శిశిరోన్ముఖం(కథ)

శిశిరోన్ముఖం


జ్వలిత


"ఒరే పవన్ మీ పెళ్ళెప్పుడురా…?" శీను.

"ఏమో మామా నాకీజీవితంల పెళ్ళిరాతలేనట్టుంది. అనిత పెళ్ళొద్దంటున్నది" దిగులుగా అన్నడు పవన్.

" అదేంటిరా.. ప్రేమించుకున్నమంటివి కదా.. పెళ్లి ఎందుకు వద్దట? విచిత్రాల పిల్లలురా మీరంతా.." విసుక్కున్నడు పవన్ మామ శీను.

"విచిత్రం ఏమీ లేదు.. అనితకు పెళ్ళంటె ఇష్టం లేదు.." పౌరుషంగా జవాబిచ్చిండు మేనల్లుడు పవన్.

"అంటే.. పెళ్ళి లేకుంట కలిసుంటరా? వాళ్ళోళ్ళు ఒప్పుకుంటరా? మీ అమ్మ నాయన ఊకుంటరా ? నన్ను ఇరికించకొరేయ్.." భయంగా అన్నడు శీను.

"కలిసుంటె తప్పేంది ? కోర్టు కూడా 'సహజీవనం' న్యాయ సమ్మతమే అన్నదికదా ! అయినా అనిత కలిసి ఉండదు, పెండ్లి చేసుకోదు. ఇందుల నిన్ను ఇరికిచ్చుడేమి లేదులే.." నసిగిండు పవన్.

"అబ్బ.. ఏందిరా నీ గోల? సరిగ చెప్పు" పంచర్ ఏస్తున్న సైకిల్ ట్యూబ్ నీళ్ళల్ల వదిలి వచ్చి, పవన్ పక్కన సిమెంట్ అరుగు మీద కూసున్నడు శీను. మళ్లీ తనే

"పెళ్ళి చేసుకోరు, కలిసుండరు.. ఉత్తగనే ప్రేమ పచ్చులోతిగ జీవితమంతా.. షికార్లు తిరుగుతరా" చతురాడిండు . 

"నీకు పరాసికం అయితంది... నాకేమో అయోమయంగా, గందరగోళంగా ఉన్నది. ఎవరికీ చెప్పలేక నీకు చెప్పిన. 

అందుకే నీకు అలుసయిన" చిన్న బుచ్చుకున్నడు పవన్.

"ఇంతల్నే చిన్న బుచ్చుకుంటె ఎట్టరా.. మీ దోస్తులందరికి ఎరకైన సంగతే కదా! సరేలే.. నేనేం చెయ్యాలో చెప్పు…" అంటు భుజం మీద చెయ్యేసిండు.

"నేనేం చెయ్యాలో తెలిస్తే కదా! నువ్వేమి చెయ్యాలో చెప్పేది. అనితంటే నాకు ప్రాణం. ఆమెకు కూడా నేనంటే ఇష్టమే.. పెళ్ళి చేసుకుందామంటే వద్దంటది. ఎందుకు వద్దో చెప్పదు. పెళ్ళి మాటెత్తితే రెండు మూడు రోజులు ఫోనే మాట్లాడదు.. ఇన్ని రోజులు నౌకర్ లేదు, బతికేదెట్లని భయపడుతాందనుకున్నా.. కానీ ఇద్దరికీ ఉద్యోగాలొచ్చినయ్.. ఒకటే కులం. మరి సమస్యేమిటో సమజ్ కాట్లేదు.."  విచారంగా అన్నడు పవన్.

"వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడితే ఎట్లుంటది" శీను. 

"ఆమెకు తండ్రి లేడు మామా.. తల్లీ, తమ్ముడున్నరు. తమ్ముడు ఇంటర్ చదువుతున్నడు".

"మీ అమ్మా నాయినకు తెలుసా.. మీరు ప్రేమించుకున్న సంగతి".

"తెలవదు. ఫలానా అని తెలవదు. కానీ, 'ఎవరినన్న ఇష్టపడతన్నవా' అని అడిగింది మా అమ్మ. ఈ మధ్య ఊకె ఫోన్ల మాట్లాడుతంటే.. 'తర్వాత చెప్తలే' అన్న నేను" పవన్.

"మనిద్దరం పోయి వాల్లమ్మతో మాట్లాడుదాం.. సంగతేందో వివరం అడుగుదామా.. మీ అత్తను సుత తీసక పోదాము".

"అనిత పెండ్లే వద్దంటది.. వాల్లమ్మను అడిగితే.. అసలు నాతో స్నేహమే వద్దంటే ఎట్లా.. నేను తట్టుకోలేనుమామా" బేలగా అన్నడు పవన్.

"అనితోల్ల ఊర్లనే మీ అత్త దోస్తొకామె ఉన్నది. ఆమెను అరుసుకోమంట, నువు ఫికర్ చెయ్యికు. నాకు నాలుగు దినాలు గడువియ్యి" అనుకుంట పవన్ భుజం సరిసి లేచి, మళ్ళీ సైకిల్ ట్యూబ్ ఉన్న నీళ్ళతొట్టి దగ్గర కూర్చున్నడు శీను. 

పవన లేచి " మర్వకు మామా.. పోయొస్త.." అనుకుంట రోడ్డెక్కిండు దిగులుగా..

*** *** ***


"అమ్మా ఈరోజంతా ఆన్లైన్ మీటింగుంటది... రాత్రి ఏడింటి దాక, నేను నీకు ఏ సాయం చెయ్యలేను. నన్ను పిలవకు" ఉక్మా తినుకుంట చెప్పింది అనిత వాళ్ళమ్మ సరోజకు.

"సరెలే.. తలుపేసుకో బయట సప్పుడు ఇనపడకుంట. దుకనం కాడికొచ్చినోళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతరు గదా... పగటికి అన్నం తినుడు మరిసి పోకు. నాకు దుకన్లనే సరిపోతది" అన్నది సరోజ.

 "మీటింగ్ బ్రేకుల తింటలే.. నువు టైముకు తిను బేరంల పడి మరచిపోకు" అనుకుంట టిఫిన్ తిన్న ప్లేటు ఎంగిలి గిన్నెలల్ల ఏసి, పక్క గదిలకు పోయి తలుపేసుకుంది. 

సరోజ కూడ వంట బండ సదిరి దుకన్లకు పోయి, అక్కడున్న కొడుకుతో "ప్లేట్ల ఉక్మ పెట్టిన, పగటికి టిఫిన్ డబ్బ పెట్టిన చప్పుడు చెయ్యకుండ తిని.. కాలేజీకి పో.. అక్క మీటింగ్ల ఉన్నది" అన్నది.

"సరే అమ్మ... చానా ఆలస్యమైంది, మొదటి పిరేడ్ అయిపోతది నేను పోయేటాలకు, రోజిదే తంతు " అనుకుంట దుకనంల నుంచి ఇంట్లకు నడిచిండు అనిత తమ్ముడు రమేష్.

ఆరోజు సోమారం బేరాలు పల్చగున్నయి. నిన్న మిగిలిన నీసు కూరలతోటే నడిపిస్తరు చానా మంది. అందుకే కూరగాయల మండి నించి ఎక్కువ కూరలు తేలేదు సరోజ.. మిగిలినా పాడుకాని ఆలుగడ్డ, క్యారెట్, వంకాయ వంటివి తెచ్చింది.

అప్పుడొకల్లు ఇప్పుడొకల్లు వస్తున్నరు... పేరుకు సరోజది చిన్న కూరగాయల దుకనమే కానీ, అల్లం ఎల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు, వడియాలు, అప్పడాలు, చిన్న పిల్లలకు చిప్సు పాకెట్లు, బిస్కెట్లు, పెద్దోళ్ళకు సిగరెట్లు, అగ్గిపెట్టెలు, జరదా పాకెట్లు వంటివి కూడా అమ్ముద్ది. అందరికీ అవసరమైన సర్ఫు, షాంపు పాకెట్లు సబ్బులు వంటివి కూడా పెట్టుకుంది. కూరగాయల దుకణమే అయినా సగం కిరాణం సామాన్లుంటయి.


    ఆ దుకాణం మీదనే ఇద్దరు పిల్లల్ని సదివించింది. అనితకు ఉద్యోగం వచ్చినంక కొంచెం బెంగ తీరింది సరోజకు. కరోనా చేయబట్టి  ఇంటి నుండి పని మొదలై తర్వాత కూడా ఇంట్లకెల్లి కొలువు నడిపిస్తున్నయి కొన్ని కంపెనీలు. అందుకే అనిత ఇంటి నుండే పని చేస్తుంది.. మీటింగ్ లున్నపుడు తల్లికి ముందే చెప్తుంది. సరోజ దుకనంల లొల్లి కాకుండా బేరం చేసుకుంటది. 


సరోజది రెండుగదుల రేకులిల్లుకు ఒక వరండా...

వరండాకే వెడల్పుగా ఉన్న దర్వాజ బెట్టి మూడు మడతల తలుపు పెట్టిచ్చింది దుకనం కోసం.


మధ్యాహ్నం రెండు గంటలయింది. ఆగష్టు నెల ఆకరు వారమే అయినా, ఎండాకాలం లాగా ఎండ తీవ్రంగున్నది.  ఇంకా అన్నం తినలేదు సరోజకు ఆకలైతంది. తలుపేసి లోపలికి పోతే అనిపించింది. అమ్మో.. ఏదన్న బేరం

తిరిగి పోతాదేమోనని భయపడ్డది. ఇంతకు ముందు దుకానంల కూసోనే అన్నం తినేది బేరం చూసుకుంట.


అనితకు ఉద్యోగమొచ్చినంక, అట్ల తిననియట్లేదు.

'ఇంట్ల కూర్చొని నిమ్మలంగ అన్నం తినమ్మా. ఆ పావు గంటలనే వ్యాపారమంత తిరిగి పోదులే..' అంటుంది. ఇంకొద్దిసేపాగి తింటలే అనుకొంది. పక్కన ఉన్న క్యారెట్టు తీసి నములుకుంట, గల్లలున్న డబ్బులు తీసి లెక్క పెట్టుడు మొదలు పెట్టింది.

ఇంతల్నే ఒక పిలగాడు అయిదు రూపాయల నోటు అందించి కురేకురే పాకెట్ ఇమ్మన్నడు. వాడడిగిందిస్తుంటే... పక్క బజార్ల సుగుణ వచ్చింది.

"కోతిమీరాకుందా సరోజా?" అనుకుంట.

 "అయిపోయిందొదినే. సోమారం కదా.. కొద్దిగనే

తెచ్చిన. అయినా కోతిమీరాకు కోసం మీ బజార్ల నుంచి వచ్చినవా గింతదూరం" అన్నది సరోజ.

"కాదులే.. పక్కనే మందులషాప్ కొచ్చిన, మా అత్తకు జోరమొస్తుంది గోలీలకోసం. దుకనంలో నువ్వు కనపడ్డవు, సరే కోతిమీరపచ్చడి చేద్దాం, జరమొచ్చిన నోటికి రుచిగొడతదని అడిగిన" అన్నది సుగుణ, పక్కనున్న స్టూల్ మీద కూసుండు కుంట. 

"తిన్నవా ఒదినె..." అన్నది సరోజ.

"ఆ.. తిన్న. నువ్వు తిన్నవా యాపారంల పడి తిండి మరిసినవా.. మీ అనిత కనపడదు, కొలువుకు పోయిందా" ఆరా తీసింది సుగుణ.

"లే ఇంట్లనే ఉన్నది... కరోనా చెయ్యబట్టి ఇంటి నుంచె కొలువు చేస్తున్నరు కదా అందరు" అన్నది సరోజ.

"ఈ ఏడు అనితకు పెండ్లి చేస్తవా.. ఏమన్న సంబంధాలు సూస్తున్నవా.." సుగుణ.

"ఏమన్నుంటే చెప్పొదినె. మంచి పిలగాడుంటే చూడు. ఆడపిల్ల ఎన్నాళ్ళున్న పెండ్లిచేసి పంపక తప్పది కదా"! సరోజ.

"పక్కూర్లనే మా దోస్తు ఆడబిడ్డ కొడుకున్నడు, నౌకరి చేస్తుండు. వాళ్ళు కూడ సంబంధాలు ఎతుకుతున్నరు. చెప్పమంటవా.." సుగుణ.

"చెప్పొదినె ... పిలగాడు మంచోడేనా.. అమ్మా నాయిన మంచోళ్ళేనా... ఎంత మంది పిల్లలు... " గుక్క తిప్పుకోకుండ అడిగింది సరోజ.

"ఆఁ నీలాగానే, ఒక కొడుకు ఒక బిడ్డ. కాక పోతే కొడుకు పెద్దోడు. బిడ్డకు సంబంధం కుదిరింది.. కొడుకుకు సంబంధం సూస్తన్రు. కుదిరితే ఇద్దరికి ఒక్కపాలె సేత్తరట" సుగుణ. 

"మంచోళ్ళేనా... కట్నమెంత అడుగుతాన్రు" ఆత్రంగా అడిగింది సరోజ.

"మంచోళ్ళే అన్నది మా దోస్త్. కట్నం సంగతి తెల్వది కని, ఒక సారి రమ్మని పిలుద్దాం పిల్లనచ్చితే మిగిలినయి మాట్లాడొచ్చు" అన్నది సుగుణ.

"అట్లనే ఒదినే. రెండ్రోజులు ముందు సెప్పు జర. సుమతి టీచర్కు కబురు చేస్త.. నీకెరికే కదా.. నాకెవరు లేరు" అన్నది కళ్ళనీళ్ళు పెట్టుకుంట సరోజ.

 అనిత బయటికొచ్చింది. "అన్నం తిన్నవా అమ్మా!" అనుకుంట.. సుగుణను చూసి "బాగున్నవా అత్తా!" అని పలకరించింది.

"ఆఁ నేను బాగానే ఉన్న... పప్పన్నం ఎప్పుడు పెడతవు అనితా.." అన్నది సుగుణ.

"ఏ ఊకో అత్తా.. పెళ్ళికి తొందరేమొచ్చె.." అనుకుంటూ ఇంట్లకు పోయింది. సిగ్గుపడుతుందనుకున్నరు వాళ్ళు. " మా దోస్త్ తో మాట్లాడి నీకు కబురు చేస్తా... అయినా నీ ఫోన్ నెంబరియ్యి" అని సరోజ నెంబర్ తీసుకొని వెళ్ళిపోయింది సుగుణ.

***

రెండు రోజుల తర్వాత  "ఏమయింది మామా.."  అనుకుంటూ పవన్ వచ్చిండు శీను దగ్గరకు.

"మీ అత్త దోస్త్ సుగుణ, అనిత తల్లితో మాట్లాడిందట. పిల్లను చూడటానికి ఒకసారి మా వాళ్ళొస్తరంటే, సరే అన్నదట. నువ్వే అనవసరం దిగులు పడుతున్నవు అల్లుడూ.. " అన్నడు శీను.

రెండు నిమిషాలు సంతోషమనిపించినా, వెంటనే దిగులు

మేఘం కమ్మింది పవన్ ముఖం మీద మళ్ళీ...

***

వారం రోజులల్లనే తల్లికి తండ్రికి విషయమంత చెప్పిండు పవన్. అనిత తాను గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న సంగతి. అనితకు పెళ్ళంటే ఇష్టం

లేదు, ఎందుకో చెప్పదు, గట్టిగా అడుగితే ఏడుస్తది. నేను పెళ్ళి చేసుకుంటే అనితనే  చేసుకుంట. లేకుంటే పెళ్ళే చేసుకోనన్నడు. 

పవన్ తల్లిదండ్రులు ముందు కొంత గునిసినా.. తర్వాత కొడుకు ఇష్ట ప్రకారమే పిల్లను చూడటానికి సిద్దమయ్యారు.


మంచిరోజు చూసి అనితా వాళ్ళ యింటికి బయల్దేరారు వాళ్ళు. పవన్ వెళ్ళలేదు వాళ్ళతో.. 

అతను భయపడ్డట్టు అక్కడేమి జరగలేదు. వాళ్ళకు అనిత నచ్చింది.  పవన్ ఫోటో అనిత తల్లికి ఇచ్చి వచ్చారు.

ఆరోజు రాత్రి పది గంటలకు అనిత ఫోన్ చేసింది. భయపడ్తూనే ఫోనెత్తాడు పవన్. మామూలుగానే మాట్లాడింది అనిత. నాకు పెళ్ళి ఇష్టం లేదని చెప్పినా మీ వాళ్ళను ఎందుకు పంపావు అని అడిగింది..

"ఎందుకు వద్దో.. కనీసం వాళ్ళకన్నా చెప్తావని" అన్నాడు పవన్. 

ఏమి మాట్లాడకుండా ఫోన్ కట్ చేసింది. భయపడినంత జరిగేట్టున్నదని బెంగ పట్టుకుంది పవన్ కు.

*** *** ***


తర్వాత రోజు రాత్రి అన్నం తిన్న తరువాత టీవీ చూస్తూ కూర్చున్న అనితను తల్లి అడిగింది.

"ఫోటోలో పిలగాడు నచ్చాడా" అని.

అనిత కొద్ది సేపు మాట్లాడ లేదు.. తల్లి పక్కలు సర్దుతూ మళ్ళీ అడిగింది.

టీవీ ఆఫ్ చేసి, తల్లి దగ్గరకు పోయి, తల్లి చెయ్యి పట్టుకొని మంచం మీద కూర్చొబెట్టి, ఆమె వడిలో తల పెట్టుకొని పడుకొని "అమ్మా నీకు ఒక విషయం చెప్పాలె" అన్నది. 

"సరే చెప్పవే తల్లీ" సరోజ.

"ఫొటోలో అబ్బాయి నా స్నేహితుడే. అంతే కాదు, మేమిద్దరం రెండు సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నాం" అంది నెమ్మదిగా.

"అయితే ఇంకేం నీకు నచ్చిన అబ్బాయే, నిన్ను చేసుకుంటనని వచ్చిండు సంతోషం" అన్నది తల్లి సంబరంగా.

"నేను చెప్పేది పూర్తిగా వినమ్మా.. నాకు పెళ్ళంటే ఇష్టం లేదు" అన్నది అనిత దీనంగా..

"ఇచిత్రాల పిల్లవు, ప్రేమించిన అంటవు పెళ్ళొద్దంటవు, ఏం పిల్లవే నువ్వు" అన్నది సరోజ.

అనిత ఏడ్వడం మొదలు పెట్టింది. తల్లిని గట్టిగా పట్టుకొని. సరోజకు భయమేసింది "ఏమయింది. బిడ్డా ఆపిలగాడు మంచోడు కాదా!" అన్నది బిడ్డను దగ్గరికి తీసుకొని.. బిడ్డ ఏడుస్తుంటే తల్లికి కూడా దుఃఖమొచ్చింది. పెళ్ళి తెచ్చిన తుఫాన్ తననెంతగా ముంచేసి సుడిగుండంలోకి నెట్టిందో గుర్తుకొచ్చింది. ఒకరినొకరి పట్టుకొని చాలాసేపు ఏడ్చారు. కొద్ది సేపటి తర్వాత.. "ఏమయింది బిడ్డా! పెళ్ళెందుకు వద్దంటనవో చెప్పు.. నీకిష్టం లేకుండ ఏదీ జరగదు చెప్పు బిడ్డా.. చెప్పకపోతే నాకెట్ల తెలుస్తది" అన్నది మనసులో

అనుమానం పీకుతుండగా..

"నాకు పెళ్ళొద్దమ్మా... అన్నది" మళ్ళా..

"అదే ఎందుకొద్దో చెప్పాలెకదా బిడ్డా!"

"ఈ పెళ్ళొద్దా...? అసలు పెళ్ళే వద్దా.." అన్నడు అనిత

తమ్ముడు రమేష్.

 ఆశ్చర్యంగా చూశారు ఇద్దరూ ఆ పిల్లవాడి వైపు. ఎప్పడొచ్చాడో తల్లీ బిడ్డలు చూసుకోనే లేదు... 

అనితే సమాధానం చెప్పింది.

 "వాడు చూడు నా కంటే చిన్నోడు.. ఆ గొంతులో పెత్తనం చూడు. నీకు తెలవదు పోరా రమేష్.. " అన్నది అనిత.

"నువ్వు చిన్నోడివి కొడకా నీకు తెలవదు, పండుకోపో కొడకా.." అన్నది తల్లి. 

"సరేలే, నీకిష్టం లేకపోతే చేసుకోవద్దులే.. ఏడ్వకు పండుకో.." అని తన వడిల నించి లేపి మంచంల పండుకోబెట్టి, దుప్పటి కప్పి పక్కన పండుకొన్నది దగ్గరికి పొదవుకొని. తల్లీ బిడ్డలు మాట్లాడు కోలేదు కానీ పొద్దుపోయేదాక నిద్రపోలేదు.. తెల్లారుజామున లేసి కొడుకును తీసుకొని కూరగాయాల మార్కెట్ కు పోయింది సరోజ.

అనిత ముభావంగా తన పనిల తను పడింది.... శనివారమే కాబట్టి ఆఫీసు పనిలేదు.. తల్లి బాధపడుతున్న సంగతి గమనించింది. తన బాధను తల్లికి ఎట్లా ఏమని చెప్పాలో అర్ధం కాలేదు. తమ్ముడు కాలేజీకి పోయిన తర్వాత విచారంగ కూసున్న తల్లి దగ్గరకు పోయింది.. 

"గిరాకి ఏమీ లేదు కదా.. కాసేపు తలుపు పెట్టి ఇంట్లకి రా అమ్మా.." అని పిలిచింది. 

బిడ్డ వైపు నిర్వికారంగా ఒకసారి చూసి, బిడ్డ చెప్పినట్టు వచ్చి లోపలకొచ్చి, కుర్చీపీట గోడకు జరుపుకొని కూర్చున్నది. 

అనిత వేడివేడి టీ కప్పుల్ల పోసుకొని వచ్చి తల్లికొకటి ఇచ్చి, తనొకటి తీసుకుని పక్కనే నేలమేద బాసంపెట్టేసుకొని కూర్చున్నది.

 

బిడ్డ ఏమి చెప్తదో ఏమి వినాలో అనే భయంతో టీ చప్పరిస్తున్నది. ఉడుకుడుకు చాయి గొంతు దిగంగనే కొంత ఊరట పడింది సరోజ.. 

"అమ్మా నేను చెప్పేది నిమ్మలంగ విను, కోపం తెచ్చుకోకు

 ఏడవకు...." అన్నది అనిత.

 "సరేలే.. చానా జాగ్రత్తలు చెప్తున్నవుకని అసలు సంగతి చెప్పు" తల్లి అన్నది.


“నాకు పెళ్ళంటే భయం, పెళ్ళి పేరుతో జరిగే పెత్తనాలంటే భయం, నాన్న దూరమయినంక మనమెంత మనశ్శాంతిగ  ఉన్నం... ముఖ్యంగ నువ్వు ఏడ్పుకు దూరమైనవా లేదా..? పెళ్ళంటే.. నాకు నా చిన్న తనం నాన్న ఉన్న రోజులే గుర్తుకు వస్తున్నాయి... నీవు తిన్న దెబ్బలు, తిట్లు, పడ్డ అవమానాలు, అవే గుర్తుకొస్తున్నయి... తమ్ముడు పుట్టక ముందు నన్ను గంప కింద కప్పి పెట్టిన రోజులు... ఆడపిల్ల నయినందుకు నన్ను చీదరించుకోడం, నన్ను చంపుతా.. అమ్మేస్తనని నిన్ను బెదిరించడం, ఇవే కళ్ళ ముందు తిరుగుతున్నయి.. అసలు ఆ పెళ్ళి బంధమే లేకపోతే నిశ్చింత కదా అమ్మా.."

బిడ్డ మాటలు వింటుంటే సరోజ కళ్ళు జలపాతాలయ్యాయి, గుండె చెరువయ్యింది. అయినా ఏదో ఒకటి చెప్పాలని..

"అందరూ మీ నాయినోతిగ ఉండరు" అంటూ ఏదో చెప్తున్న తల్లిని ఆపి....

"కాదమ్మా ఇంకా చాలా మంది అమ్మలను, నాన్నలను చూసిన... హాస్టల్ల ఉన్నపుడు నా దోస్తులు చెప్పిన భయంకరమైన వాస్తవాలు, అనుభవాలు విన్నాను. అందుకే పెళ్ళి ఒక బందిఖానా అనిపిస్తుంది నాకు" అన్నది. 

సరోజ సర్ధి చెప్పాలని చూసింది బిడ్డ వినేట్టు లేదు.. ఏడుస్తున్న అనితను చూసి....

"నువ్వు ఏడవకు బిడ్డా నా తలరాత నీకెందుకొస్తది? నువ్వు చదువుకున్నవు. కొలువు చేస్తున్నవు. తెలివైనదానివి. ధైర్యవంతురాలివి. నేనంటే చదువురాని దాన్ని, ఎవ్వరు లేని దాన్ని.. కాబట్టి అన్ని అనుభవించిన. నీకెందుకయితదట్ల.. నీకు నేను, తమ్ముడు, నీ దోస్తులు మంచిచెడు చూసేందుకు ఉన్నము. ఏడవకు నీకిష్టం లేకుంట ఏది జరగదు" అని ఊరడించింది.

"నీకు మనసు బాగా లేకపోతే.. ఏదన్న పుస్తకం చదువుకో లేకపోతే టీవి పెట్టుకో. దుకనంలకు పోతన్నా గిరాకి వచ్చినట్టున్నరు" అని లేచి బిడ్డ తలమీద చెయ్యి పెట్టి దువ్వి, దుకాణంలకు పోయింది.

మనసంత గతములోకి పోతాంది. గిరాకి ఏమి లేదు. ఇంతలనే తుప్పర తుప్పర చినుకులు మొదలయి జోరందుకుంది ఆకాశానికి చిల్లులు పడ్డట్టు. వానల ఎవరు రారని, దుకనం బందు చేసి ఇంట్లకు వచ్చింది. అనిత నిశ్చింతగ నిద్రపోతంది.

తను కూడా మంచం మీద వాలి కళ్ళు మూసుకుంది. అనిత తన జీవితం చూసి భయపడతాంది.. ఏమిచెయ్యాలె.. 

*** *** ***

కందిరీగల్లాగ ఆలోచనలు చుట్టుముట్టినయి.

పెళ్ళప్పుడు తన వయసు పదేండ్లు కూడా లేవు, అక్కకు పన్నెండేళ్ళు. వద్దని ఏడుస్తుంటే.. తన తల్లి "తాగుబోతు మీ నాయిన మీ పెండ్లిళ్ళు చెయ్యిలేడు. మీ అక్కకు మంచి సంబంధం వచ్చింది. కట్నం కూడ అడగట్లేదు. ఉన్న ఇల్లు అమ్మి వచ్చిన డబ్బు తోటి మీ ఇద్దరి పెళ్ళి చేస్తే నా బరువు తీరిపోద్ది" అని పట్టు పట్టి పెళ్ళి చేసింది.

అప్పటి దాకా అమ్మ చెప్పిన పని చేసుడు, ఆటలు, తిండి, నిద్ర మాత్రమే తెలుసు తనకు. పెళ్ళంటే ఏమిటో తెలవదు, చదువు లేదు. తన కంటె పదేండ్లు పెద్దోడు, భారీ శరీరం, నవ్వంటే తెలవని మొఖం. మొగడంటే భయం మాత్రమే తనకు తెలిసింది. మరో భావమే లేదు. 

"ఆట గోగిల పిల్ల వచ్చే ఏడాది పంపిస్తం అత్తగారింటికి" అన్నది అమ్మ.. 

"ఆట గోగిల పిల్లకు పెండ్లెందుకు చేసిన్రు. మాయింటికొచ్చి ఏం మామ్ల చేస్తది నీ బిడ్డ. మేమంత పనికి పోతే, కుక్క కావలుంటది ఇంటికి" అని తోలుకొచ్చింది అత్త.


ఆటలు అటకెక్కినయి, కష్టాలు మొదలయినయి. తండ్రీ కొడుకులు రోజు తాగొచ్చేది, ఊకూకె గొడవ పడేది. వాళ్ళ పంచాయతీ తనకు అర్థమయ్యేది కాదు, కానీ ఆ అరుపులకు భయమయ్యేది.  వాకిలూడ్చుడు, బోళ్ళు తోముడు, అత్త ఏపని చెప్తే ఆ పని చేసుకుంటుండేది. వండుడు పెట్టుడు అత్త చేసేది. అందరు కూలి పనికి పోతే బావురుమని గుడిసెల కూసునేది తను. 

పెళ్ళయిన నెలరోజులకు తన తల్లి ఒకసారి చూడటానికొచ్చింది. తల్లిని పట్టుకుని శోకాలు పెట్టింది తను. చిన్న పిల్ల, బెంగటిల్లింది, ఒకసారి ఇంటికి పంపమని అడిగింది తల్లి.

"ఊ కూకె రావద్దు, పంపమని అడగొద్దు. ఇక్కడేమన్న కూలికి పంపుతున్నమా.. ఇల్లు గదలకుంట,కడుపుల సల్లకదలకుంట, నీడపట్టున ఉంటంది కదా.." అన్నది అత్త. కళ్ళ నీళ్ళు గుక్కుకుంట తల్లి తిరిగెల్లిపోయింది.


తల్లి వచ్చిపోయినంక వారం రోజులకు. పగటేళ్ళ ఏడ్చి ఏడ్చి ముడుసుకొని నిద్రపోయింది. ఎవరో మీద పడ్డట్టయింది. భయంతో అరవబోయింది. నోరు గట్టిగ మూసి, అనగబెట్టి మీద పడ్డడు మొగడు ఎలుగ్గొడ్డోతిగ. మీద పడ్డోడిని నెట్టెయ్య బోతె, తన వశం కాలె. రెండు చెంపల మీద చెళ్ళు చెళ్ళున సరిసిండు. జుట్టు పట్టుకోని తల నెలకేసి కొట్టిండు. భయంతో బిగుసుకుపోయింది. మొదటి సారి నరకం చూపిచ్చుండు. కొరికిండు, కొట్టిండు, పసిమొగ్గను నలిపిండు, ఏళ్ళుపెట్టి గెలికిండు, నెత్తురోడుతుంటే లేచి పోతూ పోతూ.. "నేను నీ మొగడిని ఇట్లనే చెస్తా.. చంపుత.. ఎవరికన్న చెప్తివంటే కత్తి పెట్టి చీరుత" అని బెదిరిచ్చి ఎల్లి పోయిండు.

భయంతో వణికి పోయింది.. ఏమి జరిగింది.. ఏమి చేసిండు తనని. ఏడ్చి ఏడ్చి కళ్ళు వాసినయి.. ఒళ్ళంత పచ్చిపుండయింది. దెబ్బకు జరం పట్టింది... సాయంత్రం అత్త వచ్చింది.. బట్టలకు నెత్తురంత చూసింది... "ఏమయిందే పోరి ఏందిదంతా..?" అన్నది. సగం అర్థమయినా.. భయంతో నోరు తెరవలే సరోజ.

"మావోడొచ్చిండా ఇంటికి" అన్నది.

 ఔనని తలూపింది. 

"నీ మొగడే కదా.. ఏం కాదులే ఏడ్వకు .. పెండ్లంటే ఇదే మరి హి హి.." అని ఇగిలిచ్చుకుంట వేడి నీళ్ళు పెట్టి తానం చేయించి "గీ నెత్తురు గుడ్డలు ఇప్పుడేం ఉతుక్కుంటవు, రేపు ఎండాల ఉతుక్కుందువు గని ఆ కుండల తడిపి పెట్టుకో" అన్నది.

చీకటి పడ్డంక తండ్రికొడుకులు తాగొచ్చిన్రు... ఎందుకో గని అత్తమామలు కొడుకుతో పంచాయితి పెట్టుకున్నరు..

"మునుపే ఒకతి సచ్చె నీ చేతుల.. అది చిన్నపోరి కదా ఇంకొన్ని దినాలు ఆగితే ఏమాయె" అత్త కసురుకుంది గుసగుసగా..


అయినా సరోజ చెవున పడ్డయా మాటలు. పగటాల మొగడన్న మాటలు యాదికొచ్చి భయంతో వణికి పోయింది. నన్ను కూడ సంపుతడా.. ఆరాత్రి ఏమి తినలే.. నొప్పి, మంట, జరం, భయం ఎట్ట తింటది. 

అత్త రెండుసార్లు అడిగి సప్పుడు సెయ్యికుండ పన్నది. రాత్రంతా ఏడుస్తనే ఉన్నది. ఒకటే మంట, నొప్పి, భయం... వామ్మో ఎన్నాళ్ళు ఇట్లా.. ఎప్పటికి ఒడుస్తది.. ఎట్ల తెల్లారుద్దో..

 తెల్లారి పాటికి మూసిన కన్ను తెరవకుంట, ఒళ్ళు కాలి పోతాంది... "మా ఇంటికి పోతా.. మా ఇంటికి పోతా.." అని కలవరిస్తుంది. 

అత్తకు మామకు భయమైంది. ఆరెంపి డాక్టర్ను పిలిచి సూదేయించిన్రు... "చిన్న పిల్లను ఇట్లెందుకు చేసిన్రు.. అమ్మగారింటికి పంపండి"అని సలహా చెప్పి పోయిండు. మూడోనాడు జరం జారంగనే, అత్తనే తనను ఎంట బెట్టుకొని అమ్మగారింటికి తోలి పోయింది..

"అమ్మ గారింట్ల ఇక్కడి సంగతులేవి చెప్పొద్దు. మావోడు మోటోడు. అయిన నీ మొగుడే కదా.. మా అందరికి ఇట్లనే అయింది. నువ్వు అమ్మ గారింట్ల సెప్తివా తగువైతది. నీ మొగడు నిన్ను వదిలి పెడ్తడు. ఎట్ల బతుకుతవు ? ఏం చేస్తవు?" అని ఏమేమో భయాలు కలిగిచ్చింది. జరం తగ్గినంక తోలిపొండి మీరే. అని చెప్పి ఎల్లి పోయింది.

తల్లికి తనేమి చెప్పలేదు.

తండ్రికి ఏ సోయి లేదు. తన పరిస్థితి తల్లికి అర్థమయిందో కాలేదో తెల్వలేదు తనకు. దోస్తులందరు ఒక్కొక్కలు వచ్చి చూసి పోయిన్రు. "బక్కగైనవే సరోజా" అని ఒకలు.

"మీ అత్త మంచిదేనా..' అని ఇంకొకల్లు. 

"మీ ఆయన గంత పెద్దగున్నడు సూస్తెనే గుబులయితది, నీకేమనిపించట్లేదా" అని మరొకల్లు. చిత్రచిత్రాల మాటలు మాట్లాడిన్రు. ఎవ్వరికేమి చెప్పలేదు. "అబ్బా పెండ్లయినంక బగ్గ మారిపోయినవే" అన్నరు దోస్తులు. 

పది రోజుల తర్వాత తల్లి తోలుకొచ్చి అత్తింట్ల తోలి పోయింది...

మొగడి మొగం ఎలిగి పోయింది, తనను చూసి. రాక్షస క్రీడకు ఆటబొమ్మ దొరికిందని. ఒంటరిగ దొరకకుండ అత్త చుట్టే తిరుగేది తను.. 

రెండు నెలలు గడిచినంక మళ్ళీ ఒక రోజు మునపటి నరకం సూపిచ్చిండు. ఈసారి మరోప్రయోగం చేసిండు... మళ్ళీ రక్తస్రావం, జ్వరం, డాక్టర్ సూది మందు.. అంతే.


తర్వాత తర్వాత ప్రతి రెండు నెలల గడువు ఒక నెలగా మారింది అత్యాచారాల కొలుపు. సంవత్సరం గడిచిన తర్వాత పెద్ద మనిషయింది తను. రాక్షసక్రీడ నిత్య కృత్య మయింది. పదమూడో ఏటికీ కడుపొచ్చింది. కొడుకే కనాలె అత్తమామ మొగనితో కలిసి ముగ్గురి హుకుం. మనవడు మనవడు అని కలవరిచ్చిన మామ తనకు కాన్పు కాక ముందే పాము కరిసి సచ్చిపొయ్యిండు. మొగడే ఇంటి పెద్దయిండు. తన ముందే అత్తను కొట్టేది. కడుపుతో నున్నదని చూడడకుండా తనను కొట్టేది మోర్దోపోడు. వేరే ఆడోళ్ళతో సంబంధాలున్న తనతో రాక్షసక్రీడ నిత్యం కొనసాగేది. కాన్పుకు పంపమని తల్లి వచ్చింది. కానీ పంపలేదు మొగడు. ఆమెను కూడ ఈడనే ఉండి పురుడు పొయ్యమన్నడు. అల్లుడు పెట్టుపోతలడగ లేదు. ఆడికే సంతోషమయింది తల్లికి. నెలలు నిండి ఆడపిల్ల పుట్టింది.


ఆరోజంత బూతులు తిట్టిండు. దరిద్రపుగొట్టు దానివన్నడు. శని పుట్టిందన్నడు. నీ బిడ్డ సెయ్యబట్టి మా నాయనను పాము కరిసిందన్నడు. అత్త కూడ ముక్కిరిసింది, మొగని మాటలకు అడ్డు పడలే.

అత్తకు కూడా ఆడపిల్ల ఇష్టం లేదు. బిడ్డపుట్టినంక కష్టాలెక్కువయినయి తనకు.. పిల్ల కంటికి కనపడొద్దు.. ఏడుపిన పడొద్దు చంపేస్తా అనేటోడు. ఒక రోజు మొగడు ఇంటి కొచ్చె సరికి బిడ్డ ఏడుస్తంది. తను ఎదో పని చేస్తంది. వచ్చి రావడమే ఉయ్యాలలున్న పిల్ల కాళ్ళు పట్టుకుని లేపి నేలకిసిరిండు. తనొచ్చి కింద పడకుండ అందుకుంది. కాళ్ళు చేతులాడలేదు సుతం సేపు, గుండె ఆగినంత పనయింది. పిల్ల గుక్క పట్టింది. బిడ్డను పట్టుకొని రోడ్డు పట్టింది. కని ఎక్కడికి పోతది పదిండ్లవతల ముత్తాలమ్మ గుడికాడ ఏప చెట్టు కింద కూసున్నది. పిల్ల నోట్ల రొమ్ము పెట్టి ఉప్పసదీర ఏడ్చింది. ఎక్కడికి పోవాలో అర్థంకాలే. పక్క గుడెసెల గౌండ్ల ముసలమ్మ వచ్చింది "ఏమయింది బిడ్డా.." అని. 

ఆడపిల్ల పుట్టిందని మొగడు పెడ్తున్న హింస చెప్పింది. "ఎవలకన్న సాదుకోను ఇయ్యరాదు. నీ పానానికే సుఖం లేదు. ఆ పోరినెట్ట సాత్తవు" అన్నది. 

"అమ్మో పిల్లనిచ్చి నేనెందుకు బతుకుడు ఇద్దరం కలిసి సత్తము" అన్నది తను. 

"సచ్చేం సాదిత్తవ్.. నీ పిల్లన్న మంచిగ బతుకదని సెప్పినగని" అని, అటిటు ఎవరన్న చూస్తున్నారా అని చూసింది.

"నా దగ్గర ఒక మందున్నది. పిల్లకు పాలిచ్చేప్పుడు రొమ్ముకు రాసుకో, పిల్ల ఏడ్వకుండ నిద్రపోతది. నీ కష్టం కొంత తగ్గుతది" అని పెసరగింజంత పొట్లంగట్టి ఇచ్చింది. తన చేత్తోనే నీళ్ళల్ల తడిపి రొమ్మకు రాసింది. ఏ పాపం తెలవని పసిది రొమ్ము పట్టి చప్పరిచ్చుకుంటనే నిద్రపోయింది. "జాగ్రత్త జరంతనే రాయి ఎక్కువయితే నిద్రలనే కన్ను మూస్తది" అని ఎచ్చరించి ఇంటికి పంపింది. ఆనాటి నించి ఉయ్యాల తీసి పారేసింది తను. కోళ్ళను కమ్మేటి గంప తెచ్చి దానికింద బిడ్డను పండపెట్టేది.


 కొడుకు దాష్టీకం చూడ లేక అత్త గుడిమెట్ల కాడికి చేరింది. అక్కడే తిని అక్కడే పండేది. నాలుగేళ్ళొచ్చినా నల్లమందు నాకిచ్చి గంపకింద పండ పెట్టేది. మొగడి తిట్లు దెబ్బలే నిత్య జాతర అయింది తనకు. 

తన బిడ్డకు కోళ్ళ గంప కింద నే ప్రపంచం. తండ్రి చేసే పనులు, మాటలు కొన్ని అర్థమయ్యేవి కొన్ని అర్ధంకాకపోయేది. ఎదురైతే ఏది చేతిలో ఉంటే దానితో కొట్టేటోడు. కాళ్ళతో తన్నెటోడు. శని ముండ అనెటోడు. 


ఒక రోజు తాగి ఇంటికి వస్తుంటే లారీ గుద్దింది అక్కడికక్కడే సచ్చి పోయిండు. గుడి ముందల జరిగిన యాక్సిడెంటుకు ముత్త్యాలమ్మ సాక్షమని లారీ యజమాని భయపడి.. మూడులక్షల రూపాయలు ఇస్తానన్నడు. తనకు ఏడ్వాలన్న ఏడుపు రాలేదు. అసలు లోపల సంతోషంగ అనిపించిందప్పుడు. 

ఇల్లు కట్టియ్యి బాబు డబ్బులొద్దన్నది తను.  గుడిసె జాగల రేకులతో రెండు గదుల ఇల్లు కట్టిచ్చి ఇరవై వేలు చేతుల బెట్టిండు. మార్కెట్ల చెప్త నీకు కావాలసిన కూరగాయలు తెచ్చి అమ్మకో అన్నడు. తన బిడ్డను తనను చూసి..

ఆరోజుతో పెండ్లితో మొదలైన నరకం తనకు దూరమైంది. అప్పటికే మళ్ళ నెలతప్పి మూడో నెల. రేపులు చేసినా కడుపులొస్తయనేందుకు రెండో సాక్ష్యం.. 

చచ్చేదాక బతకాలె.. బతికేందుకు తినాలె. తినేందుకు ఏదో ఒకటి చెయ్యాలె. లారీ యజమాని చెప్పినట్టే కూరగాయలు తెచ్చి నెత్తిన పెట్టుకొని అమ్ముడు మొదలు పెట్టింది. బిడ్డను బడిల వేసింది. బడిలున్న సమత టీచరే 'అనిత' అని పేరు రాసింది బళ్ళె చేర్చెటప్పుడు. అనిత ఎప్పుడూ నిద్రపోతుండటం చూసి, టీచర్ ఒక సారి అడిగింది తనని. గౌండ్ల ముసలమ్మ ఇచ్చిన మందు గురించి చెప్పింది తను. దాని ప్రభావం మెదడు మీద పడ్తదని, ఆ టీచరే అనితను పట్నం డాక్టర్ దగ్గరికి తీసుకపోయింది. ఆరోజు డాక్టర్ తనను తిట్టి, మూడు సంవత్సరాలు  మందులు వాడాలె, ఒకే సమయానికి మందు వెయ్యాలె. ఒక్కరోజు కూడ గ్యాప్ రావద్దు అని జాగ్రత్త చెప్పిండు. అట్లనే మందులు వాడింది తను.

 

 కొత్త ప్రపంచం కొత్తలోకం. మొగని నరకం తప్పింది కని అలవాటు లేని కూరగాయాల బేరం. భయం భయంగనే చేసేది తను.మొగడున్నప్పుడు ప్రపంచమే తెలవదు, టీచర్ సాయంతో లెక్కలు పద్దులు నేర్చుకొన్నది.

 నెలలు నిండినయి, తల్లిని పిలిపిచ్చుకుంది. మొగడు చచ్చినంక అత్తను కూడా ఇంటికి తెచ్చుకొంది. ఈసారి కొడుకు పుట్టిండు.


 మనవడిని చూసుకున్న ఆనందంల ఒకరోజు నిద్రలనే అత్త చచ్చిపోయింది. తల్లిని తన దగ్గరే ఉంచుకుంది.

నెలరోజుల బాలింతప్పుడే మళ్ళ కూరగాయలు అమ్మడం మొదలుపెట్టింది. పొద్దటిపూట వీధులెమ్మటి అమ్మేది, సాయింత్రం ఇంటిముందల బల్లమీద పెట్టుకొని అమ్మేది తను. తల్లి సాయంగ ఉండేది. 


తర్వాత వీధులెమ్మటి తిరగటం మానేసి, ఇంటిముందే కూరగాయలు, పాల పాకెట్లు పెట్టుకొని కూసునేది. లారీయజమాని బాపతు మనిషని అందరు మర్యాదగనే చూసేది. దుకాణం దగ్గరికి వచ్చినోళ్ళందరూ తన చుట్టాలే అన్నట్టు.. అక్కా, అన్నా పెద్దమ్మ, తమ్ముడూ, చిన్నాయిన, చిన్నమ్మ అంటూ వరసలు కలిపి మాట్లాడేది.

పాత బొంతలు కుండపెంకులుండే పూరి గుడిసె ఇప్పుడు కూరగాయల దుకనపు సరోజ ఇల్లయింది. 


సమత టీచర్ సలహాలతో పిల్లలిద్దరినీ మంచిగ చదివిస్తున్నది. నరకానికి దూరం జరిగి, కష్టాన్ని నమ్ముకున్న తనకు పాతికేళ్లు నిండని వయసుతో వంట్లె మెరుపొచ్చింది, కంట్లె వెలుగొచ్చింది. మాటల్ల చతురొచ్చింది. దానితో అప్పటి దాక జాలి పడ్డ కొందరి కళ్ళల్ల అసూయ మంట పుట్టింది తనను చూసి. లారీయజమాని ఉంచుకున్నడని ప్రచారం మొదలయింది. లారీ ఓనర్ కంటే మాకేం తక్కువని, ఒక్కరాత్రికి వెయ్యని ఒకడు, నేను రెండు వేలిస్తనుకుంట వెంట బడుడు మొదలయింది.

కొత్త కష్టాలు మొదలయినయి ఆరోజంత ఏడ్చింది తను. సమత టీచర్ తో చెప్పింది. 

"డబ్బులు లేకుండ కూరగాయలు తెచ్చు కుంటున్నావు కదా - అందుకే వాళ్ళకు అవకాశం దొరికింది. ఎవ్వరి దగ్గర ఏమి తీసుకోకు. ఎంతో కొంత సాయం కొన్నేళ్ళు తీసుకున్నవు. ఇంక ఆపెయ్యి, నీ సొంత డబ్బులతో యాపారం చేసుకో" అని చెప్తే, నాకేమొచ్చని ఏడ్చింది తను. 

ఇప్పుడు చేస్తున్నదే. కొనసాగిచ్చు డబ్బులిచ్చి తెచ్చుకో అన్నది టీచర్. 

అదే చేసింది తను. రోజూ అమ్మిన డబ్బులు తిండికి పోగా.. కొన్ని జమచేసింది. అందులో నుండి కొంత తీసింది.. తెల్లారి మార్కెట్ లో రోజూ వెళ్ళే లారీయజమాని దుకాణం కాడికి కాకుండా వేరే దుకాణం దగ్గరికి పొయ్యి డబ్బులిచ్చి కూరగాయలు కొనుక్కొచ్చింది.

ఏమయింది? ఏమయింది ? అని ప్రశ్నలు మొదలయినయి. ఎవరికి సమాధానం చెప్పలేదు. డబ్బులిచ్చి కూరగాయలు, సరుకులు తెచ్చి నగదు డబ్బులకు అమ్ముడు మొదలు పెట్టింది. 

ఇంతలనే వయసు మీదపడి తన తల్లి చచ్చిపోయింది. మళ్ళీ ఒంటరిదయింది.. టీచర్ సాయంతో పిల్లలిద్దరిని హాస్టల్లేసింది. పది తర్వాత కూడా అనితకి రిసెడెన్షియల్ కాలేజీలో సీటొచ్చింది. అనితకు ఫ్రీ సీట్లతోనే ఫీజులు కట్టకుండానే కాంపస్ సెలక్షన్ లో ఉద్యోగమొచ్చింది. కొడుకు రమేష్ పదవ తరగతి కాగానే ఇంటర్ మీడియట్  ఇంటి దగ్గర నుండి కాలేజీకి పంపిస్తుంది. 

అంతా సరిగా జరుగుతుంది అనితకు పెళ్ళిచేస్తే బాధ్యత తీరుతదనుకున్న సమయంలో ఇప్పుడు బిడ్డ పెళ్ళివద్దంటుంది. ఏమి చేయాలో తెలియట్లేదు తనకు.


 "అమ్మా  ఏమయింది ? దుకాణం మూసేసి పండుకున్నవు. వంట్లె బాగలేదా!" కొడుకు కాలేజీ నుండి

వచ్చి అడుగుతుంటే ఆలోచనల నుండి బయటపడింది.

 "ఏంలేదు కొంచెం సుస్తిగున్నదని పండుకున్న" అని లేచి జాలాట్లకు పోయి మొఖం కాళ్ళు కడుక్కొని టీ పెట్టడానికి పొయ్యికాడికి పోయింది. 

తమ్ముడి మాటలకు అనిత కూడా లేచింది. రమేష్ పుస్తకాలక్కడ పెట్టి దుకాణం తెరిచి కూచున్నడు.


*** *** ***


"నేను టీచరమ్మ దాక పొయ్యొస్త బిడ్డా" అని ఇంట్ల నుండి బయటికి నడిచింది సరోజ. 

సమతటీచర్ రిటైర్ అయినంక ఇంట్లోనే ఉంటుంది.

మొక్కల మధ్య కుర్చీలో కూర్చొని ఏదో పుస్తకం చదువు కుంటున్నదల్లా.. గేటు తీసుకుని వస్తున్న సరోజను చూసి " రారా సరోజా బాగున్నవా... ఈ మధ్య మా ఇంటికే రాట్లేదు... పిల్లలు బాగున్నారా ! " అన్నది.

"ఆఁ బాగనే ఉన్నరమ్మా. మీరు బాగున్నరా.." అనుకుంటూ పోయి కుర్చీ పక్కనే సిమెంటు దిమ్మె మీద కూసున్నది. "ఏంటి సంగతి సరోజా దిగులుగున్నవు.. ఏం జరిగింది" టీచర్ అడిగింది.

 "ఏం చెప్పాలె.. టీచరమ్మ. అనితకు ఒక పెళ్ళి సంబంధం వచ్చింది.."

"శుభవార్త.. సంతోషంగా చెప్పాల్సింది కదా!"

"కాదమ్మా.. అనిత పెళ్ళే వద్దంటుంది" అని జరిగిందంత టీచర్ కు చెప్పింది.

టీచర్ కు కూడా దిగులని పించింది. చిన్న తనంలో ఎదురైన అనుభవాలు వారి జీవితాలపై ఎట్లా ప్రభావం చూపుతాయో కొంత వరకు తనకు తెలుసు.

"పెళ్ళి వాళ్ళకు ఏమి చెప్పారు.. " అడిగింది టీచర్. 

"ఇంకా ఏం చెప్పలేదమ్మా. ఏం చెప్పాలో, ఏం చెయ్యాలో తెల్వక మీ దగ్గరికొచ్చిన " అన్నది సరోజ

 "నేను మాట్లాడతాలే అనితతో.. నువ్వేం కంగారు పడకు సరోజా.. ధైర్యంగుండు. శీను కాలేజికి పోతున్నడా...." అని అడిగింది. సరోజ కూడా కొద్దిసేపు అవి ఇవి మాట్లాడి ఇంటికి వచ్చింది. 

"అనితా.. టీచర్ ఒకసారి నిన్ను రమ్మన్నది" అన్నది.

తల్లి బాధపడుతూ టీచర్ దగ్గరకు వెళ్ళడంతో అనిత కూడా దిగులు పడ్డది. కానీ టీచర్ తో మాట్లాడితే బాగుంటది అనిపించింది.

తెల్లారి ఆదివారం పొద్దున్నే పనులు ముగించుకొని, టీచర్ కోసం కొన్ని కూరగాయలు పట్టుకొని బయలు దేరింది అనిత.

టీచర్ దగ్గర అనితకు చనువు ఉన్నప్పటికీ తన విషయం ఎట్లా చెప్పాలా అని ఆలోచిస్తూవెళ్ళింది.

 "అనితా టిఫిన్ చేశావా.." అంటూ కొబ్బరి పచ్చడితో ఇడ్లీ వేడి వేడిగా పెట్టింది. తర్వాత ఉద్యోగం ఎలా ఉంది? ఏం సినిమాలు చూశావు ? వంటి రొటీన్ ప్రశ్నల తర్వాత "సరే నీ సంగతి చెప్పు.." అన్నది టీచర్.

"అమ్మ చెప్పే ఉంటదిగా టీచర్". 

"నువ్వు చెప్పు వినాలని ఉన్నది"..

 "పవన్ నాకు రెండేళ్ళుగా తెలుసు టీచర్.. అతని తల్లిదండ్రులే నన్ను చూడటానికి వచ్చారు. వాళ్ళకు నేను నచ్చాను కూడా.. కానీ నాకు పెళ్ళి వద్దు టీచర్" అన్నది దిగులుగా.

"ఎందుకు వద్దు. అమ్మని వదిలిపెట్టి అత్తగారింటికి వెళ్ళాలిసి వస్తదనా" కారణం అది కాదని తెలిసినా అడిగింది.

"అదేం కాదు చిన్నప్పడి నుండి హాస్టల్లో ఉండే కదా చదువుకున్నాను.. నాకు పెళ్ళంటే భయం టీచర్. పెళ్ళి వద్దు, పవన్ కు కూడా అదే చెప్పాను పెళ్ళి వద్దని. స్నేహితుల్లా కలిసి ఉందామంటే ఒప్పుకున్నాడు కూడా... " ఆగింది అనిత..

"పెళ్ళి ఎందుకు వద్దో నీకు స్పష్టత ఉందా..!" సమత టీచర్.

"మా అమ్మను చూశాను. ... ఇంకా చాలా మందిని చూశాను. పెళ్ళిలో ఆనందం లేదు. స్వేచ్ఛ లేదు" అనిత.

"అందరూ అట్లనే ఉన్నరా.. నన్ను చూస్తున్నావుకదా.. నేను బాగానే ఉన్నాను కదా!" టీచర్ అన్నది.

"అందరు మీ లా అదృష్టవంతులున్నారా టీచర్"అనిత. 

"ఒక సారి పవన్ తో మాట్లాడుదాము పిలవరాదు.."

"పవన్ మంచోడు టీచర్.. నేనంటే ఇష్టం, ప్రేమ, గౌరవం కూడా... కానీ పెళ్ళయినంక మారిపోతరు. పెత్తనం చేస్తరు మీకు తెలవదా.." 

"అంతేనా.. అయినా ఒకసారి పవన్ తో మాట్లాడుదాం. 

లేదా ఫోన్లో మాట్లాడుదామా..".

"ఫోన్లో ఎందుకు లెండి. ఈరోజు సండేనే కదా రమ్మంటాను..." అని, అక్కడే కూర్చొని ఫోన్ చేసింది... రెండు సార్లు రింగ్ అవగానే ఫోన్ ఎత్తాడు పవన్. 

"పవన్ ఒక సారి మాట్లాడదాం మా ఊరు వస్తావా.. నాలుగింటికల్లా మాఊరు గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి వచ్చి పోన్ చెయ్యి" అన్నది. 

"నువ్వు పిలవడమే ఎక్కువ తప్పకుండా వస్తాను" అన్నాడు పవన్.

"సరే.. ఉంటామరి..." అని ఫోన్ కట్ చేసింది.

''సరే టీచర్ నేను వెళ్తా.. ఆదివారమన్న అమ్మకు పని సాయం చెయ్యాలె" అన్నది. 

"నువ్వు కూడా నా దగ్గరే ఉండు అనితా.. ఈ రోజు సాయంత్రం పవన్ తో మాట్లాడినంక వెళుదువు కానీ. అమ్మకు నేను చెప్తాలే" అన్నది టీచర్.

అనితకు కూడా టీచర్ దగ్గర ఉంటే ఉత్సాహంగా అనిపించింది. ఇంటి చుట్టూ మొక్కలతో వాతావరణం బాగుంటది. ఇల్లు కూడా ప్రశాంతంగా పుస్తకాలతో, అందమైన బొమ్మలతో తీర్చిదిద్దినట్టు ఉంటుంది.

"సరే టీచర్" అని ఉండి పోయింది.

 కొన్ని విషయాలు తల్లికి కూడా చెప్పుకోలేని పరిస్థితి అనితది..

ఎటు వంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉన్న అనితను చూస్తే ఊరటనిపించింది టీచరుకు. 

వాళ్ళమ్మకు పోన్ చేసి చెప్పింది. అనిత సాయంత్రం వరకు ఇక్కడే ఉంటదిని.... అవసరమయితే సాయంత్రం నీకు ఫోన్ చేస్తా నువ్వు కూడా రమ్మని అన్నది.. కాని పవన్ వస్తున్నట్టు చెప్పలేదు.


మూడింటికే పోన్ చేశాడు పవన్ "నేను స్కూల్ దగ్గరకు వచ్చాను" అని.

"లైన్లో ఉండు" అని, "పవన్ వచ్చాడు టీచర్" అంటూ ఇంటి ముందు గేట్ దగ్గరకు వచ్చింది. అక్కడ్నించి స్కూల్ కనబడుధ్ది. పవన్ వెంట ఎవరో ఉండటం చూసి..

"నీవెంట ఎవరో వచ్చారు ఎందుకు ? ఒక్కడివే రావలసింది పవన్" అన్నది అనిత.

"మా మావయ్యే... ఫర్వాలేదు ఫ్రెండ్లీగా ఉంటాడు"

"కుడి పక్కకు తిరుగు నీలం గేటు దగ్గర.. కనబడ్డానా.. ఆఁ రండి" అని ఫోన్ కట్ చేసింది. 

"పవన్ వాళ్ళమామను కూడా తెచ్చుకున్నాడు టీచర్... ఇంతే వీళ్ళు మన పరిస్థితి అర్థం చేసుకోరు" అన్నది నిరాశగా.

"ఫర్వాలేదులే అనితా... రానీలే.. " అంటుండగానే, వాళ్ళు గేటు తీసుకొని లోపలికొచ్చారు. ఇద్దరూ టీచర్ కు నమస్కారం పెట్టారు... వాళ్ళను కూర్చొమని సోఫా చూపించింది టీచర్.

అనిత బిస్కట్లు, టీలు పట్టుకొచ్చి వారి ముందు పెట్టింది. టీలు తాగడం అయి పోయిన తర్వాత.. 

"అమ్మాయి పెళ్ళొద్దంటుందని. మా అల్లుడు దిగులు పడతండమ్మా. వాని చెల్లెకు పెళ్ళి కుదిరింది.. ఇద్దరిది కలిపి ఒక్కసారే చేద్దామని అక్కాబావ ఆలోచన" అన్నడు పవన్ మామ శీను మాటలు మొదలు పెడ్తూ.

"వాళ్ళ అమ్మ పడ్డ బాధలు. రోజూ చుట్టూ జరుగుతున్న సంఘటనల వల్ల అనిత అట్లా ఆలోచిస్తున్నది. ఒకరకంగా ఆమె చెప్పేది నిజమే అనిపిస్తుంది. ఆమెకు మనం నమ్మకం కలిగించాలి. తనలో ఉన్న అభద్రతకు కారణాలను గుర్తించి తొలిగించాలి" అన్నది టీచర్. 

ఆ మాటలతో అనితకు ధైర్యమొచ్చింది.

పవన్ వాళ్ళ మామ చెయ్యి పట్టుకున్నడు. 'నువ్వేమి మాట్లాడకు' అన్నట్టు.

టీచర్ వైపు చూస్తూ "నేనేమి చెయ్యాలో చెప్పండి మేడం" అన్నాడు పవన్. 

"మీరిద్దరు ప్రేమికులు అంతకంటే ఎక్కువ ప్రాణస్నేహితులు. భయాలతో బ్రమలతో మొదలయ్యే జీవన ప్రయాణం, ఎవరికీ సుఖాన్ని ఇవ్వదు. మీరిద్దరూ ఒకసారి మ్యారేజ్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళండి... కావాలంటే నేనూ వస్తాను" అంటూండగానే పవన్ అందుకుని "మీరూ రండి మాకు ఏమీ తెలియదు కదా" అన్నాడు.

తర్వాత అనితను తాను ఎంత ప్రేమిస్తున్నది ఎట్లా కేర్ తీసుకునేది చాలా చెప్పాడు పవన్.. 

శీను వాళ్ళింట్లో ఆడవాళ్ళను ఎంత గౌరవంగా చూస్తారన్నది చాలా వివరించాడు.


అనితకు, పవన్ కు ధైర్యంగా ఉండమని చెప్పి, తనకు తెలిసిన వాళ్ళ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్ చేస్తానని చెప్పింది టీచర్. పవన్ కొత్త ఆశతో ఆనందంగా వెళ్ళొస్తానని లేచాడు.. పవన్ వెళ్ళిన తర్వాత సరోజకు ఫోన్ చేసి రమ్మన్నది టీచర్. 

ప్రి మ్యారేజ్ కౌన్సిలర్ తోపాటు సైకాలజిస్ట్ ను కూడా కలిస్తే బాగుంటుందని, అన్ని వివరాలు సరోజకు చెప్పింది..


****


తర్వాత వారం రోజులకు తనకు తెలిసిన వారి ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించింది సమత టీచర్.. తన భ్రమలు భయాల నుండి ఎట్లా బయట పడాలో వివరించారు. 

వివాహ బంధం చాలా గొప్పది. పరస్పర గౌరవంతో ప్రేమతో మెలిగితేనే హేమంతరాగ మధురానుభూతిని శిశిరోన్ముఖంలో కూడా ఆస్వాదించడం కుదురుతుంది.

జీవితం ఒక ప్రయోగశాల విజయమైనా అపజయమైనా అనుభవమే మిగులుతుంది.. కలిసి బ్రతకాలనే ఆసక్తి, బాధ్యత ఉన్నంత వరకు చిన్న చిన్న సమస్యలు వస్తే అదిగమించవచ్చు. 

లేదంటే స్నేహితులుగా విడిపోవచ్చు.

పౌరులు బాధ్యతగా ఉంటే చట్టాలతో పనుండదు. 


             *** *** *** ***





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష