అత్యాచారాల పై కవిత్వం

 తెలుగు సాహిత్యంలో అత్యాచారాల పై కవిత్వం(శీర్షిక)

జ్వలిత-9989198943

యుగయుగాలుగా పంజరం పై పక్షి చేసే యుద్ధమే కవిత్వం. యుగయుగాలుగా అణిచివేతకు హింసకు గురవుతున్న మానవి, తనపై జరిగే అత్యాచారాల గురించి రాసిన కవిత్వమే నేటి నా చర్చ అంశం. యుగయుగాలుగా అనుభవిస్తున్న హింసాత్మక సముద్రాన్ని , నెత్తురోడుతున్న ఆకాశాన్ని ,గాయాలతో సలుపుతున్న భూమిని, ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు నిర్భయ మొదటిది కాదు దిశ చివరిదీ కాదు. కానీ జరుగుతున్న సంఘటనల పై కవిత్వం గురించి ప్రస్తావించడం కోసం ఒక నిర్దిష్టమైన కాలాన్ని సూచించడం కోసమే.మ నిర్భయ కంటే ముందే పూలన్దేవి రమీజాబి వంటి వారున్నారు. దిశ తరువాత మానస వంటి ఎందరో బాధితులున్నారు.

ఇప్పుడు అసలు అంశంలోకి వస్తే నిర్భయ సంఘటన తర్వాత వెజైన్ మోనో లాగ్ అనే కవితను ప్రస్తావిస్తాను .

"ఈ వ్యవస్థ ముఖం మీద/ నా సిగ్గుబిళ్ళను విసిరేసి వెళ్తున్నాను/ అత్యాచార చరిత్ర పేజీలేని నేల మీద/ మళ్లీ వెజైనా తో పుట్టాలని ఉంది / మళ్ళీమళ్లీ స్త్రీగానే అంటారు
నువ్వు నీ సెక్యూరిటీ కలిసి/ ఒక చిన్న వెజైనా రక్షించ లేక పోయాయి" అంటూ వ్యవస్థ మీద ఉమ్మారు కవయిత్రి.
"నా మీద లైంగిక దాడి జరుగుతున్న క్షణాన/ నేను తుమ్మ ముల్లు నై వాళ్లకు గుచ్చుకోవాలని అనుకున్నాను / విష కన్యను కానందుకు చింతించాను/ నా వెజైనా మీద హింస పరాకాష్ఠకు చేరుకున్న/ ఆ అవాంచిత విషాద సమయంలో/ నేను అస్థిత్వం కోసం ప్రతిఘటించాను / పోరాడి గాయపడి చివరికి ముగిసి పోయాను" అంటారు మెహ జబీన్.

"మీ కోరికలు రేపే మెదళ్ళ స్థానంలో/ దయగల హృదయాలను ఇవ్వమని/ క్యాస్ట్రేషన్ అవసరం లేకుండా/ కరిగి పోయే మైనపు లింగాలు కావాలని/ మాకు ఆసన స్థానంలో/ గిలిటెన్ యంత్రాలను మాత్రమే ఇవ్వమని/ కామాఖ్య యాగం చేస్తూన్నాం" అంటారు జ్వలిత "కామాఖ్య యాగం" అనే కవితలో.

"ఏదీ స్వాతంత్య్రం" అనే కవితలో " చిన్నారి నక్షత్రాల రక్తంతో / త్రివర్ణ చీరెపుడో మాసిపోయింది/ గొంతు దాటని ఆర్తనాదాలతో/
పండుగలన్నీ ఆబ్ధికాలయ్యాయి/ సమిధలైన లేత కాయంతో /మృగ చరిత లిఖించబడుతుంది!"
అంటారు రవీణ చవాన్ అనే కవయిత్రి పూణె నుండి.

"సామూహిక బలత్కారాలకు ఎర అయి / లైంగిక హింస నడిపిన స్త్రీల మన శరీరాల క్షోభనూహించగలరా ?/ అంగాన్ని ఆయుధంగా చేసుకున్న నర పశువుల అంగాన్ని తెగ నరకాలని మాకు ఉంటే/ హింసకు ప్రతి హింస ఎలా తప్పు అవుతుందిరా?" అని అని ప్రశ్నిస్తారు జయప్రభ.

" ద్వాపర నాటి వస్త్రాపహరణ సభ /ఈనాడూ పునరావృతం అగుట వ్యధ" అంటారు అనసూయ.

" అందమైన దోపిడీకి/ పవిత్రమైన హింసకు/ న్యాయమైన దాస్యానికి/ బలైన నేను భారత స్త్రీ ని" అంటున్నారు ఓల్గా.

" మొలకలు రుధిర జ్వాలలు" అనే కవితలో
"పిండ దశ నుండి మగాళ్ళ స్పర్శలోని మర్మాన్ని/ చూపుల్లో కామాన్ని / మాటల్లో క్రౌర్యాన్ని/ కనిపెట్టగలిగే టిప్స్ కూడా పేగు తాడుతో అప్లోడ్ చేయాలి / ఇప్పుడు ఇక్కడ పసి మొలకలన్నీ/ అభిమన్యుడికి మల్లె / గర్భంలోంచి యుద్ధ విద్యలను అభ్యసిస్తున్నాయి " అంటారు అయినంపూడి శ్రీలక్ష్మి.

"ఆడ జాతిని అణగ్గొట్టే/ మగ సెగలను ఎగదోసే/ మందు మాధకాల్నీ/ బూతు సినిమాల్ని /సీరియలళ్ళనీ/ సెల్లు సెక్సుల్నీ/ బంధు పెట్టి /బొంద పెట్టుండ్రీ" జూపాక సుభద్ర "విష వివక్షలు -పాయేదేర్ల పాపాలు" అనేక కవితలో.

"ఆమె కాల్చి వేయబడుతుంది /ఆమె ఆక్రందన పొలిమేర దాటదు/ ఆమె ఒక్కరోజులోనే పాత వార్తగా మారిపోతుంది" మెర్సీ మార్గరెట్ , ఆమె వార్త , అనే కవితలో.

"ఈ భయము బ్రతుకులు మాకొద్దు/ జింకల కి మాత్రమే కాదు /ఆడవారి కోసమూ అభయారణ్యాలు కావాలి" అంటారు నస్రీన్ ఖాన్ "ఆడవారికి అభయారణ్యాలు" అనే కవితలో.

"ఎవరి జన్మ రహస్యాన్ని దాచడానికి మనకీ నరకం/ ఈ మారణకాండకు కారణమయ్యే /పునరుత్పత్తి అవయవాలు మనకొద్దు" అంటారు 'మనకొద్దు 'అనే కవితలో లక్ష్మీభవానీపల్లి ,నెల్లూరు నుండి.

"ఎక్కడ ?మానవ విలువలు " అనే కవితలో
"మద్యం మత్తులో మమకారం మరిచే
కన్నతండ్రన్న స్ప్రహా కూడా లేదాయే
మానవత్వం మట్టిలో కలిసిపోయే
ఎక్కడకు పోతున్నం ఏమవుతున్నం" అంటారు యడవల్లి శైలజ , ఖమ్మం నుండి.

" పసివాని చేతిలో ఆండ్రాయిడ్ /ఉచిత వైఫై తో అదుపులో లేని అశ్లీలాలందిస్తుంటే/ విజృంభించి విహరించే ఆ అంగాన్ని తొలగించితే/ మరో కామ తృష్ణ భయపడుతుంది" అంటారు "విష బీజం" అనే కవితలో గాలి లలిత ప్రవల్లిక .

"వికసించని మొగ్గ" అనే కవితలో "ముక్కు పచ్చలారని పసిపాప/ ఆడతనమే తెలియని ఆడపిల్లను /అచ్చోసిన ఆంబోతులు
/ నుసి చేశాయి పసి మొగ్గను" అంటారు కాళంగి వసంత.

"చిన్న పిల్లలను పసితనంలో బలిచేస్తున్నరు / చిన్న పిల్లలు పసి మొగ్గలతో సమానం/ ఊహ తెలియని వయసులో/ అత్యాచారంకు
గురవుతున్నారు / చదువుకునే వయసులో కాటేస్తూనె ఉన్నరు" అంటారు "చిన్న పిల్లలు" అనే కవితలో తిరునగరి సంధ్య ,ఖమ్మం .

"నాలుగు చుక్కల అంగవిలాసానికి/ఎందుకంత పైశాచికం/ఇంకా పురుడుపోసుకోని- ఆడతనపు బలి పర్వం/ ఎన్నాళ్ళని సహించడం/నలిగినబాల్యంపైపౌరనిర్మాణం/
కత్తిమీదసామనితెలిసినా/రాజ్యమా ఎందుకుఉలికిపడవు/ నరాలు పిడికిలెత్తుతున్నాయి/ కన్నులు నిప్పులవుతున్నాయి/
కోపం ఉప్పెనవుతుంది" అంటారు డా. శారదాహన్మాండ్లు, నిజామాబాద్.
దగ్ధమందారం

"ఘడియకో అఘాయిత్యం
సర్వసధారణమైన పుణ్యభూమిలో
అత్యాచార విస్ఫోటనంలో
ఎగసిపడిన మాంసపుముద్దను" అంటారు
కడెం లక్ష్మీ ప్రశాంతి భద్రాచలం నుండి

"మమ్మల్ని ఆడించామన్న ఆనందపు అహం మీది/
బలహీనతల బానిసత్వపు పిరికితనమూ మీదే/
రక్తసిక్త దేహాలతోనూ చెదరని చిరునవ్వు మాది/
పీల్చి పిప్పిచేసినా తరగని ఆత్మవిశ్వాసం మాది/
ఆకాశంలో మేము సగమో పావో తెలియదు/
అవనిపై మహిళలను అవమానించిన కొద్ద/
మరింతగా ముందుకు దూసుకుపోతుంటాం/
సమగ్ర మహిళా వికాసంతో ప్రగతిపథంలో పయనిస్తాం" అంటారు సమ్మెట విజయ "యుద్ధం" అనే కవితలో.

"పురుషావేశం పొంగినప్పుడల్లా/ సమాధానం లేని ప్రశ్నలా మిగులుతోంది స్త్రీ/ గాయం తగిలిన గుండెను ఒక చేత్తో/ చిధ్రమైన శరీరాన్ని దాచుకునే ప్రయత్నాన్ని మరో చేత్తో/ మోయ లేక మోయడం తప్ప మరే మార్గం కనుగొన లేక పోతోంది" అంటారు "సృష్టికేతనం" అనే దీర్ఘ కవితలో శైలజ మిత్ర.

"వావివరుసలులేక మృగమైన పురుషపుంగపులు మారేదేప్పుడు/ఎన్ని నిర్భయ దిశ చట్టాలు అమలైతున్నా/ తనంతటతాను నియమనిష్ఠలను ఏర్పర్చుకోలేకపోతే/ ఎప్పటికీ మార్పుజరగనే జరుగదు కద జగతిన /స్వయంక్రమశిక్షణ,స్వయంనియంత్రణ కావాలి/ మగవాడా మృగానివికాకు" అంటారు ముడుంబైఆచార్య పద్మశ్రీ "మొగాడు" అనే కవితలో.

"ఏడ దాచాలి /మా ఆడ కూతుళ్లను /కుళ్ళిపోతున్న దుర్గంధం నుండి /మదమెక్కిన పుండా కోరులనుండి/ చేవ చచ్చిన చట్టాల నుంచి" అంటారు" కలి" అనే కవితలో రమాదేవి కులకర్ణి, రంగారెడ్డి నుండి .
వికసించని మొగ్గలపై తుమ్మెద వాలదు/ క్రూర జంతువులు కూనల వైపు కన్నెత్తవు/ చేపలని చెరపట్టే కొంగలై/ పసితనం పై పాపం పడగ విప్పుతుంది" అంటారు 'బండి ఉష' ఖమ్మం నుండి, పందిరి అనే కవితలో.

"ముందడుగు వేయండి" అనే కవితలో
ఇది నవయుగమా..నవీన యుగమా..కాదు..కాదు. పాపం పెల్లుబికె పాపపు యుగం.
వావి వరస చూడక అఘాయిత్యాలు చేస్తున్నారు
వీరికామాన్ని ఏ కాష్టంలో వేసి కాల్చాలి
ఏ భోగిమంటల్లో వేసి మసిచేయాలి
ఆడపిల్లకాదు.. పులికావాలి
గాండ్రించి..గర్జించాలి" అంటారు గాజుల భారతి శ్రీనివాస్. ఖమ్మం నుండి

" ఆడతనమే శాపమా" అనే కవితలో "నిండు తనమే లేదంటూ/ అంగాంగ ప్రదర్శనమే మీకు చేటంటు/మాటల తూటాలు/మరి పాలు గారే పసిదానికి ఏ అంగం వృద్దిచెందినది/ కామవాంఛలు తీర్చుకొని కాటికి పంపే మృగ మాయారోగాలు/
ముదిమి వయసలో నైన/ పాలు తాగే పసి తనమైన/ ఆడ తనమే శాపమై వేదింపులు" అంటారు తులసి గుగులోతు,భద్రాద్రి కొత్తగూడెం.

"తనయను సైతం కామానికి బలిచ్చే కామాంధుల మైకం/పసికూనలకు కూడా రక్షణలేని దౌర్భాగ్యపు లోకం/మానవత్వం మృగత్వం అవుతుందని తెలిసీ మద్యం నిషేదించని ప్రభుత్వాన్ని నిలదీయాలా/తప్పెలా చెయ్యొచ్చో పదేపదే చూపించే మాధ్యమాల ధోరణి మార్చాలా " అంటారు, "ఓదార్పు కాదు మార్పు"అనే కవితలో
రాజశేఖరుని శ్రీ శివ లక్ష్మి.

చెప్పలేను...కాని చెప్పక తప్పట్లే అనే కవితలో
"ఏమని చెప్పను
ఎలా వర్ణించను
ఆడ దాన్ని ఆట బొమ్మగా చూసే సమాజంలో
ఏడ ఉన్నది మానవత్వం ఆనవాలు
వాయి ,వరస లేని రాక్షసత్వంలో
ఎలా బ్రతకనూ " అంటారు శ్రీలత సవిడిబోయిన అనే కవయిత్రి.

కవయిత్రి రాగా రాజేశ్వరి "నీ ఉనికికే చేటు" అనే కవితలో "ఆడతనపు ఆకారమే అమ్మగా వచ్చి/
జన్మ యిచ్చి లాలించగా/ అమ్మా అమ్మ అని
పిలుస్తూ/ ఆమె చేతి అన్నం తింటూ/ రక్త మాంసాలుగా ఎదిగి/ ఆడతనమునే నుంచే/ నీచ రూపమే భూమికి భారము నీ ఉనికి/ జన్మ క్షేత్రాన్ని చిద్రం చేసే/ పేరులేని మృగాల పైశాచిక ఆనందాన్ని
అనుభవిస్తూంటే/ గుండె పగిలి విస్తు పోయే వుడమి తల్లీ" అంటారు.

"మగువ జీవితం " అనే కవితలో "ఎలా? చెప్పను/ నా వ్యధ/ ఇరుగుపొరుగు ,సహోద్యోగులు లైంగిక వేధింపులు ../
మానవత్వం లేని పోకడలు రాక్షసత్వం తో/ మద్యం మత్తులో అత్యాచారాలు/ ఏమరుపాటు లో కామాంధుల కాటుకు గురి అవుతానేమోనని/ క్షణ క్షణం భయం భయం ఎలా బతకను?" అంటారు మరింగంటి పద్మావతి, భద్రాచలం నుండి.

ఓ మగతనపు ఆకారమా నీ వునికి చేటు...
"ఖబడ్దార్ " అనే కవితలో "దుర్వాంఛా విత్తనాలను పోగేసుకుంటూ/
కోరికల గుర్రాలపై స్వారీ చేసే దుర్మార్గం నీదైతే/
యమపురికి మార్గంచూపే/అగ్గితెగువే లలన" అంటారు సోంపాక సీత, భద్రాచలం నుండి.

"పౌరుషాంగం విచ్ఛన్నం చెయ్యాలి " అంటారు ముక్కెర సంపత్ కుమార్.

క్షమించండి. శీర్షిక లేదు!
"వాడుపరిచితుడో అపరిచితుడో ఎవరైతేనేం?/
ఇంటనో బైటనో ఎక్కడైతేనేం?/
పెద్దరికం మారణాంగాలతో వెంటపడుతున్నది/
పసిపిల్లల చుట్టూ/
కంచెలు వేసుకోవాల్సిన కాలం దాపురించింది" అంటారు అరణ్య కృష్ణ.

"దొంగ సన్యాసి వచ్చి సీతనెత్తుకెళ్ళాడు/ ఇప్పుడైతే అత్యాచారం చేసి హత్యాచారం పాటించే వాడేమో" అంటారు "సూర్యరసం" కవితలో రావి రంగారావు.
"అత్యాచారమనే పదమే అంతమవ్వాలి
స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ
మాతృశాసనం రాయాలి" అంటారు లేళ్ళశ్రీదేవి అనే కవయిత్రి "మాతృశాసనం" అనే కవితలో చెన్నై నుండి.
ఫెమినిస్టు కవయిత్రులకు పురుషాధిక్య సమాజంపై కసి కోపం ఎక్కువైంది. కసి కోపంతో కాస్ట్రేషన్ కోరితే సరిపోదు. అందులో కవిత్వం లేకపోతే ఎట్లా అంటాడు ఒక కవి విమర్శకుడు. అయితే బాధను, నొప్పిని, అవమానాన్ని, సైద్ధాంతికరించడం, కవిత్వ పరిధిలోని సభ్య భాషలోనే మాట్లాడలనడం సమస్యను పక్కదోవ పట్టించే పలాయన వాదం (ఎస్కేపిజం)అంటాను నేను.

నిర్భయ సంఘటన తర్వాత ముంబైలో "విజువలైజ్ ముంబై" అనీ, ఢిల్లీ యూనివర్సిటీలో గోడల మీద ఒక కిలోమీటర్ పొడవున "డిజైన్ చేంజ్" అంటూ మార్పునకు రూపకల్పన చేద్దాం అనే పేరుతో 500 మంది చిత్రకారులు తమ కుంచెలకు పని చెప్తూ హత్యాచారాల చిత్రించారు. దీనిని టాటా హౌసింగ్ బ్రాండ్ ప్రమోషన్స్ లిమిటెడ్ కంపెనీ నిర్వహించింది.

అత్యాచారాలను మానవ సమస్యగా సామాజిక సమస్యగా గుర్తించకుండా కేవలం స్త్రీల సమస్యగా భావించినన్నాళ్ళు. అవి ఆగవు కొనసాగుతూనే ఉంటాయి.

***(())****

జ్వలిత, హైదరాబాద్.
మొబైల్- 9989198943
jwalitha2020@gmail.com
5/1/20


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష