వలయం

 

                   "వలయం"(కథ)
రచన: జ్వలిత- 9989198943

"ఎందుకంత నిష్ఠూరం? ఎందుకంత కాఠిన్యం?
ఎందుకంత రౌద్రం ? ఎందుకా కఠోర వాక్కులు? ఎందుకా చూపుల్లో కోపం? ఎందుకు? ఎందుకు?
మనిషివి కదా! నీకు ఒక మనసు ఉండాలి కదా! దుఃఖం దయ జాలి అంటే తెలుసా నీకు ?
ఒక లోహం వలె ఉంటావెందుకు? కాదు కాదు లోహం కనీసం వేడి చేస్తే కరుగుతుంది, ఏదో ఒక స్థాయిలో.. రాయిలా అనడం సరి కాదు. అది కూడా నీకు సరైన పోలిక కాదు. శిల పగిలి ముక్కలవుతుంది. శిల కూడా కరుగుతుంది, అరుగుతుంది. సుత్తి దెబ్బలకు, ఉలి మొనల తాకిడికి ఆకారం మార్చుకొని శిల్పం అవుతుంది.
నువ్వేంటీ ? నువ్వేంటి ఇంత కఠినం ? ఇంత నిష్టూరం , రౌద్రం. ఒక విషయం చెప్పు. అసలు కోపం ఎందుకు నీకైనా తెలుస్తుందా? నువ్వు ఎంత క్రూరమో నువ్వెంత నిష్టూరమో? కత్తివేటు కంటే పదునైనది కదా కఠోరమైన వాక్యం. గుండె లోతుల్లోకి దిగి మనోవేదనను కలిగిస్తుంది తెలుసా".

"నన్నేమి అడగకు, నేనేమి చెప్పను. నీ కెందుకు? అసలు నేను నీకెందుకు చెప్పాలి ? నేనింతే, నేను ఇలానే ఉంటా".

"అదే ఎందుకు అట్లా ఉంటావు? అది నీకు సుఖంగా ఉందా ? ఈ కాఠిన్యం నీకు సౌకర్యంగా ఉందా? ఆ నిష్ఠూరాలు,.నీకు మనశ్శాంతిని ఇవ్వగలవా? చెప్పు నాకు".

"ఏమిటీ నీకు చెప్పేది?"

"సరే ఏదీ చెప్పవద్దు. వదిలేయ్. ఒక్కసారిగా కాకపోయినా కొంచెం కొంచెం ప్రయత్నించు".

"ఏయ్.. నీకు పిచ్చి పట్టిందా కోపాన్ని కొంచెంకొంచెంగా వదలడం ఏమిటి ? తాగుబోతుని మద్యం తాగడం, కొంచెం కొంచెం తగ్గించు అని చెప్పినట్టు చెప్తున్నావు. అసలు నీకేమి తెలుసు నాకు కోపం ఎందుకో ? నేను ఎందుకు ఇంత కఠినమైనానో ?"
"ఎట్లా తెలుస్తుందీ. నాకు తెలియదనే చెప్పమని అడుగుతున్నా. ఎందుకు కోపం"?

"నీకు నా కోపం తెలుస్తుంది. కానీ, దానికి కారణం తెలియట్లేదా? తెలిసీ తెలియనట్లు నటిస్తూన్నావా? తెలియకుండా ఎట్లా ఉంటది. అబద్దం చెప్తున్నావు నువ్వు. అవును నువ్వు అబద్ధం చెపుతున్నావు. అబద్ధం అబద్ధం అందుకే కోపం నాకు".

"ఆగాగు ఆగు, అట్లా లేచి వెళ్లి పోకు. కూర్చో నేను అడిగేది అబద్ధం కాదు. నిజమే అడుగుతున్నా. నీ కోపానికి కారణం, నిజంగా నాకు తెలియదు. ఇప్పుడేగా చెప్పావు అబద్ధం అంటే నీకు కోపం అని. కోపానికి కారణం 'అబద్ధం' అంతేగా! ఎవరు చెప్పారు అబద్ధం? ఏ అబద్ధం నీ కోపానికి కారణం?"

"తమాషాగా ఉందా నీకు. అబద్ధం ఒక్కటేనా! మొత్తం మోసం, దగా, దోపిడి వీటన్నిటికీ మూలం అబద్ధమే కదా! ఏ అబద్ధం అంటావేమిటి, ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు"

"అదే ఏ మోసం గురించి కోపం నీకు".

"అదేంటి ? ఏ మోసమైన అబద్ధం ఆధారంగా జరిగేదే కదా!"
" గజిబిజిగా గందరగోళంగా మాట్లాడకు. నీ సమస్య ఏమిటో, నీకు స్పష్టంగా తెలియకపోతే పరిష్కారం ఎలా దొరుకుతుంది? రోగ లక్షణాలు తెలిస్తే కదా, ఏ రోగమని నిర్ధారించేది. ఏ రోగమో గుర్తించిన తరువాత కదా, ఏ మందు నీ బాధను నివారించగలదో, ఏ మందు నీకు ఉపశమనాన్ని కలిగించగలదో? తెలిసేది. అవునా! కాదా!"

"అవునవును ఇలాంటి కల్లబొల్లి కబుర్లతోనే కదా. మనుషులను ఏ మార్చేది. నేను కోపం అంటున్నాను. నువ్వు రోగం అంటున్నావు అర్థం కానిది ఎవరికీ..".

"అవును నేను అదే చెబుతున్నాను కోపం వంటి రోగం, రోగం వంటి కోపం, కోపం కూడా ఒక రకమైన రోగం అనీ, అర్థం చేసుకో మంటున్నాను".

"కోపం రోగం ఎట్లా అవుతుంది. విశ్వామిత్రుడికి వచ్చింది కోపమే కదా, ప్రతి సృష్టి చేసేందుకు కారణం అయింది కదా. రాముడికి వచ్చింది కోపం కాదా సీత పవిత్రతను లోకానికి చాటేందుకు అగ్ని పరీక్ష అయ్యింది. పరశురాముడిది కోపమే కదా, భర్త ఆజ్ఞను పాటిస్తూ రాయిగా మారిన అనసూయ నిరసన కోపం కాదా, రైలు నుండి గెంటి వేయబడ్డ గాంధీజీది కోపమే కదా. గోండు వీరుడు కొమురం భీమ్ ది కోపమే కదా. ఎన్ని చెప్పను.. అసలు కోపం లేని వాడు మనిషి ఎట్లా అవుతాడు, బురద పాము కానీ".
"అయితే నీ కోపం ధర్మాగ్రహం అంటావు, ఏ ధర్మం కోసం నీ ఆగ్రహం".
" నాకు తెలుసు మీరు ఇలానే మాట్లాడుతారు. ధర్మార్థాలు కామమోక్షాలు అంటూ, తియ్యగా తెలియలనివి మాట్లాడుతూ ఆశలు కల్పిస్తారు . తరువాత లొంగ తీసుకుంటారు. నమ్మించి మోసం చేస్తారు. నువ్వు అబద్దం. నీవు మాట్లాడేది అబద్ధం. అందుకే కోపం".
" మీరు ఇట్లానే మాట్లాడుతారు అంటున్నావు. మీరు అంటున్నావు. ఎవరెవరు ? ఇక్కడ ఉన్నది ఒక్కటే కంఠం. దానితో మరెవ్వరూ లేరు".

"కాదు మీరంతా అంతే. ఒక్కరు గా మాట్లాడుతూ సమూహంగా దాడి చేస్తారు. సర్వ నాశనం చేస్తారు".

"ఎవరు చెప్పారు నీకు ఒక్కరిగా మాట్లాడి, సమూహంగా ద్రోహం చేస్తారని".
" ఎవరో చెప్పేది ఏమిటి. అనాదిగా అదే జరిగేది. ఇది అదే కదా, ఇందులో నేనే మొదలు కాదు. నేనే చివర కాదు. అంతే అదే జరుగుతుంది".

" సరే నువ్వు మొదలు కాదు, నువ్వు చివర కాదు అని ఎరుక తెలిసినప్పుడు ఇంకా కోపం ఎందుకు".
"ఎందుకు ఏమిటి? మిమ్మల్ని నియంత్రించలేక నిరోధించ లేక కోపం".
"ఆగు ఆగు నియంత్రించ లేకపోతే.. అంగీకరిస్తే సమసిపోతది కదా. సమస్య ఉండనే ఉండదు".

"ఏమిటి అంగీకరించేది ? ఏమిటది సమసి పోయేది? కాకమ్మ కబుర్లు చెప్తున్నావా"?
"కాదు నిజంగా జరిగే సత్యాన్ని గురించే
చెప్తున్నా, నియంత్రించలేక పోతున్నావు అంటే, నిస్సహాయుడవు బలహీనుడు అనే కదా అర్థం"

"ఓహో నీకలా అర్థమైందా! ప్రవాహ వేగం తోపిడీకి ఎదురు నిలవక, తలవంచిన గడ్డిపోచది బలహీనత కాదు. సమయస్ఫూర్తి. ప్రవాహం వత్తిడి తగ్గే వరకు తల వంచి, తరువాత తలెత్తుతుంది. అదీ దాని అస్తిత్వం".
" సరే అంగీకరిస్తాను గడ్డిపోచను. మరి నీకు అస్తిత్వం, సమయస్ఫూర్తి లేవా"?

"ఉన్నాయి, నాకు ఉండేవి నాకూ ఉన్నాయి. కానీ కాల ప్రవాహాన్ని నిత్యం ఉద్ధృతంగా మార్చే మీరు మోసకారులు. నిత్య బలోన్నతులు, శక్తివంతులు".
"మరి అది అంగీకరిస్తే కోపం ఉండదు కదా. నీకు తెలిసిన నిజాన్ని కూడా అబద్ధంగా ఎందుకు భ్రమ పడుతున్నావు. నేనే బలవంతుడిని అని, నీ అస్తిత్వాన్ని చాటుకో. కోపం ఎందుకు".

"నాది దేహబలం, మీది మనోబలం. ప్రతీసారి ఓడిస్తారు. ఓడించేందుకు బుద్ధిబలంతో పన్నాగాలు చేస్తారు"
"ఏదో ఒకటి, ఓడిపోయానని ఒప్పుకో. ఇంకా కోపం ఎందుకు".

"ఒక్కసారి ఓడిపోయి చూడండి. దాని ఎద కోత ఏమిటో,? అవమాన భారమేమిటో?అర్థమవుతుంది".
"అహహ్హహ్హహ... నిత్య తిరస్కృతులం కదా మేము. సకల అవమాన సంపన్నులమూ మేమే కదా! నిత్య ఓటములు మావే కదా".

" ఓడినట్టు నటిస్తారు, అవమానంతో దుఃఖస్తారు, సానుభూతిని పొందుతారు . అంతా దగా ఓడినా గెలిచినా నా మీదే పైచేయి".
"ఎక్కడ పైచేయీ? నీ కోపంతో దహిస్తూన్న కఠోర మనస్కుడా! నీ మాటలు కత్తి వేట్లు, శూలపు పోట్లు, ఏ క్షణానికి ఆ క్షణం మరణిస్తూ, మళ్లీ నీ ఉనికిని ప్రేమిస్తాము. ప్రేమే మా బలం".

"ఔనౌను ఆ ప్రేమ పేరు చెప్పి, లొంగ తీసుకుంటారు. కులం పేరుతో నరికి వేస్తారు. మతం పేరుతో మంట పెడతారు".
" మళ్లీ మీరు అంటున్నావు. ఇక్కడ ఉన్నది, ఏక కంఠమే కదా! నిన్ను ప్రశ్నిస్తున్నది".

"అదే నేనూ చెప్తున్నా మీ చేతుల్లో మారణాయుధాలు ఉండవు. ప్రశ్నలతో మాపై నిత్యం యుద్ధం చేస్తారు. అందుకే.. అందుకే..".
"ఆహాం..ఆహా.. అందుకే... పూర్తి చెయ్యీ. అందుకే భయమా...?

"హే నాకు భయం ఏమిటి ? నేను పురుషుడిని. నాకు పౌరుషమే ముఖ్యం. అవునా పౌరుషం ఉన్న వాళ్లకు భయం ఉండదని నీ ఉద్దేశ్యమా"?
" పౌరుషం వీర లక్షణం. రోషం మీసం లేకపోతే మగవాడే కాదు"
"ఓహో నీకున్న ఒకే ఒక్క అర్హత మగవాడినన్న అహంకారమా"!

"ఏయ్.. ఏం మాట్లాడుతున్నావు? మగవాడికి ఆ మాత్రం అహంకారం ఉండాలి".
"అహంకారం అనర్ధదాయకం, అహంకారం పతనానికి హేతువు".
" అదిగో మళ్లీ నీతి బోధలు మొదలుపెట్టావు. అందుకే నాకు కోపం".

"అదేమిటి ? ఇందాక అబద్ధం అంటే కోపం అన్నావు. ఇప్పుడు నిజాలు చెప్పినా కోపం అంటున్నావు. ఏది నిజం ? నీకు అబద్ధం అంటే కోపమా? నిజం అంటే కోపమా"?
"ఏ నిజం నువ్వు చెబుతున్నావు"?
"అదే నీకు అహంకారం ఎక్కువ. మగవాడిననే ముసుగులో అనేక అకృత్యాలను కొనసాగిస్తున్నావు. నువ్వొక పిరికివాడివి".

"కాదు నేను పిరికి వాడిని కాదు. కానీ ఎందుకు మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఆనందంగా అందంగా ఉండాలని అనుకుంటారు".
"అహ్హహ్హ... మా నవ్వు నచ్చడం లేదా? మా ఆనందం చూస్తే నీకు అసూయ కదా! నీ మనసు నిండా ఈర్ష్య కుళ్ళు ఉంది దాన్ని వదిలేయ్. ఆనందం చాలా అందంగా ఉంటుంది".
"అవునవును, ఆ ఆనంద సౌందర్యంతో ఆకర్షిస్తారు, నమ్మిస్తారు, లొంగ తీసుకుంటారు".

"ఆనందం అంటేనే అందం. ఎవరికీ హాని కలిగించని ఆనందమే నిజమైన సౌందర్యం. అదే విశ్వ ప్రేమకు ఆధారం. అందరూ కాంక్షించేది ఆ అందాన్నే, ఆనందాన్నే. దాన్ని నువ్వు అంగీకరించడం లేదు".
"కాదు కాదు అందం అంటే నాకూ ఇష్టమే".

"కానీ నువ్వు ఆ ఆనందాన్ని అంగీకరించడం లేదు. ఆనందం అంటే ఇచ్చిపుచ్చుకునేది. బలవంతంగా గుంజుకునేది కాదు".
"అనవసరంగా నన్ను చెడ్డవాడినని ప్రచారం చేసే ప్రయత్నం నీది".

"ఆగు నేను చెప్పేది విను. ఎప్పుడూ చెప్పడమేనా? వినడం ఎప్పుడు నేర్చుకుంటావు.
ఆనందాన్ని బలవంతంగా అనుభవించాలను కుంటున్నావు. అందుకే నువ్వు అందాన్ని నలిపేస్తున్నావు. ఆనందాన్ని కాలరాస్తున్నావు. హత్యలు చేస్తున్నావు. అత్యాచారాలు చేస్తూ ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నావు. నీ దుష్ట మార్గాలను ఇతరులు అనుసరించేలా చేస్తూన్నావు. బాధితులను కూడా నేరంలో భాగస్వామ్యం చేస్తూన్నావు. నీలో ఉన్న అసూయను వదలివేయి. సుందర సౌందర్య సౌదామినీ సుగంధాలు నీ ముందు నిలిచి ఆహ్లాదంగా ఆహ్వానిస్తాయి".

" అందుకే నాకు కోపం, నా కఠినత్వం కూడా. మాట్లాడనిస్తే చాలు, మీ మాటలు వింటే చాలు, ఏవేవో చెప్పి నిగ్గదీస్తారు. నిరూపిస్తారు, నీతులు సూక్తులు చెప్పి లొంగ తీసుకుంటారు. మెతక తనం నింపి, ఎదురు మాట్లాడకుండా చేస్తారు".

"ఆగవయ్యా ఆగు, ఎవరు ఎవరిని లొంగ తీసుకుంటారు".
" మీరే ఒక్కరుగా కనిపించే ఒక సమూహం".
" అది నీ భ్రమ. ఇక్కడ ఉన్నది ఏక కంఠం".

"నేను చెప్పేది కూడా అదే, భ్రమలు కల్పిస్తారు అశలు పుట్టిస్తున్నారు. నట్టేట ముంచుతున్నారు. ఇదే నిజం".
"ఏది నిజం? ప్రకృతి వంటి స్వచ్ఛమైన సత్యాలు చూపిస్తున్నా. నేనెక్కడ భ్రమలు కలిగిస్తున్నా" !. "నేను అనేది అదే, సత్యాలు నిత్యాలు అంటూ రంగుల బ్రమలు ఇవన్నీ".
"కాదు చీకటి రంగు నిజం, సూర్యుని వెలుతురు నిజం, నీలో మనిషి నిజం, దాన్ని నువ్వు చంపుతున్నది నిజం, నీ అహంకారం నిజం, స్వార్ధపు ఆలోచన పాపం అన్నది నిజం".

"అయిపోయింది అంతా అయిపోయింది. ఎంత కోపం చూపినా, ఎంత కఠినంగా ఉన్నా! ఎంత భారాన్ని మోస్తున్నా! ఎంతగా నటిస్తున్నా! నన్ను నగ్న పరిచావు. అయిపోయింది, ఇంకేమున్నది"?
" ఆగాగు ఏమి అయిపోయింది ఎందుకు అంత విచారం".
" విచారం కాక మరేమిటి ? అనాదిగా మగాడిగా ఉన్న నన్ను మనిషినని గుర్తుచేసి చంపేసావు".

" చంపడం నా పని కాదు. బతకుకు సార్థకత ఇవ్వడం కోసం బతికించడం నా పని".
"సరేలే నువ్వే చంపి, చంపేసిన నువ్వే మళ్ళీ బతికిస్తున్నావు, బతుకును ఇస్తున్నావు".
".............".

"ఇంతకూ నువ్వెవరు"?
"ఇంతసేపు ఎవరు అనుకొని మాట్లాడావు"? "నేనెక్కడ మాట్లాడాను. నువ్వే మాట్లాడించావు, పోయే వాడిని ఆపి మరీ, కూర్చోబెట్టి నన్ను మాటల్లో పెట్టావు".

" సరే నేను ఎవరనుకొని ఇంతసేపు మాట్లాడావు. నీకు నీ మాటలు వినే వాళ్ళు కావాలి. నీతో మాట్లాడే వాళ్ళు కావాలి, అంతే కదా"!
" సరేలే ఇంతకూ ఎవరు నువ్వు. నా కోపానివా? అబద్ధానివా ? మోసానివా? ఎవరివి నువ్వు"?

" ఎవరనుకున్నావు ఇప్పుడు కోపంగా లేవు కదా నీ మాట సౌమ్యంగా ఉంది. నీ చూపు శాంతంగా ఉంది. అంటే నీ కోపానికి కారణమైన అబద్ధం అబద్ధమని తెలుసుకున్నావు కదా"!
" నిజమే నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది".

"ఏదీ ఒక్కసారి దగ్గరకు రా! నన్ను స్పర్శించి, నన్ను దహిస్తూన్న ఈ అగ్నిని చల్లార్చు"
"మళ్లీ అగ్ని ఎక్కడిది ? ఉదరాగ్నా? కామాగ్నా? దుంఖాగ్నా? నా స్పర్శతో ఏ అగ్ని చల్లారుతుంది".

" లేదు లేదు నాలో అగ్ని లేదిప్పుడు. శవమంత శీతలంగా ఉన్నాను. నీవూ నాకు ఉష్ణాన్ని ఇవ్వాలి. రా నా దగ్గరకు రా, ఇంకా ఇంకా దగ్గరకు".
"చూడు వచ్చాను చూడు".
" ఏది నాకు కనిపించడం లేదు్ ఎక్కడ నీ స్పర్శ నా చేతికి అందడం లేదు".
" గుడ్డివాడివా కనిపించకపోవడానికి".

"కాదు కాదు నన్ను మోసం చేయకు. నువ్వు నాకు కావాలి".
" నేనెప్పుడూ వదిలి పోయాను. నీ తోనే, నీ లోనే ఉన్నాను. నీ ప్రాణాగ్నిని నేనే. నీ అహంకార భస్మాన్ని రాశిగా పోశాను. చూడు, కళ్లు తెరువు".

" అయ్యో నాకేమీ కనిపించడం లేదు. నేను నిన్ను చూడాలి. నువ్వు నాకు కావాలి".
"మనోనేత్రంతో చూడు. ప్రేమ హృదయంతో చూడు".
"కాదు కాదు నువ్వు నాకు కావాలి. అబద్ధం చెప్పకు".
"నేను నీ లోనే ఉన్నాను. కళ్లు తెరువు".

"ఎక్కడున్నావు నువ్వు? ఇదిగో కళ్ళు తెరిచాను. నువ్వు కనిపించడం లేదు".
" సరే నేను కనిపించడం లేదు. ఏమి కనిపిస్తున్నాయి".

"చెట్టు పిట్ట కొండ కోన వాగు వంక అన్ని సజీవంగా పచ్చగా వెచ్చగా. నవ్వులు పువ్వులు తెల్లగా. సూర్యుని వెంట ఛాయా, చంద్రుని పక్కన తారా...".
"ఆగాగు కవిత్వం చెబుతున్నావా"?

"మళ్లీ నీవు మాయ చేస్తున్నావు. నన్ను ఏమారుస్తున్నావు. నాకు నువ్వు కనిపించడం లేదు".
"పోనీ వినిపిస్తున్నానా"?

"లేదే ఈ పిట్ట అరుపు నువ్వేనా? జింక గెంతు నువ్వేనా? ఆ పువ్వు, తుమ్మెద, ఆ సెలయేరు - చిట్టి చేపలు, తాబేలు - మొసళ్ళు, పులి - మేక, బుజ్జి కోడి - నల్లమేక, ఇసుకలో ఆడుతున్న పిల్లలు, ముసలి ధంపతుల సహజీవనం, వృద్ధ తల్లిదండ్రులను సేవచేస్తూన్న సంతానం, బాధతులను ఓదారుస్తూన్న మానవత్వం,
గంతులు వేస్తున్న దూడలు, అరే ఇంత అందంగా ఉన్నాయి. అన్నింటిలో నువ్వే కనిపిస్తున్నావు. ప్రతి శబ్దంలో నీ ప్రేమ ధ్వనిస్తుంది.
నిజమే నాకు కోపం లేదు. దుఃఖం లేదు. కులం లేదు. మతం లేదు. ప్రాంతం లేదు. వర్ణం లేదు వర్గం లేదు. నేనన్నది అబద్ధం. "నేను" అన్నది అబద్ధం".
" అవును నువ్వు అనుకున్నది అబద్ధం. సకలైక ప్రేమ నిజం, వసుదైక కుటుంబం నిజం. ప్రేమ ఒక్కటే నిజం".
" ఇక వెళ్ళు"
"ఎక్కడికీ వెళ్ళేది. బయట కరోనా తరుముతూ ఉన్నది. ప్రేమ గీమా జాన్తా నై, మృత్యు కౌగిలి ఆహ్వానిస్తున్నది, ఇల్లే స్వర్గం ప్రేమే మైకం"

"ప్లీజ్ మేడం, మీరే ఏదైనా చెయ్యాలి మేడం. మీకు రెస్పాన్స్ లేదా మేడం" టీవీ లో సినిమా డైలాగ్ మోగుతోంది.
"ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బాలసుబ్రమణ్యం" అన్నాడు కసిగా కోపంగా గట్టిగా నానీ వాళ్ళ నానమ్మ పక్కన నిలబడి. ఆమెకు కళ్ళు కనపడవు. టీవీ పెద్ద సౌండ్ పెట్టుకొని వింటుంది.
"ఒరేయ్ నాని ఆయన వార్తలు చదివే వాడు కాదు రా. గంధర్వ గాయకుడు ఇప్పుడే చచ్చిపోయాడు పాపం. పాటలో బతికి పోయాడు. వార్తలు చదవడు".

"ఆగవే నాయనమ్మ. ఈ కథ రేపు ఆన్లైన్లో సబ్మిట్ చెయ్యాలి. టీవీ సౌండ్ తగ్గించు, లేదంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకో"
*** *** ***

వలభోజు జ్యోతిగారికి నమస్కారం.
కథా కేళి కోసం జ్వలిత అనే నేను "వలయం" అనే కథను సహకార పథ్థతిలో ప్రచురించుటకు పంపుతున్నాను.
ఈ కథ నా స్వీయ రచన. మరే రచనకు అనువాదం కాదు , అనుసరణ , అనుకరణ కాదు.
ఏ పోటీలకు మరే పత్రికలకు ప్రచురణలకు. హామీ ఇస్తూ ఉన్నాను.

ధన్యవాదాలు
జ్వలిత
సాహితీవనం, 15-21-130/2, బాలాజీనగర్, కుకట్పల్లి, హైదరాబాద్- 500072. తెలంగాణ.
మొబైల్: +919989198943,

Email : jwalitha2020@gmail.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష