ప్రత్యామ్నయం( కథ)

ప్రత్యామ్నయం
మప్పయి సంవత్సరాలు టీచరు ఉద్యోగం చేసి రిటైర్ అయిన  సుబ్బయ్యకు పెళ్ళియిన దగ్గర నుండి వేరే ఊళ్ళో ఉండే కొడుకు పిల్లలకు మధ్య చనువు తక్కువ. సంవత్సరానికి ఒక సారి వాళ్ళు తన దగ్గరకొచ్చినా, ఆ ఒక్కరోజు రెండు రోజులు తను వాళ్ళ దగ్గరకు పోయినా పిల్లల పరిస్థితి అంతే.
రిటైర్ అయినంక గమనిస్తే చిన్న మనవడు చదువులో వెనుక బడి ఉన్నాడు. గరాబం ఎక్కువ. టీవీల 'డోరోమెన్' కర్టూన్ చూడటం యిష్టం. నేను వాడికి చదువు చెప్పనా అంటే నీకు వాడికి చెప్పడం రాదులే అన్నాడు కొడుకు. మనవడికి చదువు అంటే తల్లి మాట వినడు. తండ్రికి తీరికుండదు.
మెల్లగా చిన్న బోర్డ్ మీద చిన్న చిన్న బొమ్మలేసి అక్షరాల మీద ఆసక్తి కలిగించాడు. మనవనికి కూడా బొమ్మలు గీయడం ఇష్టం. కథలు చెప్తూ  అందులో వచ్చే పదాలకు బొమ్మలు గీస్తూ అక్షరాలు నేర్చుకొనేవాడు. తాతా మనవల మధ్య బెరుకు తగ్గింది. బడికి  వెళ్ళేపుడు బై తాతయ్యా అని‌, బడి నుండి రాగానే తాతయ్యా అంటూ దగ్గరికొచ్చే వాడు.
ఒక రోజు హోమ్ వర్క్ పుస్తకంలో parts of the body అని రాసి ఉన్నాయి. నోస్ ఇయర్ ఐ అన్నీ చెపుతున్నాడు మనవడు రాయడానికి spellings రావట్లేదు.
మూడింటికి మనవడు బడి నుండి వచ్చే సరికి కిందగోడకున్న బోర్డు మీద శరీరం బొమ్మ వేసి parts of the body పేర్లు రాసాడు. వంగి బొమ్మ గీసి పేర్లు రాసేసరికి నడుం లో నొప్పి అని పించింది. వంటింట్లో కి పొయ్యి మంచి నీళ్ళు తాగి బాత్రూమ్ కు పొయ్యి వచ్చే సరికి. మనవడు తల్లితో మాట్లాడుతున్నాడు. హాల్లోకి వచ్చి చూచాడు మనవడు లేడు బెడ్రూమ్ తలుపేసి ఉన్నది. బోర్డ్ వైపు చూసి స్థాణువయ్యాడు. బోర్డు శుభ్రంగా తుడపబడి తెల్లగా వెక్కిరిస్తున్నది. చెప్పులేసుకొని రోడ్డెక్కాడు. నిస్సత్తువగా నడుస్తు వీథి  చివర టీ కొట్టు దగ్గర కొచ్చి కూచ్చున్నాడు.
అతని మనసు శూన్యంగా మారింది.
ఏమి జరిగింది అని ఆలోచిస్తే రెండు రోజుల కింద సంఘటన గుర్తొచ్చింది.
ఆ సాయంత్రం లోపల గదిలో ఉన్న తనను అంకుల్ ఒకసారి బయటికి రారా అని పిలిచింది కోడలు. హాల్లో ముగ్గురు పిల్లలు ఒక ఆడ మనిషి ఉన్నారు. వీళ్ళ పిల్లల కు ట్యూషన్ చెప్పాలట అన్నది కోడలు. ఏ తరగతి అన్నాడు ఆశ్చర్యాన్ని కనపడనీయకుండా.
ఒకమ్మాయి ఎయ్త్ ఒలంపియాడ్‌, ఒకరు నైన్త్ ఒలంపియాడ్.. ఇంకా ఆమె ఏదో వివరాలు చెపుతోంది. తనకేమి వినపడటం లేదు. తేరుకొని ఒకసారి మీ బుక్స్ తీసుకురండి చూస్తాను అన్నాడు తన మాట తనకే పేలవంగా వినపడ్డది. ఫీజెంతా అడిగింది వచ్చినావిడ, కోడలి వైపు చూశాడు ఏవో వేళ్ళతో సైగలు చేస్తోంది.. ఒకమ్మాయి మూడు పుస్తకాలు తెచ్చిచ్చింది. అపుడే వాచ్ మెన్ వచ్చి టూషన్ పిల్లలు లిఫ్ట్ వాడకూడదని సెక్రటరీ గారు చెప్పమన్నారు అన్నాడు. రేపు పొద్దున చెపుతాను అని పుస్తకాల తో లోపలికొచ్చాడు.
వాళ్లు ఎళ్ళి పోయారు. తరువాత కోడలి తో చెప్పాడు నేను సోషల్ టీచర్ ను ఫిసిక్స్ మాథ్స్ ఇంగ్లీషు ఎనిమిది తొమ్మిది తరగతులకు చెప్పలేను అని. ఆం మీ అబ్బాయి కూడా అన్నాడు అంకుల్ మా నానకు చేతకాదని.
ఓహో నాది కాని సబ్జెక్టు చెప్పలేనన్నా కాబట్టి మనవడికి చెప్పనివ్వలేదన్నమాట. టీ కొట్టతని బిడ్డనుకుంటా పక్కనే ఏ ఫర్ ఏపిల్ ఏ ఫర్ఎరోప్లేన్ అంటూ చదువుతోంది. తన అవసరం ఎక్కడో అతనికి స్పష్టమయింది. ఒక టీ తాగి నెమ్మదిగా ఇంటికొచ్చాడు కొడుకు మొకం గంటు పెట్టుకున్నాడు తరువాత పనిమీద ఊరెళ్ళాడు. కోడలు ముఖం తిప్పుకూంటోంది. మనవడు మాట్లాడటం లేదు దగ్గరకు రావటం లేదు. మూడో రోజు ముప్పయి మూడు సంవత్సరాలుగా బోధనలో తలపండిన ఆ రిటైర్డ్ సోషల్ పంతులు బండెక్కాడు.
జ్వలిత-9989198943

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

జిల్లేడు కాయ(కరోనా కథ))