గోండు వనంలో కథాకచ్చీరు

గోండు వనంలో బహుజన కథల కచ్చీరు

  • - జ్వలిత, 9989198943
  •    
  • 06/01/2014
నివేదిక
------
ఆదివాసీ అస్తిత్వం కోసం నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించి అమరుడైన కొమురం భీం పోరాడిన జోడేఘాట్‌లో బహుజన కథకుల కచ్చీరు డిసెంబర్ మొదటి వారంలో జరిగింది. అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాట స్ఫూర్తిని ఆవాహన చేసుకునే విధంగా తెలంగాణలోని అన్ని జిల్లాలనుంచి కథకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో కవి, కథకుడు, పరిశోధకుడు గోపగాని రవీందర్, ఆదివాసీ కథకుడు, మెస్రం మనోహర్ పాల్గొన్నారు. కథాసాహిత్యంలో ధోరణులపై కథకులు తమ ఆలోచనల్ని పంచుకున్నారు. అన్ని విషయాలపై కూలంకషంగా చర్చించారు.
పచ్చటి సముద్రం వంటి అడవిలో కొండల మధ్యన ఆహ్లాదకరమైన వాతావరణంలో సమావేశంలో పాల్గొన్న 25 మందికి పైగా కథకులు తమ మనోభావాలను పంచుకున్నారు. కొమురం భీం విగ్రహం దగ్గర నివాళులు అర్పించి కథల కచ్చీరుని ప్రారంభించారు. తొలుత ఒక్కొక్కరు పరిచయం చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కథలు రావాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. గతంలో కథపై జరిగిన చర్చల్లో శైలి, శిల్పం బాగాలేదని ఆధిపత్య భావజాలంతో కథల్ని అంచనా వేశారన్నారు. బహుజనుల గళాన్ని విమర్శకులు విస్మరించారన్నారు. ఇంకా ఒకరితో చెప్పించుకోవాల్సిన స్థితిలో ఉన్నామా? అని ప్రశ్నించారు. బహుజన కథకుల సభ హైదరాబాద్‌లోని ‘లామకాన్’లో మొదట జరిగిందని, ఇప్పుడు జోడేఘాట్‌లో రెండో సమావేశమని చెబుతూ, ఈసారి అడవినుండి కథలను మొదలుపెడితే బాగుంటుందన్నారు. విమర్శకులు కూడా కొందరు సోకాల్డ్ కథకుల గురించి మాత్రమే ఎక్కువగా రాస్తున్నారని అన్నారు. పత్రికలు వివక్ష చూపుతున్నాయి. కాబట్టి మనమే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎన్నుకోవాలన్నారు. శిరంశెట్టి కాంతారావు మాట్లాడుతూ టైగర్ జోన్ పేరుతో నలభై గిరిజన గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. దాని పరిణామాల గురించి రాసే ప్రయత్నంలో ఉన్నానని చెబుతూ బహుజన స్పృహతో కథకులు కలుసుకోవడం సంతోషమన్నారు. సంగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మనమింకా బానిస భావాలతో ఉన్నాం. బహుజనులు ఉద్యమాలు చేసి పోరాటాల్లో మరణిస్తే ఆధిపత్య కులాలవాళ్లు వాటిని రచనలుగా మలిచి సాహిత్య చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారు. 1946-48, 1969-73, 2009 ఉద్యమాల్లో ప్రాణాలర్పించింది ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలు. అయితే వీరి గురించి ఒక్క ఆళ్వారుస్వామి మినహా ఎవరూ రికార్డు చేయలేదు. తమ గురించి రాసుకోనట్లయితే జీవితాలు, పోరాటాలు రికార్డు కాకుండా పోతాయి.
బహుజన బతుకులు కథల్లో రికార్డు కావాలె. ఈ మధ్య పత్రికల్లో కథకు సంబంధించి 17 లక్షణాలను స్థిరీకరించిండ్రు. ఈ ఫ్రేమ్‌లో బహుజన జీవితాలు ఇమడవు. ‘గద్దెత్తుకపోయిన బతుకమ్మ’ కథ రాస్తే అది మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో అచ్చుకు నోచుకోలేదు. తెలంగాణ ఉద్యమం వల్ల గడీలు పార్టీల కార్యాలయాలుగా మారుతున్నాయి. గ్రామాల్లోకి దొరల ఆధిపత్యం మళ్లీ వస్తోందని అన్నారు. పత్రికల్లో అచ్చుకు నోచుకోకుండా పోయిన కథలను సేకరించి మనమే ‘బహిష్కృత కథలు’ పేరిట ప్రచురించాలని జూపాక సుభద్ర అన్నారు. గోపగాని రవీందర్ మాట్లాడుతూ ఆదివాసీల వేల మరణాల గురించి తాను ‘ప్రయాణం’ కథ రాస్తే ఎవరూ అచ్చువేయలేదన్నారు. గోండు లిపిని రక్షించుకోవడంలో భాగంగా నార్నూర్ మండలం ‘గుంజాల’లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని, ఈ భాష రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ భాష తెలిసినవారు కేవలం ఏడుగురు మాత్రమే ఉన్నందున వారితోనే ఈ భాష అంతరించిపోయే ప్రమాదముందని అన్నారు. ఆదివాసీ రచయితల సంఘం అధ్యక్షుడు మెస్రం మనోహర్ మాట్లాడుతూ కొమురం భీం చేసిన ఉద్యమం వేరొకరు చేస్తే భారతరత్న దక్కేది. బిర్సాముండా స్ఫూర్తితో కొమురం భీం చైతన్యం పొందాడు. తాను రాసిన ‘ఇప్పపూలు’ కథను చదివి వినిపించారు. బహుజన కథకులు ఆదివాసీల గురించి రాయాలన్నారు.
పసునూరి రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ భాషలో కాదు, తెలుగులో కథలు రాసి పంపించాలని పత్రికలు డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు. దస్కత్ పేరుతో తెలంగాణ కథా వేదిక ఏర్పాటుచేసి కథకు ప్రోత్సాహమిస్తున్నామన్నారు. ఉద్యమ సందర్భంగా కవిత్వం వచ్చినంతగా కథలు రాకపోవడం లోటేనని చెప్పారు. కర్నూలులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కథకుడు వెల్దండి శ్రీ్ధర్ మాట్లాడుతూ బహుజన కథలు అంటే కేవలం కులానికి సంబంధించిన సమస్యలమీదే కాకుండా అన్ని రకాల సమస్యలను రికార్డు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాండలిక పదాలుంటే పత్రికల్లో అచ్చుకావడం లేదు. చిత్రకారుడు అక్బర్ మాట్లాడుతూ పత్రికలు అన్ని కథల్ని అచ్చువేయాల్సిన అవసరం లేదు. స్వయంగా సంకలనాలు వేస్తే బహుజన కథలు రికార్డవుతాయన్నారు. బహుజన కథకులంతా తమతమ భావోద్వేగాలను, తపనను ఈ సమావేశంలో తోటివారితో పంచుకున్నారు. అడవి తల్లి ఒడిలో మళ్లీ కలుద్దామని నిర్ణయించారు. ఈ సమావేశంలో బి.వి.ఎన్.స్వామి, కత్తి కళ్యాణ్, షాజహానా, బుర్ర తిరుపతి, రిజ్వాన్ ఖాన్, గఫూర్ శిక్షక్, పెందోర్ సోము తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష