పరజ నవల పరిచయం

'పరజ' ఒక కొత్తప్రపంచం పరిచయం

-జ్వలిత



'పరజ' అనేది ఒరిస్సా లోని కోరాపుట్ పర్వత శ్రేణుల్లో అడవి ప్రాంతపు గిరిజన తెగ. ఆ పేరుతోనే గోపీనాథ్ మొహంతి (1914-1991) ఒరియా భాషలో రాసిన "పరజ" అనే నవల 1945వ సంవత్సరం వెలువడింది. పరజ నవలకు 1955లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

'పరజ" నవలను విక్రమ్ కే దాస్   "పరజ"  అనే పేరుతోనే ఆంగ్లానువాదం చేశారు. 1987లో

ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రథమ ప్రచురణ చేసింది. తరువాత 1989లో ఆక్స్ఫర్డ్ ఇండియా పేపర్ బ్యాక్స్ రెండోసారి ప్రచురించింది. 

నవల మొత్తం 114 చాప్టర్లు ఉంది..


భౌగోళికంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఉత్తర సరిహద్దు రాష్ట్రంగా ఒరిస్సా ఉన్నది. ఒరిస్సా రాష్ట్రంలోని బరంపూర్ దాటినాక కోరాపుట్ రాయగడల మధ్య రోడ్డును కలుపుతూ  దారి దిగువకు ముందుకు సాగుతుంది. అక్కడ ఒకదానికెదురుగా మరొకటి రెండు వరసలుగా పర్వతాలున్నాయి. ఒకవైపు ఏబై, మరొకవైపు నలబై ప్రత్యర్ధులైన మల్లయోధులు పోటీకి సిద్ధంగా నిలుచున్నట్టు ఉంటాయి. అవి దాటి కొంత దూరం పోతే ధర్మధోర్ తర్వాత లచ్చింపూర్ వంటి అనేక గ్రామాలు ఉంటాయి ఆ కొండప్రాతంలో.. లచ్చింపూర్ అనే చిన్న గ్రామంలో పరజ, డోంబ్ తెగలకు చెందిన గిరిజనులు వేరువేరు వీధుల్లో నివసిస్తుంటారు. అడవిలో తమ చుట్టూ ఉన్న భూములను చదును చేసుకొని చిరుధాన్యాలు కూరగాయలు వంటివి పండిస్తూ ఉంటారు. అడవిలో లభించే తేనె, చింతపండు, కుంకుడుకాయలతో పాటు వంట చేసుకోవడానికి కావలసిన కట్టెలను తెచ్చుకుంటూ... పశువుల పెంపకం, వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా బతుకుతూ ఉంటారు.

      అటువంటి గిరిజన తెగకు చెందిన వారిలో శుక్రుజానీ ఒకడు. అతనికి ఇద్దరు కొడుకులు మాండియాజానీ, టిక్రాజాని... ఇద్దరు కుమార్తెలు జిలీ, బిలీ వారి పేర్లు. అతని భార్య సంబారి అడవిలో ఆకుకూరలు తెచ్చేందుకు వెళ్లి పులి బారిన పడి చనిపోయింది. తల్లి పోయిన తర్వాత వంట బాధ్యతను తీసుకున్నది పెద్ద బిడ్డ జిలీ తన పదహారేళ్ళ వయసులో…

 ప్రకృతిలో భాగంగా తమను తాము భావించుకొని ప్రకృతి సంపదంతా తమ కోసమే అని అనుకుంటూ అమాయకంగా జీవించే ఈ గిరిజన జాతుల జీవన విధానాన్ని రచయిత వర్ణించిన తీరు అద్భుతంగా ఉంటుంది.

 అయితే ఆహ్లాదకరమైన అటవీ ప్రాంతాన్ని,  అటవీసంపదను, గిరిజనుల శ్రమ శక్తిని దోచుకునేందుకు భూస్వాములు, ప్రభుత్వము ఏ విధంగా కర్కశంగా ప్రవర్తించిందో... ఈ నవలలో స్పష్టంగా వివరిస్తాడు రచయిత. తమకు తాము స్వతంత్రంగా బ్రతికే అమాయక గిరిజనులకు నాగరిక ప్రపంచంలోని చట్టాల చట్రాలు తెలయవు.. 

అమాయకంగా అడవిని తమ శ్రమశక్తిని నమ్ముకొని బతికే ఒక గిరిజనుడు, తమ కొడుకులతో కలిసి ఒక వ్యాపారిని హత్య చేసి హంతకునిగా మారే పరిణామ క్రమం నవలలో కథాంశం. 

 ఈ నవలలో అమాయక గిరిజన యువతులను శారీరకంగా, లైంగికంగా దోచుకునే ఫారెస్ట్ అధికారుల వ్యాపారస్తుల స్వార్థపూరిత కుట్రలను కంటికి కట్టినట్టు వివరించాడు రచయిత. తోటి గిరిజనుణ్ణి ప్రమాదంలోకి నెట్టేందుకు మరొక గిరిజనుణ్ణి పావుగా మార్చుకునే నాగరిక స్వార్థ శక్తులను చూసి ఆశ్చర్య పోతాము మనం.

చిన్న చిన్న అవసరాలకు గిరిజనులకు ఋణాలిచ్చి, చదువురాని వారి చేత వేలిముద్రలు వేసుకొని వారి వ్యవసాయ భూములను ఆక్రమించుకుని, వారిచే వెట్టి చేయించుకుంటూ కట్టుబానిసలుగా మార్చిన వ్యాపారులు.. భూస్వాములు.. కొద్ది పాటి మార్పులతో ఇప్పటికీ కొనసాగుతున్నారు.

     అడవే తమ ప్రపంచంగా వారి పండుగలు, సంప్రదాయాలు ఆహారనియమాలు.. స్త్రీ పురుష ఆకర్షణలు, చనిపోయిన వారి ఆత్మలు తమకు శక్తినందిస్తాయనే వారి నమ్మకాలు.. అడవి అందాలు.. కొండల్లో సెలఏళ్ళు.. అందమైన అడవి జంతువులు, పశుపక్షాదులు… వాటిని వేటాడే తీరు… వంటి అనేక కొత్త విషయాలు తెలుసుకుంటాము. 


# నవలలో క్రింద ఇచ్చిన కొన్ని సంఘటనలను చదవండి మీకే అర్థమవుతుంది. రచయిత నవలను సామాజిక, ఆర్థిక, మానసిక కోణాలలో గిరిజనుల జీవితాలను ఎంత బాగా ఆవిష్కరించారో తెలుస్తుంది.


# శుక్రుజానీ మంచి పనిమంతుడు. కానీ అతని పని అతనిని పీడించి ఓడించింది. మట్టి గోడ కట్టేప్పుడు ఒక ముద్ద పై మరొకటి చేరుస్తూ గోడ పెంచుతున్నప్పుడు అతనికి గతంలోని తన ఆలోచనలు గుర్తుకు వచ్చాయి. తన పిల్లల కోసం ఎన్నో ఇళ్ళు కట్టాలి అనుకున్నాడు. వారి భవిష్యత్తు కోసం ఎన్ని కలలుకన్నాడు. ఇప్పుడు కొడుకుతో కలిసి శ్రమ పడుతున్నాడు. కానీ అవి యజమాని గోడలు మాత్రమే పైకి పైకి లేస్తున్నాయి కప్పు కోసం కట్టే చట్రాలకు అడవి తీగలను చుడుతున్నారు. వరి గడ్డితో కప్పు తున్నారు. వడ్డీ వ్యాపారి కోసం కష్టమంతా చేస్తున్నారు అది మాత్రమే కాదు.(22వ చాప్టర్) ఒక శ్రామికుడు ఎంత నైపుణ్యం కలిగిన వాడైనప్పటికి సమాజంలోని దోపిడీ వ్యవస్థ అతడి ఆశలను ఎంతగా చిదిమి వేస్తుందో తెలుపుతుంది పై పేరా.


# యువతులంతా నిద్ర లేవగానే, రంగు రంగుల ముగ్గులు వాకిళ్ళలో, గోడల మీద చిత్రించడంలో మునిగిపోయారు. కనీసం ముఖం కడుక్కోడానికి కూడా ముగ్గులు వేయడం ఆపట్లేదు. తెలుపు పసుపు రంగులతో గోడలన్నీ అలికారు. వరండాలని నలుపు పసుపు రంగులతో. ఉల్లాసం కలిగించే డిజైన్లను చిత్రించారు. గోడల మీద వరండాలో బియ్యం పిండిని నీటిలో కలిపి రంగులతో ముగ్గులు వేశారు. చివరికి గుడిసె లోపల నేలంతా రంగులతో నింపారు. తలుపులు కిటికీలు దర్వాజాలకు బొగ్గు పొడి నూనెలో కలిపి పూసారు. చిన్న చిన్న గుడిసెలు నవ వధువుల వలె మెరుస్తున్నాయి. 


కొందరు స్త్రీలు బట్టలుతికేందుకు కట్టెల బూడిద కలిపి ఉడికిస్తున్నారు. మరింత తెల్లగా అయ్యేందుకు బలంగా బండకేసి బాదుతున్నారు అన్ని మరకలు పోయేందుకు. తర్వాత తమ వంతు స్నానం చేసి  తలలను అలంకరించుకున్నారు. చివరిగా చేతికున్న భారీ ఇత్తడి గాజులను రుద్ధి రుద్ది మెరుగు పెట్టడం చేశారు. మధ్యాహ్నం కంటే ముందు వాటిని మెరిసేలా రుద్ధి తృప్తి పడ్డారు. ఆ తర్వాత అందమైన రంగుల చీరలు మడత పెట్టి, బిగుతుగా నడుము చుట్టూ మోకాళ్ళు దాటకుండా కట్టి గుంపులుగా అడవిలోకి అదృశ్యమయ్యారు. తాజా పూలను వెతికి కొప్పులో ధరించేందుకు. వారు తలలో పూలు లేకుండా నాట్యం చేయరు.(25 వ చాప్టర్) ప్రపంచంలో ఎక్కడైనా, ఏ కాలంలోనైనా.. స్త్రీలు సౌందర్య పిపాసులు, మిక్కిలి శ్రమజీవులు అని చెపుతూ గిరిజన తెగల సంప్రదాయాలను వివరించాడు రచయిత.


# శుక్రుజానీ చుక్కల్ని లెక్కపెడుతూ ఉన్నాడు. ఆకాశమెంత విశాలంగా ఉందనుకున్నాడు. ఈ విస్తారమైన ఆకాశంలో ఎక్కడో ధర్మం ఇల్లు ఉండే ఉంటుంది. జరుగుతున్న ప్రతిదానిని ధర్మూ చూస్తూనే ఉంటాడు. కానీ అతడు ఎవరికీ కనిపించడు. అన్ని చూస్తూనే ఉంటాడు కానీ ఎప్పుడు మాట్లాడాడు. పండ్రమాలి పర్వతశిఖరం వలె మౌనంగా ఉంటాడు. ప్రత్యేకమైన నిర్ణీత కాలంలో ప్రకాశించే నక్షత్రం వంటిది పండ్ర మాలి పర్వత శిఖరం. బాధలన్నిటినీ దేవుడికి నివేదించాలి. కానీ ధర్మదేవతకు మేకలు, పావురాలు బలి ఇవ్వకపోతే వేగంగా భయంకరంగా కోపగించు కుంటాడు.


ధర్మం దృష్టినుండి ఏది తప్పించుకోలేదు. ధర్మూ ఎవరినైనా చంపనూగలడు, చనిపోయిన వారిని తిరిగి బ్రతికించనూ గలడు. ఏ మనిషైనా గత జన్మలో తప్పు చేసినట్లయితే వారిని తొందరగా చంపేసి, ఆ ఆత్మను వేరొకరి గర్భంలో విసిరి మళ్లీ జన్మించేట్టు చేయగలడు. ఒక ఆత్మ తనంతట తాను మళ్ళీ జన్మించ గలదా లేదా ధర్మం ఆజ్ఞప్రకారం అన్నీ జరుగుతున్నాయా.(102వ చాప్టర్) నిస్సహాయత ఆవరించిన ప్రతిసారీ ధర్మాన్ని తలుచుకోవడం, కనపడని దేవతలు రక్షిస్తారని గుడ్డిగా ఆశపడడం మానవ నైజం అని చెప్తాడు రచయిత పై పేరా ద్వారా..



   # షావుకారు తన పెదవులను విరుస్తూ, కుటిలంగా నవ్వుతూ అవును జిలీనే. ఇంకొకతి ఉన్నది కదా ఇంకా ఇంట్లోనే బిలీ. పిలవండి దాన్ని నా దగ్గరకు, తీసుకురండి నా దగ్గరికి. నేను మీ భూమిని తీసుకున్నాను. ఒక చెల్లెను తీసుకున్నాను. ఇంకొక చెల్లెను కూడా తీసుకుంటాను. మీ భార్యలను కూడా తీసుకుంటాను. మిమ్మల్ని కోర్టుల చుట్టూ ఒక కోర్టు నుండి మరొక కోర్టుకు దేశమంతా తిప్పు తాను. చెమటలు కక్కిస్తూ గోటీలుగా మీ జీవితాలను మారుస్తాను. మీ ముక్కులను మట్టిలో రాయిస్తాను. ఒకవేళ అట్లా చెయ్యలేకపోతే నా పేరు రామచంద్ర బిసాయి కాదు" అన్నాడు. 


        పిడికిలి పైకెత్తి అరుస్తూ "లంజా కొడకల్లారా ! మీకు సిగ్గు అనిపించడంలేదు ? ఆడవాళ్ళ లాగా శోకాలుపెట్టి ఏడుస్తున్నారు. పొండి పొండి ....  "అంటుండగానే., 


        ఆ పరజా తండ్రీకొడుకుల తలల్లో ఏదో ఆలోచన కలిగింది. వారి కళ్ళు మెరిసాయి. వారి శరీరాలు వణికిపోయాయి. మాండ్య జానీ ఒక క్రూరమృగంలా గట్టిగా గర్జిస్తూ, ఒక్క అంగలో ముందుకు దూకాడు. "నువ్వు మమ్మల్ని మోసం చేశావు మా భూమి కోసం షావుకారూ. కానీ నీవు ఆ భూమిని అనుభవించ లేవు.  నువ్వు అనుభవించ లేవు" అన్నాడు.

      

        మెరుపులా గొడ్డలి లేపి, షావుకారు తలపై ఒక్క వేటు వేశాడు. వెంటనే మిగిలిన ఇద్దరు కూడా అతనితో కలిశారు. షావుకారు మొదలు నరికిన చెట్టు వలె కూలిపోయాడు. మాండియా దెబ్బ మీద దెబ్బ అరుస్తూ వేస్తూనే ఉన్నాడు.

"నీవు మా భూమిని అనుభవించ లేవు. నువ్వు అనుభవించ లేవు" అంటూ. 


    జిలీ భయంగా కేకలు పెడుతూ పరుగు పెట్టింది. 


    రక్తమంతా వారి ముఖాలపై కళ్ళపై చిమ్మింది. అప్పుడు వారు స్పృహలోకి వచ్చారు. అప్పటికే వారి బట్టలన్నీ రక్తంలో తడిచాయి. వారి చేతుల్లో ఉన్న గొడ్డళ్ళ నుండి నెత్తుటి బొట్లు రాలుతూన్నాయి. వారు నోరు పెద్దగా తెరిచి, కనురెప్పలేయకుండా షావుకారు శరీరాన్ని చూస్తూ కొన్ని క్షణాలు ఉన్నారు. తరువాత టిక్రా తన గొడ్డలి విసిరేసి శోకాలు పెట్టడం మొదలుపెట్టాడు. 


       శుక్రుజానీ ఓహో అన్నాడు విస్మయంగా. మాండియా తండ్రి వైపు చూశాడు. తండ్రి కొడుకులు ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకుని ఏడ్చారు. వారి కన్నీళ్లు రక్తంలో కలిసి పోయాయి. సింధూర రంగు సూర్యుడు పొగమంచును కరిగించుకుంటా పైపైకి పాకుతున్నాడు. అంతా ఎరుపు రంగులోకి మారింది. 


    ఆరోజు మధ్యాహ్నం ముగ్గురూ కలిసి, ఎలా ఉన్నారో అదేవిధంగా లచ్చింపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్ళారు. "మేము ఒక మనిషిని చంపాము. మాకు తగిన శిక్ష వేయండి" అన్నారు.


సబ్ ఇన్స్పెక్టర్ అది విని ఉలిక్కిపడ్డాడు. హే అంటూ….(114వ చాప్టర్)

ఆ అరుపుతో నవల ముగస్తుంది.. బలహీనులను సైతం హింసకు ఉసికొలిపే స్వార్దపరులు చివరికి అలా అంతమై పోతారు… కోల్పోవడానికి జీవితంలో ఏమీ మిగలని మనిషికి భయం ఉండదు… అణిచివేత తిరుగుబాటుకు మూలకారణం.. వంటి జీవిత తాత్వికతలను చెప్పే నవల 'పరజ'. పాఠకులను రంజింప చేయడమే కాదు, ప్రతి ఒక్కరూ తమను తాము ఈ నవలలో ఎక్కడో ఒక చోట వెతికి పట్టుకోగలరు… వెతకండి మరి..

######

రచయిత పరిచయం


గోపీనాథ్ మొహంతి ఒరియా సాహిత్యంలో ప్రసిద్ధ సాహితీవేత్త. అతని జననం 1914, మరణం 1891. ఇరవైకి పైగా నవలలను ఎన్నో  కథలను ఒరియా భాషలో రాశాడు. 1947లో రాసిన "పరజ" అనే ఒరియా  నవలకు 1955లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. జ్ఞానపీఠ అవార్డు 1974 లో, పద్మభూషణ్ 1981లో లభించాయి.

'పరజ' నవలను ఒరియా నుండి ఆంగ్లంలోకి విక్రమ్ కె.దాస్ అనువాదం చేశారు.

****



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష