ఇంతియానం ఆవిష్కరణ

మిత్రులారా.. ఈమధ్య కాలంలో నేను ఆనందించిన  ఒక పుస్తకావిష్కరణ గురించి మీతో...

'ఇంతియానం' సాహిత్యంలో ఒక రికార్డు

—--జ్వలిత


తెలుగు సాహిత్య చరిత్రలో ఒక రికార్డు సృష్టించిన 'ఇంతియానం' 45మంది స్త్రీల యాత్రా రచన, అన్వీక్షికి వారి ప్రచురణ.. దీని కథానాయకురాలు స్వర్ణ కిలారి. తెలంగాణ గడ్డమీద మొదలయి, ప్రపంచ దేశాల పర్యటనను అక్షరీకరణల ఈ సంకలనం ఇతర భాషలలోకి అనువాదం జరగాలి. మా ఉమ్మడి ఖమ్మం (కొత్తగూడెం) మొలక స్వర్ణ కిలారి ఒకరోజు ఫోన్ చేసి మహిళల యాత్రానుభవాలను సంకలనం చేస్తున్నాను మీరూ ఇవ్వాలి అంటే భలే ఆనందం వేసింది. తెలంగాణ మహిళలు తెలుగు సాహిత్య చరిత్రలో ఎన్ని రికార్డులు సృష్టించ గలుగుతున్నారు. ఎంత కొత్తగా ఆలోచిస్తున్నారు అనిపించింది. 2011లో ఒకానొక భయంకర అనుభవాన్ని అవమానాన్ని మరిచి పోవడం కోసం వాటి  23 రోజులు 21 రాష్ట్రాల పర్యటన ఒక సమూహంతో చేశాను. అందులో మూడురోజుల యాత్రగురించి రాసిచ్చాను. రెండు నెలల్లో సంకలనాన్ని తీసుకురావడమే కాదు. ఒక ఆత్మీయ కలయికలా.. ఒక ప్రీతిపాత్రమైన విందు భోజనంలా ఆవిష్కరణ సభ జరిపారు. అందులో పింగళి చైతన్య 'ఇంతియానం' గురించి మాట్లాడిన తీరు సూపర్. (పుస్తకం, పేపర్ చేతిలో లేకుండా) ఒక్కొక్క రచయిత పేరు వారు చూసిన ప్రాంతం గురించి హస్యోక్తులతో సమీక్షించారు. సంకలనకర్త స్వర్ణకిలారి అందరి పేర్లను వారి అనుభవాలను దోస్తుల మధ్య ముచ్చట్లు చెప్పుకున్నట్టు వివరించారు. ప్రపంచ యాత్రికులు, 'స్త్రీల యాత్రలు' రచయిత ఆది నారాయణగారు తమ అనుభవాలతో  పాటు తెలుగుయూనివర్సిటిలో కొన్ని గదులను స్త్రీల యాత్రా పరిశోధనల కోసం కేటాయించాలని కోరుదామని ప్రతిపాదించారు. ప్రొఫెసర్ సూరేపెల్లి సుజాత తాను ప్రపంచ దేశాలను దర్శించిన  అనుభవాలతోపాటు రాబోయే సంకలనానికి తాను కూడా రాస్తానన్నారు. ఎందరో ప్రముఖులు, రచయిత్రుల భాగస్వామ్యంతో అద్భుతంగా సాగింది కార్యక్రమం. ఆదినారాయణ గారి సూచన మేరకు ఇంతియానంలో రచయితలందరినీ వేదికపైకి పిలిచి ముఖ్య అతిథులతో ఫొటో దిగడం బాగుంది.. మాధవ్ గారి ఛలోక్తులతో సభానిర్వహణ నవ్వులపువ్వులతో అయితే చప్పట్లు లేదంటే నవ్వులుగా సాగింది. స్వర్ణ కిలారి  కొందరిని 'ఇంతియానం' లో మిస్ అయ్యాను కనుక మిగిలిన వారు పంపవలసిందిగా ప్రకటించారు..


ముఖ్యమైన విషయం తెలుగు విశ్వవిద్యాలయం వరండాలోనే ఎదురై పాసిటివ్ ఎనర్జీ నింపిన దిలీప్ కొణతల గారి రిసీవింగ్ నాకు ఎంతో నచ్చింది. స్వర్ణ కిలారి హగ్, కొండవీటి సత్యవతి గారి షేక్ హాండ్, మల్లెసాల స్పందన ఎలా ఉంది అంటూ ప్రొఫెసర్ రఘుగారు, టీ తాగిరండి అంటూ నస్రీన్, ఇక్కడికి రండి టీ తాగుదాం అంటు సుమతి చురుకంటి గారు.. అక్కా అంటూ సొదరులు పత్తిపాక మోహన్ పలకరింపు.  ప్రొఫెసర్ సునితారాణి గారు "మీరు జ్వలిత కదా.." అని గుర్తు పట్టి నా కథల పుస్తకం గురించి అడగడం,

ఎందరో కవయిత్రులు అందరూ ఆనందంగా నవ్వుతూ.. 

 సజీవంగా సాగిందా కలయిక.

ఈ సందర్భంగా నావి రెండు ప్రతిపాదనలు..

 (1)  ప్రతి సంవత్సరం 'ఇంతియానం'  స్త్రీల యాత్రా రచనల సంకలనం తీసుకురావాలి.

( 2) ఇంతియానం పరభాషల్లోకి అనువాదం జరగాలి.

వీడియో కర్టసి: రాహుల్ గారు


          ****     ****   ****









కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష