పోరి (కథ)

  • 'పోరి'


జ్వలిత- 9989198943


త్రిస్టార్ హోటల్లో ఏ.సి.రూమ్ లో ఉన్నారు వాళ్ళిద్దరూ.. విచారంగా ఉన్నట్టున్న ఆ స్త్రీ వయసు తెలవట్లేదు. ఆకర్షణీయంగా చదువుకున్నట్టే కనిపిస్తుంది. అతడొక పత్రికా విలేకరి రచయత కూడా. ఇద్దరూ చెరొక కుర్చీలో ఉన్నారు. టీపాయ్ మీద ఒక వాటర్ బాటిల్, రెండు ఎంగిలి కప్పులున్నాయి.


"మొదలు పెడదామా" అన్నాడతను.

"రికార్డు చేస్తారా.." అన్నదామె.

"మీకభ్యంతరం లేకపోతే" అంటూ వీడియో కెమేరా సెట్ చేశాడు.

"అతడితో మీకెందుకు తగాదా వచ్చింది"..

"నా 'ఆనంద ధామం' మీద కన్నేశాడు. దాన్ని లాక్కునేందుకు 'బ్రోతల్ హౌజనీ, చిన్నపిల్లలతో వ్యభిచారం చేయిస్తున్నాననీ' ఏవేవో ప్రచారాలు మొదలు పెట్టాడు. నన్ను జైలుకు పంపి అందులో వాళ్ళను అనాథలుగా రోడ్డు మీదకు నెట్టి, ఆనంద ధామాన్న స్వాదీన పరుచుకోవాలన్న స్వార్థం" ఆగిందామె.

"అతనేమయ్యాడు.. కనిపించటం లేదట కదా.."

"నాకు తెలియదు నేను నా గురించి మాత్రమే మాట్లాడుతా.. మధ్యలో ఆపొద్దు. ఆపితే వెళ్ళిపోతాను. మీకు తెలుసు మీరు నన్ను ఆపలేరు" కఠినంగా స్థిరంగా అన్నదామె.

"తెలుసు తెలుసు.. మధ్యలో ఆపను.. మీకు సౌకర్యంగా ఉంటేనే, అభ్యంతరం లేకపోతేనే చెప్పండి" అన్నాడు. అసలు విషయం వినాలనే పట్టుదల అతనిది.

ఆమె కుర్చీలో పద్మాసనం వేసుకొని కూర్చొని కళ్ళుమూసుకుంది.


రోహిణికార్తె ఎండోలె మండుతున్నది మనసు. తడారి పోయిన చెలిమెలోలె నిస్తేజమైన కళ్ళ నుండి కన్నీటి చుక్క రాలడం లేదు. వలస కూలీల అంతులేని నడకలో బొగ్గలెక్కి చితికి నెత్తురోడుతున్న పాదముద్రల వంటి అనుభవాలు. పాతాళ గరిగతో తోడిపోస్తున్నాయి ఆలోచనలు. ఎవరినని ఏమి లాభం ఎటువంటి పుట్టుక తనది. ఎద్దుపుండు జీవితం తనది కాకుల లోకం ఇది. 'ఎద్దుపుండు కాకికి ముద్దు కాదు' ఏనాటికి.


కళ్ళుతెరిచి ప్రశాంతంగా చూస్తూ ఒక ట్రాన్స్ లో ఉన్నట్టు చెప్పడం మొదలు పెట్టింది..

"నేను పుట్టంగనే తల్లి కన్నుమూసింది. 'నీ బతుకు బరువు నువ్వే మోసుకోమని' పురిటి నొప్పులతో మూలుగుతున్న కోడలిని తాగిన మత్తుల గొడ్డును బాదినట్టు బాది, కాళ్ళతో తన్ని, సోయి తప్పి పండిండు కొడుకు. కొడుకును అపలేక కుక్కి మంచంల పక్షవాతంతో పడున్న మామ పెట్టిన కేకలకు, ఇరుగు పొరుగు ఉరికొచ్చిన్రు. నెత్తురు మడుగులో పడున్న తల్లి, సగం తల బయిటికొచ్చి ఆగిన పసిప్రాణి, బయటకు నెట్టే సత్తువ లేక పానమొదలిన తల్లిని చూసింది పక్కింటి ముసలమ్మ. సగం బయటికొచ్చిన బిడ్డను, ఆయింత బయటకు గుంజింది, సూర్ల గుచ్చున్న లిక్కితో బొడ్డుపేగును కత్తిరిచ్చింది, చెవుల్ల గట్టిగా ఊదింది. రెండు కాళ్ళు పట్టి తలకిందులు పట్టుకొని మూడుసార్లు వీపు మీద సరిసింది, మూడుసార్లు అటిటు ఊపింది.. బలిమికి ఏడిపిచ్చి, బతికిందనిపిచ్చింది. 

మంచంలున్న ముసలోనితో "తల్లి సచ్చింది.. దాని పానానికి ఈ దినంతో ముక్తి దొరికింది, ఆడిపిల్ల బతికింది"అన్నది. 

ఆనాటి నుండి మొదలైన ఏడుపు ఇంతదనుక ఆగదాయె.

 

నేను పుట్టంగానే అమ్మ పోయిందట. కాదు కనలేక పానమిడసిందట. నన్ను పెంచిన ముసలమ్మనే 'అమ్మమ్మ' అని పిలిచేది నేను. నా తల్లి చచ్చిపోతే  అనాథ శవాన్ని తీసేసినట్టు, చుట్టుపక్కల గుడిసెల్లున్న నలుగురు కలిసి అమ్మను దానం చేసిండ్రట. నా తండ్రెటు పోయిండో ఎవరికి తెలవదు. కాబట్టి తల్లి మొగం ఎట్లుంటదో తెలవదు నాకు. తండ్రి మొగమెట్లుంటదో కూడా తెలవదు. అయ్య తరుపు సుట్టం లేడు నాకు. అమ్మ తరుపు సుట్టం కూడా లేడు. అట్ల ఎందుకు లేరో కూడా నాకు తెలవదు. ఎవరికీ అవసరం లేని జన్మ నాది. 


పురుడు పోసిన పాపానికి పొరుగునున్న ముసలమ్మ పానానికి గుదిబండనయిన. చెవుకాడ జోరీగోలె ఏడుస్తున్న నాకు తీరికున్నప్పుడు కాసిప్పతో గంజినీళ్ళు దాపిందట. ఏడ్వకుండ పండుకునేందుకు పక్క గుడిసెల గౌండ్ల ముసలమ్మ తాన లొట్లు కడిగిన నీళ్ళు తాపి చావకుండ ఊపిరి నిలిపింది. కుక్క పిల్లనో పిల్లి పిల్లనో సాదినట్టు, కాలికి అడ్డమొస్తే కాలితో తన్ని, చేతికి అడ్డమొస్తే చేత్తో ఇసిరి కొట్టి ప్రేమగ సాదిన్రు. మాడమీద గుంట పూడె దనుక మంచినూనో ఆముదమో ఎదో ఒకటి మాడుకు పెట్టిన్రు. అటెంక ముసలిదే గుండు గీకుడు మొదలుపెట్టింది. ఎవరూ కోరని పుట్టుక, ఎవరికి కాని బతుకు. అయినా కొందరమ్మల జాలి దయతో బతికిన. ఎవరేది పెడితె అది తిన్న. ఎవరేదిస్తే అదే కట్టిన. అందరు నన్ను 'పోరీ' అనే పిలిసేది.


కాలచక్రం గిర్రున తిరుగుతూ నన్ను కూడా తిప్పింది. నాకు నాలుగేళ్ళొచ్చినంక, నా తల్లికి కాన్పు చేసి నాకు ఊపిరూదిన ముసలమ్మ సచ్చింది. అప్పడిదాక ముసలమ్మ తన రెక్కల కింద నన్ను కాపాడింది. తన నోటితో భయపెట్టి నాకు గుడిసెల తావిచ్చింది. ఇప్పుడు ముసులోడొక్కడే ఉన్నడు. ముసలమ్మ చచ్చిన మూడోనాడు ముసలోడు చెప్పిండు ఈ సంగతంత. తాతకు కండ్లు కనపడవు మసకలు. మా ఇద్దరి ఆకలి తీర్చే భారం నా మీద పడింది. 

"పోరీ.. నా చెయ్యి పట్టుకొని దగ్గరున్న గుడికాడికి తీస్కపో" అన్నడు ముసలోడు.

పొద్దునా సాయంత్రం ముసలోణ్ణి తీసకపోయి ఇద్దరం గుడి మెట్ల కాడ కూసునేది. గుడికొచ్చెటోళ్ళందరు చిల్లర పైసలో‌, కొబ్బరి చిప్పలో, ప్రసాదమో మా చేతుల్లో వేసేది. అదే మాకు ఆధరువు ఇప్పుడు. పగటేళ బస్సులాగే కాడ, ఒకొకసారి రైలు స్టేషన్ దగ్గర అడుక్కునేది. నేను మెట్ల మీద తాతను కూసోపెట్టి చెట్టు కింద ఆడుకునేది. ఆకలి, దప్పిక, నిద్ర అన్నిటికీ తాతే ప్రపంచం.  ఇప్పుడు తాతకు కళ్ళు పూర్తిగ కనపడవు. చప్పుడిని మనుషుల ముందు చేతులు చాపడం తనకు అలవాటయింది. 


ఏది ఆగినా ఆగక పోయినా కాలం ఆగదు కదా..

నాకు ఆరేళ్ళొచ్చినయి. అందరు పిల్లలు బడికి పోతంటే చూసిన నాకు కూడా ఆశ పుట్టింది. తాతను బతింలాడిన "తాతా.. బడీ, గుడీ పక్కపక్కనే ఉన్నయి కదా.. నేను బళ్ళె కూసుంటే, నువు బడి ముందలున్నా కనపడతవు గుడి ముందలున్నా కనపడతువు. నువ్వోపాలి పిలువు నీ కాడ వాలిపోతా.. నేను సుత బళ్ళెకు పోత.. బళ్ళె పగటేల బువ్వ పెడతరట.." అంట ఎన్నోరకాలు బతిమిలాడిన.

సరేనన్నడు తాత. ఒక రోజు తాత చెయ్యి పట్టుకుని బళ్ళెకు తీసక పోయిన. లోపలకు పోతుంటే "లోపలకు రావొద్దు బళ్ళె అడుక్కోవద్దు" అన్నరు ఎదురైన పంతుళ్ళు. 

"అడుక్కోను రాలేదు" అన్న నేను.

"మరెందుకొచ్చినవు లోపలికి" అన్నరు వాళ్ళు.

"నేను కూడా సదవుకుంటా.." అన్న నేను.

"అబ్బో.. ఆ గదిల పెద్ద సారున్నడు. ఆడికి పో.." అని తప్పుకున్నరు. 

నేను తాత సెయ్యి పట్టుకొని లోపలికి పోయిన. 

"తాతా.. సెప్పూ.." అన్నా తాతసెయ్యి పట్టుకొని ఊపుతూ. "దండాలు సామి.. మా పోరి బళ్ళె సదువు కుంటదట, కూసోబెట్టుకోండి సామీ.." అన్నడు. 

ఆ పెద్దసారు మా ఇద్దరిని పైకి కిందికి చూసి..

"సరే పేరేంటి ?" అన్నడు

"పేరూ.. పేరూ 'పోరి'" అన్నడు తాత. 

"పోరా.. అదేం పేరు?" అన్నడాయన.

నేను "ఔను సారు 'పోరి' నాపేరు. అందరు అట్లనే పిలుస్తరు" అన్నా. 

"తండ్రిపేరు ? తండ్రి ఏమి చేస్తడు. నువ్వేమైతవు" పెద్దసారు ప్రశ్నలేసిండు.

ముసులోడికి కూడా నా తండ్రి పేరు గుర్తుకు రాలేదు. తల గోక్కుంట 'దేవుడు' అన్నాడు. అదే రాసుకున్నడు పంతులు. 

"ఏమి కులం.  ఏమి సేస్తరు".

 "అమ్మా అయ్యా లేరు సామీ. ఆల్లు చచ్చిపోయిన్రు. ఇగ కులమంటే యాచకులం" అన్నడు ముసలోడు. 

అదేదో కులమే అనుకొని అదే రాసుకుండాయన. 

"మరి నీ పేరేంది?". "పెంటయ్యి.."

" ఏమి చేస్తవు". "అడుక్కుంటం".

"ఎప్పుడు పుట్టింది". 

"ఉగాది ముందు రోజు అమాసనాడు.. మునపటి సమ్మక్క జాతరప్పుడు" ముసలోడన్నడు.

"రేపడ్నించి బడికి పంపు ఇక వెళ్ళండి..," అన్నడు పంతులు.

 నా సంతోషానికి ఆదుపు లేదు ఎగురుకుంట దునుక్కుంట గుడిసెకొచ్చినం. ఎప్పుడు తెల్లారుద్దా అని ఎదురు సూసిన.. నీళ్ళు పెట్టి నెత్తి దువ్వుకున్న. తాతను గుడి మెట్లకాడ కూసో పెట్టి. బడికెల్లే సూసుకుంట కూసున్న. గుడంటే తెల్లారక ముందే తలుపులు తెరుస్తరు. బడికి పొద్దెక్కాలె కదా.. ముందు రోజుట్లాగానే సేతులు సాచుకుంట గడిపినం. బడి గంట మోగింది. గుడికాడి నించి తాతను తీసకొచ్చి బడి ముందల కూసోపెట్టి బళ్ళెకు పోయిన. పలకా బలపం లేకుండ చేతులూపుకుంట పోయిన.  పిల్లలంతా నా సుట్టు మూగిన్రు. "కొత్తగొచ్చినవా..? పలకేది? ఏ నువ్వు బిచ్చపోల్ల పోరివి కదా..?" తలా ఒక మాట అనడం మొదలు పెట్టిన్రు. 

"ఔను.. నేను కూడ చదువు కుంట" అన్న బిక్క మొకమేసుకొని ... "మరి పలకేది" అని అడుగుతుంటే అందరిని తోసుకొని నిన్న పేరు రాసిన సారు దగ్గరికి పోయిన. "సార్ నాకు పలక లేదు. ఒక పలకియ్యి" అన్న. 

నేను అడిగిన తీరుకు చికాకు పుట్టింది  ఆయనకు. కాని ఎదురుంగ ఎవరో పెద్దాయన కూసొని ఉన్నడు.


 సారు లేచి, పోయిన సారి పంచంగ మిగిలినయి అనుకుంట మూలకు కొన్ని పలకలు పేర్చి ఉన్నయి. అండ్ల కెల్లి ఒకటి తీసిచ్చి, ఎదురుంగ ఉన్న తరగతి  సూపిచ్చుండు. అందుల కూసోమని. ఎగురు కుంట పొయిన. పట్టరాని ఆనందంగ ఉంది నాకు. తరగతిల పిల్లలందరు ఒక్క సైజు వాళ్ళే.. కానీ అంగన్వాడీలో శిశుమందిర్లో కొంత నేర్చుకున్న వాళ్ళు. నాకు ఆ పోకడలు తెలవవు. అయినా బిడియం, భయం లేకుండా అందరినీ ఆశ్చర్యంగా ఆనందంగా నవ్వులతో పలకరింపుగా చూసిన.. అదొక పూలతోట, రకరకాల సీతాకోక చిలుకలతో పక్షుల కిలకిల రావాలా సమాహారం. 


రోజూ పంతుళ్ళేదో చెపుతున్నరు, మేమంతా ఏదో నేర్చు కుంటున్నము. గుడిసెకొచ్చినంక తాతతో బళ్ళె సంగతంతా గుక్క తిప్పుకోకుండా చెప్పేదాన్ని.. విసుక్కోకుండా వినే వాడు తాత.  బళ్ళో మధ్యాహ్నం అన్నం పెడతరు. బళ్ళో పెట్టిన అన్నం తాతకు తినిపించి, నేను తినేది. బళ్ళె ఇచ్చిన గుడ్డు, అరటిపండు చెరి సగం తినేవాళ్ళం.  బట్టలు పుస్తకాలు కూడా ఇచ్చిన్రు. ఏ తోడు నోచుకోక, ప్రేమకు నోచుకోక తిరస్కారాల చీత్కారాల మధ్య పెరిగిన నాకు, బడి ఒక స్వర్గదామమయింది. 


నాకు ఎనిమిదేళ్ళు వచ్చినయి. ఒక రోజు తాత నిద్రలనే కన్నుమూసిండు.. ఇన్ని నాళ్ళు  తాత తోడున్నడు. ఆ తోడు కూడా దూరమయింది నాకు ఆరోజు. నేను భయపడలేదు కానీ శోకాలు పెట్టి ఏడ్చిన, దీర్ఘాలు తీసి ఏడ్చిన. నన్ను పెంచిన అమ్మమ్మను దానం చేసినట్టే చుట్టు పక్కల గుడిసెల వాళ్ళంతా కలిసి తాతను దానం చేసిన్రు.. రెండు రోజులు బడికి పోలేదు. మూడోరోజు బడికి పోయిన. పిల్లలందరు తాత చచ్చిపోయిన సంగతి టీచరుకు చెప్పిన్రు. ఆమె శాన మంచిది నన్ను హాస్టల్లో చేర్చింది. పదవ తరగతి పరీక్షలు జిల్లా స్థాయి ర్యాంకులో పాసయిన. ప్రైవేట్ కాలేజీల వాళ్ళు ట్రాప్ చెయ్యాలని చూశారు. కానీ ఒప్పుకోలే.. గవర్నమెంట్ కాలేజిలనే చదివిన. 

మా అమ్మనాన్న గుడిసున్న స్థలం, నన్ను పెంచిన అమ్మమ్మ గుడిసున్న స్థలం రెండు నేనే శుభ్రంగ ఉంచేది సెలవులప్పుడు. 

కానీ.. ఇప్పుడది ఒక హోమ్. హోమ్లెస్ పీపుల్ హోమ్. దానిని నేనే కట్టించిన. ఎట్లా అంటే..


నాలాగే తల్లి తండ్రులు లేని పిల్లలను బిక్షాటన చేసే పిల్లలను రాత్రి పూట గుడిసెల్ల పండుకోనిచ్చేది.. తాగొచ్చి తన్నే మొగుళ్ళున్న ఆడోళ్ళకు, కడుపుతో ఉన్న బిచ్చగత్తెలకు, స్టేషన్లో, ఫుట్ పాత్ మీద, చెట్ల కింద పండుకునే ఆడపిల్లలకు ఆ గుడిసెల్ల తావిచ్చిన. ఇంటర్ పూర్తి చేసిన నేను చదువు మానేసిన..  ఎందుకు చదువు మానేసిన్నో తర్వాత చెప్త.

మొదట్లో ఇళ్ళల్లో పనిచేసేవాళ్ళు హోటళ్ళల పని చేసేవాళ్ళు అక్కడ మిగిలిన తిండి పదార్థాలను పట్టుకు వచ్చి నా గుడిసెలో ఉండే వాళ్ళకిచ్చేవారు. ఇదంతా నేను చెప్పినంత సులభంగా జరగలేదు.. 


నిలువ నీడ లేక అడుక్కునే వాళ్ళకు తాగటానికి దొరికేది గుడుంబా, బెల్టుషాపులు అందరికీ అందుబాటులో ఉండేయి. తెల్లటిచిక్కటి ద్రవమేదో చిన్నచిన్న సీసాలల్ల దొరికేది చిన్నపోరగాళ్ళ నుండి ముసలోళ్ళ వరకు తాగెటోళ్ళు. గంజాయి, భంగు, డ్రగ్స్ విచ్చలవిడిగా ఈ నిరుపేదలైన దరిద్రులకు దొరికేవి. మత్తుల తూగే వాళ్ళు రాక్షసుల్లా మీద పడేవారు చిన్నపిల్లలు దొరికినా ఆడపిల్లలు దొరికినా జంతువుల కంటే హీనంగా ప్రవర్తించే వాళ్ళు. తల్లిదండ్రి లేని నేను ఎన్నోసార్లు వాళ్ళ పాలబడ్డాను. ఆ పైశాచిక క్రీడకు బలయ్యాను.. ఒకసారి కడుపొచ్చింది. విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. డాక్టర్  పరీక్ష చేసి 'ప్లాసెంటా ప్రివ్యా' అంటూ ఏదో చెప్పారు అబార్షన్ చెయ్యడం కుదరదన్నారు ఆపరేషన్ చేసారు. ఇక పై తల్లివయ్యే అవకాశం లేదన్నారు. ఈ వీధి పిల్లలే నా పిల్లలు నాకు జరిగినట్టు ఎవ్వరికీ జరగకూడదు. 

అందుకే నేను నా శరీరం పెట్టుబడి పెట్టి ఈ 'ఆనందధామం' భవనం కట్టించిన. ఈ హోమ్ నడుపుతున్నా.. నాకు లభించిన జాలి దయను వడ్డీతో సహా చెల్లిస్తూన్నా. నేను చేస్తున్న పని నచ్చిన వాళ్ళు డోనర్స్ గా ముందుకొచ్చారు. ఇక్కడుండి చదువుకున్న వాళ్ళు మంచి ఉద్యోగాలలో ఉన్నారు. వాళ్ళు ఈ హోమ్  కు అన్నిరకాల అండగా ఉన్నారు. ఇదొక 'కొత్త చూపు'. ఎవరు ఇచ్చినా ఇవ్వక పోయినా  దీనిని నడప గలను. ఇందులో పిల్లల మీద గాని, ఈ భవనం మీద గానీ కన్నేసిన వాళ్ళను వదిలి పెట్టను. ఇది అనాథల ఆనందం ధామం" అని ఆగింది. 

ముందుకు వంగి బాటిల్ తీసుకుని గడగడ నీళ్ళు తాగింది.

 "మరి నేను వెళ్ళొస్తా.." అని చేతులు జోడించి గది నుండి బయటకు నడిచింది.


*******


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష