కొత్త చరిత్ర రాస్తాం

‘కొత్త చరిత్ర రాస్తాం…’
జ్వలిత- 9989198943

సంఘం కోసం సభ్యులా..?
సభ్యుల కోసం సంఘమా..?
ఈ నిరంకుశ పాలన మీమాంసల్లో 
మీనమేషాలు లెక్క తేల్చక ముందే 
మేమంతా భారతీయులమే 
ఉపేక్షల వరదల్లో తడిచిన ఉప్పు బస్తాలం

లేని వాళ్ళమనీ..
ఏదీ లేని వాళ్ళమనీ..
దేశమే లేని వాళ్ళమనీ..
చెప్పుకునే అవకాశం కూడా లేని వాళ్ళం 
మా జనం ఎంతో లెక్క తెలవదు 
మేము ఎవరమో గణన ఉండదు 
మేము ఏమేమి చేస్తామో లెక్కుండదు 
మాకు ఏమీ అవసరమో 
అధ్యయనం ఉండదు 
మాపై ఏమి జరుగుతుందో 
ఎవరికీ ఎరుక ఉండదు
మా పట్ల అన్నీ ఉల్లంఘనలే 
మిగిలేదంతా ఉపేక్షల ఊకపొల్లే…

ప్రతి చోటా ఉంటాం..
అందరి మాట వింటాం..
ఏ ఎజెండా లేకుండా అన్ని జెండాలు మోస్తాం  
కలాలు గళాలతోపాటు భుజాలు అందిస్తాం
అన్ని ఉద్యమాల్లో బలిదానాలవుతాం 
మతం ముసుగేసుకున్న అరాచకాన్ని గుర్తిస్తాం
 కులం రాజకీయ జూదాలను పసిగడతాం 

అయినా..
మాకు అసలు మెదళ్లే లేవని 
ప్రచారం చేస్తారు కొందరు 
మా అక్షరాలకు 
వక్ర భాష్యం చెప్తారు ఇంకొందరు
మన మూలాలన్నీ ఒకటే
మనమంతా సహ ఉదరులం 
అంటూనే 
మా పైటలు గుంజుతారు మరికొందరు 
మా తొడలు గిల్లి 
జోల పాడుతుందో తల్లి 

అయినా మేమంతా 
మీ నాయకత్వాలను నమ్మి గొర్రెల మందలమవుతామ్
మా మీద మేమే మన్ను పోసుకుంటాం
మీ ఉసిగొల్పులకు ఊర కుక్కలమై 
మాలో మేమే పోట్లాడుకుంటాం.. 
కండలూడి వచ్చేట్టు కాట్లాడుకుంటాం.. నెత్తుటేరులు పారేట్టు
కత్తులతో నరుక్కుంటాం..
మీరంతా చిద్విలాసంగా చూస్తూ 
మీ ఎత్తుగడ పారినందుకూ
మీ రంకు రాజకీయ చదరంగంలో 
ఎప్పటిలా
మేము అమాయకపు పావులైనందుకు
తృప్తిగా నవ్వుతుంటారు

మనమంతా భారతీయులం 
రాజ్యాంగ ఛత్రి నీడన పుట్టగొడుగులం 
పాతదే మతం 
కొత్తగా ఉన్మత్త పాచికలాడే వేళ 
మీ పాలిట ఉరితాళ్ళమవుతాం 

అధికార మధాహంకారంతో 
రైతులపై పెల్లెట్లై పేలుతుంటే 
రాబోయే ఎన్నికల్లో ఓట్లజిల్లెట్లై 
మీ అధికార కుత్తుకలు కత్తిరిస్తాం 

బళ్ళల్లో సిలబసు మార్చి 
పసి మెదళ్ళలల్లో విషాన్ని నింపి 
గుళ్ళల్లో మతం కులం కలిసి 
గరళం కక్కుతున్నప్పుడు 
మేము ఆటం బాంబులమై 
మీ పునాదులు కూలుస్తాం
దేశచరిత్రను తిరగరాస్తాం

         *** ****

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష