"మూలమలుపు" సమీక్ష

 'మూలమలుపు'లో బతుకు చిత్రాల కవిత్వం.


సాహితీలోకంలో ఏనుగు నరసింహా రెడ్డి గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో.
తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి కాక ముందు నుండే ఒక కవిగా సుపరిచితులే. చిన్న పత్రిక నుండి అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికల వరకు , అన్ని పత్రికల్లోనూ వారి కవిత్వానికి ఎందరో పాఠకులు ఉన్నారు.
దాదాపు నాలుగు దశాబ్దాలుగా రచనా వ్యాసంగంలో అనేక ప్రక్రియల్లో వారు రచనలు చేస్తున్నారు. ఆంధ్రప్రభలో 2016 నుండి అప్రతిహతంగా ప్రతి వారం రాసే రూబాయిలు వారి సాహితీ వ్యవసాయానికి నిదర్శనం.
"పుస్తకాలు లేని ఇల్లు ఎడారి" అని చెప్పే ఈ కవి , తనను కలిసిన అందరికీ పుస్తకాలను జ్ఞాపికలుగా అందిస్తూ అక్షర సేద్యానికి విత్తనాలను పంచుతారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మూసీతీరంలోని కల్లోనికుంటలో జన్మించి, నల్గొండ జిల్లా చిట్యాలలో పెరిగిన వీరి ప్రతి అక్షరంలోతెలంగాణ భాషాసౌందర్యం తొణికిసలాడుతుంది.
"అంతరంగం" అనే వీరి ఆధునిక కవిత్వ విమర్శ గ్రంథంలో ఇరవై ఆరు వ్యాసాలున్నాయి. వారి సునిశిత పరిశీలన , సున్నితమైన విమర్శకు అద్దంపడుతుంది ఈ "అంతరంగం"అనే పుస్తకం.

ఈమధ్య ఏమలుపులో విన్నా , ఏ పత్రికలో చూచినా ఒక పుస్తకం మీద చర్చే వినపడుతుంది , కనపడుతుంది. అదే"మూలమలుపు" అనే కవితా సంపుటి. అరవై రెండు కవితల సమాహారమైన ఈ సంపుటికి తెలంగాణ అకాడమీ అధ్యక్షులు నందిని సిద్దారెడ్డిగారు , కాళోజీ అవార్డు గ్రహీత అమ్మంగి వేణుగోపాల్ గారు ముందుమాటలు రాసారు.

ఇందులో నాకు బాగా నచ్చిన కవిత "గూట్లో దీపం". పొద్దు పోక ముందే /గూట్లో దీపం పెట్టడం మంచిది/ హుషారుగా ఉన్నప్పుడే/ పిట్ట ఎగిరిపోవడం ఉత్తమం,
ఒకరికి పెట్టావని ఒకరు/ మాటల తూటాలు పేలుస్తారు/ వీళ్ళ పాల కోసమే తిన్న రోజుల్ని/ వీళ్ళ మురిపాల కోసమే నవ్విన గడియల్ని/ ఇప్పుడెలాగూ చెప్పలేను/ ఈ కన్నాల మాటలు/ వీళ్ళ కన్నాల భవిష్యత్ వాక్యాలు / కాకూడదనే తలపోస్తాను/
ఎవరు ఈ లోకానికి ఎక్కువకాలం అక్కర్లేదు/ అందుకే పొద్దు పోక ముందే /గూట్లో దీపం పెట్టడం మంచిది" అంటారు. పెద్దలకు జరుగుతున్న దానికి బాధపడుతున్నా , పిల్లలకు తమ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలో చెప్తారు కవి.


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడిన 31 జిల్లాలను తలపోస్తూ చెప్పిన కవిత "ముప్పయొక్క దీపాలు" దీపాలు కదా / అంటించిన కొద్దీ /విస్తరిస్తూ పోయినై/వెలుగుల మీదున్న ప్రేమకు / మట్టి బహువిధ రూప/ విన్యాసాలకు కేరింతలే/ అయితే దీపావళి నాడున్న శ్రద్ధ /ఎప్పుడూ కావాలి / 31 దీపాలు/ దివ్యంగా వెలిగేట్లు చూడాలె
అంటారు నిజమే పోటీపడి మరీ మాకొక జిల్లా మాకూ ఒకజిల్లా అంటూ ఎగబడ్డ వారంతా ఆప్రాంతాల అభివృద్ధికి అంతే నిజాయితీగా పనిచెయ్యాలి మరి.

"గాయపడ్డాకే" అనే కవితలో
'కనిపించని యుద్ధరంగంలో/ వినిపించని బాంబుల మోత/ అదృశ్యంగా ఆయుధాలు/ సదృశ్యంగా తేనె పలుకులు/ ప్రకటించే నీతుల మధ్య /బయటపడని ఎజెండాల నడుమ / అన్ని చురకత్తుల్ని/ తప్పించుకోవాలనుకుంటాను/ గాయపడకుండా/ ఉండాలనుకుంటాను/ చివరికి గాయపడ్డాకే ఇల్లు చేరుకుంటాను'
ఔను ఈ అనుభవం నాది కూడా. నాదేకాదు ముసుగుల్లేని మనుషులందరిదీ ఇదే పరిస్థితి.

"అమీబా" అనేక కవితలో
'శత్రువు అమీబా / వాదం ఒక వాహిక / లక్ష్యం ఇప్పట్లో అర్థం కాదు/ మనకు అంతా అర్థమయ్యేసరికి/ రెండ శిబిరాలు వాళ్ళవే"
ఎవరు శత్రువో ఎవరు మిత్రడో గుర్తించలేని స్థితి. రాజకీయ పార్టీలదే కాదు ప్రజాఉద్యమాల్లో కూడా కప్పగంతులే చూస్తూన్నాం.

"నాన్న" అనే కవితలో అద్భుతమైన వాక్యాలు రాశారు చూడండి "సమస్త విశ్వమూ/ శత్రుశిబిరమై తలపడ్డప్పుడూ/ నాన్న ఒక్కడే తోడై/ ముందుకు నడిపిస్తాడు/ దీపం నుండి / దీపం ప్రభవించినట్లు/ పిల్లలకూ/ నాన్న తన ఔదార్యాన్ని అందిస్తాడు"
నాన్నంటే అదే కదా. ఏంటో కొందరు నాన్నలు కిరాతకుల్లా మారుతున్నారు.
సరళమైన భాషలో ఎటువంటి శ్లేషలు లేకుండా చిక్కటి కవిత్వాన్ని చదవాలంటే ఏనుగు నరసింహారెడ్డిగారి కవితల వైపు మళ్ళాలిసిందే.
"పాంచ్ తారాభవన్', నీతుల ఎడారులు' వంటి కొత్తపద ప్రయోగాలు బాగున్నాయి.
ఈ మూలమలపులో నులివెచ్చని చలిలో నెగళ్ళను ఎగదోసే పండువెన్నల వంటి కవిత్వం ఉండదు కానీ, ప్రాణం ఉనికిని చాటే బాలసూరన్న లేలేత కిరణాల బతుకు చిత్రాలుంటాయి. చదవండి మీరు కూడా.
రెడ్డన్న మరింత విస్తృతంగా సాహిత్య సేద్యం చెయ్యాలని కోరుకుంటూ....


జ్వలిత
9989198943
14/2/2020

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష