నేను మలాలా 5

 నాయకత్వానికి అర్హత వయసు కాదని చాటిన "నేను మలాల"

--పరిశీలన :జ్వలిత-9989198943

"నాకు చదువుకునే హక్కు ఉంది, నాకు ఆటలాడుకునే హక్కు ఉంది, నాకు మాట్లాడే హక్కు ఉంది" అంటూ కవితలు రాసి, కూనిరాగాలు తీసిన మలాలా 1997 జూలై 12న జన్మించింది. ఆమె పాకిస్తాన్ స్వాత్ జిల్లాలోని ఖైబర్ ఫక్తూన్ ఖాహ్ ప్రాంతంలో యూసుఫ్ జాయ్ అనే ఆదివాసీ తెగకు చెందినది. ఆమె తండ్రి జియావుద్దీన్ అభ్యుదయ భావాలు కలవాడు. తాలిబాన్ల చాందస నిరంకుశ నిబంధనలకు వ్యతిరేకంగా మలాలా మనసులో చైతన్య బీజాలను నాటి, బుద్ధుడు ఏసుక్రీస్తు మహమ్మద్ ప్రవక్తల బోధనలను అర్థం చేసుకునే స్వేచ్ఛను ఆమెకు కలిగించాడు.

"నేను మలాలా" అనే పుస్తకం శాంతి నోబెల్ బహుమతి పొందిన ఒక అమ్మాయి కథ. అమ్మాయిలు చదువుకోవాలనే ఆకాంక్షతో తాలిబన్ల ఆజ్ఞను దిక్కరించి, తీవ్రవాద దాడిని ఎదుర్కొన్న సాహస పుత్రిక కథ.
పాకిస్తాన్ కు చెందిన ఒక అమ్మాయి చదువుకోవాలనే తన హక్కును కాపాడుకోవడం కోసం, తాలిబన్ల తుపాకులకు గురైంది. అయినా ధైర్యంగా నిలబడి హాస్పిటల్లో కోమాలో నుండి బయటపడి తన ఆత్మకథను రాసుకుంది. ప్రపంచమంతా ఆమె పక్కన నిలిచింది.

మొదట స్వయంగా "మలాలా యూసఫ్ జాయ్" తన ఆత్మ కథను స్వయంగా "క్రిస్టియన్ ల్యాంబ్" అనే ఆంగ్ల రచయిత సహాయంతో ఆంగ్లంలో "అయామ్ మలాలా" పేరుతో రాసుకుంది.

అయామ్ మలాలా ఆంగ్లంలో 288 పేజీల పుస్తకం. 2013 అక్టోబర్ 8వ తేదీన "యు.కె"లో "వైడెన్ఫీల్డ్ అండ్ నిల్సన్ పబ్లిషర్స్" వారు ప్రచురించగా , దానినే "యు.ఎస్." లో "లిటిల్ బ్రౌన్ అండ్ కంపెనీ" వారు ప్రచురించారు.

నేను ఇప్పుడు పరిచయం చేయబోయే "నేను మలాలా" అనే అనువాద తెలుగు నవల "సలీమా, మహేష్ దుర్గే" రాసిన ప్రతి. దీనిని "నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్" 2014లో ప్రథమ ముద్రణ ప్రచురించింది.
ఈ తెలుగు అనువాదం "మీరా" చేసిన హిందీ అనుసరణకు అనుసృజన అని స్వయంగా తెలుగు అనువాదకులు వివరించారు.

అయితే తెలుగు అనువాదంలో ఎక్కడా కూడా మూల ఆంగ్ల ప్రచురణల ప్రస్తావనలులేవు. హిందీ అనుసరణ తేదీ కానీ, హిందీ అనువాదకుల వివరాలు కానీ, ప్రచురణల ప్రస్తావన కానీ లేవు.
కేవలం హిందీ అనుసృజన "మీరా"అనే పేరు మాత్రం ప్రచురించారు పబ్లిషర్స్. తెలుగు అనువాదకుల బాధ్యత లేదిందులో.

ఇక అసలు కథలోకి వస్తే ఈ పుస్తకం మొత్తం 104 పేజీలు కలిగి ఉంది. ఇందులోఅనువాద కథ మలాలా గురించి మొత్తం వంద పేజీలలోపే. పుస్తకం చివర్న మలాలపై 20 ఫిబ్రవరి 2013న సుప్రసిద్ధ భారతీయ ఉర్దూ కవి "నిదా ఫాజలీ" రాసిన ఉర్దూ గజల్ కు తెలుగు అనువాదం ప్రచురింపబడింది.

అసలు మలాలా ఎవరంటే పాకిస్తాన్ లోని స్వాత్ జిల్లాలో 11 ఏళ్ల అమ్మాయి. 2009లో తాలిబన్లు షరియత్ చట్టం ప్రకారం ఆడపిల్లలు చదువుకోడానికి వీలు లేదని ప్రకటించారు. ఆడపిల్లల ఇంటి నుండి బయటికి రావడం, పరదా లేకుండా తిరగడం తహారీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్(టిటిపి)ప్రతినిధులకు నచ్చలేదు.

తాలిబన్లు 2001 నుండి 2009 మధ్య కాలంలో స్వాత్ లోయలోని అనేక ప్రాంతాలలో 400 పాఠశాలలను నామరూపాలు లేకుండా చేశారు. అందులో 70 శాతం అమ్మాయిల పాఠశాలలే. ఆడపిల్లలు భయపడే వాతావరణాన్ని తాలిబన్లు సృష్టించారు. అనేక నిబంధనలను నిషేధాలను విధించారు ఆ వాతావరణాన్ని బీబీసీ ఉర్దూ శాఖ "గుల్ మకాయ్ డైరీ" పేరున ప్రచురించింది.

తాలిబన్లు విధించిన నిబంధనలు మాలాలా యూసుఫ్ జాయికి అసలు నచ్చలేదు. వారి ఛాందసత్వం దేశాన్ని తిరోగమనం వైపుకు నడుపుతుందనీ, దేశప్రజలకు శాంతి, విద్యకావాలని నమ్మింది. అమ్మాయిలు చదువుకునే హక్కు కోసం పోరాడాలనుకుంది. తనకు మద్దతిచ్చే వారి కోసం ఎదురు చూసింది. ఎవరూ కనిపించ లేదు. తర్వాత ఆమె స్వయంగా ప్రయత్నం మొదలు పెట్టింది.

తాలిబాన్ల రాజ్యం తీవ్రవాదం గురించి ఎవరైనా నా రాస్తారేమో కొండల పై ఉన్న పరిస్థితులను ప్రపంచం ముందు పెడతారేమోనని బిబిసి సంపాదకులు ఎదురుచూస్తున్న సందర్భంలో ఎందరో అమ్మాయిలు ముందుకు వచ్చారు. కానీ తాలిబన్లు హెచ్చరించడంతో ప్రాణభయంతో నోరు మూసుకోక తప్పలేదు వారికి.

ప్రపంచం పై ప్రేమ తాలిబాన్ల పై వ్యతిరేకత నిండిన మలాలా గురించి బి బి సి ఉర్దూ శాఖ తెలుసుకుంది. మలాలా తండ్రి జియావుద్దీన్ యూసుఫ్ జాయి వారిని కలిశారు. తన కూతురు చిన్నపిల్ల అయినా బిబిసి లో ఒక బ్లాగ్ రాయగలదని అవకాశం ఇవ్వమని అడిగాడు.
ఆ విధంగా "గుల్ మకాయి" అనే పేరుతో రాయడం మొదలు పెట్టింది మలాలా. "గుల్ మకాయి" అంటే అర్థం "మొక్కజొన్న పువ్వు". ఈ పేరును బి బి సి ఉర్దూ సర్వీస్ మాజీ పాత్రికేయుడు "అబ్దుల్ హోయీకక్కడ్" సూచించాడు. అతడు స్వాతి లోని అసాధారణ పరిస్థితులను మలాలా డైరీ ద్వారా ప్రపంచానికి చూపించాలి అనుకున్నాడు. ప్రజా కష్టాలను తాలిబాన్ల పెత్తనాన్ని మానవీయ కోణంలో చూపడానికి ఈ డైరీ ఉపయోగపడుతుందని అతడు నమ్మాడు.

తన హోం వర్కులను చేయడానికి కూడా వెనకాడే చిన్నవయసులో, పాఠశాలకు వెళ్ళ లేక పోతున్నామని నిస్సహాయత, కసితో మలాల తన డైరీని రాసింది. స్వాత్ కొండల్లోని మనుషులు ప్రదేశాలు ఇంకా అక్కడి పిల్లల దైన్యాన్ని తెలిపే ఉత్తమ సమాచారాన్ని డైరీగా రాసింది. 2009 జనవరి 3వ తేదీ నుండి 2009 మార్చ్ 12 వరకు ప్రతిరోజు డైరీ రూపంలో అందించింది. ఆ డైరీ చదివిన వారికి "చమత్కారంగా ధైర్యంగా రాజకీయాలకు అతీతంగా రాసిన తీరు" అందరినీ ఆకర్షించింది.

అందులో ఎక్కువ భాగం పాఠశాల చదువు, స్నేహితుల గురించి రాస్తూ, తాలిబాన్లకు సూటిగా సవాల్ విసిరింది. బి బి సి ద్వారా వెలుగుచూసిన ఆ డైరీ పేజీలు పశ్చిమ దేశాల ప్రసార మాధ్యమాలలో అత్యధికంగా చర్చాంశాలుగా మారాయి. ఆమెను "19వ శతాబ్దపు మలాలాయి"గా ప్రపంచానికంతటికీ పరిచయం చేశాయి.

ఆమె తండ్రి జియావుద్దీన్ తనను తాను తీర్చిదిద్దుకునే విధంగా , అనేక అవకాశాలు ఆమెకు కల్పించాడు. అమ్మాయిల స్వరమే వినిపించని ఆ స్వాత్ కొండలపై కేవలం డైరీ రాయడమే కాకుండా, కుటిల నీతులు ప్రదర్శించే వారికి సవాల్ విసురుతూ, టెలివిజన్ లలోనూ తోటి విద్యార్థుల ముందు బహిరంగంగా భయం లేకుండా మాట్లాడేది మలాలా.

నిత్యం శవాలు దర్శనమిచ్చే ప్రదేశంలో, పిల్లలను ఎత్తుకు పోవడం, యాసిడ్ పోయడం, తూటాలతో పేల్చడం చూసినప్పటికీ "నేను మలాల యూసఫ్ జాయిని, నా స్వాత్ కోసం తుది శ్వాస వరకు పోరాడుతాను" అని చెప్పుకుంది మలాలా.

2009 జనవరి 3న ఆమె రాసిన మొదటి డైరీ పేజీలో ఈ విధంగా ఉన్నది.
"నిన్న రాత్రి నేను ఎంతో భయంకరమైన కలగన్నాను. అంటే అందులో హెలికాప్టర్లలో ప్రభుత్వ సైన్యాలు ఇంకా తీవ్రవాదులు కనిపించారు. స్వాత్ లో సైన్యాలు ఆపరేషన్ మొదలైన తర్వాత ప్రతిరోజూ ఇటువంటి కలలు వస్తున్నాయి. అమ్మ ఇచ్చిన అల్పాహారం తిని పాఠశాలకు బయలుదేరాను. పాఠశాలకు వెళ్తున్న సమయంలో చాలా భయం కలిగింది. ఎందుకంటే అమ్మాయిలు స్కూల్ కు వెళ్ళకూడదని ప్రకటించారు తాలిబాన్లు. ఆరోజు మా తరగతిలో 27 మందిలో కేవలం 11 మంది అమ్మాయిలు మాత్రమే హాజరయ్యారు. వారి ప్రకటనకు భయపడి నా ముగ్గురు స్నేహితురాళ్ళు బడి మానేశారు. వారు తమ కుటుంబాలతో కలిసి పెషావర్, లాహోర్, రావల్పిండి ప్రాంతాలకు వెళ్లిపోయారు .బడి నుండి ఇంటికి వెళుతున్న సమయంలో నాకు ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. "నేను నిన్ను వదలను" అంటూ. నడక వేగం పెంచి, వెనుకకు తిరిగి చూస్తే దారిలో నా వెనకే వస్తున్న అతను ఫోనులో అవతలి వారిని హెచ్చరిస్తున్నాడు".

ఈ విధంగా దాదాపు 70 రోజుల దినచర్యను ఆమె డైరీ పేజీలుగా రాసింది. బీబీసీలో బ్లాగ్ రాయడంతో మెల్ల మెల్లగా గుల్ మకాయి స్వాత్ కొండల్లో చర్చనీయాంశం అయ్యింది.
"11 సంవత్సరాల ఒక అమ్మాయి తాలిబన్ల పై తిరగబడింది" అన్న సత్యం తాలిబాన్లకు తెలియదు. ఆమె వారికి వ్యతిరేకంగా వారి ఆగడాలను ఆపేందుకు సిద్ధమైంది. ఆమె ఎవరు అన్నది ఎవరికీ తెలియదు. ఆమె, ఆమె అస్తిత్వం పరదా వెనుక ఉన్నాయి. ఆమె లక్ష్యం తాలిబన్ల శాసనానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయడం. ముఖ్యంగా అమ్మాయిలను పాఠశాలకు వెళ్లేందుకు జాగృతం చేయడమే.

మే 2009 సైనిక చర్య ప్రారంభం కావడానికి ముందే ఆమె కుటుంబం స్వాత్ కొండలు విడిచి వెళ్లిపోయింది. ఆ తర్వాత స్వాత్ కొండల్ని పాకిస్తాన్ సైన్యం స్వాధీనం చేసుకుంది. అప్పుడు ఆమె తండ్రి, ఆమె అసలు పేరును ప్రపంచానికి చెప్పేందుకు తిరిగి మింగోరా గ్రామానికి వచ్చాడు. ఎందుకంటే మలాలా పేరు అంతర్జాతీయ శాంతి పురస్కారానికి ఎన్నికయింది.

అప్పటినుండి ఆమె చైతన్యవంతమైన ప్రయాణం విస్తృతంగా కొనసాగింది.
"డిస్ట్రిక్ట్ చైల్డ్ అసెంబ్లీ స్వాత్"ను కపాల్ కోర్ఫౌండేషన్ యునిసెఫ్ సౌజన్యంతో ఏర్పాటు చేసి, బాలల హక్కుల కోసం పోరాటం చేయడం ఎలాగో నేర్పింది.

తాలిబాన్లు మలాలా దినచర్యను ఒక నెలరోజులు పరిశీలించి కట్టుదిట్టమైన ప్రణాళికతో 9 అక్టోబర్ 2012 పాఠశాల బస్సులో వస్తున్నటువంటి మలాలాపై తూటాల వర్షం కురిపించారు. ఒక తూట ఆమె నుదుటికి ఎడమ వైపు నుంచి పుర్రె ఎముకను చిత్రం చేస్తూ ముఖాన్ని చీల్చుకుంటూ చెవి పక్కగా భుజంలోకి దూసుకుపోయింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను పెషావర్ మిలిటరీ ఆస్పత్రికి చేర్చారు. తూటా ప్రభావంతో ఆమె ఎడమ వైపు తల భాగం వాచిపోయి కోమాలోకి పోయింది. ఆమెకు మెరుగైన చికిత్సకోసం పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచం మొత్తం మలాలా పక్షాన నిలిచింది.

అనేక చర్చల తర్వాత 15 అక్టోబర్ 2012 న మలాలా లండన్లోని, బర్నింగ్ హోమ్ లోని, క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రిలో ఆమెకు వైద్యం మొదలైంది. 17 అక్టోబర్ 2012 న ఆమె కోమానుండి బయటపడింది అప్పుడు ఆమె వయస్సు 14 సంవత్సరాలు 26 అక్టోబర్ 2012న ఆమె తన కుటుంబ సభ్యులను తిరిగి చూడగలిగింది.

నాలుగు నెలలు చావుతో పోరాడిన తర్వాత 3 ఫిబ్రవరి 2013 రోజున తనపై దాడి జరిగిన తర్వాత మొదటి సారి మీడియా ముందు ఆంగ్లం ఉర్దూ ఇంకా ఫస్ట్ అనే వాయువ్య పాకిస్తాన్ ఆదివాసి భాషలో ప్రపంచానికి సందేశం ఇచ్చింది. ఆమె మాటల్లో ముఖ్యమైన అంశం ఏమిటంటే "అవసరమైతే నేను బలిదానానికి సిద్ధంగా ఉన్నాను. పాకిస్థాన్లో విద్యాభివృద్ధికి ఏది అవసరమో అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా కోరిక ఒక్కటే ప్రతి బిడ్డ చదువుకోవాలి. ప్రపంచంలో శాంతి నెలకొల్పాలి. శాంతి కోసం నన్ను నేను బలిదానమిచ్చుకుంటాను" అని ప్రకటించింది.

తరువాత ఐక్యరాజ్యసమితి 2013 జూలై 12న మలాలా 16వ అ జన్మదినోత్సవం సందర్భంగా జులై 12వ తేదీని "మలాలా దినోత్సవంగా" ప్రకటించింది.

"నాయకత్వానికి రూపం ఆకారం లింగం దేశం వయస్సు అనే తేడాలు ఉండవు" అని అనడానికి మలాలా జీవితమే చారిత్రక సాక్ష్యం.

సాహస పూరితమైన మలాలా ఆశయాల చరిత్రను "అయామ్ మలాల" అనే పేరుతో రాయాలనుకుంటున్నాను అని చెప్పగానే, వెయిడెన్ ఫీల్డ్ అండ్ నికొల్సన్ అనే సంస్థ మూడు మిలియన్ డాలర్లను పుస్తక ప్రచురణ కోసం ప్రకటించింది.

మలాల కొచ్చిన అవార్డులు సన్మానాలు పురస్కారాల గురించి "నేను మలాలా" అనే పుస్తకంలో 101 నుండి 103 వరకు ప్రచురించబడ్డాయి.
భారతదేశానికి చెందిన సత్యార్థి తో పాటు మలాలాకు 2014లో అత్యున్నత "నోబెల్ శాంతి బహుమతి" లభించింది. మలాల బాలల విద్య కోసం పోరాటం చేస్తే, సత్యార్థి బాలల హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు.
ఆమెకు లభించిన మరొక ప్రతిష్ఠాత్మక బహుమతి స్వీడన్ ప్రభుత్వం ఇచ్చే "బాలల నోబెల్ బహుమతి"

ఈ నవల చదువుతూ ఉంటే, బాలలే కాదు ప్రపంచ తల్లిదండ్రులు అందరూ ఈ పుస్తకాన్ని చదవాలని, తద్వారా తమ సంతానానికి ఎటువంటి స్వేచ్ఛ అవగాహన ప్రోత్సాహం అందించవచ్చో మలాలా తండ్రి ఆమెను ఏ విధంగా ప్రోత్సహించాడో తెలుసుకుంటారు. "ప్రపంచాన్ని మార్చేయడానికి ఒక్క విద్యార్థి ఒక్క ఉపాధ్యాయుడు ఒక్క పుస్తకం ఒక కలం చాలు" అని చెప్పే ఆమె ఆత్మ విశ్వాసం చదివి ప్రతి ఒక్కరూ ఆనందిస్తారు.
10/9/20

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష