గుల్దస్తా(కథ)


"గుల్దస్తా"

జ్వలిత - 9989198943


అదొక గిరిజన ఆవాసం, తండా, గూడెం, గుంపు అని కూడా పిలుసుకుంటారు వాళ్ళు. మిగిలిన నాగరిక ప్రజలు కూడా అట్లాగే పిలుస్తారు. నగరవాసులంటే వారికి భయం. నాగరికులంటే మోసగాళ్ళని వారి అభిప్రాయం. పోలీసులు, ఫారెస్ట్ అధికారులు, న్యాయస్థానాలంటే మరీ భయపడతారు. వారితో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. 

చుట్టూ అడవులు పర్వతాల నడుమ రెండు మూడు గుంపులుగా కొన్ని గిరిజన కుటుంబాలు దాదాపు వంద సంవత్సరాల నుండి ఆ చీకటి జీవితాలను వెళ్ళదీస్తున్నారు. 


స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా అక్కడికి రోడ్లు, కరెంటు వంటి సౌకర్యాలు చేరలేదు. పాఠశాల, వైద్యశాల వంటివి వారికి తెలియదు.

అయితే వారి సంప్రదాయాలు ఆచారాల ప్రకారం పండుగలు, ఉత్సవాలు చేసుకొని ఆనందిస్తారు.


 వసంత పండుగ సమయమది. ఆ గుంపుల్లో యువతులంతా నిద్ర లేవగానే, రంగు రంగుల ముగ్గులు వాకిళ్ళలో, గోడల మీద చిత్రించడంలో మునిగిపోయారు. కనీసం ముఖం కడుక్కోడానికి కూడా ముగ్గులు వేయడం ఆపట్లేదు. తెలుపు పసుపు రంగులతో గోడలన్నీ అలికారు. వరండాలని నలుపు పసుపు రంగులతో. ఉల్లాసం కలిగించే డిజైన్లను చిత్రించారు. గోడల మీద వరండాలో బియ్యం పిండిని నీటిలో కలిపి రంగులతో ముగ్గులు వేశారు. చివరికి గుడిసె లోపల నేలంతా రంగులతో నింపారు. తలుపులు కిటికీలు దర్వాజాలకు బొగ్గు పొడి నూనెలో కలిపి పూసారు. చిన్న చిన్న గుడిసెలు నవ వధువుల వలె మెరుస్తున్నాయి. 


కొందరు స్త్రీలు బట్టలుతికేందుకు కట్టెల బూడిద కలిపి ఉడికిస్తున్నారు. అన్ని మరకలు పోయి, మరింత తెల్లగా అయ్యేందుకు బలంగా బండకేసి బాదుతున్నారు. తర్వాత తాము కూడా స్నానం చేసి సిగలను అలంకరించుకున్నారు. చివరిగా చేతికున్న భారీ ఇత్తడి గాజులను రుద్ధి రుద్ది మెరుగు పెట్టారు. మధ్యాహ్నం కంటే ముందు వాటిని మెరిసేలా రుద్ధి తృప్తి పడ్డారు. ఆ తర్వాత అందమైన రంగుల చీరలు మడత పెట్టి, బిగుతుగా నడుము చుట్టూ మోకాళ్ళు దాటకుండా కట్టి గుంపులుగా అడవిలోకి అదృశ్యమయ్యారు. తాజా పూలను వెతికి కొప్పులో ధరించేందుకు. వారు తలలో పూలు లేకుండా నాట్యం చేయరు. ప్రపంచంలో ఎక్కడైనా, ఏ కాలంలోనైనా.. స్త్రీలు సౌందర్య పిపాసులు, మిక్కిలి శ్రమజీవులు అని చెప్పేందుకు వారే సజీవ సాక్ష్యాలు.

***



సుక్కడు తన వంతు కట్టెలను పోగు చేశాడు. కానీ అతని మనసు పండుగ వాతావరణంలో లేదు. ఒక ఎట్టివానిగా  అతనికి ఇంటి మీద, కుటుంబం మీద ఆసక్తి పోయింది. అన్ని ఆనందాలు పోయాయి. ఈ వేడుకలు చేసుకోవడం, పాటలు పాడడం, వెక్కిరిస్తున్నాయి అతనిని. రోజంతా గుడిసె ముందున్న పరుపు బండ మీద కూర్చుని ఉన్నాడు. ఒకప్పుడు పనిలో అలసిపోయినప్పుడు మాత్రమే అక్కడ విశ్రాంతి తీసుకునే వాడు. ఇప్పుడు ఎవరు తన బాధలను భావాలను పంచుకునేందుకు లేరు. అతని పిల్లలు చిన్న వాళ్ళు కష్టసుఖాలు వారికి తెలియదు. అతనికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. ఇప్పుడే నాటిన విత్తనాల వంటి వాళ్లు తన పిల్లలు. వారిని పైకి తేవాలి. పుష్టిగా పెరిగేందుకు ఆధారం కలిగించాలి వారికి. పెద్దబిడ్డ గోరీ, గోర్యా గురించి కలలు కంటున్నది. చిన్నది మోరీ ఇంకా ఎవరిని ఎంపిక చేసుకోలేదు. కానీ, యువకుల దేహాలు ఆమెలో ఊహలను రేకిత్తిస్తాయి.  ఆమె పేరును పదేపదే ఉచ్చరిస్తూ ఝమిడిక ధ్వని వెంటాడుతుంది. చిన్నకొడుకు బాలగిరి ఇంకా చిన్నవాడే ఇప్పుడిప్పుడే నూనూగు మీసాలు వస్తున్నాయి. పెద్దకొడుకు బాలగామా అతనికి అప్పగించిన ఇంటి బాధ్యతలు మోయలేనంత ఆశక్తుడే. ఏ సాయం అందించే వీలు లేక నిరాశకు లోనవుతున్నాడు. 

సుక్కడు వేటసంచారినికి వెళ్లేప్పుడు అంతా సవ్యంగా ఉన్నది. ఇప్పుడు అంతా అస్తవ్యస్తంగా మారింది. చేపల వల అక్కడే పడి ఉన్నది. సగంలో ఆపిన సారా బట్టి పగిలి అట్లనే మిగిలింది.. పాత కర్రమంచం సరి చేయలేదు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఈ సమయంలో వంటింటి పెరటి తోట పొడవైన చిక్కుడు కాయలతో నిండి ఉండేది. కానీ ఈసారి తీగలు సగం ఎండిపోయాయి. ఇంకా అద్వానంగా వరిపంట పూర్తిగా కోసి నూర్చలేదు. డిసెంబర్ నెల పూర్తయి పోతున్నా కూడా రాగులపంటను నూర్చి ధాన్యాన్ని సరిగా జాగ్రత్త చేయలేదు. మట్టి పాత్రలు అన్నీ మూతలు తీసి ఉన్నాయి. చిరుధాన్యాలను ఎలుకలు తింటున్నాయి. పెద్దకొడుకు బాలగామాను చూస్తే అసంతృప్తితో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఏముంది వేడుక చేసుకోవడానికి? అనిపించింది అతనకి.


సాయంత్రం అవగానే ఒక్కసారిగా 'దొంగా దొంగా' అంటూ కేకలు వినపడ్డాయి. వేడుక మొదలైందని చెప్పే గుర్తు అన్నమాట. ఆచారం ప్రకారం ఒక యువకుడు ఎవరో ఒకరి ఇరుగుపొరుగు ఇంటిలో దూరి ఏదో ఒక వస్తువు తన చేతిలో పట్టేంతది ఎత్తుకు వస్తాడు. ఏదో ఒక నీళ్ళ బిందె కానీ పెరటి తోటలో బుట్టెడు కూరగాయలు కానీ ఏదైనా కావచ్చు. ఇదంతా ఒక ఆట. తర్వాత రోజు దొంగిలించిన వాటిని నామ మాత్రపు డబ్బు తీసుకుని తిరిగి ఇచ్చేస్తారు. 


            ***


సాయంత్రం భోజనం వండుకొని తిన్నారు అందరూ. ఇప్పుడు పండుగ మంట వెలిగించడం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. యువకులంతా  వాయిద్యాలతో అక్కడికి చేరారు. మొదటి ధ్వని కోరస్ గా వినపడింది. యువతులు అంతా చక్కగా పూలతో గాజులతో అలంకరించుకుని అర్ధచంద్రాకారంలో ఒకరి చేతులు ఒకరు పెనవేసుకొని నిలబడ్డారు. ఎత్తైన యువతి ఆ వరుసలో ఒక చివర ఉన్నది. వారి ముఖాలకు నూనె పసుపు పులుముకొని ఉన్నారు. బిగువైన వారి శరీరాలు లయబద్ధంగా ముందుకు వెనుకకు కదులుతున్నాయి. పండగ మంట వెలుతురుతో యువతుల వేగం పెరిగింది చిన్నచిన్న మంటలు ఒక పెద్ద వృత్తాకారంలో వెలిగించారు. వారి చుట్టూ నాట్యాన్ని చూసేందుకు వీలుగా. 


అప్పుడు జోడియ తెగ నాట్యం చేయడం మొదలు పెట్టింది. ఆచారం ప్రకారం యువకులు నాట్యం చేయమని యువతులను ఆహ్వానించాలి. అది వారి ప్రత్యేక హక్కు మరియాదతో విన్నపం పాట రూపంలోనే జరుగుతుంది. అప్పుడు యువకులు "గాజుల ఘర్షణ"గా పిలవబడే నాట్యాన్ని చెయ్యమని యువతులను పాటతో ఆహ్వానించారు.


ఆ పాట 

"నీ చేతి గాజులు ఒకదానితో ఒకటి మోగనీ - నీచేతి గాజులను ఘర్షణ పడనీ

ఓ నా ప్రియమైన చిన్నదానా - మనమంతా కలిసి 

ఈ గాజుల ఘర్షణ నాట్యం చేద్దాం 

గతంలో మన తండ్రులు చేశారు - దాన్ని మళ్లీ మనం చేద్దామురా

ఈ పురాతన గ్రామం - నీ చేతి గాజుల శబ్దాలతో - ప్రతి ధ్వనించనీ

మీ ఊరి మామిడి పండు కోసం - మీ ఊరి నేరేడు చెట్టు కోసం - నువ్వు కోరుకున్న దానికోసం 

మనమంతా ఆడుదాం వేడుకగా - 

మనసుతీరా నవ్వుకుందాం"

అని పాడారు


అప్పుడు యువతులు తమ భారీ ఇత్తడి గాజులు తెచ్చి, ఒకదానితో ఒకటి కొడుతూ, మోగుతున్న డప్పుల మోతలకు, మిగిలిన వాయిద్యాలకు అనుగుణంగా నాట్యం చేస్తున్నారు. అడవి ఆత్మ మేల్కొన్నది , ఆ వాయిద్యాల నాట్యంతో అక్కడి నేల కంపిస్తుంది. గిరిజన తెగలవారు తరతరాల నాట్యాలు పునరావృతం చేశారు.


"తాజా గాలిలో విషం లేదు - నమ్మకం ఒక్కటే ఉన్నదీ..

ఏ దోమలు మన రక్తాన్ని పీల్చవు - ఏ పాములూ - మన కాలి మడమలపై కాటు వేయవు. 

అపరిచితులు ఎవరైనా -  అడవిదారి నడిచినా 

వారి భుజాలపై వారి బాధ్యతలు తప్ప మరే బరువులు లేవు 

అంతిమ ఘడియల్లో - తమ నేలపైనే పడి మరణిస్తారు 

మరెవ్వరూ - మన నేలను ఆక్రమించరు 

ఇక్కడి నేలపై కొండలు లోయలు - ఈ భూమంతా మనదే - మరెవరిది కాదు "

అంటూ పాటలు ప్రతిధ్వనిస్తూన్నాయి.


 గిరిజన పురోహితుడు వచ్చేసరికి నాట్యం మొదలైంది. నిర్దేశించిన ప్రకారం పూజ మొదలై, కొనసాగుతోంది. పెద్ద మంట కోసం పెట్టిన కట్టెల కుప్ప ముందు నల్ల కోడి పుంజును కోసారు. ఆ రక్తాన్ని భూమిలోకి ఇంకిస్తున్నారు. వేడి వేడి తాజా ఇప్పపూల సారాను కూడా రక్తంలో కలిసేట్టు గుమ్మరించారు. అది భూమాతకు చేసే తర్పణము. పూలను సమర్పించారు. తర్వాత రక్తంలో తడిసిన కోడిపుంజు కట్టెల కుప్ప మీద ఆనించి కొన్ని పూలను చల్లారు. కట్టెల మీద ఇంకా కొంచెం ఇప్ప సారాని పోసారు.


 ఒక్కసారిగా కేకలు డప్పుల మోతలతో కట్టెలు చిటపటలాడుతూ మండుతున్నాయి. వాయిద్యాల మోతలు అధికమయ్యాయి. యువతులంతా ఒకరి చేయి మరొకరు పట్టుకుని పొడవైన గొలుసులా తయ్యారయ్యారు. ఆ అమ్మాయిల గొలుసు ఆ మంట చుట్టూ మెలికలు తిరుగుతూ.. మెలికలు తిప్పుతూ గుండ్రంగా తిరుగుతున్నారు. వారు ఆ వెలుతురులో కొత్తగా మెరుస్తున్నారు. వారి ఎర్రని ముఖాలపై వెలుగు ప్రతిబింబిస్తూన్నది. సంగీతం పెరిగిన స్థాయికి అనుగుణంగా నాట్యం వేగాన్ని అందుకుంటుంది. యువతులు యువకులు పాటకు కోరస్ గా పాడుతున్నారు. ముందు అనుకున్నట్టు ఒక సంకేతంతో ఒక్కసారిగా పాట ఆగిపోయింది. డప్పులు కొత్త లయలో మోగిస్తున్నారు మరొకరు, మరో బృందం కోరస్ అందుకుంది.


"దిడ్డూ! దిడుకుం! అమ్మాయిలూ అబ్బాయిలూ  కలిసి రండీ..

దిడ్డూ! దిడుకుం! దిడ్డూ! దిడుకుం!" అంటూ డోళ్ళు వేగంగా 

మరింత వేగంగా మోగుతున్నాయి. యువతులు సంతోషంగా పెద్దగా కేకలు పెడుతూ సంగీత ఝంకారానికి అనుగుణంగా పాడుతూ నిషాలో నాట్యం చేశారు ఆ రాత్రంతా.


అర్ధరాత్రి సుక్కడు లేచి పరుపు బండ మీద కూర్చున్నాడు. చుట్టూ చూసుకున్నాడు దాదాపు మంట ఆరి పోయింది. బూడిదలో మెరుస్తున్న నిప్పు మిణుగురులు మిణుకు మిణుకు మంటున్నాయి. ఎక్కడబడితే అక్కడ గుంపులుగుంపులుగా జనాలు నేల మీద చచ్చేట్టు తాగి పడి ఉన్నారు. ఆ సమయంలో పండుగ నిశ్శబ్దాన్ని చేరుకుంది. కానీ మళ్ళీ ఆ మంటలు వెలిగించ బడతాయి మరొక ఊరిలో మరో కొండ ప్రాంతంలో. పండుగ కొనసాగుతోంది అత్యంత ఆకర్షణీయంగా అనేక దఫాలుగా ఆ నెల పొడుగునా వేడుక జరుగుతుంది. కానీ సుక్కడికి అదంతా ఆనందాన్ని వ్వట్లేదు.


మరుసటి రోజు వేడుకల బాధ్యత పిల్లలు తీసుకుంటారు. వారు స్వయంగా బృందాలుగా ఏర్పడి ఇంటింటికి వెళ్లి తిండి గింజలను అడుగుతారు విందు కోసం. ప్రతి పిల్లవాడు ఒక చెంప నల్ల రంగు మరో చెంప తెల్ల రంగు పూసుకుని ఉంటాడు. వారి బట్టలు కాళ్లు చేతులు రకరకాల రంగులు పూసుకుని ఉంటాయి. చేతిలో చిన్న చిన్న కార్రలతో ప్రతి ఇంటి ముందుకు వెళ్లి నేలను కొడుతూ పాటలు పాడుతూ డాన్స్ చేస్తారు.


"చర్ చర్రా చర్ చర్రా - మాకు కొంత డబ్బులు ఇవ్వండి - ఒక కట్ట చొప్ప ఇవ్వండి" 


అని పాడుతూంటే ఇంటి యజమాని లేదా అతని భార్య బయటికి వచ్చి చూసి నవ్వుకుంటూ వెళ్లి చేతినిండా బియ్యం లేదా ధాన్యం తెచ్చి వారి వద్ద ఉన్న బాదం గిన్నెలు వేస్తారు. ఆ గుంపు మరో ఇంటి వైపు సాగుతోంది వీధుల్లో.


 వృత్తి సంగీతాన్ని మొదలు పెట్టారు డ్రమ్ములు వాయించడమే వృత్తిగా కలవాళ్ళు కొందరు. ఇంకా డోలు వాయిస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడు ఉన్నట్టుండి యువకుల గుంపు ఊగుతూ నాట్యం చేస్తుంది. మద్యం ఏరులా పారుతుంది. పురుషులంతా ముచ్చట్లు పెడుతూ ఉంటే, స్త్రీలు పాటలు పాడడం నవ్వడం చేస్తుంటారు. అమ్మాయిలు నృత్యాలు చేస్తారు. సాయంత్రం డోళ్ళ శబ్దం వినపడింది. పక్క ఊరి నుంచి ఆ గుంపు మరో రాత్రి వినోదానికి సిద్ధపడతోంది. అప్పుడు ఇక ఏమాత్రం పొలాల్లో పని చేయరు జీవితం అంతంలేని వేడుకలు సమాహారం వారికి.


**** *** *** ** **



అర్ధరాత్రి గడిచిన తరువాత గోరీ మళ్లీ లేచింది. మోరీ మంచి నిద్రలో ఉంది. గోరి బయటకు నడిచింది నెల పొడుపు చంద్రుడు రావి చెట్ల కొమ్మల నుండి తొంగిచూస్తూ వెన్నెల శూలాలు విసురుతున్నాడు. మసక వెన్నెల కాంతి పొగమంచును జల్లెడ పడుతున్నది. అడవంతా నిద్రలో ఉంది వెలుగునీడలు పొగమంచుతో కలిసి  కొత్త రంగుల కలలను అల్లుతున్నది, చలిని పట్టించుకోకుండా. తననెవరో సున్నితంగా పిలుస్తున్నట్టు అనిపించింది, నిద్ర రాక పడక మీద పడి ఉన్న ఆమెకు. బయటకు వచ్చి చూసింది ఎవరు లేరు అక్కడ.


చెట్టు కింద మిణుగురు పురుగులు చీకట్లో మెరుస్తున్నాయి. ఆమె తన చేతి నిండా మిణుగురులను పట్టుకున్నది. అంతలోనే తన కళ్ళను ఎవరో మూసి, తనను ఒక్కసారిగా లాగి బలమైన చేతులతో బంధించాడు. ఆమె తన తలను తిప్పి చూసింది అతను గోర్యా. తల నుండి కాళ్ళ వరకు సంచులతో కుట్టిన బొంత కప్పుకొని ఉన్నాడు. వెన్నెల రావి చెట్టు ఆకుల సందు నుండి బొట్లు బొట్లుగా జారుతూ భూమి మీద రంగవల్లులు అల్లుతున్నది. ఆ వెన్నెల వర్ణచిత్రాలను దాటుకొని నడుస్తూ ఒక పరుపు బండ దగ్గరకు చేరి కూర్చున్నారు. ఊరి మధ్య రావి చెట్లు నిలబడి ఉన్నాయి. అన్ని ఇళ్ల తలుపులు బిగించారు. వాటి వెనుక మినుకు మినుకు మంటూ నెగళ్ళు, వాటి పక్కనే కుక్కలతో పాటు మనుషులు నిద్రిస్తున్నారు.


మరొక యువతి బయటకు వచ్చి అడవి వైపు కదిలి జంటగా చీకట్లో కలిసిపోయింది. ఎవరి కంట పడకుండా.


గోరీ, గోర్యా ప్రశాంతంగా కూర్చున్నారు.

" పగటిపూట ఒంటరిగా అడవిలోకి రావచ్చు కదా" అంటూ గుసగుసలాడాడు గోర్యా. 

"నేను ఇంటి పనిలో తీరిక లేకుండా ఉంటాను. మా అక్క, అన్నా ఎప్పుడూ నన్ను అంటిపెట్టుకునే ఉంటారు. ఎలా రాగలను" అని గుసగుసలాడిందామె. 

"నీ సంగతేంటి నిన్ను చూడడమే కుదరడంలేదు" అంటూ ఆ ప్రేమికులు చాలా ముచ్చట్లు చెప్పుకున్నారు.


చివరికి కోపం నటిస్తూ "ఎన్ని రోజులు ఈ విధంగా కొనసాగుతాము. మనిద్దరం లేచి పోదామా" అన్నది గోరీ.

గోర్యా ఆమెను చుట్టేస్తూ "నేను ఆలోచించడం లేదు అనుకుంటున్నావా! కానీ… " అని ఆగాడు. "నువ్వు నిజంగా ప్రేమిస్తే భయపడాల్సిన పనిలేదు" అంటూ ముఖం తిప్పుకుంది.

" నీ ప్రేమ ప్రమాణాలకు అర్థమే లేదు" అని నిష్టూరమాడింది. ఆమెను కౌగిలించుకొని బుజ్జగించడానికి ప్రయత్నిస్తూ "నీకు తెలుసా మనం ఇప్పుడు పారి పోవచ్చు, కానీ రేపు పొద్దున్నే మీ నాన్న తన బంధువులతో వచ్చి, కన్యాశుల్కం ఇమ్మని తలుపు కొడతాడు. దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి" అన్నాడతను.

" అయితే కన్యాశుల్కం కట్టలేవా..? " అని ఒత్తిడి చేసింది ఆమె. మళ్ళీ "మీ నాన్న అంత పేదవాడా? కన్యాశుల్కంగా కొద్ది డబ్బులు కూడా ఇవ్వలేడా?" అన్నదామె.

"కానీ రెండు, మూడు వేల రూపాయలు  గోరీ… ఎక్కడి నుండి తేగలను. అంత సొమ్ము వెంటనే చేయడం కుదురుతుందా" అన్నాడతను.

 "అయితే ప్రేమ ముచ్చట్లు ఆపు గోర్యా ! ప్రేమ చూపడం ఆపు! అప్పుడు నీ డబ్బు నీ వద్దే ఉంటుంది. మైదాన ప్రాంతం ఆడవాళ్ళ వలె కూర్చొని తినే దాన్ని కాదు నేను. చాలా కష్టపడి పని చేస్తాను. ఇక చాలు నన్ను పోనివ్వు" అంటుండగా ఆమె పెదవులు వణికాయి. కన్నీళ్లు రాలాయి. 

కానీ ఆమె తన కోపాన్ని మర్చిపోయి కళ్ళు మూసుకుంది. అతడు ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకొని బుజ్జగిస్తూ ఉంటే, అతని ఆత్మీయ స్పర్శతో పరవశించి పోయింది.

" నన్ను ఎప్పుడు తీసుకు పోతావు…" అన్నది మత్తుగా.. గుసగుసగా. 


ఆమెను అక్కున చేర్చుకొని "అతి తొందరగా.. ఈసారి పంట కోసం ఎదురు చూస్తున్నాను. డబ్బులు రాగానే వీలైనంత తొందరగా నీ దగ్గరికి వస్తాను. లేదా ఏదో ఒక రకంగా అప్పు చేసి, ఎట్టిగా నైనా మారుతాను" అన్నాడు.

" వద్దు వద్దు" అంటూ ఆమె అతనిని చుట్టుకుంది. 

"నేనెప్పటికీ నీవు ఎట్టికి వెళ్లడానికి అంగీకరించను" అన్నది 

"నువ్వేం బాధపడకు, ఏమి జరగాలో అది జరుగుతుంది. కానీ పెళ్లిళ్ల మాసం రాగానే మొదటి రోజే నిన్ను మా ఇంటికి తీసుకు పోతాను" అన్నాడతను. తరువాత ఎవరి  గుడిసెకి వారు వెళ్లి పోయారు.


ఈ గిరిజన తెగ సంవత్సరంలో నాలుగు నెలలు పెళ్లిళ్లు చేస్తారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో… మార్చి ఏప్రిల్ చైత్రం వారికి, వసంతోత్సవ పండుగ. ఆ రోజుల్లో వాళ్లు రాత్రి పగలు నాట్యాలు చేస్తూ, వేటలతో విందులు చేసుకుంటారు. 


ఈ వసంతంలో గోరీ, గోర్యాతో కలిసి నాట్యం చేయాలని కలలు కంటోంది… అతని భార్యగా. గోర్యాకు తనకు కలసి ఒక సొంత ఇల్లు ఉంటుంది, వారిద్దరూ కలిసి అడవికి వెళ్లి ఆకుకూరలు దుంపలు తినడానికి వంటచెరకు తెచ్చుకోవాలి. అతడు పొలానికి వెళ్ళినప్పుడు అతని కోసం  అంబలి సొరకాయ బుర్రలో తీసుకొని పోవాలి ఆమె. అతనితో కలిసి చేపలు పట్టేందుకు వెళ్లాలని, 'శీలవతి చేపలు' పెద్దతలలతో పొలుసులు లేకుండా మెత్తగా ఉంటాయి. వాటిని రుచికరంగా వండి, అడవి నుండి ఆకులు తెచ్చి చోళ్ళ అంబలిలో కొంచెం ఉప్పు కలిపి అతనికి ఇష్టంగా వడ్డించాలి, వారిద్దరికీ సొంత ఇల్లు ఉంటుందనే ఊహలలో తేలిపోతోంది గోరీ.


గోర్యా కూడా ఆలోచనల్లో మునిగాడు. ఏమైనా సరే ఏదో ఒకటి చేసి కన్యాశుల్కం కోసం డబ్బు సంపాదించాలి. వడ్డీ వ్యాపారి దగ్గరికి పోతే అనుకున్నాడు. ఆ ఆలోచన భయాన్ని కలిగించింది. 

వెంటనే  తాను పెళ్లిబంధంలో ఇరుక్కోవడమా, ఆ విధంగా స్వేచ్ఛ వదులుకోవాలా ? ఏమో కచ్చితంగా నిర్ణయించుకో లేకపోయాడు. కానీ అప్పుడు మళ్ళీ వణికే పెదవులతో కన్నీటితో నిండిన గోరీ ముఖం అతని మనసులో కదలాడింది. అపరాధ భావన కలిగింది అతనికి. కానీ అతను నిద్రించగానే ఎందరో యువతులు తనకోసం పోటీ పడుతున్నట్టు, అనేక ముఖాలు అతని ఆలోచనల్లో కదలాడాయి.

***


ఎప్పటివలనే గ్రామంలో "గ్రామ పెద్ద" ఇంటి వరండాలో బసచేశాడు ఫారెస్ట్ గార్డ్. అక్కడ ఆడుకుంటున్న చిన్నపిల్లలు అతడిని చూసి భయంతో గబగబ దూరంగా పోయారు. చుట్టుపక్కల ఆడవాళ్ళంతా ఇంటిలోపలకు పోయి, తమ గుడిసెల 

నుండి మూగకళ్ళతో చూస్తున్నారు, కన్నాల్లో నుండి నక్కలు చూసినట్టు. 

ఆ గుంపు పెద్ద దగ్గరుండే ఎట్టివాడు మరోసారి గ్రామంలోని అన్ని వీధులకు వెళ్లి గ్రామస్తులందరినీ పోగేశాడు. గ్రామ పెద్ద ఫారెస్ట్ గార్డ్ సేవ చేయడంలో నిమగ్నమై ఉన్నాడు. మాంసం కోసం కొయ్యడానికి ఒక మేకను తెచ్చారు, కోళ్లు కోడిగుడ్లు కూరగాయలు సేకరించబడ్డాయి.

గ్రామస్తులంతా వచ్చి వినయంగా నిలబడ్డారు. ఫారెష్ట్ గార్డ్ సౌకర్యంగా స్థిమితపడ్డాడు.


సాయంకాలం గార్డు తనకు ఇష్టమైన ప్రదేశాన్ని వెతుకుతూ బయల్దేరాడు, వాగు తీరాన ఎవరూ లేరు అతనికి అసంతృప్తి కలిగింది. "ఒకవేళ గోరీ వచ్చే సమయం ఇది కాదేమో , వేచి చూడాలి" అనుకున్నాడు. గోరీ కోసం పొదలచాటున మాటు వేసి ఉన్నాడు. కొందరు అమ్మాయిల గుంపు చెలెమె వద్దకు వచ్చి వెళ్ళారు, కానీ అందులో గోరీ లేదు. చీకట్లు కమ్ముకున్నా అతను ఎదురు చూస్తూనే ఉన్నాడు. చివరికి చాలా సేపటికి దూరం నుండి ఎవరో ఒంటరిగా కొండ దిగువలో మట్టికుండతో నడుస్తూ కనిపించింది. అది గోరీనే.

ఆమె దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా చాటు నుండి ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు, నవ్వుతూ మీసాలు దువ్వుతూ.

"నన్ను గుర్తుపట్టావా అమ్మాయి" అంటూ మాటలు కలిపాడు.

"ఔ తెలుసు" గోరి సమాధానం ఇచ్చింది.

"నువ్వు ఎంత అందంగా ఉన్నావు" అంటూ ఆమెకు సైగ చేశాడు.

ఆమె "నువ్వు అందంగా లేవా " అని చురక వేసింది చిరునవ్వుతో.. .

అతను కొన్ని అడుగులు ముందుకు వేసి ఆమెతో సరసమాడాడు. ఆమె కూడా అదే పద్ధతిలో సరసంగా సమాధానమిచ్చింది. కొండ ప్రాంతాల్లోని ఏ అమ్మాయి తమపై ఎటువంటి చతురులాడినా అందుకు గొడవ పడదు.


"నేను నిన్ను 'ప్రియా' అని పిలవవచ్చునా…".

"ఓ పిలవచ్చు. కానీ నీవు నాకు 'ఏమౌతావు, నీకు నేను ఏమౌతాను" అన్నది అమాయకంగా గోరి.

" నేను ఈ రాత్రికి ఇక్కడే బస చేస్తున్నాను" అంటూ ఫారెస్ట్ గార్డ్ ఆమెకు సూచన చేశాడు. 

మళ్ళీ "ఈ సాయంత్రం నాట్యం సంగతి ఏమిటి ? నువ్వు వస్తావా" అన్నాడు.

"తప్పకుండా.. నాట్యమంటే చాలా ఇష్టం నాకు, ఎవరైనా డప్పు వాయిస్తూ పాట పాడితే, నేను డాన్స్ చేస్తూ ఎగురుతాను" అన్నదామె. ఇద్దరూ కలిసి నవ్వుకున్నారు.

జానపద గీతాన్నొకదాన్ని ఫారెస్ట్ గార్డ్ రెండు చరణాలు పాడాడు.

"ఇప్పుడే రావోయి ఓ నా ప్రియురాలా

దిట్టంగా కట్టిన ఇంటి గోడల వలె - నువ్వు బలంగా ఉన్నావా !

మద్యం కాసేవాడి ఇంటి వరండా వలె - నువ్వు బలంగా ఉన్నావా !

రావోయి రా నన్ను చూడనివ్వు - నీ యవ్వనం ఎంత దృఢమైనదో" పాడుతూ.. ఒక్కసారిగా అతడు ఆమె ముందుకు దూకి ఆమె భుజాలపై రెండు చేతులు ఉంచి, ఆమె కళ్ళలోకి చూస్తూ నవ్వాడు. 

గోరీ విదిలించుకుని ముందుకు నడిచింది. ఒక కొండ జాతి అమ్మాయి లేచి పోతే ఎవరు తప్పు పట్టరు. కానీ దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఒక అపరిచితుడు తన పరిధులను దాటి అవివేకంగా ప్రవర్తిస్తున్నాడు. 

గోరీ ఆశ్చర్యపోయింది అవాక్కయింది. కానీ తన తిరస్కారాన్ని ఫారెస్ట్ గార్డ్ ముందు బయట పెట్టలేదు. ఆమె నల్లటి కళ్ళు అయిష్టాన్ని మాత్రం వ్యక్త పరిచాయి.

గ్రామస్తుల గుంపు ఒకటి వారాంతపు సంత నుండి తిరిగి వస్తూ చెరువు అవతలివైపు, గట్టు మీద నడుస్తూ వారిలో వారు గట్టిగా మాట్లాడుకుంటున్నారు.

అది చూసి ఫారెస్ట్ గార్డ్ వెనుకకు తగ్గాడు. వారు కనుమరుగు కాగానే, మళ్లీ "ప్రియమైన గోరీ.." అంటూ గొణుగుతూ ఆమె వైపు వచ్చాడు.


ఆమె సమాధానం చెప్పలేదు.

పక్షులను వేటాడేవాడు జిగురు పూసిన కర్రను కొద్దికొద్దిగా పక్షుల వైపు ముందుకు చాపి, అనుమానం రాకుండా దానికున్న ఎరను పక్షి రెక్కలకు పూస్తాడు. 

ఫారెష్ట్ గార్డు కూడా వేటగాడి వలె ఆమెను వెంటాడుతూ, ఆమెను తన వైపు లాగాలని చూస్తున్నాడు. "ఇక్కడ మనని ఎవరూ చూడరు ఎందుకు భయపడుతున్నావు" అంటూ గట్టిగా సణగడం మొదలు పెట్టాడు. అతని కళ్ళు మండుతున్నాయి.

"ఇక్కడ ఎవరూ లేరు, భయమెందుకు ? నాతో రా గౌరీ, మనమిద్దరమూ ఈ కొండ దాటి అవతలి వైపు పోదాం, అక్కడ ఆకుపచ్చ పావురాలను నా తుపాకీతో వేటాడుదాము రా" అంటూ, అతని రెండు చేతులూ వెడల్పుగా చాపుతూ ఆత్రంగా ఆమె వైపు రెండు అడుగులు వేసాడు.


ఆమె కదలలేదు అతడి ముఖం సమాధి రాయిలా ఉంది. ఆమె అతని వైపు కింది నుండి పైకి పరిశీలించింది ఇంతవరకు ఆమె చూడని వ్యక్తిని చూసినట్టు. పొడవుగా, బక్కగా, ముదిరి గిడసబారినట్టు వింతగా ఉన్నాడు. అతని చెంపలు లోపలికి పీక్కుపోయి గుంటలు పడి ఉన్నాయి. కాళ్లు చేతులు బలహీనంగా ఎండిపోయాయి పదే పదే మలేరియా బారిన పడిన వాడి వలె. గాలి కోసం అతడు గసపెడుతున్నాడు. అతను గొణిగినట్టుగా పళ్ళు కరచుకొని "మనం పోదాం రా.. పోదాం రా.." అంటున్నాడు.

ఆమె అతడిని పరశీలనగా చూసింది, తన శక్తితో పోల్చుకుంది తప్పించుకునేందుకు. 


ఇది ఎంత విచిత్రం భూమి మీద ఉన్న విచిత్రమైన ప్రాణి స్త్రీ. పురుషులందరూ ఆమెకు ప్రియులు కావాలనుకుంటారు. ఎంత సిగ్గుచేటు, అవమానం అనుకుంది. చిరాకుగా వెనుకకు తిరిగి ఇంటి దారి పట్టింది. ఫారెస్ట్ గార్డ్ కుక్క వలె ఆమె అడుగులను అనుసరించాడు.

దాదాపు ఇంటి వరకు వచ్చిన తరువాత

" ఇది ఎవరి ఇల్లు ?" అని గట్టిగా అరిచాడు. ఆమె వెనుకకు తిరగకుండా "ఇది మా ఇల్లు" అని సమాధానం చెప్పింది. " మీ నాన్న పేరేంటి ?" అన్నాడు. "సుక్కన్న"

" అవునా" అన్నాడతను.

గోరి ఇంటి లోపలికి వెళ్ళింది.

తలుపు దగ్గర మోరీని చూసిన ఫారెస్ట్ గార్డ్ "మీ నాన్న ఎక్కడ" అన్నాడు.

"కొండ పైకి వెళ్ళాడు".

 "నేను ఇల్లు శుభ్రంగా ఉందో లేదో చూడాలి. నేను మీ ఇంట్లోకి వచ్చి చూస్తాను" అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా గుడిసెలో జొరబడ్డాడు. "ఇది ఏంటి ? ఇది ఏంటి?" అంటూ చీకటిగా ఉన్న గుడిసెలో గోరి కోసం తడుముతూ వెతికాడు. అతడి కళ్ళు కామంతో మూసుకుపోయాయి. మోరి కూడా అతనిని అనుసరించింది లోపలికి వచ్చింది.

అంతలో మనసు మార్చుకుని ఫారెస్ట్ గార్డ్ వెనక్కు తిరిగి వెళుతూ "మీ తండ్రి రాగానే నన్ను కలవమనండి, నేను ఫారెస్ట్ గార్డును, ఒక ఆఫీసర్ని వచ్చాను" అని చెప్పండి అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు.

*** *** *** *** ***



ఆరోజు రాత్రి ఒకటి జరిగింది. రాత్రిపూట చోళ్ళగంజి తాగి గిరిజనులంతా నిద్రించిన తర్వాత గ్రామమంతా అన్ని పనులు ముగించుకొని సద్దుమణిగింది. సుక్కడు తన ఇంటి ముందు అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. రోడ్డుపై చీకట్లో ఒక కాలుతున్న చుట్ట వెలుతురు కొద్దికొద్దిగా ముందుకు వస్తూ అతని ఇంటి వద్దకు వచ్చింది. అతడు గ్రామ పెద్ద వద్ద ఉండే ఎట్టి వాడు కాకిగాడని గుర్తుపట్టాడు. ఎవరైనా అప్పు తీసుకొని చెల్లించలేక ఎట్టికి పనులను చేస్తారు. చాలాకాలం అప్పు తీరక చివరికి బానిసగా మిగులుతారు. వారిని  ఎట్టి అంటారు. ఎట్టి కాకిగాడు సుక్కడిని పక్కకు పిలిచి గుసగుసగా ఏదో చెప్పాడు. సుక్కడి పెదవుల నుండి అసమ్మతిగా హుంకారం వచ్చింది.

కానీ ఎట్టివాడు పట్టుదలగా చెప్తూనే ఉన్నాడు.

" అవును అవును ఫారెష్ట్ గార్డ్ వచ్చింది గోరి కోసమే. నన్ను నమ్ము, అతడు అదే కోరుకుంటున్నాడు, అడవి మీద ఒట్టు,  అతడే, నీ బిడ్డను.. గోరీని.. ఫారెస్ట్ గార్డ్ " అంటూ ఆపి ఆపి మాట్లాడుతుంటే.

సుక్కడు ఆగ్రహంతో ఉన్న జంతువు వలె గర్జిస్తూ "నీచుడా ! నిన్ను చూడు, ఏం చేస్తానో?" అని అరిచాడు.

" నీ ఎముకలు అన్నీ విరగ కొడతాను, నువ్వు ఆగు నువ్వు బతికుండగానే నీ తోలు వొలుస్తాను" అని అరిచాడు.

"పిచ్చివాడిలా నామీద అరవకు" అంటూ  ఏడుస్తూ "నేను కేవలం ఫారెస్ట్ గార్డ్ పంపితే వచ్చాను. నీకు తెలుసు అతని మాట వినకపోతే ఏం జరుగుతుందో. అదే నీకు కూడా జరుగుతుంది. నీకే కాదు మన అందరికీ అదే జరుగుతుంది. అధికారులు అడిగిన దానిని తిరస్కరించ లేము. అది వారికి సమర్పించాల్సిందే. ఒకవేళ వారి కోరిక మన భార్యా పిల్లలు అయినా సరే. ఏదో ఒక వంకన మనను చేతికి బేడీలు వేస్తారు. ఒకరి పొరపాటుకు శిక్ష గిరిజనులంతా తప్పనిసరిగా అనుభవించాల్సి ఉంటుంది" అన్నాడు ఎట్టివాడు.

" తలకాయలేని మాటలు ఇవి" అంటూ  గట్టిగా అరిచాడు సుక్కడు. మళ్ళీ "అవును నాకు తెలుసు ఫారెస్ట్ గార్డ్ చాలా శక్తిమంతుడు. మనందరినీ నలిపేస్తాడు కానీ, ఆ పశువు నా అమాయకపు గోరీనే ఎందుకు ఎంచుకున్నాడు. అతనంటే చాలా మంది పడిచస్తారు. వెళ్ళు వెళ్లి నీ అదృష్టాన్ని పరీక్షించుకో. మన కోళ్లను మన ధాన్యాన్ని అన్నీ తీసుకున్నారు. ఇంకా ఏమి మిగిలి లేదు" అన్నాడు సుక్కడు.

"అంత ధైర్యం చేయలేనయ్యా…" అన్నాడు ఎట్టివాడు విచారంగా.

"అతడు గోరీ పట్ల పిచ్చి కోరికతో ఉన్నాడు. ఫారెస్ట్ గార్డ్ నాతో ఏమన్నాడో తెలుసా? అటువంటి అమ్మాయిని ఇంతవరకు చూడలేదని, ఆమె అవయవాలు మృదువుగా వెన్న వలె ఉంటాయని, ఆమె రొమ్ములు కొండలవలె ఉంటాయని, వెళ్లి ఆమె తండ్రికి చెప్పు. ఆమె నాకు కావాలనీ, ఈ పదిరూపాయల కట్టను ఆమె తండ్రికి ఇవ్వు" అని చెప్తూండగానే సుక్కడు లేచి అతని మీద పడి పిడి గుద్దులు కురిపించాడు పెద్దగా అరుస్తూ.

"ఓరి దుర్మార్గుడా ఇదిగో ఇదిగో వాడికి మీ దేవుడికి ఆ మురికి కుక్కకు ఫారెస్ట్ గార్డ్ కు ఇవ్వు. దరిద్రుడా ముందు నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో నిన్ను చంపక ముందే ఇక్కడి నుండి కదులు" అంటూ అరిచాడు. ఒక గిరిజనుడికి కోపం వస్తే మృగంలా మారతాడు. సుక్కడు కోపంతో ఊగిపోతున్నాడు. అతని చూపు మసకబారింది. అతని చేతులు చాలా వేగంగా చెట్లు నరికి, రాళ్ళు ఎత్తి దృఢంగా అయినాయి.


కాకిగాడు నొప్పులతో ఏడుస్తూ చీకటిలో కలిసిపోయాడు, నెమ్మదిగా గుంటనక్కలా.


ఆ తర్వాత  అవమానంతో కుంగిపోయాడు సుక్కడు . మొదటిసారి ఫారెస్ట్ గార్డ్ మీద ఉద్రేకం కలిగింది. వెంటనే పోయి లెక్క తేల్చుకోవాలనుకున్నాడు. కానీ ఆలోచిస్తే "ఈ సంగతి ఎవరికైనా తెలిస్తే " అని అనుకోగానే క్రమంగా ఆవేశంగా ఎగురుతున్న తల కిందికి వాలింది. అతడు మట్టి ముద్దలా నిలబడి నెమ్మదిగా పక్కన గోడకు ఆనుకొని నేలమీద కూలబడ్డాడు. తల రెండు చేతులతో పట్టుకొని, అంతవరకు జరిగిన సంఘటన మళ్లీ గుర్తు చేసుకున్నాడు. 


సుక్కడు తాను చేసినది చాలా దూరం వెళ్లినట్టు గ్రహించాడు. "ఇది ఎక్కడ ముగుస్తుంది" అంటూ తనను తాను ప్రశ్నించుకున్నాడు. అది ఒక పరిష్కారం లేని సమస్యగా బాధపడ్డాడు.

***



మరుసటి రోజు ఫారెస్ట్ గార్డ్ ఏమీ జరగనట్టుగా భుజంపై తుపాకీ చేతిలో కర్రతో ఊరు వదిలి వెళ్ళాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు జరిగిన దాని గురించి. కానీ కొత్త అవమానాన్ని తనలో దాచుకుని వెళ్ళాడతడు. గ్రామస్తులంతా అతని వెంట చాలా దూరం సాగనంపారు. 


సుక్కడు అతని పిల్లల జీవితం అలవాటయిన దారివెంట నడుస్తున్న ఎడ్లబండి వలె సాగుతోంది. పగటి వెలుతురు మసగబారే వరకు తండ్రి కొడుకులు కష్టపడి కొండపై చెట్లను నరుకు తున్నారు. వారి గొడ్డళ్ళ చప్పుడు ఆ కొండ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తోంది. సాయం సమయంలో కుటుంబ సభ్యులంతా ఒక్క చోట చేరి అవీ ఇవీ మాట్లాడుకుంటున్నారు. కానీ రాత్రి సమయంలో సుక్కడు కంటి శుక్లాల వల్ల సరిగా చూడలేకపోతున్నాడు. అంతా బాగున్నట్టు హాయిగా నవ్వుకునే సమయంలో ఉన్నట్టుండి ఎవరిదో అదృశ్యమైన హస్తం తన గొంతును నొక్కుతున్నట్లు, ఏదో జరగబోతోంది అని భయం అతన్ని కమ్ముకుంటుంది. కొండ లోయలను కప్పేసి నల్లటి మేఘంలా అతని ముఖాన్ని కప్పేస్తుంది. అతడు భయం కరమైన కోపంతో అధికారులు చేసే దుర్మార్గాన్ని తలుచుకొని బాధపడుతున్నాడు. ఆ సమయంలో ఏదో తెలియని భయంతో రెండు చేతులు జోడించి నుదుటి పై ఉంచుకొని అతను ఏడవడం మొదలు పెడతాడు. గిరిజనుల దేవుళ్ళనందరినీ వేడుకుంటాడు. భూదేవి నాకు ఏ చెడు జరగనీయకుండా చూడండి. మీకు కోళ్లను పావురాలను బలి ఇస్తాను అంటూ ప్రార్థిస్తాడు.


ఒక పక్షం గడిచింది, తర్వాత నెల గడిచింది కానీ ఫారెస్ట్ గార్డ్ తిరిగి రాలేదు. సుక్కడు దేవుళ్లకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఫారెస్ట్ గార్డ్ బదిలీ అయి ఉంటాడని, రానే రాడని భావించి హాయిగా స్వేచ్ఛగా గాలి పీల్చుకున్నాడు. తండ్రి కొడుకులు అడవిలో చెట్లను నరికే కార్యక్రమం కొనసాగిస్తూనే ఉన్నారు. పని మధ్యలో ఆపినప్పుడు వారు కొండ దిగువన లోయల్లో పశువుల కాపరులు రహస్యంగా సారా కాసే చోటికి వెళ్లి ఇప్పసారా తాగి నృత్యం చేస్తూ కొత్త శక్తిని తమలో నింపుకుంటున్నారు. ఆ విధంగా తమ అలసటను మర్చిపోతున్నారు.


ప్రతిరోజు అడవి నరికి విశాలంగా చేస్తున్నారు వారు నరికే చెట్లు, కాల్చే కలప పాలకులకు సంబంధించిన సంపద అని వారికి తెలియదు. కానీ చట్టం దృష్టిలో వారు నేరస్తులు. లైసెన్స్ ఉన్న దుకాణాల్లో కాకుండా రహస్యంగా మద్యాన్ని కొనడం తాగడం చేసేవారు. వారి తలలు రాళ్ల వంటివి ఏ విషయాలు వారికి తెలియదు. వారి దృష్టిలో అడవిలో కొండలపై పెరిగే సంపదంతా వారికోసమే అనుకుంటారు. సూర్యుని కాంతి, వర్షము, గాలి, నీరు ఎటువంటి నిబంధనలు లేకుండా వాడుకున్నట్టు అడవి సంపద కూడా తమకోసమే అని భావిస్తారు.


***


అనుకోకుండా ఒక రోజు కొండ శిఖరం పై చాలామంది కనిపించారు. వారంతా తెల్ల రంగు దుస్తులు ధరించి ఉన్నారు. ఒకరిద్దరి తలపై టోపీలు ఉన్నాయి. ఆ గుంపుకు ముందు నాయకుని వలె ఫారెస్ట్ గార్డ్ తుపాకీ భుజంపై పెట్టుకుని కనిపించాడు. 


సుక్కడు చేతిలో గొడ్డలి జారిపోయింది. దూరం నుండి వారిని చూడడంతో అతని కళ్ళకి ఒత్తిడి కలిగింది. అనుమానం లేదు అతడు ఫారెస్ట్ గార్డే. అతడు తనకు తానే చెప్పుకున్నట్టుగా "నేనే తప్పు చేయలేదు" అనుకున్నాడు. కానీ ఏదో తెలియని భయం కమ్మేసింది. తన భయాన్ని తరమడానికి మళ్లీ గొడ్డలి అందుకున్నాడు, మధ్యలో ఆపిన పనిని కొనసాగిస్తూ వేగంగా చెట్టు నరకడం మొదలుపెట్టాడు. అధికారులకు సుక్కడు చెట్లు నరికే చోటుకి రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.


ఫారెస్ట్ గార్డ్ గట్టిగా "ఏయ్ నిన్నే" అంటూ అరిచాడు. 

సుక్కడు అతని ఇద్దరు కుమారులు గొడ్డళ్ళను వదిలేసి, అధికారుల వద్దకు వచ్చి, వీలైనంత నడుము వంచి నమస్కారం చేశారు. 

అధికారులను మీరెవరు అని అడిగే ధైర్యం వారికి లేదు. ఆడవి భూముల్లో నడుముకు చుట్టుకున్న వస్త్రం తప్ప ఎక్కువ దుస్తులు ఎవరూ ధరించరు. తమ హక్కుల గురించి ప్రశ్నించే ప్రయత్నం ఎవ్వరూ చేయరు. అధికారులంతా ఒకరిని మించి ఒకరు ఒకరు గిరిజనులపై దౌర్జన్యాలను చేస్తారు. సుక్కడు అటువంటి వాతావరణంలో పెరిగాడు. అధికారులకు విధేయులుగా ఉండడమే వారి బాధ్యత. అధికారులు ఎవరైనా సరే గిరిజనులకు సంబంధం లేదు.


వచ్చిన వారిలో ఒకరు "నిన్ను ఈ చెట్లు నరకమని ఎవరు చెప్పారు ?" అని అడిగాడు.

సుక్కడు అమాయకంగా "ఫారెస్ట్ గార్డ్ చెప్పాడు నాకు. అతడే అనుమతి ఇచ్చాడు" అన్నాడు. 

"ఏమిటి నీకు నేను అనుమతిచ్చానా చెట్లు నరకడానికి" అంటూ ఆశ్చర్యం ప్రకటించాడు ఫారెస్ట్ గార్డ్.

" అబద్దాలకోరా మోసగాడా నీతిలేని ముండాకొడకా ! నీకు ఎంత ధైర్యం ? ఇక్కడ నిలబడి నేను అనుమతిచ్చానని చెప్పడానికి" అని అరిచాడు.


"అనుమతి లేకుండా మీ చెట్లను తాకే ధైర్యం ఎవరికి ఉంది సామీ!" అని సమాధానమిచ్చాడు.

 "మీరు నాకు చెట్లు నరికి సాగు చేసుకోవడానికి అనుమతి ఇవ్వలేదా, ఒకసారి అడవిలో అడిగాను సామి. మరోసారి గ్రామ పెద్ద ఇంటి వద్ద ఉన్నప్పుడు అతని సమక్షంలో అడిగాను. అప్పుడు మీరు అనుమతి ఇచ్చారు, పని చేసుకోవడానికి. అది నిజం, గ్రామ పెద్ద కూడా విన్నాడు. మీరు ఎందుకు మరిచిపోయారో తెలవదు సార్" అన్నాడు.


అది విన్న సీనియర్ అధికారి అంగీకరిస్తున్నట్లు తల ఊపాడు. ఫారెస్ట్ గార్డ్ వారందరినీ తీసుకుని వేరేవాళ్ళు చెట్లు నరికిన చోటును చూపిస్తూ "ఇదంతా కూడా ఆ వెధవే నరికాడు సార్. నేను చెప్పే నిబంధనలన్నీ పాటించకుండా ఈ ప్రాంతమంతా చెట్లు నరికింది వాడే" అని చెబుతూ ఉండగా, పైల్వాన్ వంటి సోముడు మరో ఇద్దరూ వచ్చి ఫారెస్ట్ గార్డ్ చెప్పేది నిజమని సాక్షమిచ్చారు.

"ఆ పొగరుబోతు సుక్కడూ, అతని కొడుకులిద్దరూ ఎవరిమాటా వినరు. వారు ఆశపోతు వెధవలు" అంటూ సాక్ష్యం చెప్పారు.

ఆ తర్వాత చెట్లు నరికిన ప్రాంతమంతా కొలతలు వేశారు. చెట్ల మోడులను లెక్క పెట్టారు. వాటన్నింటిని ఒక కాగితం మీద రాసి నష్టాన్ని అంచనా వేశారు. మిగిలిన గూడెం వాసుల సాక్షాలను సేకరించారు. వారంతా ప్రమాణం చేసి  చేసిన నేరాన్ని ధృవీకరించారు. ఆ గిరిజనుల  జీవితాలు అధికారుల భయంకరమైన హింస అనే ఆపదతో నలుగుతూ ఉంటాయి.

చట్టంతో దాగుడుమూతలు ఆడటం తెలియకపోతే అడవి ప్రాంతంలో నివసించడం కష్టం. ప్రతి ఒక్కరు తమ ఒంటిపై చర్మాన్ని కాపాడుకోవడానికి అబద్ధాలు మాట్లాడుతారు గొప్ప నమ్మకంగా. వారి జీవితాలలో సహజమైన నిజాయితీ, నిరాడంబరత, జీవితకాలపు భయంతో అభద్రతతో క్షీణించి పోయాయి.


సుక్కడు నేరస్తునిలా నిలబడ్డాడు. ఒక అధికారి రాస్తూంటే పదునైన కత్తితో తన గుండె పై గీరుతున్నట్టుగా భయపడ్డాడు. కాయితం పై రాసేది పెద్ద ముప్పని గిరిజనులలో ఉండే సహజమైన భయం. అంతేకాదు అధికారులు మాట్లాడుతున్న భాష వింటున్న గిరిజనులకు అర్థం కాదు. ఆ అర్థం కాని తనం మరింత భయాన్ని పెంచుతుంది వారిలో. అందుకని తలలూపుతూ ఒప్పందాన్ని అంగీకరిస్తారు. సుక్కని కొడుకులు నిశ్శబ్దంగా తడారిపోయిన గొంతులతో గుడుకలు వేస్తూనే ఉన్నారు.

అప్పుడే తీర్పు వచ్చింది "సుక్కా.. ఇప్పుడు నువ్వు తప్పు చేసినట్టు ఒప్పుకుంటున్నావా ?  అడవి సంపదను నష్ట పరచినందుకు, నాలుగు వేల రూపాయలు నువ్వు చెల్లించాలి" అన్నాడు అధికారి.


" నేను ఏ తప్పు చేయలేదు ఓ ప్రభువా! నేను ఏ నేరం చేయలేదు. నేను నీ పుస్తకం మీద ప్రమాణం చేస్తాను. నేను అమాయకుడిని. మనుషులను తినే పులి మీద ప్రమాణం చేస్తున్నాను. పులి తోలు మీద నిలబడి ప్రమాణం చేస్తాను, మీరు ఏ ఒట్టు పెట్టమంటే ఆ ఒట్టు పెడతాను. నేను అమాయకుడిని" అంటూ ఉండగా.

"మాట్లాడకు నువ్వు ఈ డబ్బు చెల్లిస్తున్నావా" అన్నాడు అధికారి.

" అంత పెద్ద మొత్తాన్ని నేనెలా చెల్లించ గలను. నాపై దయ చూపండి, జాలి చూపండి" అన్నాడు.

" ఇంక నువ్వు వేసిన నాటకాలు ఆపు. నువ్వు ఎలా చెల్లించవో మేము చూస్తాం. గుర్తుపెట్టుకో ఇప్పుడు మేం వెళ్తున్నాం "


సుక్కడు ఆశ్చర్యపోయాడు. కళ్ళముందే తన చిన్న గుడిసె గాలికి కొట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కొండ ప్రాంతాల్లో వచ్చే సుడిగాలిలో వరదలో కొట్టుకు పోయింది. ఒక నీలిమేఘం కమ్ముకుంది.

పొలాల్లో ఉండే ఎలుక జీవితమంతా సంపాదించిన దాన్ని ఒక గట్టిగాలి వచ్చి విధ్వంసం చేసినట్లుగా.


*** *** *** **** *** ***

చెరువు నుండి ఇంటికి వచ్చిన గోరీ నిస్త్రాణంగా కూర్చున్న తండ్రి, అన్నలను చూసి భయపడింది. సుక్కడు, అతని కొడుకులు బిడ్డలు ఒకరిని ఒకరు పట్టుకొని గొల్లున ఏడుస్తూనే ఉన్నారు. వారి గోడును ఎవరూ పట్టించుకోలేదు.

అందరికీ తెలిసిన విషయమే , కానీ వీరిని ఓదార్చడానికి వస్తే, అధికారులు వారిని ఏం చేస్తారో అని భయం. పులి నోట్లో తల పెట్టే సాహసం ఎవరు చేయరు కదా.

అలుపు వచ్చేవరకు, గొంతు ఎండిపోయే వరకు పెద్దగా ఏడ్చి, మెల్ల మెల్లగా అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. రాత్రి గడిచి పోతుంది, ఎవరు ఏమి తినలేదు.

అర్ధరాత్రి దాటిన తర్వాత, వారి ఇంటి వైపు కొన్ని నీడలు కదులుతూ వచ్చాయి. ఇంటి చుట్టూ తిరిగి, గుడిసె వెనక నుండి తలుపు తియ్యమని గుసగుసగా అడిగాయి.

సుక్కడు తడకకున్న కర్ర తీయగానే, కులపెద్ద అతనితోపాటు మరో నలుగురు లోపలికి వచ్చారు. సానుభూతిగా తలాడిస్తూ ఇటువంటిదే ఏదో జరుగుతుందని ముందే చెప్పాను కదన్నా! అంటూ మొదలు పెట్టాడు. కుల పెద్ద మిగిలిన వారు వంత పాడారు.

ఇదంతా చేస్తున్నది ఆ ఫారెస్ట్ గార్డే, మనకందరికీ ఆ విషయం తెలుసు అన్నాడు ఏదోరకంగా మాటలు మొదలు పెట్టడానికి.

సుక్కడు నెమ్మదిగా నోరు విప్పి" మీ అందరికీ తెలుసు కదా! ఫారెస్ట్ గార్డ్ చెప్తేనే కదా! చెట్లు నరికాను. అతను నా వద్ద డబ్బు తీసుకున్నాడు. మీకు తెలుసు కదా! మీరు ఎందుకు మాట్లాడలేదు" అన్నాడు.

వారిలో ఒకరు మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తావు. పులికి ఎదురు చెప్పి మనం బ్రతకగలమా? మాకూ భార్య పిల్లలు ఉన్నారు కదా! అన్నారు.

సరే సుక్కన్నా భయపడకు నాలుగు వేల డబ్బులు ఇస్తే కేస్ కొట్టేస్తారు. ఏదో ఒక రకంగా డబ్బు చెల్లించు అన్నారు.

"అంత డబ్బు జీవితంలో ఎన్నడూ చూడని ఒక గిరిజనుణ్ణి, నా దగ్గర అంత డబ్బు లేదు, నావల్ల కాదు" అన్నాడు సుక్కడు.

 వచ్చిన వాళ్ళలో ఒకడు "నీకు నేను ఒక ఉపాయం చెప్తాను. నువ్వు ఎంతో దూరం వెళ్ళనవసరం లేదు ఇక్కడికి కొన్ని మైళ్ల దూరంలో కొండ దగ్గర, పటేల్ అనే వ్యాపారస్థుని దగ్గర డబ్బు చాలా ఉన్నది. అతనికి మనుషులు అవసరం ఉన్నది. కనుక మీ ఇంట్లో ఇద్దరు అతని వద్ద పనికి కుదిరినట్టయితే, కొంత డబ్బును మీకు అప్పు ఇస్తాడని చెప్పాడు.

సుక్కనికి ఆ వ్యాపారి విషయం అంతా తెలుసు. గతంలో ఒకరికి నూట పాతిక రూపాయలు అప్పు పెట్టి చక్రవడ్డీతో లెక్కకట్టి కొడుకులు, మనవళ్ళతో గొడ్డు చాకిరీ చేయించుకుని , అప్పు తీర్చలేదని చాలా వేధించాడు. అది గుర్తుకొచ్చి.

" వద్దు వద్దు" అంటూ గట్టిగా అరిచాడు.


వచ్చినవాళ్లు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని బయటకి వెళ్లి కాసేపు మాట్లాడుకొని మళ్ళీ లోపలికి వచ్చారు. చూడు సుక్కా తెలివి తక్కువగా ఆలోచించకు. డబ్బులు కట్టనట్లయితే, నీ చేతికి సంకెళ్లు వేస్తారు. జైల్లో పెడతారు. మీకు సంబంధించిన అన్నింటినీ జప్తు చేస్తారు. ఇల్లు కూలకొడతారు. ఇంట్లో ఉన్న వస్తువులను వేలం వేస్తారూ. ఇదంతా ఒక ఎత్తయితే నువ్వు జైలుకు పోతే, కులం తప్పు పడుతుంది. కులాన్ని కోల్పోతావు. మళ్లీ కులంలోకి రావాలంటే చాలా ఖర్చవుతుంది. ఆలోచించుకో అన్నాడు.

అది విన్న తర్వాత 'జైలు, సంకెళ్ళు, ఇల్లు కూలగొట్టడం, కులం పోగొట్టుకోవడం, అన్నిటికంటే వ్యాపారి వద్దకు ఎట్టికి వెళ్లడమే మంచిది అనుకున్నాడు. వడ్డీ వ్యాపారి దగ్గర తెచ్చే రుణాన్ని, తండ్రి కొడుకులు ముగ్గురు కష్టపడితే తీర్చ వచ్చునని అనుకున్నాడు.

కానీ అంతలోనే మనసు మార్చుకుని లేదు నాయక తల్లిలేని నా పిల్లలను బానిసలుగా వ్యాపారి వద్దకు పంపలేను అన్నాడు.

అప్పుడు "సరే మంచిది. రాత్రంతా నీకు సమయం ఉంది. ఆలోచించుకొని ఏ విషయం రేపు చెప్పు" అంటూ వెళ్లిపోయారు వాళ్ళు.


రాత్రి పగలు తేడా లేకుండా సుక్కడి జీవితం అంధఃకారమయింది. తన భార్యతో కలిసి తన పిల్లల కోసం ఎంత కష్టపడ్డారో, ఎలా పిల్లల్ని పెద్ద చేశారు అన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. భార్య దూరం అయిన తర్వాత వచ్చిన పెద్ద కష్టం ఇది. 



ఒంటరిగా ఏమీ చేయలేని పరిస్థితి. చనిపోయిన తన భార్య తోడుంటే బాగుండు అనిపించిందతనికి. ఆ రాత్రంతా తెరిచే ఉన్న కళ్ళముందు ఏవేవో దృశ్యాలను చూస్తున్నాడు. అడవంతా విపరీతమైన వర్షంతో ముంచెత్తుతోంది పెద్ద పెద్ద చెట్లు వేర్లతో సహా కూలిపోతున్నాయి. సుడిగాలితో కూడిన వర్షం ఇళ్లను, పంటలను, పొలాలను సర్వ నాశనం చేసింది.

ఫారెస్ట్ గార్డు కుట్రతో తమను నాశనం చేసినట్టు.

చేజారి పగిలిన గుల్దస్తాలో పూలవలె గోరీ, మోరీలు..

***

తంగేడు పత్రికలో ప్రచురితం (మార్చి 2022)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష