యువతను వదలని చెదపురుగులు

 యువతను వదలని "చెదపురుగు"  

జ్వలిత -9989198943



బెంగాలీ నవలా చరిత్రలో మొదటి భాగం 1858 లో ప్రారంభమైంది. ఆ ప్రథమ ఘట్టాన్ని బంకించంద్ర ఛటోపాధ్యాయ రవీంద్రనాథ్ శరత్ చంద్ వంటి వారి  నవలలతో సంపన్న మైనది. 1930 నుండి 50 వరకు వంగ నవలా చరిత్రలో ద్వితీయ భాగంగా చెప్పవచ్చు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత మధ్యతరగతి జీవితాలలో చాలా మార్పులు వచ్చాయి. విలువలు నశించాయి, అభిరుచులు తారుమారు అయ్యాయి. దేశ విభజనతో పురాతనమైన గ్రామాలలో పరిస్థితి కలలుగానే మిగిలిపోయాయి. నిరాశ నిస్పృహలు ప్రజలను ఆవహించాయి. దేశమంతా  అదే పరిస్థితి ఉన్నా  బెంగాలీ రచనలలో  ముఖ్యంగా నవలలో  ఈ క్లిష్ట పరిస్థితి వస్తువుగా చోటుచేసుకుంది. ఆ సమయంలో నవలా రచయితలు మోతీ నందీ, శీర్షేందు ముఖోపాధ్యాయ, దేబేష్ రాయ్  వంటి వారు 1960 నుండి తమ కథారచనను ప్రారంభించారు. శీర్షేందు ముఖోపాధ్యాయ 1967లో 'ఘూన్ పొకా' పేరుతో తన మొదటి నవలను రాశారు. ఘూన్ పొకా అంటే అర్థం చెదపురుగు అని. మొదటి నవలే శీర్షేందు ముఖోపాధ్యాయకు నవలాకారునిగా పేరు సంపాదించి పెట్టింది. "చెదపురుగు" పేరుతో  తెలుగులోకి అనువాదం చేసిన వారు  బొమ్మన విశ్వనాథం. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా 2000 సంవత్సరంలో ఈ తెలుగు అనువాదాన్ని తొలిసారి ప్రచురించింది. 


ఈ నవలలో శ్యామ్ అనే యువకునిది ప్రధాన పాత్ర. శ్యామ్ కథానాయకుడు కాదు కానీ ఆనాటి సామాజిక పరిస్థితులకు లొంగిపోయిన మానవునికి ప్రతినిధి. ఏ ఒక్క వర్గానికి చెందినవానిగా శ్యామ్ మనకు కనపడడు. దేశ విభజనలో భాగంగా పుట్టిన గడ్డపై ప్రేమతో కన్న కొడుకుని వదిలి అతని తల్లిదండ్రులు సొంత  ప్రాంతానికి పోతారు. కనుక శ్యామ్ ఏకాకి స్వేచ్ఛాజీవి. యజమాని తిట్టిన ఒక తిట్టు కారణంగా ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు అన్నిటికీ తానే బాధ్యునిగా భావిస్తూ ఉంటాడు. అతని చుట్టూ తిరిగే  ఇతూ, లీలా భట్టాచార్య వంటీ స్త్రీ పాత్రలు కానీ మీనూ, అరుణ్ , మిత్రా వంటి పురుష పాత్రలు కానీ శ్యామ్ పై ఎటువంటి ప్రభావం చూపవు. నవలలో ఎక్కడ స్పష్టమైన సంభాషణలు ఉండవు. నవలంతా ఒక మానసిక సంఘర్షణల వలయం వలె అనిపిస్తుంది. 


"సెంట్ అండ్ మిల్లర్ కంపెనీ ఉద్యోగము జూన్ నెలలో వదిలేశాడు శ్యామ్" అంటూ మొదలవుతుంది నవల. ఉద్యోగం వదల వలసిన అంత పెద్ద కారణం కాదంటూ నవలను కొనసాగిస్తాడు రచయిత. కానీ కారణం యజమాని శ్యామ్ ని ఒక డ్రాయింగ్ లో దొర్లిన చిన్న పొరపాటుకు బాస్టర్డ్ అని తిడతాడు. ఆ ఒక్క  మాట శ్యామ్ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. అట్లా అని ఇంతకుముందు ఆ మాట కొత్త కాదుశ్యామ్ కు. ఆ మాట స్వయంగా శ్యామ్ ఎందరినో అన్నాడు. కానీ తనను  యజమాని ఆ మాట అనేసరికి తట్టుకోలేకపోయాడు. చాలా రోజులు నిరాసక్తంగా నిర్లిప్తంగా ఏ పని చేయకుండా పిచ్చివాడిలా తిరుగాడు. తర్వాత కొన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. ఆ సమయంలోనే పాత మిత్రులైన మీనా, అరుణ్ వంటి యువకులు, గతంలో తనకు సాయం చేసిన "ఇర్ఫాన్ ", "సోను కాక" వంటి వారు మళ్లీ అతనికి తారసపడతారు. 


ఇర్ఫాన్ వయసులో పెద్దవాడైన ఒక వ్యాపార వేత్త. రాజాబజార్ లో ఉంటాడు. అతడు తన తండ్రికి డబ్బు పంపడానికి సహకరించే వాడు. పాకిస్తాన్ లో ఉన్న తన తండ్రికి డబ్బు పంపాలంటే ఇర్ఫాన్కు  250 రూపాయలు ఇచ్చేడు. ఇర్ఫాన్ వెంటనే తనమిత్రునికి లేఖ రాసేవాడు. "ఈసారి మన దక్షిణం వైపు తోటలో మామిడి కాపు బాగానే ఉందిగా. బానఖడా కమలాఖ్య చక్రవర్తికి రెండొందలు పంపండి" అని ఉత్తరంలో రాసేవాడు. శ్యామ్ తండ్రికి రెండు వందలు చేరేవి. ఆవిధంగా వ్యాపారాలలో ఉపయోగించే రహస్య భాషను రచయిత మనకు వివరించారు. ఆ ఇర్ఫానే పాకిస్థాన్ వెళ్ళేందుకు ఏజెంట్ గా పనిచేసేవాడు.

సోనూ కాక తన తండ్రికి మిత్రుడి వంటివాడు. 


నవలంతా కలకత్తా నగరంలోని ఒక వ్యక్తి చుట్టే తిరుగుతుంది. జరిగే సంఘటనలు జన సంచారాలు, నేరాలు, పొడవైన హౌరా బ్రిడ్జి, నిరవధికంగా పరుగులుతీసే ట్రాములు, బస్సులు, అద్దాల షాపులు ఇంకా చాలా విషయాలను పాఠకుని కళ్ళ ముందు చిత్రీకరిస్తాయి. 


ఒక వ్యక్తి దృష్టిలో అమూల్యంగా రూపొందిన చరిత్ర, సమాజం, రాజకీయాల యుగంలో భౌతిక సంపత్తి లేని సాధారణ మానవుడు తన సహజ వ్యక్తిత్వాన్ని కోల్పోయి, మళ్లీ  కోల్పోయిన వ్యక్తిత్వాన్ని తిరిగి పొందడం శ్యామ్ పాత్ర ద్వారా నవల రచయిత ఇచ్చిన ప్రత్యేక సందేశం కావచ్చు. ఆనాటి అంటే రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఆ నాటి యువతరం అనేక సంఘర్షణలకు గురయ్యారు. వారి ఆశలకు ఆదర్శాలకు వాస్తవ ప్రపంచం ప్రతికూలంగా కనబడేది. ఆ సత్యాన్ని సహించలేని వారు నిరాశపరులై గమ్యాన్ని తెలుసుకో లేకుండా, తమ చుట్టూ తాము తిరుగుతూ ఉండేవారు. అటువంటి ఒక నవ నాగరిక యువకుడి కథ ఈ నవల. కొన్నిచోట్ల ఆ యువకుడు విషయ లోలుడిగా, మరొకచోట పరిణితి చెందిన తాత్వికునిగా కనిపిస్తాడు మొత్తానికి ఎన్నో సామాజిక రాజకీయ ఆర్దిక అంశాలను వివరిస్తుంది ఈ నవల నర్మగర్భంగా.

నవలలు మరో పాత్ర అరుణ్. శ్యామ్ చిన్ననాటి మిత్రుడు. స్వార్ధానికి మోసకారి తనానికి ప్రతీక. అతి మామూలు ఉద్యోగస్తునిగా మొదలైన అతని జీవితం, యజమానిని ఎదిరించడం ద్వారా కొత్త మలుపు తిరిగింది. ధనవంతుడైన యజమాని అనాకారి కూతురికి భర్తను చేసి అనేక విలాసాలను అందిస్తుంది. తృప్తి లేని అరుణ్ భార్యను, మామను మోసం చేసి అమెరికా వెళ్లి స్థిరపడాలి అనుకుంటాడు. కానీ జాగ్రత్త పరుడైన అతడి మామ, అతని నేర ప్రవృత్తిని గ్రహించి ఎటువంటి అవకాశం లేకుండా చేస్తాడు. ఆ అరుణ్ శ్యామ్ కు లీలా భట్టాచార్యను పరిచయం చేస్తాడు. ఆమెపై వ్యామోహం కలిగేట్టు శ్యామును రెచ్చగొడుతాడు. కానీ లీలాభట్టాచార్యతో అరుణ్  సంబంధం నెరుపుతాడు. స్వయంగా అరుణే తాగిన మైకంలో ఆ విషయం అంతా స్నేహితుడైన శ్యామ్ కు వివరిస్తాడు. 


       నవలలో మరొక వ్యక్తి సుబోధ్ మిత్రా వయసు మళ్ళిన బ్రహ్మచారి. అతనిదొక వింత కథ. రవీంద్రుని భక్తుడు. ఈ పాత్ర ద్వారా నవలా రచయిత ఆనాటి సమాజంలో ఉన్న బలహీనతలను వివరించాడు. రవీంద్రుని రచనలు చదవలేదు మిత్ర. కానీ అతని ఇంటి గోడల నిండా రవీంద్రుడి పటాలను వేలాడదీసాడు. దైవమంటే భక్తి లేదు కానీ తల్లి కోరిక మేరకు ఆమె చనిపోయిన తర్వాత ప్రతిరోజు కొన్ని విగ్రహాలకు పూలు దీపారాధనతో పూజ చేసి పంచదార బిళ్ళలు నైవేద్యంగా పెడతాడు. ఆ తర్వాత ఆ పంచదార బిళ్ళలు అటుకులతో కలిపి అల్పాహారంగా తింటాడు. పెళ్లి చేసుకోవాలని కోరిక ఉన్నా ధైర్యం చేయలేడు. అవసరమైతే ఆత్మహత్య చేసుకోవడానికి నిద్ర మాత్రలు సేకరించి పెట్టుకుంటాడు. కావాలంటే శ్యామ్కు  కూడా ఇస్తానంటాడు. ఇద్దరూ  రోజూభోజనం చేసే హోటల్లో కలుస్తారు. శ్యామ్ ఒక అధికారనీ, యజమాని తిట్టినందుకు ఉద్యోగం వదిలేశాడనీ తెలుసుకున్న మిత్రా శ్యామ్ ను ఇంటికి తీసుకుపోయి తన కథంతా చెప్పాడు. 


మరో పాత్ర మీనూ. శ్యామ్ చిన్ననాటి స్నేహితుడు. నేరస్తుల స్నేహంతో నేరాలు చేస్తూ భయంభయంగా బతుకుతుంటాడు. ఒకరోజు రైల్లో కనపడి శ్యామును బలవంతంగా రైలు నుండి దింపుతాడు శ్యామ్ కు మేలు చేయడం కొరకే రైలు నుండి దింపానని చెప్తాడు. కానీ అతని వేషధారణ అతని చుట్టూ ఉన్న అతని మిత్రులు, మిత్ర చేయబోయే రక్తసిక్త దృశ్యాన్ని శ్యామ్ పసిగడతాడు. అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

చివరకు మిత్ర చేతిలోనే చావు దెబ్బలు తినడంతో శ్యాం స్పృహ కోల్పోతాడు. నవల ముగుస్తుంది. అయితే శ్యామ్ చనిపోయాడా ? కోలుకొని మంచి వ్యక్తిగా మారిపోయాడా ? అనేది నవలా రచయిత చెప్పకుండా చదివే వారి ఊహకు వదిలేయడం నవలలో కొసమెరుపు. 


   ఇందులో భౌతిక అంశాల కంటే కూడా మానసిక సంఘర్షణలను ఎక్కువగా రచయిత వివరించాడు. అందుకు ఉదాహరణ "బస్సులో ఎడమ వైపు నుంచి చూస్తున్న దృశ్య జాలం, కుడి వైపు నుంచి చూసిన దానికి భిన్నంగా ఉండడం సహజమే కదా? మేడ మీద నుంచి కిందకు చూసిన దృశ్యం, గోతి నుంచి మేడ మీదకు చూసిన దృశ్యంలో ఉన్న భేదం లాంటిదే, అనిపిస్తుంది వారిద్దరి లో ఉన్న భేదం" ఈ మాటలు మీనూ శ్యామ్ జీవితాలలో అంతరాన్ని తెలిపేందుకు రాసిన వాక్యాలు. 


ఈ నవలలో లీలా భట్టాచార్య మోటార్ సైకిల్ అనేవి శ్యామ్కు రెండు ముఖ్యమైన పార్శ్వాలు. 


లీలను పెళ్లాడాలని కోరిక కలిగినప్పుడు లీలకు కొన్ని విషయాలు చెప్పాలని తనకు తాను అనుకుంటాడు. ఆమె తనను కొన్ని ప్రశ్నలు వేస్తున్నట్టుగా తనకు తాను ఊహించుకుంటాడు. ఇవన్నీ అవసరమైన ప్రశ్నలు అని సమర్ధించుకున్నాడు. "నా పేరు శ్యామ్ చక్రవర్తి, నాన్న పేరు కమలాఖ్య చక్రవర్తి, శాండిల్య గోత్రం, విక్రమ్ పూర్ పక్కనే ఉన్న భానీఖాడా గ్రామం . అన్నదమ్ములు ఎవరూ లేరు ఒక్కతే చెల్లెలు పెళ్లి అయిపోయి ముర్షిదాబాద్ లో ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందో తెలీదు. సెంట్ అండ్ మిల్లర్ లో జూనియర్ ఆఫీసర్ గా పని చేశాను. పై ఆఫీసర్ బాస్టర్డ్ అని తిట్టినందుకు కోపం వచ్చి ఉద్యోగానికి ఉద్వాసన చెప్పాను" అని చెప్పాలనుకుంటాడు. కానీ ఆమె అడగదు, అతను చెప్పడు. ఇలాంటి ఊహాత్మక సంభాషణలను రచయిత నవల నిండా రాశాడు. 


శ్యామ్ కు మోటార్ సైకిల్ వాళ్ళ అంటే చాలా కోపం, ఆ కోపానికి కారణం అతనికి తెలియదు. ఒకరోజు టైం పాస్ కోసం అద్దాన్ని పట్టుకొని కిటికీ నుండి వచ్చే సూర్యుని కిరణాలు అద్దంపై పడేట్టు పట్టుకుని, ఆ మెరుపులు చుట్టూ ఉన్న వారిపై  పడేటట్టు  చేస్తూ ఉంటాడు  శ్యామ్.  ఉన్నట్టుండి  ఒక మోటార్ సైకిల్ శబ్దం  వినపడుతుంది. రోడ్డున పోయే వాహనదారునిపై పడేటట్టు చేస్తాడు. వెంటనే పెద్ద శబ్దంతో యాక్సిడెంట్ జరుగుతుంది.  మోటార్ సైకిల్ శబ్దం ఆగిపోయింది.

భయంతో శ్యామ్ కిటికీ దగ్గర నుండి కిందికి ఒంగుతాడు. ఆ తర్వాత తన వల్లనే ఒక ప్రాణి చనిపోయిందని బాధపడతాడు. తనకు తాను నేరస్తునిగా భావిస్తాడు. మోటార్ సైకిల్  అతను చనిపోయిన వార్త కోసం రోజూ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదొక వింత ప్రవర్తన. 


అదేవిధంగా లీల విషయంలో కూడా వ్యామోహానికి గురై, ఆమె పనిచేసే కార్యాలయం ముందు రోజూ నిలబడి చూస్తూ ఉంటాడు. ఒకరోజు అతని మిత్రుడు మీనూ గాజు తలుపులు తెరుచుకొని అకారణంగా కోపంగా వచ్చి శ్యామ్ని  బలంగా కొడతాడు. శ్యామ్ తప్పించుకునే ప్రయత్నమే చేయడు. చివరకు దెబ్బలు తట్టుకోలేక దీప స్తంభానికి తగిలి స్పృహ కోల్పోతాడు. స్పృహ కోల్పోయే ముందు తల్లి తండ్రి గుర్తుకొస్తారు. తన తల్లి అతన్ని ప్రేమగా పిలుస్తూ వెతుకుతున్నట్టు రచయిత చెప్తాడు. నవల ముగుస్తుంది. 


ఈ నవల ద్వారా రెండో ప్రపంచ యుద్ధానంతరం భారత దేశంలో చోటుచేసుకున్న దేశ విభజన ప్రభావం. నాటి స్థితి ఆర్థికంగా సామాజికంగా మధ్యతరగతి కుటుంబాల పై ముఖ్యంగా యువతను ఏ విధంగా ప్రభావితం చేశాయో వివరించాడు.

       ******   *******   ******* 


మూలరచయిత గురించి:-

శీర్షేందు ముఖోపాధ్యాయ్ భారతదేశానికి చెందిన బెంగాలీ రచయిత. అతను పెద్దలకు  పిల్లలకు కథలు రాశాడు. అతను బరోడాచరన్, ఫాతిక్ మరియు షాబోర్ దాస్‌గుప్తా అనే కొత్త కల్పిత స్లీత్‌లను సృష్టించడానికి ప్రసిద్ది చెందాడు. 

వారి పుట్టిన తేదీ: 2 నవంబర్, 1935 (వయస్సు 85 సంవత్సరాలు)పుట్టిన స్థలం: బిక్రమ్ పూర్

విద్య: యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా, చలన చిత్రాలు కూడా తీశాడు.

నవలలు 1967లో "ఘూన్ పొకా", 1971లో "పార్ పారా"

    ****  ***   ***   ** 


అనువాద రచయిత గురించి:-

బొమ్మన విశ్వనాథం భారతీయ సాహిత్యాన్ని వంగభాషలోనికి అనువదించిన తెలుగువ్యక్తి. ఇతడు 1934, నవంబర్ 7వ తేదీన ప్రస్తుతం ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లా బరంపురం పట్టణంలో జన్మించాడు. ఇతని మాతృభాష తెలుగు అయినప్పటికీ తండ్రి ఉద్యోగరీత్యా ఇతడు తన పదవయేట కలకత్తా చేరుకున్నాడు. అప్పటి నుండి బెంగాలీ భాషను అభ్యసించాడు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ రచనలు అధ్యయనం చేయడంతో సారస్వతాభిమానం పెంపొదింది. వంగ సాహిత్యాన్ని అభ్యసించడంతో పాటు ఇతర భారతీయ భాషలలోని సాహిత్యాన్ని చవి చూడాలనే ఆసక్తితో తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం, ఒరియా, బెంగాలీ, హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు.

ఇతని మాతృభాష తెలుగు అయినా, ఇతడు చిన్నప్పటి నుండి వంగదేశంలోనే వుండడం వలన ఇతడు బెంగాలీ భాషలోనే మొదట స్వతంత్ర రచనలు చేశాడు.

రచనలు- అజ్ కేర్ డాక్, సూచనా (నాటకాలు)

నాటికా (ఏకాంకిలు), ఆధునిక్ భారతేర్ గల్ప సంచయన్ - 14 భారతీయ భాషలనుండి బెంగాలీలోనికి అనువదించబడిన 14 కథలు. కేరళార్ గల్పగుచ్చ -14 ఉత్తమ మళయాల కథలకు బెంగాలీ అనువాదం.

ఆంధ్రేర్ గల్పగుచ్ఛ - 7 ఉత్తమ తెలుగు కథలకు బెంగాలీ అనువాదం. ఆధునిక్ భారతేర్ కవితా సంచయన్ - 19 ఉత్తమ కవితల బెంగాలీ అనువాదం.

  *****   *****   **** ****  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష