ఉదాహరణకి 1958 లో జరిగిన ఎస్టేట్ చట్టం ఆనాటి రైతు కూలీలకు సంక్షేమం కోసం చేయబడింది. కానీ దాని గురించి వారికి తెలియనే తెలియదు. ప్రతాప్ భూస్వామి ఆ చట్టాన్ని గురించి మాట్లాడిన మాటలే అందుకు ఉదాహరణ. అధికారులు వాటిని అమలుపరిచరు ప్రజా నాయకులు చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించరు. డబ్బు ఉన్న వారిది, భూమి ఉన్నవాడిదే పెత్తనంగా నడుస్తూ ఉంటుంది.

" నీడ లేని నిరుపేదలు అధికార యంత్రాంగానికి ఇష్టం లేని మొదటి భార్యలా తయారయ్యారు"
"చిల్లు కుండ లో నీళ్లు నింపడానికి ప్రయత్నించినట్టు ఇదంతా పూర్తిగా వృధా కాళీసంత్ర జిల్లా వార్తలు ప్రచురించడం, కాపీలను బుక్ పోస్ట్ లో పంపడం అనేక సమావేశాల్లో కలెక్టర్ పక్కనే కూర్చోడం ఇవేవీ ఉపయోగపడేవి కావు (4 వ పుట).
" విప్లవం అనే మాట పానుకు చుట్టిన మెరుపు కాగితం వలె విలువ లేనిది, అలవాటుగా పదేపదే వాడే అనేక పదాలలో ఒకటి మాత్రమేనని . (4 వ పుట).
"చర్షా గ్రామాన్ని సవతి తల్లి లాగా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తోంది. 1970 - 71 లో ఉద్యమకారులకు రహస్యంగా మద్దతు ఇచ్చినందుకు"
"ప్రపంచమంతటా కూడు గుడ్డ లేని నిర్భాగ్యుల అందరి జీవితాల లాగా సంతాల్ ప్రజల జీవితాలను కూడా నిర్ణయించేది శాసించేది ఆకలే గాని ఏ ప్రభుత్వము కాదు. తన ప్రజలను నిరంతరం భయంతో పరిగెత్తిస్తూ పాలించే నియంత లాగా ఆకలి పేదలపై పెత్తనం చేస్తుంది"
పై మాటలన్నీ పేదల పట్ల ప్రేమను భాషా ప్రయోగంలో చమత్కారాన్ని సమాజాంలో అసమానతలపై రచయత్రి అసంతృప్తిని తెలియ చేస్తాయి.

"ప్రపంచ కార్మికులారా ఏకం కండి, కార్మికులకు సొంత రాజ్యం వచ్చేదాకా స్వాతంత్ర్యానికి అర్థం లేదు, కార్మికులు ప్రపంచానికి నిజమైన యజమానులు, వంటి నినాదాలు ప్రతిధ్వనించి నప్పుడు కార్మిక శాఖ కనీస వేతనాలు ప్రకటించింది, చట్టాలు చేయాలి కాబట్టి చేశారే కానీ వాటిని అమలు చేయడం అక్కర్లేదని వాళ్ల ఆలోచన" ఇది ప్రభుత్వాల ధోరణి అని రచయిత్రి చెప్ప దలుచుకున్నారు.

"ప్రాచీన మహర్షుల దివ్యదృష్టితో ఈ విషయాలు తెలుసుకున్నారు కులం పోయినా సుఖం దక్కని వాడిలాగా (3వపుట)"
"దేవీమిస్సర్ బాబు బ్రాహ్మణ అహంకారంతో అతనిని చిన్న చూపు చూస్తూన్నాడు.(3వపుట.)"
"అధికార యంత్రాంగం చేసే చికిత్సలు గాలింపు, విధ్వంసం, నిర్బంధం, నిర్మూలన, కాల్పుల్లో కతం వంటివి.(8వ పుట)"
వంటి మాటలు రచయిత నిరసన స్వభావాన్ని మనకి తెలియజేస్తాయి.
ఒక చోట రచయిత చెప్పిన ఒక జానపద కథ "ఒక జిత్తులమారి నక్క ఒకసారి ఒక మొసలి యొక్క పిల్లలన్నింటిని తినేసి, చివరకు ఒకే ఒక పిల్లను పైకెత్తి తల్లికి పదేపదే చూపిస్తూ పిల్లలన్నీ బతికే ఉన్నాయని నమ్మించడానికి ప్రయత్నిస్తుంది. పార్టీలో ప్రతిష్ట పై మబ్బులు కమ్మినప్పుడు ఆదర్శప్రాయుడైన కాళీసంత్రాని మొసలి పిల్లలాగా పార్టీ చూపిస్తుంది. తన నిజాయితీ చాటుకోవడానికి" అంటారు. ఆ విధంగా లెఫ్ట్ పార్టీలలో ఉండే డొల్లతనాన్ని చాటుతారు.

*** బషాయి మరణాలు

బషాయి ప్రతాప్ గోల్దాని చంపినప్పుడు ఒకసారి
రామేశ్వర్ తండ్రి శివేశ్వర్ ని చంపినపుడు ఒకసారి
నూర్జాషావు తల నరికినప్పటి ఎన్కౌంటర్ లో ఒకసారి.
నవలలో చివరిది నాల్గవది రామేశ్వర్ ను కనీస వేతనాలు ఇవ్వ వలిసిందిగా కోరుతూ కాంగ్రేస్ కర్తలు పోలీసుల సమక్షంలో నే మరోసారి.
ఈ విధంగా ప్రతిపోరాటంలో బషాయి టుడు అంత్యత హింసాత్మకంగా ఎన్కౌంటర్ చెయ్యబడతాడు.
ప్రతిసారీ పోలీసులు కాళీసంత్రాను శవనిర్దారణకు తీసుకు పోతారు.

ఆదివాసీల తరపున ఆ జాతికి చెందిన ఒక నాయకుడు అవసరం ఈ నవలలో వివరించబడింది చారిత్రక సాంఘిక అంశాల తో కూడుకున్న నవల ఇది.
విప్లవ నవలయినా ఇందులో కూడా ప్రేమ జంటలు. స్వేచ్ఛగా ప్రేమను తిరస్కరించే స్త్రీలు ఉన్నారు. కాస్త ధైర్యంగా చదవాలసిన నవలే మరి.

***** **** ***
బషాయి టుడు నవల
రచన: మహాశ్వేతా దేవి
ఆంగ్లానువాదం: సమిక్ బంధోపాధ్యాయ మరియు గాయత్రీ స్పైవాక్
తెలుగు సేత : ప్రభంజన్.
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు 1997 నవంబర్ లో మొదటి సారి , 2018 లో పునర్ముద్రణ చేశారు.
.....
14/7/20

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష